ఉపవాస ధర్మం

(సుఖజీవన సోపానాలు - 3)
సంపూర్ణ ఆరోగ్యాన్ని
సంరక్షించండి.
సర్వదా ఐశ్వర్యాన్ని
అనుభవించండి.

డా. మంతెన సత్యనారాయణరాజు

http://www.manthena.org

విషయ సూచిక

 1. నాటి కాలం - నేటి చికిత్స
 2. జీవి ధర్మం - ఉపవాసధర్మం
 3. ఉపవాసం అంటే ఏమిటి?
 4. ఉపవాసం ఎందుకు చేయాలి?
 5. ఉపవాసంతో రోగాలు ఎందుకు తగ్గుతాయి?
 6. ఉపవాసంతో చికిత్సలు
 7. ఉపవాసం ఎన్నిరకాలు?
 8. ఉపవాసంలో నిమ్మకాయ ప్రాముఖ్యత
 9. ఉపవాసంలో నీటి ప్రాముఖ్యత
 10. ఉపవాసంలో తేనె ప్రాముఖ్యత
 11. ఉపవాసంలో 'ఎనిమా' ప్రాముఖ్యత
 12. ఉపవాసం చేయాలనుకునే వారికి నా సలహా!
 13. ఉపవాసంలో మనస్సు ఎలా ఉండాలి?
 14. ఉపవాసం ఎలా ప్రారంభించాలి?
 15. ఉపవాసంలో మందులు ఎందుకు మానవచ్చు?
 16. ఉపవాసంలో ఎలా ఉంటుంది?
 17. ఉపవాసంలో నిద్ర ఎలా పడుతుంది?
 18. ఉపవాసంలో ఎందుకు ఆకలి వేయదు?
 19. ఉపవాసంలో ఎందుకు తినాలనిపించదు?
 20. ఉపవాసంలో ఎందుకు నీరసం రాదు?
 21. ఉపవాసంలో ఎందుకు వ్యాయామం చేయరాదు?
 22. ఉపవాసంలో చెడ్డ వాసనలు ఎందుకు వస్తాయి?
 23. ఉపవాసంలో మనస్సు ప్రశాంతంగా ఎందుకు ఉంటుంది?
 24. ఉపవాసంలో తింటే ఏమౌతుంది?
 25. ఉపవాసం 5, 6 రోజులు మాత్రమే చేస్తే ఏమౌతుంది?
 26. ఉపవాసం ఎన్ని రోజులు చేయాలి?
 27. ఉపవాసం ఎప్పుడు విరమించాలి?
 28. ఉపవాసం ఎలా విరమించాలి?
 29. ఉపవాసం అంటే నిరాహారదీక్షలు కాదు.
 30. ఉపవాసానంతరం ఆహరం యొక్క విశిష్టత.
 31. ఉపవాసానంతరం మామూలు ఆహరం తింటే నష్టమేమిటి?
 32. నేటి ఉపవాసాల కథ
 33. ఒక పూట తింటే అది ఉపవాసం ఎందుకు అవ్వదు?
 34. ఉపవాసం ఎన్నాళ్ళకొకసారి చేయాలి?
 35. ఉపవాసం ఏ వయస్సు వారు చేయవచ్చు?
 36. ఉపవాసాలు చేస్తే ఆయుష్షు ఎందుకు పెరుగుతుంది?
 37. చెడు అలవాట్లను వదులుటకు ఉపవాసమే శ్రేయస్కరం?
 38. ఉపవాస జీవన విధానంలోకి స్త్రీలు ఎందుకు మారాలి?
 39. ఉపవాసంలో బరువు తగ్గడం?
 40. ఊహాపోహలు - నిజానిజాలు
 41. అనుభవాలు - అనుభూతులు
 42. అసలైన ఆరోగ్యానికి సిసలైన అవసరాలు
 43. ముత్యాల గొడుగు
 44. మరొక్కమాట

ముఖ్య గమనిక

ముందుగా ఉపవాసాలు చేసిన తరువాత ఆహార నియమాలు పాటించడం బదులుగా ముందే ప్రకృతి జీవన విధానాన్ని, ఆహార నియమాలను తు.చ. తప్పకుండా 6 నెలలు ఆచరించిన తర్వాత దీర్ఘకాలిక ఉపవాసములు డాక్టరు గారిని సంప్రదించి మొదలు పెట్టడం అనేది అటు మీకు, ఇటు మాకు మరింత లాభదాయకం అని తెలియజేస్తున్నాము. అలాగే మీరు ఆచరిస్తారని ఆశిస్తూ.
ఇట్లు
ప్రకృతి జీవన విధానము

అంకితం

1942 వ సంవత్సరంలో గాంధీగారి పిలుపు నందుకొని 'క్విట్ ఇండియా' ఉద్యమంలో చురుకైన పాత్ర వహించినప్పటి నుండి అజరామరంగా సమాజానికి ఎటువంటి మంచి జరుగుతుందని తలచినా, అటువంటి కార్యాలకు మనసా, వాచా, కర్మణా తనవంతు కృషినందించే మహా మనిషి శ్రీ చింతలపాటి వరప్రసాద మూర్తి రాజు గారు.
1946 లోనే ప్రకృతి వైద్యం పట్ల ఆకర్షితులై, ఇటు ప్రభుత్వానికిగాని అటు సమాజానికిగాని పెద్దగా అవగాహనా లేని ఆ కాలంలోనే ప్రకృతి వైద్యాన్ని తన జీవన విధానంగా మలచుకొని సమాజానికి ఉపయోగపడేలా ప్రకృతి వైద్యానికి ప్రభుత్వ గుర్తింపు తెచ్చిన ఆదర్శపురుషులు, పితృ సమానులు అయిన మూర్తి రాజు గారికి "ఉపవాస ధర్మం" అంకితం.
- మంతెన సత్యనారాయణరాజు

శ్రీ మూర్తి రాజు గారి జీవిత సంగ్రహం

శ్రీ సి.హెచ్. వి.పి. మూర్తి రాజు - ఒక మహామనిషి
గాంధేయ వర్తి
బుధజనులకు స్ఫూర్తి
శ్రీ మూర్తిరాజు గారు ఆంధ్ర రాష్ట్రము నందు పశ్చిమ గోదావరి జిల్లాలోని 'చైనా నింద్ర కొలను' అనే కుగ్రామంలో క్షత్రియ వంశజుడిగా శ్రీ చింతలపాటి బాపిరాజు, సూరయమ్మ పుణ్యదంపతులకు 16, డిసెంబరు 1919వ తేదీన జన్మించారు.
స్వాతంత్ర్యోద్యమకాలంలో శ్రీ మూర్తిరాజు గారు స్టూడెంట్సు కాంగ్రెసు కార్యదర్శిగా పనిచేసి, గాంధీగారి పిలుపునందుకొని 'క్విట్ ఇండియా' ఉద్యమము నందు చురుకుగా పాల్గొన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం ఆయన తన జీవితాన్నంతా ధారపోశారు. సాగునీటి కాలువలు, మారుమూల ప్రదేశాలకు రహదార్ల అభివృద్ధికి ఎంతో కృషి చేసారు. కొల్లేరు సరస్సు పరిసర ప్రాంతంలో పేద ప్రజల వ్యవసాయ భూమి కొరకు అక్కడ ధనికులతో పోరాడి విజయం సాధించారు. పేద ప్రజల పెన్నిధి గనుకే ఆయన రాష్ట్ర శాసనసభకు 1952 నుంచి 1983 సంవత్సరం వరకూ అవిచ్ఛిన్నంగా ఎన్నికయ్యారు.
వినోభాజీ ప్రారంభించిన 'సర్వోదయ' ఉద్యమానికి శ్రీ మూర్తిరాజుగారు నాయకుడిగా పనిచేసి, మహాత్మగాంధీ, వినోభాజీల ఆదర్శాలకు నిజమైన అనుచరుడిగా 1961 వ సంవత్సరంలో అఖిల భారత సర్వోదయ సమ్మేళనాన్ని పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు నందు ఏర్పాటు చేసారు. డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్, జయప్రకాష్ నారాయణ్, ఆర్యనాయకమ్ కృష్ణ చౌధరి, శంకర్ రావుదేవ్ మొదలగు నాయకులు హాజరైన ఈ సమ్మేళనాన్ని విజయవంతంగా నిర్వహించారు.
పత్రికా రంగం నందు కూడా ఈయన కృషి ఖ్యాతి గడించినది. హైదరాబాద్ లో 1961వ సంవత్సరంలో "ఆంధ్ర రత్న" తెలుగు పత్రికను స్థాపించి, సంపాదకీయ బాధ్యతలను నిర్వహించారు. అంతేకాక "వినోభా ఉపన్యాసాలు, మహాత్మాగాంధీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా 100 పుస్తకాలు ప్రచురించారు. విద్యారంగంలో 'విద్యాజ్యోతి' పత్రికను ప్రచురించి విద్యాసేవ జరిపినారు. కొల్లేరు బహుళార్థసాధక ప్రాజెక్టు అనే గ్రంథాన్ని ఆంధ్రా౦గ్లములలో రచించారు.
హరిజనుల కోసం అనేక హరిజన కాలనీలను నిర్మించారు. కులరహిత సమాజము అనే ధ్యేయము కొరకు పాటుబడి ప్రయోగాత్మకంగా 50 కుటుంబాలకు సామూహికంగా వంట (Community Kitchen) నడిపించారు. పెదనింద్రకొలను గ్రామంలో 100 అడుగుల వ్యాసం గల గాంధీ భవనాన్ని, పేదలు, బాటసారుల కొరకు అనేక విశ్రాంతి గృహాలను నిర్మించినారు. భారత సేవక్ సమాజ్ అధ్యక్షుడిగా, గాంధేయవాదిగా గాంధీతత్వాన్ని, సిద్ధాంతాలను ప్రజలలో వ్యాపింపచేయుటకు 600 మైళ్ల పాదయాత్ర చేశారు. భారత్ సేవక్ సమాజ్ సహకారంతో పేద ప్రజలకు కాలనీలను నిర్మించి పెట్టారు. వినోభాజీ భూదాన యజ్ఞం కొరకు 100 ఎకరాలు, ఏలూరు మహిళా కాలేజీ కొరకు 100 ఎకరాలను దానం చేసారు. విద్యారంగంలో ఈయన చేసిన సేవ ఎన్నదగినది. శ్రీ చింతలపాటి బాపిరాజు ధర్మ సంస్థను స్థాపించి, ఆ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 68 విద్యాసంస్థలను స్థాపించారు. వాటిలో 5 డిగ్రీ కళాశాలలు, 1 ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సెంటర్, 5 జూనియర్ కాలేజీలు, 3 ఓరియంటల్ కాలేజీలు, 28 ఉన్నత పాఠశాలలు, 23 ఓరియంటల్ ఉన్నత పాఠశాలలను మరియు 3 ఉన్నత ప్రాథమిక పాఠశాలలు స్థాపించి విద్యా పోషకుడిగా గణుతికెక్కారు. కళారాధకుడిగా ఛాయాగ్రహణం నందు అభిరుచి కలిగి "భారత కళా పరిషత్" అనే సంస్థను స్థాపించారు.
సమాజ సేవకుడిగా, సారస్వత పోషకుడిగా, విద్యాదాతగా, రాజకీయ నాయకునిగానే కాక ప్రకృతి వైద్య విధాన సంకర్తగా, ప్రకృతి జీవన విధానాన్ని అనుసరిస్తూ ప్రకృతి వైద్య అభివృద్ధికీ, గుర్తింపుకీ కూడా సకల విధాలా పాటుపడినారు. శ్రీ మూర్తి రాజుగారు ప్రకృతిని అనుసరించడమే తన జీవన విధానంగా మలచు కొనుటకు గల నేపథ్యాన్ని ఒకసారి పరికిద్దాం.
శ్రీ సి.హెచ్.వి.పి మూర్తి రాజు గారికి బాల్యం నుంచి ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. ఆనాడు దేశంలో వైద్యసదుపాయాలు తక్కువ. ఎల్.యం.పి. డాక్టర్లు తాలూకా కొకరుండేవారు. గ్రామంలో ఎవరికి జబ్బు చేసినా ఆయుర్వేదం తెలిసిన వారు వచ్చి మందు ఇచ్చేవారు. అవీ ఉచితంగా ఇచ్చేవారు. ఆ రోజులలో వైద్యం పరోపకారంగానూ బాధ్యతగానూ తలచేవారు. బాల్యంలో వీరికి ఒళ్ళంతా గజ్జి కురుపులతో రాత్రులు నిదుర ఉండేది కాదు. ఒళ్ళంతా ఒకటే దురదలు. పడుకుందామన్నా వీలుండేది కాదట. లాగు, చొక్కా తొడుక్కోవడానికి వీలుపడని పరిస్థితి. తుండు కట్టుకొని ఉండేవారట. అందుకనే వారికి చదువు రాలేదన్నారు.
1946 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీరికి కాళ్ళ నొప్పులు విపరీతంగా ఉండేవి. పార్టీ పరంగా ఎన్నికల ప్రచార బాధ్యత వీరి భుజస్కంధాలపై పడింది. కనుక ప్రచారం తప్పదు. ఇటు చూస్తే భరించలేని కాళ్లనొప్పులు. డాక్టరు ములుపా రంగయ్యగారు చికిత్స చేసి విశ్రాంతి తీసుకోమన్నారు. ఎన్నికల గురుతర బాధ్యతల వలన విశ్రాంతి తీసుకోవడానికి వీలుపడలేదు. నరాలలో గునపాలతో పొడిచినట్లుండే బాధను తట్టుకోలేక రైలుక్రింద పడటం నయం అనుకొనేవారట. అంతటి బాధలో కూడా ప్రచారానికి వెళ్ళక తప్పలేదు. కారులో ఇద్దరిని రెండు వైపులా కుర్చోబెట్టుకొని ఎల్లప్పుడూ కాళ్లు, చేతులూ పిసికించుకుంటూ ఉండేవారు. కారు దిగి ఉపన్యాసం చెప్పటం, కారు ఎక్కడం, మళ్ళీ కాళ్ళూ, చేతులు ఒత్తించుకోవడం ఈ విధంగా ఎన్నికల ప్రచార బాధ్యతలు నెరవేర్చారు.
పిమ్మట వైద్యం నిమిత్తం రాజమండ్రి డా. (డి.యస్. రాజు) కల్నల్ రాజుగారి ఆసుపత్రిలో చేరారు. నాలుగు నెలలు వైద్యం జరిగినా మార్పు లేదు. అట్టి స్థితిలో శ్రీమూర్తి రాజుగారు ప్రకృతి వైద్యం వైపు దృష్టి సారించారు. ప్రకృతి ఆశ్రమ వైద్యులు శ్రీ వేగిరాజు కృష్ణంరాజు గారికి తన పరిస్థితిని చెప్పి ఆశ్రమానికి రమ్మంటారా అని అడిగారు. కృష్ణంరాజు గారు తప్పక తగ్గుతుంది రమ్మన్నారు. ఆ విధంగా వైద్యం కోసం ప్రకృతి ఆశ్రమంలో చేరారు.
ఆశ్రమ వైద్య విధానం ఒక వారం పాటించాక నిద్ర పట్టడం మొదలయ్యింది. గాఢనిద్ర పడుతుంది. రెండు నెలలకు పూర్తి ఆరోగ్యం సమకూరినది. ఆ విధంగా మూర్తిరాజుగారు ప్రకృతి వైద్యం యొక్క విశిష్టతను స్వానుభవంగా తెలుసుకున్నారు. తెలుసుకొనడమే కాక ప్రకృతి వైద్యాన్ని ప్రోత్సహించి, ఆదరించి తనకు కలిగిన మేలును సమాజంలో అనారోగ్యానికి గురి అయిన ప్రతి ఒక్కరూ పొందాలని సద్భావించారు. అందుకోసం వారు చేసిన కృషి అనన్య సామాన్యం.
1952 లో మద్రాసు అసెంబ్లీకి శ్రీ మూర్తిరాజు గారు ఎం. ఎల్.ఏ.గా ఎన్నికైనారు. 1956 లో విశాలాంధ్ర ఏర్పడినది. హైదరాబాదు రాష్ట్ర రాజధాని అయినది. కీ.శే. కళా వెంకట్రావు గారు ఆరోగ్యశాఖా మంత్రిగా ఉన్నారు. అపుడు ప్రకృతి వైద్య విధానానికి అనుమతి లేదు. అనుమతిలేనిదే వైద్యం చేయరాదు. కనుక అనుమతి కోసం మూర్తి రాజు గారు మంత్రిని కోరడం జరిగినది. మంత్రిగారికి ఈ వైద్యంపై నమ్మకం లేని కారణంగా అనుమతి నిచ్చుటకు అంగీకరింపనని చెప్పినారట. మూర్తిరాజుగారు అందుకు ఒప్పుకోక తన స్వానుభవాన్ని వివరించి, పట్టుబట్టి ప్రకృతివైద్య విధానమునకు అనుమతి లభింపచేసినారు. అంతటితో ఆగలేదు. వీరి కృషితో ఆశ్రమంలో ప్రకృతి వైద్య కళాశాలను స్థాపించారు. దానికి ప్రభుత్వ అనుమతి లేదు. అందువలన ఆ కళాశాలలో చదివి పాసైన వారు వైద్యము చేయుటకు వీలు లేదు. చాలా చోట్ల ప్రకృతి వైద్య కళాశాలలున్నవి. వాటిని ఏ ప్రభుత్వమూ అనుమతించలేదు.
ప్రకృతి వైద్యానికి ప్రభుత్వ అనుమతిని సంపాదించడంలో శ్రీరాజుగారు తృప్తి పడలేదు. వారు స్థాపించి, పోషించుచున్న ప్రకృతి వైద్య కళాశాలకు కూడా ప్రభుత్వ అనుమతిని సాధించవలెననెడిది వారి ప్రగాఢమైన కోరిక. ప్రకృతి వైద్య విధానము చేసుకొన్న పుణ్యమేమొ అన్నట్లుగా శ్రీరాజుగారు 1972 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో దేశీయ వైద్య మంత్రి అయ్యారు.
అయిందే తడవుగా ప్రకృతి వైద్య కళాశాలకు అనుమతి ఇవ్వాలని తలచారు. అక్కడ వారికి చుక్కెదురైనది. ప్రభుత్వయంత్రా౦గ౦ వారి నిర్ణయానికి అనుకూలంగా లేదు. "ఇది సైన్సు గాదు, కనుక సరియైనది గాదు". అనేదివారి వాదన అయినప్పటికీ శ్రీరాజుగారు ప్రకృతి వైద్యకళాశాలకు అనుమతి కొరకు ఫైలు పెట్టమని పి.ఎ. ను కోరారు. పి.ఎ.కీ కూడా ఇష్టంలేక సెక్రటరీ గారు ఫైలు పెట్టాలి అపుడు మీరు చేయాలి అనిచెప్పారు. కొన్ని రోజులు గడిచాయి. పి.ఎ. తో ఒకరోజు సెక్రటరీని ఫైలు పెట్టమను లేనిచో నేనే స్వయంగా వ్రాసి పంపిస్తా అని చెప్పారు. విధిలేక ఫైలు వచ్చింది. దానిమీద ఆనాటి వైద్యశాఖా మంత్రిగా ఈ విధంగా నోట్ వ్రాశారు.
"ప్రకృతి వైద్యమును గూర్చి ప్రభుత్వాధికారులకు ఏమీ తెలియదు. నాకు తెలుసు. పైగా అనుభవము కలదు. కనుక నేను ప్రకృతి వైద్య కళాశాలకు, కళాశాలలో inception నుండి అనుమతించడ మైనది". అంతే అనుమతి అమలులోకి వచ్చినది.
ప్రకృతి విధానాన్ని తన జీవిత విధానంగా మలచుకున్న ఆదర్శ పురుషుడు శ్రీ మూర్తి రాజుగారు. దానికి నిదర్శనంగా :
ఆయన జీవితంలో ఒక ప్రముఖ ఘట్టం....... 1989వ సంవత్సరంలో ఎన్నికల హడావిడి, తీవ్రమైన ఒత్తిడి, సంచారం వలన ఒక సంవత్సరం పాటు ప్రకృతి నియమాలన్నీ వదిలి వేసి తిరుగ వలసి వచ్చినది. ఫలితంగా మూర్తిరాజు గారికి గుండె పోటు రావడంతో భీమవరం, హైదరాబాదు, నిమ్స్ లోనూ పిమ్మట మద్రాసు విజయ హాస్పిటల్ లో చేర్చారు. వైద్యులు బైపాస్ సర్జరీ చెయ్యాలన్నారు. రాజు గారు "సర్జరీ చేస్తే ఎంతకాలం బ్రతుకుతాను?" అని ప్రశ్నించారు. దానికి వైద్యులు ఇంకొక 10 సంవత్సరాలు బ్రతకవచ్చు. అయినప్పటికీ నిరంతరం మందులు వాడుతుండాలి అన్నారు.
"ఆపరేషనూ వద్దూ, ఏమీవద్దూ నేనింకా 30 సంవత్సరాలు బ్రతకాలి. ఒక వేళ ఆపరేషన్ లేక మరణించినా నావల్ల దేశానికి వచ్చే నష్టం ఏమీలేదు, ప్రకృతి వైద్యం ద్వారానే నాగుండెను బాగు చేసుకుంటాను అని ఆపరేషన్ విరమించుకున్న ధీశాలి. అప్పటి నుంచి ప్రకృతి నియమాలను క్రమం తప్పక, క్రమశిక్షణతో ఆచరిస్తూ ఏవిధమైన మందులూ వాడకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది, పునరుజ్జీవితులయ్యి ఆధునిక వైద్య విధానానికొక సవాలు విసిరారు. ఈవిధంగా తన ప్రకృతి జీవన విధానమే తన సందేశంగా మలచిన శ్రీ మూర్తిరాజు గారు ధన్యులు, మాన్యులు, మనందరికీ మార్గదర్శకులు.
గత మూడు సంవత్సరాలుగా ఆయనతో కలిగిన పరిచయ భాగ్యం నాకు మార్గదర్శకత్వాన్నిచ్చినది. సత్యశీలి, అహింసామూర్తి, ప్రకృతి ప్రేమికుడు అయిన శ్రీమూర్తిరాజు గారు నిజమైన గాంధేయవాదిగా వర్తించి తన జీవితాన్నే మన కొక సందేశంగా చూపారు. వారికి ఈ ఉపవాసధర్మం పుస్తకాన్ని అంకితం గావించడం అనువర్తిగా నా కనీసధర్మంగా, అదృష్టంగా భావిస్తూ....... కృతజ్ఞాభివందనాలతో..........
మంతెన సత్యనారాయణరాజు

ఆశీర్వచనములు

శ్రీమన్నారాయణ స్వరూపులు
హెచ్.హెచ్.త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి
తేదీ: 21-9-1998
ప్రియ శ్రీమాన్ డా. యం. సత్యనారాయణరాజు గారు!
శ్రీమతే నారాయణాయనమః అనేక మంగళా శాసనములు!
"నానృషిః కురుతే కావ్యం" అని ఒక సంస్కృత సూక్తి. ఋషి కాని వాడు కావ్యాన్ని ఆవిష్కరించలేడు అని దీనికర్థము. 'కావ్య' మంటే నిత్య నూతనంగా భాసిల్లే భావాలను ఆవిష్కరించడంతో పాటు అవి ఆచరణ యోగ్యాలుగా అందించడం. 'ఋషి' అంటే చూసినవాడు. జరుగుతున్నదాన్ని, జరిగిన దాన్ని, జరగబోయే దాన్ని కూడా చూడగలవాడు. ఊరకచూస్తే ఉపయోగమేమి ఉంటుంది? జరిగిన దాన్ని భావించి, జరగవలసిన దాన్ని దర్శించి, వర్తమానంతో సమన్వయం చేస్తూ జీవన విధానాన్ని అందించగలవాడు. మీరు ఆ కోవకి చెందుతారు. మీరందించే ఈ "ఉపవాసధర్మం" గ్రంథాన్ని చూస్తే ఆ విషయం స్పష్టపడుతుంది.
గ్రంథానికి పేరెట్లా ఉన్నా నిరాడంబరంగా జీవిస్తూ, నిత్య యౌవ్వనంతో నిలువగలిగే జీవన విధానాన్ని ఈ గ్రంథం స్పష్టపరుస్తోంది. అల్పాయాసంతో అతి విలువైన జీవనాన్ని సాధించే విధానమీ గ్రంథం. అల్ప శ్రమతో అధికశక్తిని సాధించే ఆచరణ విధానమీ 'ఉపవాస ధర్మం' గ్రంథం. సులభ సాధన - సుఖమయ జీవనం ఎలా సొంతం చేస్కోవచ్చో సోదాహరణంగా నిరూపించినదీ "ఉపవాసధర్మం" గ్రంథం. సామాన్య ప్రక్రియలతో - అసామాన్య జీవన మూల్యాలను పెంచి యిచ్చే 'కరదీపిక' మీ 'ఉపవాసధర్మం' గ్రంథం. ప్రకృతి సహజమైన పద్ధతితో పవిత్ర జీవన లక్ష్యాలను స్పష్టంచేసేదీ గ్రంథం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారే. ఆ సుసంపన్న ఆరోగ్యానికి సహజసులభ ప్రక్రియ మీ గ్రంథం. అందరికీ అందుబాటులో ఆనందదాయకమైన ఆరోగ్యం ఎలా పరిరక్షించుకొంటూ జీవించవచ్చునో చాలా చక్కగా వివరించిన మీ గ్రంథం చాలా బాగుంది. ఎంతో అనుభవజ్ఞులయిన వారు గూడ వ్రాయలేని విధంగా అతిసులభమైన లలితమైన భాషలో ఉన్న మీ గ్రంథం కాస్త రుచి ఉన్నవారిని తనంతటనే చదివిస్తుంది. అందులో ప్రవర్తింపచేస్తుంది గూడ.
విషయావిష్కార విధానం గూడ ప్రతివారినీ ఉత్తేజపరచి అందులోని వాస్తవాన్ని ఆలోచింపచేసేదిగా ఆచరింపజేసేదిగాను ఉంది. ధరలు ఆకాశాన్నంటే ఈ రోజుల్లో సామాన్యుని బ్రతుకులు మాత్రమేగాక ఉన్నత తరగతి వారి జీవితాలు కూడా క్లిష్టమవుతున్నాయి. ఆరోగ్యములు చూద్దామా అంటే మరీ బలహీనములై దేనికీ స్వయంగా తట్టుకోలేక ఓషధులమీదనే ఆధారపడేటట్టు చేస్తున్నాయి మనిషిని. ఇక ఆహారాలను చూద్దామా అంటే అన్నీ రసాయనాల తయారీలే, సహజత కోల్పోయిన కృత్రిమ రూపాలు. రంగులు, రుచులు, శక్తి గూడ కృత్రిమమయ్యేట్టు చేస్తున్నాయి. వాతావరణం కలుషితమని అందరికీ తెల్సు. ఇలాంటి స్థితిలో మనిషి తనలోంచే సహజంగా తట్టుకునే శక్తిని పెంపొందించు కోవాల్సిన అవసరం ఉంది. బయటి కాలుష్యాలని ఎదుర్కోగలిగే స్వయం శక్తిని ఏర్పరచుకోవలసి ఉంది, సముపార్జించు కోవలసివుంది. ప్రస్తుతమున్న వైద్య విధానాలు ఇందుకనుకూలంగా లేవు. దీనికొక సులభమైన, సమర్థవంతమైన, అల్పవ్యయకరమైన, శాస్త్రీయమైన తరణోపాయ మన్నట్లుంది మీ 'ఉపవాధర్మం' అనే గ్రంథం.
ఏది సాధించాలన్నా మనిషిలో మొదటలో లక్ష్యశుద్ధి ఉండాలి. "నేను ఇది చేసి తీరాలి, ఇంత వరకు చేయాలి, ఇంత వరకు సాధించాలి" అనే పట్టుదల ఉండాలి. అది ఉన్న వ్యక్తికి అసలు బయట ప్రోద్భలకాలు ఏమీ అవసరమే లేదు. దృఢమైన చిత్త సమాధానం ఉన్న వ్యక్తి దేనికీ చలించడు. వాని మనస్సు అన్నీ విధాల వాడికి తోడుంటుంది. అలాంటి వాడు ఏ అస్వస్థత ఏర్పడ్డా తన మనస్సు మీదనే ఆధారపడతాడు తప్ప బయటి విషయాల మీద కాదు. మరి అందరికీ ఆ దృఢచిత్తత ఉండదు. అయినా బాగుపడాలనే ఆశ మాత్రం అయితే ఉంటుంది. ఆ మాత్రం ఉన్న వారికైనా ఓ క్రమపద్ధతిలో ఆరోగ్య సోపానాలు అధిరోహించి, ఆనంద సింహాసనం అధివసించే యోగ్యత కల్గించాలి. మీ వైద్య విధానం దానిని కరతలామలకం చేస్తోంది.
పైకి సులభంగా, సుఖకరంగా ఉండేవన్నీ పర్యవసానంలో పరమ దారుణంగా స్వరూప నాశాన్ని కల్గించే తామసాలని, పైకీ పర్యవసానంలో గూడ ప్రయాస జనకంగా ఉండేవి రాజసాలని, ఆరంభంలో కాస్త శ్రమగా ఉన్నట్లనిపించినా పర్యవసానం పరమాద్భుతంగా, పరమానందదాయకంగా ఉండేవి సాత్విక ప్రక్రియలని శ్రీ కృష్ణభగవానుడే భగవద్గీతలో తెలిపినాడు. మీ ప్రక్రియే దానికి నిదర్శనం. ఇందులోనికి ప్రవేశించడానికి కాస్త మనోనిబ్బరముంటే చాలు. ఓసారి రుచిచూసిన తర్వాత తనంతటనే క్రమంగా రుచిని పుట్టించుకుంటూ సాధన చేసేట్టు చేస్తుంది. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యాన్నిచ్చి, ఆరోగ్యవంతులకు ఆనందాన్ని పెంచే ప్రక్రియను అనుభవం గడించిన మీరందించడం మాకెంతో తృప్తినిస్తోంది. సహజమైన, నియమబద్ధకమైన, శాస్త్రీయమైన జీవనం సాగించేవారికి ఏ ప్రక్రియా అవసరం లేదుగదా! అలాంటి వారు "పంచకాల పరాయణులు". అంటే వారు తాము లేచినప్పటి నుండి నిదురించేటంత వరకూ ఉండే కాలన్నంతటినీ 5 భాగాలూ చేసుకొని భగవదారాధనగా దాన్ని భావించి జీవిస్తారు. అలాంటి వారు భగవదారాధన గూడ జరిపి, అప్పుడు భగవత్ప్రసాదంగానే ఆహారాన్నంతనూగూడ గ్రహిస్తారు. చివరికి జలం గూడ. అంటే అలా భగవన్నివేదితమైన ప్రసాదంతో దేహధారణకనువైనంత మాత్రం గ్రహిస్తూ మనశ్శక్తిని పెంపొందించుకుంటారు. భగవంతుడే వారికి లక్ష్యం గనుక భగవంతుని వైభవానికి తగినట్టు ఆహారాదులు షడ్రసోపేతంగ తయారు చేస్తారు. దాంట్లో తమ రుచి అంటూ ఏమీ లేకుండా కేవలం "ప్రసాదబుద్ధితో మాత్రమే" అవసరమైనంత మాత్రం స్వీకరిస్తూ వుంటారు. అలాంటి వారు శాస్త్రం విధించిన రీతిలో మాత్రం "ఉపవాసాలు" గూడ చేస్తారు. ఆ ఉపవాసాలు, వాటి నియమాలు వేరు. భగవత్ప్రీతికరం 'ఏకాదశ తిథి' కనుక దాన్ని 'హరి వాసర' మంటారు. ఆనాడు మనస్సుపై చంద్రుని ప్రభావముండును. తమోమయమైన పదార్థాలను ఆనాడు ఆహారంగా గ్రహిస్తే ఆ ఆహారము మనస్సునకు ప్రోద్భలకం కనుక తమోగుణం మనస్సులోని భగవన్నిష్ఠను చెదురుస్తుందని, ఆనాడు నిరాహారంగ ఉండటం శాస్త్రం విధించింది. ఆనాడైనా భగవచ్చరణామృతం, ఆయనకు నివేదించిన ప్రసాదాన్ని మృగముద్రతో పట్టేటంత అంటే ఓ మామూలు రేగుపండంత భగవత్ప్రీతి కోసం గ్రహించాలి. అప్పుడే ఆ ఉపవాసం సరి అయినది. బయట భగవన్నివేదన కావించిన తర్వాత హృదయగుహలో ఆ భగవానుడే ఉంటాడని, ఆయనే మన నాలుక ద్వారా ఆ పదార్థాన్ని రుచి చూస్తాడని వేదం చెప్తోంది. ఆ విశ్వాసంతోటే పై రీతిలో స్వీకరిస్తారు తప్ప తన కడుపు నిండడానికి గాదు. మిగిలిన ఏకాదశితిథి అంతా పూర్తి నిరాహారంగా, జలస్వీకరణగూడ లేకుండా ఉంటారు. జలం గూడ ఉపవాసాన్ని భంగపరచేదే. అసలు గాలి తప్ప లోపలికి ఇక ఏది వెళ్ళినా ఉపవాసం పోయినట్లే. ఒక్క భగవత్ప్రసాదమే, అదీ ఆరాధనానంతరం ఒక్కసారే అంగీకరించారు. అంబరీషోపాఖ్యానంలో రాజు 'సలిలభిక్షణంబు సమ్మతంబు' అంటూ అది గూడ ఉపవాసం పూర్తిచేసినట్లు 'పారణ' చేసినట్లే కనుక ద్వాదశి ఘడియలుండగానే జలపానం చేసాడని ప్రసిద్ధి. దీన్ని బట్టి జలం త్రాగడం గూడ ఉపవాసం చేసేటప్పుడు చేయరు. ఏకాదశి తప్ప మిగిలిన సమయాలలో ఉపవాసాలు శాస్త్రీయాలు కావు. ఇప్పుడు సామాన్యులు చేస్తున్నట్టు ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవత పేరు చెప్పి ఆహారం మానడం శాస్త్రీయ విధులలో చేరదు. ఆహరం ఎంత, ఎలా, ఎప్పుడు, దేనిని తీస్కోవాలనేది శాస్త్రం స్పష్టంగా చెప్పింది. ఆ నియమం ప్రకారం రెండు యామముల కాలం అతిక్రమించరాదట ఆహార గ్రహణలో, అంటే 6 గంటలన్నమాట. అయితే ఆ గ్రహించేది ఏమిటి, ఎంత అన్న దాన్ని బట్టి ఉంటుంది మిగిలినదంతా. ఇది గ్రహించి చేసిననాడు భగవంతుడేర్పరచిన షడ్రుచులు గూడ పరిగ్రహించదగినవే తప్ప ఏదీ వదలక్కర్లేదు. అలాంటి వారికి దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి గూడ స్వాధీనంలో ఉంటాయి. అయితే ఇప్పుడుండే జనులు నూటికి 96 శాతం ఆ శాస్త్రీయ విధులకు అతీతులై బ్రతికేవారే. అందుకే వారికి ఆరోగ్యాలు చెడి, వైద్యులు అవసరమైయ్యారు. మనోబుద్ధుల సంగతి దేముడెరుగు, శరీరంమీద గూడ సామాన్యమైన నియంత్రణ లేకుండా పోయింది. ఏ కాస్త ప్రాకృతిక ఆటుపోట్లు వచ్చినా, పెనుగాలిలో దూది పింజలా ఎగిరిపోతుంటారు. నిగ్రహంలేని ఆహారాలు, శరీరాలలో అర్థంకానంత అనర్థాలను చేర్చి కూర్చిపెట్టేసరికి అర్థంలేని వైద్యాలతో దిన దిన గండం వెయ్యేళ్ళాయుష్షులా బ్రతకలేక బ్రతుకులు వెళ్లదీసే స్థితిలో సంసారాలు సాగిస్తున్నారు.
ఇలాంటి వారిని తిరిగి ప్రాచీన ఋషుల స్థాయికి చేర్చాలంటే అంత పరిశుద్ధమనస్కులుగా తీర్చిదిద్దాలంటే సులభమా? ఇంద్రియాల పంజరంలోంచి బయటకు తెచ్చి ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకునేట్టు బలవంతులను చేయాలంటే ఓ పట్టాన జరిగేదా? దానికంతా అంగీకరిస్తారా? చేదు శక్తులను కోరి కోరి మనుష్యులు ఆర్జించుకున్నవారాయె, ఎవరైనా తీసేస్తామంటే, తొలగిస్తామంటే ముందర వీళ్ళకే బాధ. కష్టార్జితాలను ఎలా వదిలేస్తామో! అని అందుకే అలాంటి వారి నుండి వాటిని వారికి గూడ తెలియకుండా అపహరించి వేయాలి. దానికి తగినట్టు పైకి ఆకర్షకంగా, లోపల అతి సమర్థవంతంగా పనిచేసే ప్రక్రియ కావాలి. అటు శరీరం బలహీనపడరాదు, మనస్సు బెంబేలు పడకూడదు, మలినాలు తొలగాలి, దోషాలకు దూరంగా ప్రవర్తించాలి. ఇలా మనిషిని తీర్చిదిద్దడానికి గతంలో ఎన్నో ప్రకృతి చికిత్సా విధానాలు ఉన్నాయి, ప్రక్రియలూ ఉన్నాయి, చిన్న చిన్న గ్రంథాలూ ఉన్నాయి, కాని మీ గ్రంథం చాల పెద్దది. రుచి పుట్టించేది. లోలోపలికి తీసుకు పోయేది. సమగ్ర లోపాలను తగ్గించుకుంటూ తయారైన దివ్యప్రక్రియ. చాలా బాగుంది.
ఉప్పు మానివేయడం ఒక్కటి శ్రమ తప్ప మిగిలినవి అన్ని రుచులూ మీరు సంస్కరించి అందుకునేట్టు చేసారు. అసలు అది గూడ సంస్కరించే అవకాశముంటుందేమో పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన శాస్త్రాలలో "షణ్ణాం రసానాం లవణం ప్రధానం" అన్నారంటే ఉప్పు గూడ అవసరమే అవుతుంది. జలం అధికంగ ఉన్న భూమి మీది ప్రాణులు ఆ అధిక జలాన్ని ఉప్పుగానే చూస్తున్నాయి. ఆ జలమే జీవరాశికి జీవనాధారంగా ఉంది. దాని పరిణామమే అయిన మానవ శరీరం గూడ 60 శాతం జలంతో ఉండి, ఆ జలంలో ఉప్పు తగిన రీతిలో ఉన్నప్పుడే సురక్షితంగా ఉంటుంది. లేకపోతే శరీరస్థితి క్రమంగా స్వీయరక్షణ శక్తిని కోలుపోవచ్చు. మన భారతీయులు రుచులను ఆహారంలో క్రమపద్ధతిలో అలవాటు చేశారు గనుక భారతీయుల చర్మం అన్నిరకాల వాతావారణానికి తగినదీ, త్వరగా రోగాలకు నిలయం కానిదీ అయింది. ఇది యుగాల ఆహార అలవాట్లలో తయారైనదే తప్ప ఏళ్లకాలంలో కాదు.
అయితే ఉన్న నియమాన్ని అనాదరించారు జనులు. అధికంగా వాడారు కనుక ఇప్పుడు కొంతకాలం దాన్ని వదలినా ఏ ప్రమాదం లేనంత నిల్వ లోపల ఉండి పోయి ఇబ్బందేమీ కల్గించదు. ఇది కొన్ని తరాల వరకూ గూడ కొనసాగవచ్చన్నా ఆశ్చర్యం లేదు. అయితే అదే "జీవన విధానం" కాలేదు. మీరు యిచ్చిన సహజ ప్రక్రియ తరతరాలుగా అందరిలోనూ ఉండి పోవాలి. అందరూ దీన్ని ఆచరించే వారు కావాలి. ఆరోగ్యవంతులూ కావాలి అనుకున్నప్పుడే, యుగాల ఆచారం వెనుక ఆశయాలు చూడవల్సి ఉంది. ప్రపంచంలో ఇతర లవణ రహిత ఆహరం గ్రహించే వారి కంటే మనవారి వైలక్షణ్యం గమనించవలసి ఉంది. దీన్ని మీరు అలోచించి దీని విషయంలో పరిశోధించవలసి ఉంది. అయితే ఇప్పుడు సాగే వైద్య విధానాన్నాచరించే వారికందరికీ ఉప్పు పూర్తిగ మానివేసి కొంతకాలం ఉండటం చాల మంచిదే. అందులో మాకేమీ విరుద్ధాభిప్రాయం లేదు.
ఇక మీరు చిన్నవయస్కులైనా స్వయంగ అనుభవించి, ఆచరించడం వల్ల మీ ప్రతి మాట అనుభవపూర్ణమై ఎదుటి వ్యక్తికి సూటిగ హృదయంలో చేరి స్పందింప చేయడమే కాక, ఆచరింప చేసేదిగానూ ఉంటుంది. భగవంతుడు మీకు దాన్ని బాగ ఆవిష్కరించగలిగే శక్తిని యిచ్చాడు. దానికి తోడు ఆధునిక విద్యలో, విజ్ఞాన శాస్త్ర ప్రవేశం, శారీరక శాస్త్ర పరిచయం గూడ ఉండటం బంగారానికి అబ్బిన తావియే. మీరందించే ఈ 'ఉపవాస ధర్మం' నిజమైన ఆరోగ్య స్వరూపుడైన భగవంతుని సన్నిధిలో జనసామాన్యం నివసించేటట్టు చేయాలని, వారి మనస్సులను ధార్మిక, సాత్విక శక్తితో సమగ్ర శ్రేయస్సు వైపు నిలుపగలిగేది కావాలని మేము హృదయపూర్వకంగా మంగళాశాసనాలు చేస్తున్నాం.
ప్రకృతిలోవీ, జీవితానికి సంబంధించినవీ అయిన అనేక ఔపనిషధ రహస్యాలను లోకానికి అందించిన వారు చాలామంది ప్రభువులే, రాజులే. అందులోనూ 'ఆహారం సంస్కరించుకో ఆరోగ్యం నీ చేతుల్లోదే, ఆనందం నీ ముంగిటే' అంటూ వైశ్వానరోపాసనను 6గురు మునులకు ఉపదేశించిన వాడు ఓ రాజు, అశ్వపతి అనే మహానుభావుడని ఉపనిషత్తు చెప్తోంది. ఆ అంశమే మీలో పనిచేస్తూ ఉండి ఉంటుంది. 'ఉపవాసం'తో పాటు అత్యుత్తమ ఆరోగ్యం, అతి సులభ సాధనము అయిన సహజ వైద్య విధానాన్ని లోకం చేరువలోకి తేగలుగుతున్నారు. భగవంతుడు మీ ద్వారా తనదైన ఈ సమాజాన్ని సవ్యంగ తీర్చి దిద్దుకొనుగాక! ఎవరి శ్రేయస్సు కోసం దాన్ని అందిస్తున్నారో వారంతా దాన్ని తమదిగా స్వీకరించు గాక!
- హెచ్.హెచ్.త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి

ముందుమాట

శ్రీ సత్యనారాయణ రాజు గారు నాకు సంవత్సర కాలం నుంచి పరిచితులు. వారు అకుంఠిత దీక్షతో మన ప్రాచీన సాంప్రదాయమైన ప్రకృతి వైద్యాన్ని మరల ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి చాలా కృషి సల్పుతున్నారు. ఇప్పటి మన వైద్య ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా మన జీవిత విధానంతో ముడిపడ్డాయని భావిస్తారు. ప్రస్తుత జీవిత విధానంలో శరీరానికి తగినంత శ్రమ లేకపోవడం, తరువాత భోజన సదుపాయాలు ఎక్కువ కలిగి ఉండడం, నియమం పాటించకుండా అన్నివేళలా భోజనం చేయడం. ఈ కారణాల వలన అనారోగ్యం చేకూరుతుంది. ప్రస్తుత వైద్య పద్ధతిలో రోగానికి మందు ఇస్తున్నారు. కాని నియమావళితో, క్రమశిక్షణతో జీవితాన్ని గడపలేకపోతున్నాము. శ్రీ రాజు గారు ప్రతి వ్యక్తి దగ్గరకు వెళ్ళి, నియమంతో భోజనం చేస్తే మనిషికి జబ్బులు రావటానికి అవకాశం లేదు అని తను నమ్మినదాన్ని మిగిలిన వాళ్ళకు నమ్మకం కలుగజేస్తారు. ఈ విధానంలో ఉపవాసం ముఖ్యమైన భాగం. ఉపవాసం వలన మన శరీరంలో ఏర్పడిన చెడ్డ పదార్థాలు బయటకు పోయి మళ్ళీ శరీరంలో స్వచ్ఛమైన రక్తం ప్రవహిస్తుంది. దీని వలన అనేక జబ్బులు నయం అవుతాయి. మనిషి ఆరోగ్యంగా జీవించటానికి అవకాశం ఉంటుంది. శ్రీ రాజు గారు ఎన్నో విషయాలపై రీసెర్చి జరిపి తన శరీరం మీదే వాటి పరిశోధన చేశారు. ఆయన ఒక కర్మజీవి. అందరి శ్రేయస్సును మనసులో పెట్టుకుని ప్రకృతి వైద్యాన్ని అందరి దగ్గరకు తీసుకువెళ్ళటానికి ఎంతో కృషిచేస్తున్నారు. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు అందించి, ఈ మంచి పనికి ఇంకా దోహదం చేయాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.
హెచ్. జె. దొర, ఐ.పి.యస్
పోలీసు డైరెక్టరు జనరల్,
హైదరాబాద్

నివేదన

ప్రియమైన పాఠకులకు నమస్కారములు,
మన దేహం పంచభూతముల వల్ల అవిర్భవించినది. పాంచభౌతిక శక్తులతోనే అభివృద్ధి చెందుచున్నది. అట్టి దేహమునందు లోపములను, రోగములను కూడా పాంచభౌతిక చికిత్సలే నివారింపగలవు అనుట సత్యము. రోగములు పంచభూత శక్తుల లోపముల వలననే కలుగుచున్నవి. పంచభూత శక్తులు లోపం రాకుండా జీవించగలుగుచున్న పశు, పక్ష్యాదులకు రోగాలు రాకుండటకు అదే కారణం. మన అలవాట్లను బట్టి, ఆహార విహారములను బట్టి ఈ పంచభూతముల లోపం మానవునకు కలుగుచున్నది. పంచభూతములనగా గాలి, నీరు, భూమి, సూర్యుడు, ఆకాశము మొదలగునవి. వీటి లోపం కారణంగా మనకు సంక్రమించే అన్ని రోగాలు వీటిని తిరిగి సవరించడం ద్వారా పూర్తిగా నివారింపబడతాయి. పాము ఎక్కడుంటే దెబ్బకూడా అక్కడే వేసినట్లుగా మనకొచ్చిన రోగాలకు ఈ చికిత్సలు ఆ విధంగానే పనిచేస్తాయి. శరీరానికి పంచభూతాలతో చేసే చికిత్సలు పాలు, నీరు వలె కలిసి పోతుందీ స్నేహం. అందువల్లనే ఈ చికిత్సల వలన దుష్ఫలితాలు అసలుండవు.
జంతువుల నుండి మనుషులు వచ్చినట్లు శాస్త్రాలు చెప్పుచున్నాయి. ఎన్నో వందల కోట్ల సంవత్సరాల నుండి జన్మలున్న జంతువులు డాక్టర్లు, ఆసపత్రులు, మందుల అవసరం లేకుండానే ఆరోగ్యంగా జీవించడంలో ఉన్న రహస్యం ఆలోచిస్తే ఆహారనియమాలను ఉల్లంఘించకపోవడమే కాకుండా, శరీరంలో ఇబ్బందులు చోటుచేసుకున్నప్పుడు సృష్టికర్త సృష్టించిన ఉపవాస ధర్మాన్ని విధిగా ఆచరించడం వాటి ముఖ్యమైన ధర్మం. మనిషి పుట్టక ముందు నుండి ఈ ఉపవాస ధర్మాలు ఉన్నాయి. కాబట్టి ఉపవాస ధర్మం అనేది మనిషి కనిపెట్టింది కాదు. భూమి మీద వున్న అన్ని జీవరాసులకు సృష్టికర్త అందించిన సహజమైన చికిత్స ఈ ఉపవాస ధర్మం. ఉపవాస ధర్మానికి దూరం కావడం, ఉల్లంఘించడం సృష్టికర్త ఆజ్ఞను ధిక్కరించడం వంటిది. ఉపవాస ధర్మాన్ని ఉల్లంఘించడం క్షమించరాని నేరం. తద్వారా భగవంతుడు అందించే సుఖాలకు దూరమై రోగాలకు చేరువై, పాపాలను పోగు చేసుకుంటారు.
పంచభూతాలన్నింటిలో అతి ముఖ్యమైనది ఆకాశము. సృష్టి అంతా ఈ ఆకాశము అనే ఖాళీలోనే ఉంది. ఈ ఆకాశమనే భూతానికి సంబంధించినదే ఈ ఉపవాస ధర్మం. మన శరీరంలో కూడా ఆకాశమనే ఖాళీ (శూన్యం) ఉండబట్టి పదార్థాల రాకపోకలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. శరీరంలో రోగ పదార్థాలు(నిర్జీవ పదార్థాలు) పేరుకొని పోయినప్పుడు ఖాళీ తగ్గి (ఆకాశం తగ్గి) లేదా ట్రాఫిక్ జామ్ అయ్యి, మంచి పదార్థాల (ఆహరం, గాలి, నీరు) ప్రయాణానికి ఆటంకం కలిగిస్తుంటాయి. ఆ ఆటంకాలను తొలగించి, ఖాళీని తిరిగి కల్పించి (ఆకాశాన్ని) ఆహార పదార్థాల రాకపోకలు (ప్రయాణాన్ని) సాఫీగా జరిగేటట్లు చేయడమే ఉపవాసం. భగవంతుడు ఈ శరీరానికి తన్నుతాను బాగుచేసుకొనే శక్తిని కల్పించియున్నాడు. ఆ శక్తి 'ఉపవాస ధర్మం' అవలంభించడం ద్వారానే సాధ్యపడుతుంది. శరీరానికి ఆహారాన్ని అందివ్వకుండా విశ్రాంతి నివ్వడమే ఉపవాసం. కారును తయారుచేసినవాడే కారును బాగా రిపేరు చేయగలడు. శరీరాన్ని సృష్టించిన వాడే శరీరానికి నిజమైన డాక్టరు. నీవు తిండి మానివెయ్యి, నేను నిన్ను బాగుచేస్తానని ఆ భగవంతుడే స్వయంగా చెబుతుంటే ఆ వైద్యుడిని కాదని, వేరే వైద్యులకు నీ శరీరాన్ని అందివ్వడం ఎంతో పొరపాటు. అదే నీ గ్రహపాటు. తిండిని నిగ్రహించడమే తపస్సు అన్నారు. అంటే ఉపవాసం తపస్సంత పవిత్రమైనది, శక్తిగలది.
ఈ కలియుగాంతంలో మనుషులు ఉపవాస ధర్మాన్ని ముఖ్యంగా మరిచారు. ఏ యుగాలతో సంబంధం లేకుండా కలియుగపు మనుషులతో సహచర్యం చేస్తున్నప్పటికీ మిగతా జీవరాసులు ఈ ఉపవాస ధర్మాన్ని విడనాడకుండా వాటికున్న దైవ భక్తిని చాటి చెప్పుచున్నాయి. మనతోపాటు మన ప్రాంగణంలో జీవించే కుక్క, పిల్లి, గేదె, ఆవులు ఉపవాసాలు చేస్తున్నప్పటికీ, మనిషి మాత్రం తను మరచిన ఉపవాస ధర్మాన్ని తిరిగి వాటిని చూసి (జంతువులన్నీ దైవంతో సమానం) కూడా తెలుసుకోలేక పోవడం ఎంతో దురదృష్టకరం. ఏ జన్మలోనో పాపం చేసి ఉంటేనే ఈ జన్మలో మనకు ఉపవాసాలు చేయ మనస్కరించదు. ఉపవాస ధర్మాన్ని ఆచరించే అవకాశం కలగడమంటే ఎంతో పుణ్యం చేసుకున్నట్లు. తపస్సు (ఉపవాసం) చేస్తే పుణ్యం వస్తుంది. అప్పటికి శరీరానికి పట్టిన చీడ పీడలన్నీ పటాపంచలు అవుతాయన్నది సత్యం. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఉపవాసాన్ని ఒక చికిత్సగా గాక ఒక ధర్మంగా వివరించడం జరిగింది. అదే మీ ముందుకొచ్చిన ఈ 'ఉపవాస ధర్మం'. ఇది సహజమైన సృష్టి ధర్మం.
సుమారు 250 సంవత్సరాల నుండి ఈ ఉపవాస ధర్మం ఉపవాస చికిత్సగా వెలుగులోకి వచ్చింది. మనిషి ఆహార విహారాదులు అసహజం అవ్వడం వలన, ఉపవాసం ద్వారా శరీరం శుద్ధికావడానికి జంతువుల వలె ఒకటి రెండు రోజులలో పూర్తిగాక ఎక్కువ రోజులు పడుతున్నవి. ఎక్కువ రోజులు ఏమీ ఆహారం ముట్టకుండా కేవలం నీటితో ఉంటే శరీరం దెబ్బతింటుంది. ప్రకృతి వైద్యంలో ఉపవాసాలను కేవలం నీటితో, కొంతమంది నిమ్మకాయ నీళ్ళతో, ఇంకొంతమంది బెల్లంనీళ్ళతో, మరి కొంతమంది మూడు నాలుగుసార్లు తేనెతో చేయిస్తున్నారు. శరీరానికి సరైన గ్లూకోజు అందక ఉపవాసంలో నీరసించిపోవడం, కళ్ళు తిరిగి పడిపోవడం, మనిషి ఎండుకొని పోవడం, ఆకలి చచ్చిపోవడం, ఎవరన్నా ప్రాణాలు కోల్పోతుండడం మొదలగునవి ఉపవాసం మీద భయాన్ని ప్రజలకు మిగిల్చినవి. వీటి కారణంగానే ప్రజలు ఉపవాస ధర్మానికి దూరం అయ్యి కృత్రిమమైన చికిత్సలకు చేరువైనారు. ఉపవాసం అంటే నీరసాన్ని వదిలించి శక్తిని పెంచేదని, రోగాన్ని వదిలించి ఆరోగ్యాన్నిచ్చేదని, అజీర్ణాన్ని వదిలించి ఆకలిని పెంచేదని, పోయే ప్రాణాన్ని నిలిపేదని నిరూపించడానికి మీ ముందుకు వచ్చినదే ఈ "ఉపవాస ధర్మం". అదే జీవ ధర్మం.
శరీర శాస్త్ర ప్రకారం మెదడు రోజూ శక్తివంతంగా పనిచేయాలంటే ముఖ్యంగా ప్రతినిత్యం 800 కేలరీల శక్తి కావాలి. నేను నా శరీరం మీద చేసిన ప్రయోగ ఫలితంగా శరీరానికి అపకారం జరుగకుండా ఉపవాస విధానాన్ని రూపుదిద్దడం జరిగింది. 250 గ్రా. తేనెను నాలుగు టీ స్పూన్లు ప్రతి రెండు గంటలకు ఒక్కసారి చొప్పున రోజుకి 8 సార్లు ఇస్తూ, అలాగే 5 లీటర్ల మంచి నీరు ప్రతి రెండు గంటలకు రెండుగ్లాసుల చొప్పున టైము ప్రకారం త్రాగే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రస్తుత నాగరిక ప్రపంచాన్ని దృష్టిలో ఉంచుకొని, శరీర శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని మానవాళికి శ్రీరామ రక్ష కావాలని సరికొత్త ఉపవాస ధర్మాన్ని మీకందించడం జరుగుచున్నది. మేము చేయించే ఈ ఉపవాస విధానానికి రోగానికి నీరసం వచ్చి శరీరాన్ని వదిలి వెళ్ళాలేగానీ, శరీరానికెన్నడూ నీరసం రాదు. శరీరం నుండి పూర్తిగా రోగాలు విసర్జింపబడే వరకూ శరీరం శక్తివంతంగా రోగాన్ని ఎదుర్కొంటూనే ఉంటుంది. శరీరం కోరినన్ని రోజులు శరీరానికి ఇబ్బంది లేకుండా ఉపవాసాలు చేయవచ్చు. చిన్న, పెద్ద వయస్సుతో నిమిత్తం లేకుండా మా దగ్గర ఒక సంవత్సరం బాబు ఏడు రోజులు చేస్తే 96 సంవత్సరాల ముసలాయన 6 రోజులు ఉపవాసాలు చేయగలిగారు. ఇన్ సులిన్ (షుగరు జబ్బు ఎక్కువ ఉన్న వారు) ఇన్ జెక్షన్ చేసుకొనే వారు కూడా ఇన్ సులిన్ లేకుండా (ఆహరం లేకుండా) 44 రోజులు ఉపవాసాలు చేయగలిగారు. సుగరెక్కువ వున్న వారికి ఉపవాసాలు ఎవరూ చేయించరు. అలాంటి వారిని కూడా క్షేమంగా ఉపవాసాలు చేయించగల సత్తా ఈ ఉపవాస ధర్మానికుంది. అన్ని రకాల దీర్ఘరోగాల వారికి, అని తత్వాలుగల వారికి సరైనదీ ఉపవాస విధానం. రక్తం బాగా తక్కువ ఉన్న వారికి ఉపవాసాలు వలదు అంటారు. కానీ ఈ ఉపవాస ధర్మం ద్వారా ఉపవాసంలో రోజురోజుకీ కొత్తరక్తం పడుతుంది. ఉపవాసాలు ఎన్ని రోజులు చేసినప్పటికీ రక్త లోపాలుగానీ, రక్త భేదాలు గానీ రావు అనుట సత్యం. మా దగ్గర వారం నుండి 100 రోజుల వరకూ ఉపవాసాలు చేయగలుగుతారు. ఉపవాసం మొదలు పెట్టిన రోజున 65 సంవత్సరముల వయసున్న ఆయనకు హిమోగ్లోబిన్ 14.8 గ్రాములుంటే, ఆయన ఉపవాసం విరమించే రోజున అంటే 58 వ రోజు తిరిగి రక్త పరీక్ష చేయిస్తే హిమోగ్లోబిన్ 15.8 గ్రా.కు పెరగడం జరిగింది. ఇది ఈ ఉపవాస విధానం యొక్క గొప్పతనం. అన్ని పనులను ప్రక్కన పెట్టి, కదలకుండా కూర్చొని ఉపవాసాలంటే ప్రజలు కుదరక ఎక్కువ మంది దూరం అవుతున్నారు. వెనుకటి పద్ధతిన చేయించే ఉపవాసాలు అయితే ఇటువంటి వారికి పనిచేసుకొంటూ చేయడానికి నీరసం వస్తుంది. అదే ఎక్కువ తేనెతో ఉపవాసాలు అయితే 80 సంవత్సరాల వయస్సు వారు కూడా రోజూ ఆఫీసుకెళ్లి 12 గంటలు పనిచేసుకొంటూ మా ఉపవాసాలు చేయగలుగుచున్నారు. ఎక్కువ పనిచేయడం మంచిది కాదు. అవకాశమున్నంత వరకూ విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈ కాలపు వారికి మా ఉపవాస విధానం రాముడికి ఆంజనేయుడు అండగా నిలిచినట్లు నిలవగలదనడంలో సందేహం లేదు. అందుకే ఈ 'ఉపవాసధర్మం' మనందరి ధర్మం.
ఉపవాస ధర్మం శరీరంలోని రోగ పదార్థాన్ని కడగడానికి సహకరించితే, తిరిగి శరీరానికి రోగ పదార్థం చేరకుండా ఆహారం సహకరిస్తుంది. ప్రకృతి వైద్యంలో కూరలను ఉడకబెట్టి, ఆ చప్పిడి ముక్కలను రోగులకు బెడతారు. ఆ చప్పదనం కారణంగా రోగులు కొన్ని రోజులు (ఆశ్రమంలో మాత్రమే) మాత్రమే ఆ ఆహారాన్ని తిని మరలా మామూలు రుచులకు పోవడం జరిగి మరలా వ్యాధులు, బాధలను అందుకోవడం సహజమయ్యింది. ప్రకృతి వైద్యాన్ని ఒక జీవన విధానంగా తీర్చిదిద్దాలన్న తపన నాలో ఎన్నో సంవత్సరాలుగా మెదులుతూ ఉండేది. అప్పుడే రోగి శాశ్వతంగా ఒకే మంచి ఆహారాన్ని తింటూ డాక్టర్లకూ, రోగాలకు స్వస్తి చెప్పగలడన్న విశ్వాసంతో వంటలలో నేను 15 నెలలు చేసిన ప్రయోగ ఫలితంగా సుఖజీవన ఆహరం, రుచికరంగానే ఉండే వంటలు వెలుగులోనికి వచ్చినవి. మనకు అలవాటు ఉన్నట్లు అన్ని రకాలుగా వండుకోవడంలో (ఉప్పు, నూనె, నెయ్యి, తీపి, పులుపు, కారం, మసాలాలు లేకుండా) ప్రత్యామ్నాయపు రుచులను వాడుకొంటూ, రుచిని అనుభవిస్తూ రోగాన్ని దూరం చేయగల వంటలను కనుగొన్నాము. ఈ వంటలు వచ్చిన దగ్గర నుండి గాంధీ గారు, కృష్ణంరాజు (భీమవరం) గారు ఆశించినట్లు ప్రకృతి కుటుంబాలు తయారయ్యి, ఇంటిల్లిపాదీ సంవత్సరం పొడవునా తినగలిగి, ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగేటట్లు సాధ్యపడుతుంది. వంటల మార్పుతో మేము ప్రజలకు ప్రకృతి జీవన విధానం అయిన ఈ "ఉపవాసధర్మం"తో ఆహారధర్మాన్ని అందించగలుగుతున్నాము.
సృష్టికర్త అనండి, దైవం అనండి, ప్రకృతి మాత అనండి, వారి నుండి స్ఫూర్తి నాకు గత ఐదు సంవత్సరాలుగా అందుతూ నిరంతరం నన్ను కంటికి రెప్పలా కాపాడుతూ ప్రజలకు ప్రకృతి ధర్మం, ఉపవాసధర్మాలను అందించే విధంగా నన్ను భుజం తట్టి, మేలుకొలిపి మందుల రంగం నుండి నన్నీ రంగంలోనికి దింపడం జరిగింది. నాలుగు సంవత్సరాల క్రితం ఒక రోజు నా జీవితం ఈ విధంగా ప్రకృతి పరంగా మారుతున్నట్లు స్ఫురణకు వచ్చి, ఈ విధంగా జరుగుతుందని నాకు ఆ నిమిషంలో తెలియజేసింది. అదే ఇప్పుడు స్పష్టంగా జరుగుచున్నది. ఆ స్పూర్తే నన్ను మేలుకొలిపి ఉత్తరం వ్రాయడం కూడా సరిగా రాని నా చేత 1997 జనవరిలో "సుఖ జీవన సోపానాలు" మరియు 1998 ఫిబ్రవరిలో "ఆహరం-ఆలోచన" (ఆహారంగురించి - వంటలగురించి) అను పుస్తకాలను వ్రాయించి మీ అందరికీ అందించే విధంగా తోడ్పడింది. అలాగే 1998 జులై ఆఖరులో 'ఉపవాస ధర్మం' గురించి సుమారు 100 - 150 పేజీలు అవుతుందని వ్రాయుట ప్రారంభిస్తే అది సుమారు 450 పేజీలు అయ్యింది. రాస్తూ ఉంటే నాకు తెలియకుండా ఒక పేజీ అనుకున్నది ఐదు పేజీలు వ్రాయడం, ఎన్నో కొత్త విషయాలు నా స్ఫురణకు రావడం చూస్తూ ఉంటే ఆ ప్రకృతి మాతే నా చేత స్వయంగా ఉపవాసధర్మం గురించి ఇంత ఉందా అన్నట్లు రాయించింది. ఇది అంతా నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను గత ఐదు సంవత్సరాల నుండి ఉపవాస విధానంలో పొందిన మెళకువలను ప్రజలందరూ సంతోషంగా ఆమోదించడంలో ఆ మెళకువలను మీ కందరకూ అందించేదే ఈ 'ఉపవాస ధర్మం'.
రోగము నిర్జీవ పదార్థము, నీవు సజీవుడవు గనుక నీవే రోగాన్ని పట్టుకు కూర్చున్నావు. రోగం నిన్నెప్పుడూ వదలదు. ఆత్మ వంతుడవై నీవే రోగాన్ని వదిలిపెట్టాలి. శరీరంలో వున్న రోగ పదార్థాలని మనం వదిలివేయాలంటే ఉపవాస మొక్కటే శరణ్యం అని మరువకండి. ఆహారం, నిద్ర, సంగమం మొదలయినవి ఎంత అవసరమనుకుని, జీవితంలో భాగం అనుకుంటున్నామో అలాగే ఉపవాస ధర్మం కూడా మనం జీవితంలో ఒక భాగమని వివేకంతో గుర్తించాలి. ఆకలి లేనప్పుడు, నోరు చేదుగా ఉన్నప్పుడు ఆహరం తింటూ మందులు మింగడం అనేది వివేకవంతులు చేయవలసిన పని కాదు. శరీరానికొచ్చిన ఇబ్బందులకు ముందు ప్రకృతి ధర్మానికి అవకాశమివ్వకుండా మందులు వేయడమనేది పాము ఒక చోట ఉంటే దెబ్బ మరో చోట వేయడం అవుతుంది. ఇల్లు, ఒళ్ళు గుల్ల అవుతుందేగాని ఆరోగ్యం రాక ఉన్న శరీరం దెబ్బతింటుందని తెలుసుకోండి. ఆసుపత్రుల చుట్టూ ప్రదిక్షణలతో, మందులతో పని లేకుండా జీవించగలిగేటట్లు బోధించేదే ఈ 'ఉపవాసధర్మం' అదే ఆరోగ్య ధర్మం.
మంచిని పదే పదే చెప్పితే గానీ పలువురికి అర్థం కాదంటారు పెద్దలు. దానిని దృష్టిలో ఉంచుకొని సామాన్య ప్రజలను ఆధారంగా చేసుకొని, ఉన్న విషయాన్ని రకరకాల ఉదాహరణలతో, అవసరమయితే రెండు మూడు సార్లుగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరి హృదయాల్లో హత్తుకుని నా మాటలు మీ మనస్సులో ముద్రింపబడాలన్న తపనతో మాత్రమే ఇలా వ్రాయడం జరిగింది. పది మందికి మీరు మరలా విషయాన్ని తిరిగి చెప్పగలగాలంటే ఉదాహరణల ద్వారానే సాధ్యపడుతుంది. అందువల్ల అనుభవజ్ఞులు, జ్ఞానులు నా మాటలను వేరేలా భావించవద్దని ప్రార్థన.
నేను అనుభవించే ఆరోగ్య ఆనందాన్ని మీకందిద్దామన్న ప్రయత్నమే ఈ 'ఉపవాసధర్మం' గ్రంథం. ఎన్నాళ్ళ నుండో నాలో మెదులుతూ, కదులుతూ వస్తున్న ఆలోచనా పరంపరలకు అక్షరాకృతియే ఈ 'ఉపవాసధర్మం'. ఈ పుస్తకంలో అడుగడుగునా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి అంటూ పెట్టుకొన్న మొర మీకు వినిపిస్తుందని ఆశించడంలో తప్పు లేదనుకుంటాను. ఈ గ్రంథాన్ని చదివి కొన్ని చోట్ల కటువుగా చెప్పినందుకు అపార్థం చేసుకున్నా ఫర్వాలేదుగానీ, విషయాన్ని సరియైన కోణంలో అర్థం చేసుకొని, ఆచరించి మీరు ఆరోగ్యవంతులై పదిమందికీ ఆరోగ్యాన్ని ప్రసాదించగలిగితే నా జన్మ ధన్యమైనట్లే, నా ఈ ప్రయత్నం సఫలమైనట్లే. నా మనోరథం సిద్ధించినట్లే.
నిత్య ప్రయోగశీలి అయిన ప్రకృతిలో నిత్యనూతనంగా మార్పులు వస్తూనే ఉన్నాయి. మీరిచ్చే సలహాలు, సహకారాలు, మీ అనుభవాలు నాతో పంచుకోమని విన్నవించుకొంటున్నాను. ప్రకృతి వైద్య ఆహార, ఆరోగ్య నియమాల నవలంభిస్తున్న నా జీవన యానంలో మీ సలహాలు సర్వదా శిరోధార్యాలు. మీరు సహృదయంతో చదవండి. పెద్ద మనస్సుతో ఆలోచించండి. ఉపవాస ధర్మాన్ని ఆచరించి చూడండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని కుటుంబం అంతా పొందండి. హాయిగా జీవన యానం సాగించండి.
పలకండి!
మీ అభిప్రాయం తెలపండి!
ఆశీర్వదించండి!
ఎందరో శ్రేయోభిలాషులు
వారందరికీ నా వందనాలు
అందరికీ ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తూ
"ఆరోగ్యం అంటే ఆనందం" అని శాసిస్తూ...
తమ విధేయుడు
మంతెన సత్యనారాయణరాజు

కృతజ్ఞతలు

ఎందరో మహానుభావులున్న ఈ మహానగరంలో ఎటుచూసినా కాంక్రీట్ జంగిల్సే తప్ప సేద తీరడానికింత పచ్చని చెట్లుండే ప్రశాంత వాతావరణం ఎక్కడా కానరాదు. పచ్చదనం వెతుక్కోవాలంటే నిజంగా అదొక యజ్ఞమే. ఎటు చూసినా కొండలు, లోయలూ ఇంకా గుట్టలతో నిండిపోయిన యీ భాగ్యనగరంలో ప్రకృతి కాంత దివి నుండి భువికి దిగి వచ్చిందా అనిపించేట్టుగా వుండే చెట్లతో, మొత్తంగా భాగ్యనగరాన్ని ఒకేసారి వీక్షించ గలిగే గవాక్షం లాంటి జూబ్లీహిల్స్ లో ప్రకృతి వైద్యాన్నందించేందుకు ఒక చక్కటి అనువైన ప్రదేశాన్ని అట్లూరి సుబ్బారావుగారు నాకు కల్పించి, 'నేను సైతం సమిధనొక్కటి ఆహుతిచ్చాను' అన్న మహాకవి శ్రీశ్రీని స్ఫూర్తిగా చేసుకుని, ప్రకృతి వైద్యాన్ని పదుగురికీ ఉచితరీతిని అందించే అవకాశాన్నిచ్చి, సమాజానికి తనూ ఇంత సేవచేయగలుగుతున్నానే అన్న తృప్తి మిగుల్చుకున్నారు పూజ్యులు అట్లూరి సుబ్బారావుగారు. ఎలాంటి ఫలాపేక్ష లేకుండా ఎవ్వరూ ఎటువంటి పనీ తల పెట్టరనుకునే నేటి సామాజిక వాతావరణంలో ఎంతో సామాజిక స్పృహతో ఏమీ ఆశించకుండా ప్రకృతి వైద్య విధానాల ఆచరణకు ఖర్చుకు వెరవకుండా నన్ను వెన్నుతట్టి హైదరాబాదు నగరానికి వచ్చిన నాకిక్కడ నిలువనీడ నిచ్చిన సుబ్బారావుగార్కి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
'ఉపవాస ధర్మం' గ్రంథ రచనకు నన్ను ఆశీర్వదించి ఆశీస్సులందజేసిన శ్రీమన్నారాయణ స్వరూపులు శ్రీ జియ్యర్ స్వామి గార్కి నా ప్రత్యేక కృతజ్ఞతలు.
అడిగిందే తడవుగా 'ముందుమాట' వ్రాసి నన్ను ముచ్చట పరచి, గ్రంథరచనకు నన్ను ఉత్తేజపరచిన పోలీసు డైరక్టరు జనరల్ శ్రీ హెచ్. జె. దొర, ఐ. పి. ఎస్., గార్కి నా ధన్యవాదాలు.
ఇంటికో పూవు తెస్తే ఈశ్వరునికో మాల అయిందని సామెత. పుస్తక రచన ఒక యజ్ఞం లాంటిది. ఈ యజ్ఞంలో సహకరించిన శ్రీ గోపాలకృష్ణ మూర్తి గార్కి, అలాగే నా ప్రకృతి వైద్య విధానాన్ని ఆచరించి, ఆరోగ్యవంతులై వారి అనుభవాలను అక్షర రూపంలో అందించిన నా శ్రేయోభిలాషులందరికీ నా కృతజ్ఞతలు.
తలచిందే తడవుగా అతి తక్కువ వ్యవధిలో ఈ పుస్తకాన్ని పైట చెంగంత అందంగా, అద్వితీయంగా ముద్రించిన సూరజ్ ప్రింటర్సు వారికి, ముఖ్యంగా ఎంతో శ్రమకోర్చి నాకు సహకారాన్నందించిన శ్రీ శివాజీ రాజు గారికి నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసు కుంటున్నాను.
మంతెన సత్యనారాయణ రాజు

1. నాటి కాలం - నేటి చికిత్స

ఆరోగ్యం ప్రతి జీవి యొక్క జన్మహక్కు. ఒక్క మనిషికి తప్ప సృష్టిలోని ప్రతి జీవరాశికి ఆరోగ్యం జీవితంలో ఒక భాగంగా లభిస్తున్నది. మన పూర్వీకులు, ఋషులు ఆరోగ్యాన్ని ఒక మహాభాగ్యంగా గుర్తించి, వారి లోపం లేకుండా శరీర ధర్మాలను నియమానుసారంగా పాటించి ఆరోగ్యాన్ని అనుభవించారు. రోగంలేని, రోగం రాని మనిషిగా జీవించగలిగారు. కాలక్రమేణా వృత్తిధర్మాలు, శరీర ధర్మాలు, ఆహార ధర్మాలు మార్పు చెందడంతో మనిషికి ఆరోగ్యం జన్మహక్కు లాగా రోగం కూడా జన్మహక్కుగా మారింది. ఆరోగ్యంగా జీవయాత్ర సాగిస్తున్నవారు అరుదుగా గోచరిస్తున్నారు. చుక్కల్లో చంద్రునిలా ఆరోగ్యవంతులు అరుదుగా అగుపిస్తున్నారు. మనిషికి రోగాలు రావడం సహజమయి పోయింది. లింగభేదం, వయోబేధం, ఋతుబేధం లేకుండా రోగాలు సంక్రమిస్తున్నాయి. వయస్సుతో శరీరభాగాలు ఒక్కొక్కటి పాడవడం, కళ్ళు పోవడం, పళ్ళు ఊడిపోవడం, నడుం వంగిపోవడం, కూర్చొని లేవలేకపోవడం, కీళ్లు అరిగిపోవడం, మంచాన పడి మూలగడం మొదలగునవి మనిషికి తప్పదన్నట్లు భావిస్తున్నారు. అవి వస్తున్నాయంటే మనం చేసుకొనే లోపాలేనని ఏ ఒక్కరూ గుర్తించడం లేదు. అందరికీ వస్తున్నాయి కాబట్టి నలుగురితో నారాయణ అనే దృక్పథంతో మనిషి వాటికి ముందుగానే సిద్ధపడుతున్నాడు. నిజంగా ఆలోచిస్తే మనిషికి వంద సంవత్సరాలలో అసలు రోగం వచ్చే ప్రసక్తే లేదు. మనకు భగవంతుడు అందించిన అవయవాలు అంత గట్టితనం, సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ప్రతి ఒక్కరికీ రోగాలు రావడం చూస్తున్న డాక్టర్లు కూడా ఈ వయస్సుకి ఈ రోగాలు తప్పవు, మీకు వయస్సు వచ్చింది కదా అని అంటున్నారు. కప్పిపుచ్చుకోవడానికే గానీ ఆ మాట సరియైనది గాదు. నిజానికి మనిషికి కళ్ళు పోకుండా, కీళ్లు అరగకుండా, పళ్ళు ఊడకుండా, మంచాన పడకుండా జీవించే మార్గం లేకపోలేదు. మనకు రోగాలు ఎందుకు వస్తున్నాయో? ఎలా వస్తున్నాయో? ఎలా వదిలించుకోవాలో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రోగాలు ఎలా వస్తున్నదీ మనకు తెలియనిదే రోగాలు మాత్రం మన నుండి పోవు అన్నది నిజం. అందుకని రోగాలు ఎలా వస్తున్నదీ ముందు తెలుసుకుందాం.
మన శరీరంలో రెండు పదార్థములు మాత్రమే ఉంటాయి. ఒకటి జీవ పదార్థము, రెండవది నిర్జీవ పదార్థము. జీవపదార్థమనగా సజీవమైనది. శరీరాన్ని, అవయవాలను, గ్రంథులను పోషించేది. దేహమునకు బలమును చేకుర్చునది, వివిధ ధర్మములను నిర్వర్తించుటకు శక్తి సామర్థ్యములను అందించేది. ఈ జీవపదార్థమును జాతీయ పదార్థమని అందురు. అలాగే నిర్జీవ పదార్థమనగా రోగ పదార్థమనియు, విజాతీయ పదార్థమనియు, అన్య పదార్థమనియు రకరకాలుగా చెప్పుచుంటారు. నిర్జీవ పదార్థమనగా ప్రాణములేనిదని, కదలికలు లేనిదని అర్థము. ఈ ప్రాణములేని కదలికలు లేని పదార్థము శరీరంలో ప్రవేశించినప్పుడు, కదలికలు గల రక్త ప్రవాహమునకు అడ్డుపడుతూ, ప్రవాహానికి ఆటంకం కలిగిస్తూ ఉంటుంది. ఆ రకంగా అడ్డుపడ్డ పదార్థాన్ని అడ్డు తొలగించడానికి శరీరంలో ఘర్షణ ఫ్రారంభం అవుతుంది. తద్వారా బాధలు మొదలవుతాయి. ఈ రోగ పదార్థము నాడీమండల ప్రవాహములో చేరినప్పుడు పక్షవాతము, నెర్వస్ డిజార్డర్స్ మొదలైనవి వస్తాయి. రక్తప్రవాహంలో ఈ రోగ పదార్థము చేరినప్పుడు రక్తనాళాలు పూడుకొని పోవుట, రక్త ప్రసరణ తగ్గిపోవుట జరుగుతుంది. ఆ విధంగా మూసుకొని పోయిన రక్తనాళాల ద్వారా రక్తాన్ని గుండె ఎక్కువ ఒత్తిడితో చిమ్మవలసి వస్తుంది. దానివలన గుండె జబ్బులు వస్తాయి. బి.పి. పెరుగుతుంది. అదే గుండెకు ఉండే రక్తనాళాలలో ఈ రోగ పదార్థము పేరుకొనిపోతే గుండెకు రక్తప్రసరణ సరిగా అందక గుండె ఆగిపోతుంది. ఆ రోగ పదార్థము కీళ్ళలో చేరితే కీళ్ళు బిగిసిపోతాయి.
మన దేహము ఆహారము చేత పోషించ బడుచున్నది. మనం తినే ఆహారము దేహానికి ఉపయోగకరమైనదిగా యుంటే అట్టి ఆహరం వలన శరీరానికి హాని కలుగదు. రోగ పదార్థము పుట్టదు. అట్లు గాక దేహ విరుద్ధమైన దానిని, రుచులు కలిగిన దానిని జిహ్వకు దాసులమై భుజించినచో అది శరీరానికి సరిగా శక్తినందించలేదు సరిగదా అందులోని నిర్జీవ పదార్థములు రోగ పదార్థములుగా నిలిచిపోవును. ఆ రోగ పదార్థము ఏ అవయవములో లేదా ఏ భాగములో నిలిచిపోతే ఆ భాగం రోగగ్రస్తమవుచున్నది. రోగ పదార్థమనేది మనం తినే ఆహరం ద్వారా తయారవుతున్నదని అర్థమవుతున్నది. రోగమనేది ఏ ఒక్కచోట, ఏ అంగం ప్రత్యంగములలోనూ పుట్టదు. మన ఆహార విహార లోపములే ఈ రోగపదార్థమునకు కారణము. ఈ రోగపదార్థమనేది నిర్జీవమైనందువల్ల అంతరావయవాలలోనూ, చర్మ భాగాలలోనూ వివిధ రూపాలలో అనగా ఘన, ద్రవ, వాయు రూపములలో నిలువయుండును. ఈ నిలిచియున్న రోగపదార్థము రస, రక్త, నాడీ, వాయుప్రవాహములకు అవరోధము కల్గించుచున్నప్పుడు మనలోని రోగనిరోధక శక్తి దానిని బయటకు నెట్టి వేయుటకు చేయు ప్రయత్నమే "రోగము". శరీరంలో రోగనిరోధక శక్తి లోపించినప్పుడు రోగపదార్థము శరీరంలోనే నిలువ యుండిపోతుంది. అది జీవము లేనిది అయి ఉండుటవలన త్వరగా శిథిలమై చెడిపోయి, అందు నుండి అనేక రకములైన రోగ క్రిములు పుడుతుంటాయి. ఆ క్రిములు శరీర లోపల భాగాలను పాడుచేస్తూ ఉంటాయి. క్రిములకు కారణమగుచున్న రోగ, నిర్జీవ పదార్థమును శరీరము ఘనరూపంలో ఉన్నదానిని మల రూపములో విరేచనాలు, అతిసారము ద్వారా వెలువరించుచుండును. ద్రవరూపములో నున్న దోషములను మూత్రము, చెమట, తుమ్ములు, పడిశము, జలుబు మొదలగు రూపాలలో బహిష్కరించును. అలాగే వాయురూపమైన దోషములను ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసల ద్వారా మరియు చర్మము ద్వారా వెలువరిస్తూ ఉంటాయి. మనకు తరచూ కనిపించే తరుణ వ్యాధులగు దగ్గు, తుమ్ములు, రొంప, విరేచనములు వగైరా బాధలన్నియు లోపల రోగ పదార్థమున్నదనియు, దానిని తొలగించవలసియున్నదనియు మనకు ముందుగా మనలోని రోగనిరోధకశక్తి అందించు సంకేతములేనని గ్రహించాలి. తుమ్ములు, దగ్గు, రొంప, విరేచనములు మొదలైనవి రోగాలు కాదు, పొగలాంటివి మాత్రమేనని గ్రహించాలి. పొగ పైకి వచ్చిందంటే నిప్పులోపల ఎక్కడో ఉన్నట్లు అర్థం కదా! అలాగే ఈ తరుణవ్యాధులు రావడానికి కారణమైన నిప్పు అనే రోగ పదార్థం లోపల ఉన్నది కాబట్టి, ఆ రోగ పదార్థాన్ని పూర్తిగా వెలువరింపబడే ప్రయత్నం మనం చేసి శరీరాన్ని రక్షించాలి. ఈ రోగ పదార్థాన్ని పూర్తిగా కడిగివేస్తే రోగం పునాదులతో పోతుంది. శరీరం కాంతివంతం అవుతుంది. ఈ రోగ పదార్థాన్ని అణిచివేస్తే వడ్డీ రూపంలో రోగ పదార్థం రోజు రోజుకీ పెరుగుతూ కొత్త రోగాలకు, దీర్ఘ రోగాలకూ పునాది తయారవుతుంది.
పైన చెప్పుకున్న పరిస్థితి శరీరానికి సంభవించినప్పుడు మన పూర్వీకులు ఏమి చేసినారో ఆలోచిద్దాము. వారికి మందులు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేవి కాదు. వారికీ తెలిసినదల్లా ఉపవాసాలు చేయడం, ఆముదం త్రాగడం, విరేచనానికి మాత్రలు వేసుకోవడం, ఎనిమా చేసుకోవడం, నీటి ఆవిరి పట్టడం, పథ్యం చేయడం మొదలైనవి వారి చికిత్సలు. ఇంకా అవసరమయితే ఆకు పసరలు లేదా ఆయుర్వేద మూలికలు సేవించడం. శరీరానికి ఏ రకమైన తరుణ వ్యాధి సోకినప్పటికీ ముందు ఆహారం తినడం మానివేసేవారు. తరువాత మలశుద్ధి చేసుకొనే వారు. అందువలన ఘన రూపంలో పోవలసిన చేదు అంతా మలరూపంలో పోయేది. నీటి ఆవిరి పట్టి చర్మం ద్వారా పోవలసిన ద్రవరూపంలో రోగ పదార్థాన్ని బయటకు పోయేటట్లు చేసుకొనే వారు. అలాగే వాయురూపంలో చెడు కూడా పోయేది. శరీరానికి రెండు మూడు రోజులు లంఖణాలను పెట్టడం (ఉపవాసాలు) వలన లోపల రోగపదార్థాన్ని నిరోధించడానికి మనలో యాంటీబడీస్ (రోగ నిరోధకశక్తి) క్రొత్తవి తయారయ్యి త్వరగా రోగ పదార్థాన్ని నిరోధించేటట్లు శరీరం సిద్ధమయ్యేది. ఆహారం మానివేయడం కారణంగా కొత్త రోగపదార్థాలు శరీరంలోనికి వెళ్లడం ఆగి, శరీరంలోని పాత రోగపదార్థాన్ని వెలువరించుకోవడానికి అవకాశం కలిగేది. రోగ పదార్థం పూర్తిగా పోయేవరకూ ఆహారం జోలికి పోయేవారు కాదు. అప్పటి వరకూ శరీరంలో పేరుకున్న రోగ పదార్థం పునాదులతో సహా విసర్జింపబడేది. ఆ ఉపవాసంతో శరీరం పూర్తి ఆరోగ్యవంతం అయ్యేది. మనకు పూర్తి ఆరోగ్యం రావాలంటే మనలో పేరుకున్న ఆ రోగ పదార్థాన్ని పూర్తిగా పోగొట్టడమే ముఖ్యము గానీ ఏ రకమైన వైద్య విధానం అన్నది ముఖ్యము కాదు. ఈ రోగ పదార్థాన్ని పునాదులతో శుభ్రం చేయలేని వైద్యం ద్వారా మన శరీరం ఆరోగ్యవంతం కాకపోగా, ఆ వైద్య విధానం వల్ల నష్టం పొందుతుంది. అప్పుడే దీర్ఘరోగాలు లేదా వేరే రకమైన రోగాలు పుడుతుంటాయి. మన పూర్వీకులు శరీరానికి చేసిన చికిత్సలు రోగాన్ని నిరోధించడానికి సహకరించి లోపల ఉన్న రోగపదార్థం అనే నిప్పు పూర్తిగా ఆరిపోయేటట్లు చేయగలిగేవి. నిప్పు ఆరిపోతే ఇక పొగ ఎక్కడ నుండి వస్తుంది. ఉపవాసం చేసినప్పుడు తయారైన యాంటీబడీస్ శరీరంలో ఉండి మళ్ళీ వెంటనే ఆ రకమైన తరుణ వ్యాధులు సోకకుండా నిరోధించడానికి సహకరించేవి. ఇది శరీరానికి సహకరించే వైద్యం.
పరప్రభుత్వ పాలనలో, పరదేశీయ స్నేహంతో, పరభాషా పఠనంతో, పరదేశ వైద్య విధానమే మనకు ప్రసాదంగా మిగిలింది. పరదేశీయులు పోయి 51 సంవత్సరాలు గడిచినా ప్రజలకు వాళ్ళు అలవరచిన అలవాట్లు పోలేదు. ఎన్నో లక్షల సంవత్సరాల నుండి ఉన్న ఉపవాస ధర్మాలు, ఆహార నియమాలు వాళ్ళతో స్నేహం కారణంగా మంట గలిసిపోయాయి. ఆకలి గాక పోయినా తినడం, టీ, కాఫీలు త్రాగడం, అర్థరాత్రికి తినడం, మద్యం సేవించడం, రోగాలు వచ్చినప్పుడు కూడా మందులు వేసుకొని తినడం మొదలైనవి మన పతనానికి దారితీస్తున్నాయి. వారి నుండి వచ్చినవే ఇంగ్లీషు మందులు. నాగరికత పెరిగిన దగ్గర నుండి మనిషి తాత్కాలిక ఉపశమనం కోరుకుంటూ, వచ్చే తరుణ వ్యాధులకు శక్తిగల మందులను వినియోగిస్తూ ఉపవాస ధర్మాలను, ఆహార నియమాలను మరవడం జరిగింది. మనకు వచ్చే తరుణ వ్యాధులకు మందు వేసుకొంటే మనలో వచ్చే మార్పులను తెలుసుకుందాము. రొంప, దగ్గు, తుమ్ములు, విరేచనాలు, జ్వరాలు వచ్చినప్పుడు మందు వేసుకొంటే పొగరావడం అంటే రొంప, దగ్గు మొదలైనవి ఆగిపోతాయి. మందుకున్న గుణం ఏమిటంటే ఘన, ద్రవ, వాయురూపాలలో కదిలివెళ్ళే చెడును కదపకుండా వాటిని కదిపే రోగ నిరోధక శక్తిని అణిచివేస్తుంది. అంటే రోగ పదార్థం బయటకు కదిలిరాకుండా లోపలే ఉండిపోతుంది. మనకు బయటకు వస్తుంటే ఇబ్బంది అనుకుంటున్నాము. కాబట్టి ఆ రోగ పదార్థం లోపేలే ఉండేటట్లు మనకు మందు సహకరించగలుగుచున్నది. విరేచనాలు, దగ్గు, రొంప, జ్వరం మొదలైనవి బయటకు రావడం ఆగిపోతాయి కాబట్టి తాత్కాలిక ఉపశమనము అంది చాలా సుఖముగా ఉండేటట్లు మందు సహకరించినట్లు అనిపిస్తుంది. కానీ మన శరీరంలో ఆ రోగ పదార్థం ఆగిపోవడం వలన వచ్చే నష్టం గురించి మందులు వేసుకునేవారు ఆలోచించడం లేదు. బయటకు రాకుండా అలా నిలువ ఉండి పోయిన రోగ పదార్థం కొత్త రోగాలను, కొత్త సూక్ష్మజీవులను శరీరానికి పరిచయం చేస్తూ ఉంటుంది. పొగ రాకుండా నిప్పును కప్పెట్టే పని చేయడం అవుచున్నది. కప్పెట్టిన నిప్పు నిదానంగా ఎప్పటికో రగులుకొంటూ ఒక్కసారే భగ్గుమంటుంది. అలాగే మందులతో అణచబడ్డ రోగపదార్థాలు రోజు రోజుకీ బలాన్ని పెంచుకొంటూ ఒక్కసారే దీర్ఘ రోగాలుగా బయట పడతాయి. మహావృక్షం కూడా చిన్న మొక్క నుండి రావాల్సిందే. అలాగే దీర్ఘ రోగాలు కూడా చిన్న రోగాల నుండి పెరగవలసిందే. చిన్నరోగాలను అణచకుండా కడిగిన వారికీ దీర్ఘరోగాలు వచ్చే అవకాశమే లేదు గదా. మరి మందులు వేసుకొని రోగానికి పోషణ చేసే వారికి వచ్చిన రోగం రోగంగా ఎలా బయటకు పోతుంది? అందువల్లే దేశంలో రోజు రోజుకీ రోగాల సంఖ్య పెరగడం జరుగుచున్నది.
ఉదాహరణకు మన దేహంలో అజీర్ణం వల్ల కఫం పెరుగుతుంది. ఆ కఫం శ్వాసనాళాలలో చేరి ప్రాణవాయువుకు అవరోధము కల్గిస్తుంది. అట్టి ఇబ్బందిని తొలగించడానికి మనలోని శక్తి జలుబు, దగ్గు, తుమ్ములుగా వచ్చి దేహము వేడెక్కి, కఫ పదార్థము పలుచబడి, ముక్కుల వెంట కళ్ళవెంట నీరు కారుచూ వెలువరింపబడుచుండును. ఈ సమయంలో కొద్దిగా జ్వరం వచ్చినట్లుగా, గొంతు నొప్పిగా, తలనొప్పిగా ఉండి ఇబ్బంది అనిపించవచ్చు. మనం వాటిని ఓర్చుకోలేక మందులు వాడితే, ఆ కఫ పదార్థము శ్వాసనాళములలోనే ఉండిపోయి స్థిర రూపము బొంది, అంతర్గతముగా ఎక్కువ రోజులు నిలువయుండి పోతుంది. పరిస్థితులు మారి ఆహార లోపములు, వాతావరణ దోషములు సమకూరినప్పుడు ఆ జలుబు వ్యాధి (ఆ కఫ వ్యాధి) బ్రాంకైటిస్ గా (ఊపిరితిత్తుల జబ్బుగా) పరిణమించును. మళ్ళీ అప్పుడు కూడా గట్టి మందులు వాడితే ఆస్త్మాగా మార్పు చెందును. కొందరిలో అది సైనసైటిస్ గా (ముక్కు ఎప్పుడూ బిగవడం) స్థిరపడిపోతుంది. ఏదో చిన్న తప్పు ఆహారం ద్వారా చేసినందుకు వచ్చిన రోగ పదార్థాన్ని కప్పి పుచ్చితే, చివరకు జీవితకాలం వదలని రోగాలు సంక్రమించడం అనేది మనం చేతులారా చేసుకొంటున్నాము. ఆస్త్మాకు మందులు వాడితే ఇంకో రకమైన రోగాలు పుడతాయి. తిరిగి దానికి వేరే రకమైన మందులు వాడితే గానీ ఉపశమనం రాదు. ఒక తప్పును కప్పిపుచ్చితే పది తప్పులకు అది దారితీసినట్లు, మనం వాడే మందులు రోగాలకు దారితీస్తున్నాయి. మన దేహము అతుకుల బొంతగాదు. శరీరంలో రకరకాల అవయవములు, రకరకములైన విధులను నిర్వర్తించుచున్ననూ, ఇవి అన్నియూ ఒక దానికొకటి అవినాభావ సంబంధము కలిగి యున్నవి. అవి అన్నీ ఒకే శక్తి మూలంగా నడుచుచున్నవి. మనలో అణచబడ్డ రోగపదార్థం ఆయా స్థానములను వీడి మరొక స్థానము నాక్రమించుచున్నది. రోగపదార్థం ఉన్న స్థానాన్ని బట్టి రోగానికి పేరు పెట్టి, ఆయా రోగనిపుణులు వివిధ మందులు వాడిననూ రోగ పదార్థము రూపాంతరము బొంది మన దేహంలోనే నిలువయుంటున్నది. ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్కరు పంచుకొని ఉన్న ఒక్క రోగ పదార్థానికి పది రకాల మందులు వేసి ఎవరి అవయవాన్ని వారు చూసుకొంటున్నారే గానీ అవయవాలకున్న అవినాభావ సంబంధాన్ని వదిలివేస్తున్నారు. మందులు మారినా, ఆసుపత్రులు మారినా, వైద్య నిపుణులు మారినా చివరకు రోగముల సంఖ్య మారుచున్నదే గానీ రోగ పదార్థం యొక్క బలం తగ్గడం లేదు. ఒక్కసారి ఆసుపత్రిలో అడుగుపెట్టిన మనిషి సంపూర్ణారోగ్యముతో తిరిగి ఇల్లు చేరలేక పోవుచున్నాడనుట లోక సత్యము. అందుచేత రోగి బ్రతుకంతా మందుల పాలై దేహము అతుకుల బొంతగా తయారగుచున్నది.
రోగ పదార్థాన్ని లోపలే ఉంచుకొని మందులతో కాలయాపన చేయడం ద్వారా శరీరం బలహీనమై చివరకు తిన్నది అరగడానికి మందు, బయటకు మలాన్ని వెలువరించడానికి మందు, బాధలు తగ్గడానికి మందు, బలం రావడానికి మందు, నరాల నీరసానికి మందు, నిద్రపట్టడానికి మందు ఈ విధంగా తీసుకొంటూ మందులను విందులుగా భుజించుచున్నాడు. మందులు మింగడం మనిషికి సాంప్రదాయం అయిపోయింది. ప్రపంచంలో నూటికి 25 శాతం మంది అసలు వచ్చిన రోగం వలన చనిపోతే, మిగతా 75 శాతం మంది మందులను వాడటం వలన వచ్చిన దుష్ఫలితాల వల్ల చనిపోతున్నారని ఒక సర్వేలో తేల్చారు. మన అశ్రద్ధే మన ప్రాణాలను తీస్తున్నది. మందులో ఐదు ఉపయోగాలుంటే ఏడు నష్టాలుంటాయి. నేను మందుల గురించి నాలుగు సంత్సరాలు చదివిన కారణంగా మందుల వల్ల లాభనష్టాలు పూర్తిగా అర్థం చేసుకున్నాను. మందులను మనం సరైన రీతిలో ఉపయోగించుకొంటే మంచి ఫలితాలను పొందవచ్చు. ప్రాణాలను కాపాడుకోవచ్చు. ప్రాణాన్ని కాపాడుకోవడానికి అత్యవసర పరిస్థితులలో వాడుకోవలసిన ధర్మాలు కలిగిన మందును, మనం కారణం లేకుండా చిన్నవాటికి కూడా మందును ఆశ్రయించి ఆపదలను కొనుక్కొంటున్నాము. అల్లోపతి సిస్టమ్ ను, మందులను కాలు విరిగినప్పుడు కర్రలా కొంతకాలం అవసరానికి, ప్రాణాన్ని నిలుపడానికి వాడుకొని చుట్టం చూపులా వదిలి వేయాలిగానీ, వాటితో స్నేహం గానీ, కాలయాపన గానీ చేయరాదు. మనం ఆ విధంగా వాడుకొనే మందులవల్ల నష్టపోతున్నాము. వేటి ఉపయోగం వాటికుంటుంది. వేటినీ చెడు అనడానికి లేదు. ఏ వైద్య విధానమూ తప్పుకాదు. అన్ని వైద్య విధానాలు మానవ కళ్యాణానికి భగవంతుడు అందించినవే. మన ఆరోగ్య పరిస్థితిని బట్టి, అవసరాన్ని బట్టి మనం వాడుకొనే వైద్య విధానం ఆధారపడి ఉండాలి. అంతేగానీ ప్రతి దానికీ మందు మింగడం ధర్మం కాదు. మనిషి ప్రతి చిన్నదానికీ మందు వేసుకోవడం మాని ప్రకృతి ధర్మాలను ఆచరిస్తూ అవసరమైనప్పుడు లేదా ప్రాణం మీదకు వచ్చినప్పుడు మందులను తప్పనిసరిగా వాడుకోవచ్చు. మందుల గురించి మనం ఇంతసేపు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, మందులను వాడుకోవడం చేతగాక మన కొచ్చిన రోగాలను దీర్ఘ రోగాలుగా మార్చుకొని జీవితం అంతా రోగాలతో బాధపడే పరిస్థితి మనిషికి కలుగుచున్నది. కాబట్టి వాటికి దూరంగా వుండే ప్రయత్నం చేసి ఆరోగ్యం వచ్చే ఆలోచనలు చేయమని చెప్పడానికి. అంతేగాక "మందును మందుగానే వాడాలి గానీ, మందును ఆహారంగా మాత్రం వాడకూడదు. మందుల వల్ల రోగం మరో రూపం బొందుతుంది" అన్నది కీ.శే. వైద్యరాజు వేగిరాజు కృష్ణంరాజుగారి మాట. అయన అన్నదే మరొక్కమాట. "రోగం నిర్జీవ పదార్థము, నీవు సజీవుడవు గనుక నీవే రోగాన్ని పట్టుకు కూర్చున్నావు. రోగం నిన్నెప్పుడూ వదలదు, ఆత్మవంతుడవై రోగాన్ని వదులు". కృష్ణంరాజు గారి మాటలలోని సత్యాన్ని మనం గ్రహించి, మనస్సు మార్చుకొంటే, పురుగుపట్టిన గింజధాన్యాలను ఎండలో పోస్తే పురుగులు గింజలను వదిలి పారిపోయినట్లు మన రోగాలు కూడా మనం వదిలి వేస్తే పారిపోవడానికి సిద్ధంగా ఉంటాయి. రోగాన్ని వదలడానికి కూడా మనిషికి ధైర్యం కావాలి.
కాలక్రమము ననుసరించి వైద్యులు, వైద్య విధానాలు, వైద్యాలయాలు, రోగులు, రోగములు, మందులు, చికిత్సలు మారవచ్చును గానీ అనాదిగా మానవ శరీర శక్తులను క్రమపరిచే మూలవిధానములు మాత్రం ఎన్నటికీ, ఎక్కడను, ఏ స్థితిలోనూ మారవు. అనాదిగా ఏ పోషకాహార పదార్థములు శరీరానికి పోషణ నందించుచున్నవో, ఏ స్వచ్ఛంద వాయువులు ప్రాణశక్తి నందించు చున్నవో, ఏ సౌరశక్తి తేజస్సును, జీవశక్తిని అందించుచున్నదో, ఏ జలములు దేహమును చల్లబరిచి శుభ్రపరచుచున్నవో, ఏ సుఖ నిద్ర పగలంతా పనిచేసి కోల్పోయిన యింద్రియ శక్తులకు విశ్రాంతి నిచ్చి పునర్జీవింప జేయుచున్నదో, ఏ దేహ వ్యాయామములు కండర బలమును, ఆరోగ్య భాగ్యమును అందించుచున్నవో అవే నాటికీ నేటికీ మారని మహోత్కృష్టమైన చికిత్సలుగా తెలుసుకోండి. అవి మారిన నాడు మానవునికి మనుగడయే ఉండదని తెలుసుకోండి. సర్వాంతర్యామియైన భగవంతుడు మనకు ప్రసాదించిన దేహనిర్మాణంలోనే తన్నుతాను పోషించుకొనే శక్తిని ఇమిడ్చాడు. ఆ శక్తిని, రక్షించడమే మన ప్రథమ కర్తవ్యం. శరీరానికి పంచభూతములు, విశ్రాంతి, వ్యాయామం అతి ముఖ్యమైనవి. ఇవే ఆరోగ్యానికి పునాదులు. వీటిని ఆధారంగా చేసుకొని చేసే ఏ వైద్య విధానం అయినా రోగపదార్థాన్ని పూర్తిగా నివారించగలుగుతుంది. వీటిని (పంచభూతాలను) వదిలి చేసే ఏ వైద్య విధానానికైనా పునాదిలేదనే చెప్పవచ్చు. పునాది గట్టిగా లేకుంటే గోడలు బీటలు వారినట్లు, మన శరీరం కూడా రకరకాల రోగాలకు నిలయం అవుతుంది. పునాదిని గట్టి చేయకుండా ఎన్నిసార్లు పగుళ్ళకు సిమెంటు పూతలు పూసినా తాత్కాలికమే గానీ శాశ్వతం గాదు. అలాగే పంచ భూతాలను సవరించకుండా ఎన్ని రకాల వైద్యాలు చేసినా తాత్కాలిక ఉపశమనమే గానీ, సంపూర్ణ రోగ నివారణ జరుగదు అన్నది నగ్న సత్యం. ప్రతి రోగము రావడానికి ఒక కారణముంటుంది. కారణము తెలుసుకొని తొలగిస్తే మందు పనిలేదు. కారణము తొలగించకుండా వ్యాధి నిర్ములించుట అసంభవము. కనుక కారణము తీసివేయకుండా కార్యము నెరవేరదు అన్నది సృష్టి ధర్మం. ప్రస్తుత వైద్య ప్రపంచము నేల విడిచి సాము చేసినట్లు కారణమును వదిలిపెట్టి కార్యసాధన (వైద్యమును) చేస్తున్నారు. అందువల్లనే సమాజంలో రోజు రోజుకీ రోగాల సంఖ్య, రోగుల సంఖ్య ఊహించని రీతిలో పెరిగిపోవుచున్నవి. ఈ స్థితి నుండి మనం బయటపడాలంటే కార్యకారణ సంబంధముగా వైద్య విధానం సాగాలి.
ప్రకృతి విరుద్ధం, దేహవిరుద్ధమైన ఆహారాన్ని మనిషి స్వీకరించడం వలన రోగ పదార్థం శరీరంలోకి ప్రవేశిస్తున్నది. అదే రోగానికి పునాది. ఆ విధంగా రోగ పదార్థం శరీరంలోనికి చేరే అవకాశం లేకుండా చేయాలంటే ప్రకృతి సిద్ధమైన, దేహోపయుక్తమైన ఆహారాన్ని తిరిగి అందించడమే మార్గం. పథ్యం చేస్తే మందు అక్కరలేదు. పథ్యం చేయకపోతే మందు పనిచేయదు. పథ్యకరమైన ఆహారాన్ని తెలిపే శాస్త్రమే ప్రకృతి వైద్య శాస్త్రము. శరీరం తన్ను తాను బాగుచేసుకొనే శక్తిని కలిగి యుండటం వలన మనం అవకాశమిస్తే శరీరంలో నున్న రోగ పదార్థాన్ని పూర్తిగా నివారింపగలదు. శరీరానికి అవకాశం ఇవ్వడం అంటే (ఆహారాన్ని మానివేయడం) సృష్టిధర్మమైన ఉపవాసధర్మం పాటించడమే. ఈ ఉపవాస ధర్మం వలన లోపల ఎప్పటి నుండో నిలువయున్న రోగ పదార్థాలు పూర్తిగా శరీరం నుండి విసర్జింపబడడానికి వీలుంటుంది. తద్వారా రోగానికి పునాది లేకుండా చేయగలదు. వచ్చిన ఇబ్బందిని పోగొట్టడానికి ఉపవాస ధర్మం సహకరిస్తే తిరిగి శరీరానికి ఇబ్బంది రాకుండా (రోగం) చేయడానికి పథ్యకరమైన ఆహారం సహకరిస్తుంది. అంటే రోగాన్ని పోగొట్టి తిరిగి రోగం రాకుండా చేయడానికి ఉపవాస ధర్మం, ఆహార నియమం ముఖ్యమన్నమాట. ఈ రెండింటిని బోధించేదే ప్రకృతి వైద్య శాస్త్రం. ఈ రెండింటి సమ్మేళనమే మనిషి ఆరోగ్యము. ప్రకృతి వైద్య విధానం కార్యకారణ సంబంధముగా రోగాన్ని ఎక్కడి నుండి పుడుతుంటే అక్కడ నుండి పుట్టకుండా ఆపి, (ఉపవాసం) ఉన్న రోగాన్ని శరీరం నుండి పూర్తిగా పోయేటట్లు సహకరించగలుగుచున్నది. అందువల్లనే ఈ విధానం ద్వారా రోగాలు పునాదుల నుండి తొలగించబడతాయి కాబట్టి అన్ని వైద్య విధానాలకు ప్రకృతి వైద్యం పునాది లాంటిది. ఇది ప్రకృతి సిద్ధమైన మనిషికి ప్రకృతి సిద్ధమైనది, సృష్టిధర్మమైనది. పాలల్లో నీరులాగా శరీరంతో ఈ వైద్య విధానం కలుస్తుంది. బియ్యంలో మట్టిగెడ్డలాగా శరీరంలో మందులు ఎన్నటికీ కలవవు. అందువల్లనే రోగనివారణ జరగకపోగా సైడ్ ఎఫెక్టులు రావడానికి కారణం. తల్లి ప్రకృతి మాత నుండి వచ్చిన ప్రకృతి సిద్ధమైన వైద్యమే ఈ ఉపవాస ధర్మం. ప్రాణికోటికి రుగ్మతలు కల్గినప్పుడు వాటి నివారణ కోసం ప్రకృతి ధర్మమైన ఉపవాస ధర్మాల్ని ఆచరిస్తున్నాయి. ప్రాణికోటిలో అంతర్భాగమైన మానవుడు మరిచిన ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయాల్సిన ఆవశ్యకత నేటి సమాజానికి ఎంతైనా ఉంది.
ప్రాణికోటి ప్రకృతిలో అంతర్భాగమై ప్రకృతి ధర్మాన్ని ఆచరిస్తున్నాయి. ఆరోగ్యంగా జీవిస్తున్నాయి. వేరే వైద్యులు, మందులు అవసరం లేకుండా ఒక్క ఉపవాసధర్మమే వాటికి తెలిసిన మందు. అలాంటి ఉపవాస ధర్మం గురించి పూర్తిగా తెలుసుకొని వాటిలాగా ఆరోగ్యంగా జీవించే ప్రయత్నం మనమూ చేద్దాం. ఉపవాస ధర్మం అంటే రెండు ప్రక్కలా పదునున్న కత్తి అనవచ్చు. ఆ రెండు పదునులు ఏమిటంటే మొదటిది రోగం వచ్చిన వారికి రోగం తగ్గించడానికి పనికివస్తుంది. అలాగే రెండవ పదును రోగం రాని వారికి రోగం రాకుండా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనకిప్పుడు ఎన్నో రకాల వైద్య విధానాలు మానవుని ఆరోగ్యాన్ని రక్షించడానికి అందుబాటులో ఉన్నాయి. మనకు అందుబాటులో ఉన్న అన్ని రకాల వైద్య విధానాల యొక్క ఉపయోగం, ఈ ఉపవాస ధర్మం యొక్క ఉపయోగం వేరుగా ఉంటుంది. అన్నిరకాల వైద్య విధానాలు రోగం వచ్చిన తరువాత రోగాన్ని తగ్గించుకోవడానికి మాత్రమే పరిమితమైయున్నవి. రోగం తగ్గినా తగ్గక పోయినా వాటి ఉపయోగం అంతవరకే. రోగం రాని వాడికి ఆ వైద్య విధానాలతో పనిలేదు. భవిష్యత్తులో రోగం రాకుండా ఉండాలంటే, ఆ విధంగా జీవించాలంటే వాటిలో అటువంటి అవకాశం మనిషికి లభించదు. రోగం వచ్చిన వాడికి డాక్టరుగానీ, మందు గానీ ఉంటాయి గానీ రోగం రానివాడికి రోగం రాకుండా ఏ మందు గానీ ఏ డాక్టరు వద్ద గానీ ఏమీ ఉండవు గదా! ఉదాహరణకు డాక్టరు గారూ మా నాన్నకు సుగరు ఉంది, నాకు కూడా ఈ వయస్సులో సుగరు వచ్చే అవకాశముంది కదా; ఆ సుగరు రాకుండా ఏదైనా మందు ఉంటే ఇవ్వండి అని అడిగితే ఇవ్వడానికి ఆ సుగరు రాకుండా చేయడానికి మందు అనేది ఉంటేనే గదా! మనకు వచ్చే ఇలాంటి ఇబ్బందులు నుండి కూడా రక్షించడానికి ఉపవాస ధర్మం ప్రకృతి వరంలా మనిషికి అండగా చేయూత నివ్వగలదు. ఖద్దరు బట్ట ఎండకు చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా చలికాలంలో వెచ్చదనాన్ని ఇచ్చే విధంగా, రెండు రకాలుగా అన్ని కాలాలకు అనుకూలంగా పనిచేయగలదు. అలాగే ఉపవాసధర్మం కూడా మనిషికి ఏది అవసరమైతే దాన్నే అందిస్తుంది అన్నది పరమసత్యం. ప్రకృతి మనకందించిన ప్రివెన్షన్ అండ్ క్యూర్ ఈ ఉపవాస ధర్మం.
మనిషికి రోగం వచ్చిన ప్రతిసారీ డాక్టరు వద్దకు వెళ్లి ఆయన సలహా మేరకు మందును తీసుకోవడం, పుచ్చుకోవడం చేస్తూ ఉంటాడు. వచ్చిన రోగం ఆ మందులతో పోవచ్చు. కానీ మళ్ళీ రోగం రాదని గ్యారెంటీ ఎవరు ఇస్తున్నారు? రోగం రాదనీ ఎవరు చెప్పుచున్నారు. మళ్ళీ అదే రోగం వస్తే అయన దగ్గరకో లేదా ఇంకొక రోగం వస్తే వేరే డాక్టరు దగ్గరకో వచ్చినప్పుడల్లా తిరుగుతూ, రోగం వచ్చిన ప్రతిసారీ ఇల్లు, ఒళ్ళు గుల్ల చేసుకుంటూ, సమయాన్ని వృధా చేసుకొంటూ బెల్లం చుట్టూ ఈగల్లా డాక్టర్ల చుట్టూ తిరగవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల నుండి మనిషిని విముక్తుడిని చేయడానికి ప్రకృతి మనకందించిన ప్రకృతి ధర్మం, ఉపవాసధర్మం మానవుని క్షేమం కోరి ఉన్నాయి. వివేకంతో తెలుసుకోగలిగి వాటిని ఆశ్రయించిన వారు అదృష్టవంతులు. మిగతా వారందరూ దురదృష్టవంతులేనని వేరే చెప్పనక్కరలేదు. ఏ వైద్య విధానం అయినా రోగికి వచ్చిన రోగాన్ని తగ్గించవచ్చు లేదా రోగిని పెద్ద రోగిగా దీర్ఘ రోగిగా చేయవచ్చు. అంతేగానీ రోగిని డాక్టరు చేయడం సాధ్యపడదు. రోగి డాక్టరు కావడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? అవును ఇది నిజం. సూర్యుడంత సత్యం ఈ నిజం. ప్రకృతి ధర్మాన్ని, ఉపవాస ధర్మాన్ని రోగం వచ్చినా రాకపోయినా ఒక్కసారి పూర్తిగా అనుభవించి, ఆచరిస్తూ అవగాహన చేసుకొంటే ఏ రోగం రాదు. ఒక వేళ ఏ రోగం వచ్చినా తిరిగి ఏ డాక్టరు వద్దకూ వెళ్లకుండా, చివరకు ప్రకృతి వైద్యుని దగ్గరకు కూడా వెళ్లనవసరం లేకుండా మీ ఇంట్లో మీరే మీ శరీరానికి చికిత్స చేసుకోవచ్చు. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందవచ్చు. అలాగే మీ కుటుంబానికంతటికీ కూడా మీరే ఏది అవసరమైనా వైద్యం చేయవచ్చు. ప్రకృతిని నమ్మినవారికి రోగిలా కాలయాపన చేసే అవకాశం ఉండదుగానీ యోగిలా జీవించే భాగ్యం మాత్రం తప్పనిసరిగా కలుగుతుంది. యోగి కావాలన్నా, భోగి కావాలన్నా, రోగి కావాలన్నా మనం ఆశ్రయించే మార్గాన్ని బట్టి (వైద్య విధానాన్ని బట్టి) అవుతాం. మన నుదుటి రాత బాగుంటే సరైన వైద్య విధానం, జీవన విధానం లోనికి మనం ప్రవేశించడం జరుగుతుంది. నుదుట వ్రాసిన వ్రాతలు నులుపితే చెరిగిపోవు అన్నట్లు ఖర్మ బాగో పోతే, వైద్య విధానం సరైనది ఎన్నుకోకపోతే డాక్టరు కూడా రోగిగా బాధపడక తప్పదు. ఇప్పుడు లోకంలో అదే జరుగుచున్నది.
ఎన్నో ఏళ్ళు కష్టపడి శరీర శాస్త్రం, ఆరోగ్య శాస్త్రం పూర్తిగా తెలుసుకొని, ఆరోగ్య సూత్రాలను పాటించలేక రోగికి ఆరోగ్యాన్ని ప్రసాదించవలసిన వైద్యులే రోగాలతో బాధపడుతుంటే, రోగికి ఇంకెక్కడ నుండి ఆరోగ్యం వస్తుంది. వైద్యుడికి ఆరోగ్యంలో నున్న ఆనందం ఏమిటో పూర్తిగా తెలియనప్పుడు రోగికి పూర్తి ఆరోగ్యం రావాలని ఏమి తపన పడగలడు? అసలు డాక్టరు అంటే ఆరోగ్యాన్ని అందించే వాడు. తనకే పూర్తి ఆరోగ్యం లేనప్పుడు రోగికి ఎక్కడ నుండి ఇవ్వగలడు? సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద పడినట్లే ఉంటున్నది నేటి ఆరోగ్య పరిస్థితి. ఏ విధంగా మన జీవన విధానం ఉంటే ఆరోగ్యం వస్తుందో డాక్టర్లు ఇంకా పూర్తిగా తెలుసుకోలేక పోతూ, తాము బాధపడుతూ రోగులను బాధ విముక్తులను చేయలేక పోతున్నారు. సమాజంలో ముందు డాక్టర్లు పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఆనందించే రోజున గానీ ప్రజలకు మంచి రోజులు రావు. దేశం అప్పుడు గానీ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విలసిల్లదు. ఈ మార్పు సమాజములో రానిదే ఏ దేశమూ బాగుపడదు. ఏ డాక్టరైనా ప్రకృతి సిద్ధంగా పుట్టిన వాడే. ప్రకృతి ధర్మాలను తను పాటించవలసిన బాధ్యత, ధర్మం ప్రతి డాక్టరుకుంటే ఏ వైద్య విధానాన్ని చదివినా, ఏ వైద్య వృత్తిని ప్రజలకు అందిస్తున్నా, ఆరోగ్యం కావాలంటే ప్రతి డాక్టరు కూడా తప్పనిసరిగా సృష్టిధర్మాలను నియమబద్ధంగా పాటించవలసిన కర్తవ్యం ఎంతైనా ఉంది. డాక్టర్లే సృష్టి నియమాలను తప్పుతుంటే, డాక్టర్లను చూసి నేర్చుకొనే రోగులకు సృష్టిధర్మాలు, నియమాలు ఏమి తెలుస్తాయి, ఎంత తెలుస్తాయి? ఆరోగ్యంలో ఉన్న ఆనందం ఏమిటో నన్నది ఉపవాసధర్మం, ఆహార నియమం పాటించిన వారికే తెలుస్తుంది. ఈ రెండు ధర్మాలు తెలియని వారికి ఆరోగ్యం అంటే తెలిసేది గురివింద గింజలో నలుపంత మాత్రమే. గురివింద గింజకు తన నలుపు తనకు తెలియనట్లు ఈ ధర్మాలు తెలియని వారు కూడా అదే పూర్తి ఆరోగ్యం అన్నట్లు భావిస్తుంటారు. ఒక డాక్టరుగా నేనీ మాటలు వ్రాయడం లేదు. శ్రేయోభిలాషిగా నేననుభవించే ఆరోగ్యంలోని ఆనందం మీరందరూ అందుకోవాలని, అదే రోగులకు శ్రీరామరక్ష కాగలదని ఆశించడంలో తప్పులేదనుకుంటాను. ప్రకృతి ధర్మాలను ఉల్లంఘించడం క్షమించరాని నేరం. అది ఎవరైనప్పటికీ శిక్షననుభవించక తప్పదు. ఏ డాక్టరుకూ సంబంధం లేని దానిని నేను ఏదో చెప్పి వినమనడం లేదు. ఆచరించమనడం లేదు. ప్రతి జీవికీ అన్ని వైద్య విధానాలలో ఉన్న డాక్టర్లకు, అన్ని రకాల రోగాలున్న లేదా రోగం లేని ప్రజలకు సంబంధించిన ప్రకృతి ధర్మాన్ని నేను ఆలకించమంటున్నాను. అలాగే ఆచరించమంటున్నాను. ఇది ప్రతి భారతీయుడి యొక్క ప్రథమ కర్తవ్యం అని నా అభిప్రాయం. అటు వైద్యులకీ, ఇటు రోగికీ ముఖ్యంగా కావలసింది ఆరోగ్యమే కాబట్టి ఆరోగ్యాన్ని అందించే ప్రకృతి ధర్మాలు అందరికీ వర్తిస్తాయి. అది నా బాధ్యతగా, ప్రథమకర్తవ్యంగా సమాజంలోని ప్రజలందరికీ ఆరోగ్యాన్ని అందివ్వాలన్న స్ఫూర్తితో, తపనతో, ఆర్తితో, ఈ ఉపవాస ధర్మాన్ని అందివ్వాలన్న సంకల్పంతో ఈ గ్రంథం రచించడం జరిగింది. అందరూ ఉపవాస ధర్మం మన ధర్మంగా గుర్తించి, ప్రకృతి సిద్ధంగా పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని పదిల పరచుకుంటారని మనసారా కోరుకుంటున్నాను.
ప్రకృతిని ఆశ్రయిస్తే ఎవరికి ఏది కావాలంటే, శరీరానికి ఏది అవసరమైతే అదే అందుతుంది. వస్తువులు కొనడానికి సూపర్ మార్కెట్ కు వెళితే అన్నీ ఒక్కచోటే లభిస్తాయి. రకరకాల రోగాలను నిర్మూలించడానికి రకరకాల ఆసుపత్రులకు, వైద్యుల దగ్గరకూ, వైద్య విధానాల వద్దకూ వెళ్ళకుండా అన్ని ఇబ్బందులు ఒక్కచోటే ఒకే వైద్య విధానం వల్ల నివారించబడతాయి. అదే ప్రకృతి ధర్మం (ఉపవాస ధర్మం, ఆహార ధర్మం). ఇందులో నివారింపబడనప్పుడు వేరే వైద్య విధానాన్ని అప్పుడు ఆశ్రయించడం మంచిది. అది ధర్మం. ముందు ప్రకృతి ధర్మానికి అవకాశమివ్వడం మనిషిగా మన విద్యుక్తధర్మం. ప్రకృతిధర్మం ద్వారా శరీరానికి, ఆరోగ్యానికి కావాలసిన పునాది పడుతుంది. ఆ పునాది గట్టిగా పడిన తరువాత మనం ఏ వైద్య విధానాన్ని ఆశ్రయించినప్పటికీ మనకు పూర్తి న్యాయం జరుగుతుంది. పునాది గట్టిగా ఉంటే ఎన్ని అంతస్తులు కట్టినా ధృడంగా ఉన్నట్లు ప్రకృతి ధర్మం చేసి ఏ మందు వాడినా ఫలితం వెంటనే వస్తుంది. ప్రకృతి ధర్మం గురించి తెలియక మిగతా వైద్య విధానాల యొక్క ఫలితాన్ని మనిషి తక్కువగానే అందుకోవడం జరుగుచున్నది. ప్రకృతి విధానాన్ని జోడించి మిగతా వైద్య విధానాలను చేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. కనుక మనకు సంబంధం లేనిదని ప్రక్కన పెట్టకుండా ప్రతి డాక్టరూ ప్రతి రోగి ప్రకృతి ధర్మాలను తెలుసుకొంటే శరీరానికి న్యాయం ఎక్కువ జరుగుతుంది. శరీరం రోగాల నుండి త్వరగా రక్షించబడుతుంది.
ఆరోగ్యాన్ని అందించేదే ధర్మం. అనారోగ్యాన్ని ఇచ్చేది కాదు. శరీరాన్ని శుద్ధి చేయనిదే ఆరోగ్యం రాదు. శరీరాన్ని అంతర్ముఖంగానే గాక ప్రతి కణం నుండి కూడా శుభ్రం చేసుకుంటూ వచ్చి, కలుషిత వాతావరణాన్ని నిర్మూలించి పూర్తి ఆరోగ్యాన్ని అందించేదే ఉపవాస ధర్మం. రోజూ మనం చేసే స్నానం శరీరాన్ని పైకి శుభ్రం చేస్తున్నట్లు, ఉపవాస ధర్మం శరీరాన్ని లోపల శుభ్రం చేస్తుంది. మనకు రోగ పదార్థాలు పేరుకొని రోగాలు వచ్చినప్పుడు వాటిని కడగటానికి ఉపవాసం మినహా శరీరశుద్ధికి వేరే ప్రక్రియలు అందుబాటులో లేవు. రోగం వచ్చిన ప్రతి మనిషీ శరీరాన్ని లోపల శుభ్రం చేయకుండా ఎన్ని రకాల వైద్యులు, వైద్య విధానాలను మార్చినప్పటికీ ప్రయోజనం శూన్యం. శరీరానికి ఇంతటి ముఖ్యమైన ఉపవాస ధర్మాన్ని మనం తెలిసో తెలియకో దూరం చేసుకోవడం జరిగింది. జరిగి పోయినది తిరిగి రాదు. కనీసం మిగిలిన శేష జీవితం అన్నా సుఖంగా, ఆరోగ్యంగా గడపాలి అంటే ఉపవాస ధర్మాన్ని తప్పక ఆచరించాలి. అంతటి ముఖ్యమైన ఉపవాస ధర్మం ఏ విధంగా చేయాలో, ఎందుకు చేయాలో, చేయకపోతే వచ్చే నష్టమేమిటో, చేస్తే ఆరోగ్యం తేలిగ్గా ఎందుకు కలుగుతుందో, ఉపవాసం మన జీవధర్మం ఎందుకో మొదలగు ముఖ్యమైన విషయాలను విపులంగా వివరించడం జరిగింది. విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకొని సకుటుంబసమేతంగా ఉపవాస ధర్మాన్ని ప్రారంభించి, రోగాల పేరిట శరీరానికి పట్టిన శనిని వదిలించి, ఆరోగ్యమనే స్వాతంత్ర్యాన్ని శరీరానికి అందించి, డాక్టర్ల చుట్టూ పరిభ్రమణల జీవితానికి స్వస్తి పలుకుతారని ఆశిస్తున్నాను. ధర్మాన్ని నమ్ముకున్న వారిని విజయం వరిస్తుంది.

2. జీవి ధర్మం - ఉపవాస ధర్మం

ఈ భూమి మీద జంతుజన్మలు ప్రారంభమై సుమారు 350 కోట్ల సంవత్సరాలు అవుతున్నది అని విజ్ఞాన శాస్త్రం చెప్పుచున్నది. అలాగే మానవ జన్మలు రావడం ప్రారంభమయ్యి లక్షల సంవత్సరాలు అవుతున్నదని కూడా చెప్పుచున్నది. పంచభూతాత్మకమైన ప్రకృతిలో 84 లక్షల ప్రాణులు ఉన్నట్లు తెలియుచున్నది. సృష్టిలోని ప్రతి జీవికి దేహ ధర్మములు, జీవన ధర్మములు ఉన్నాయి. ఆహారము, నిద్ర, భయము, సంగమము అను నాల్గు కర్మలు జ్ఞానములేని పశుపక్ష్యాదులకు ధర్మాలుగా ఉన్నవి. అవి వాటి ధర్మాన్ని ఎప్పుడూ తప్పకుండా సృష్టి పరిణామానికి సహకరించగలుగుచున్నాయి. వాటి ఆహారం ప్రకృతి సిద్ధమైనది, దేహోపయుక్తమైనది, దేహ పోషకమైనదిగా వుంటున్నది. ప్రకృతి ధర్మంగా, దేహ నిర్మాణానికి అనువుగా ఏ ప్రాణి ఏ ఆహారాన్ని తినాలి? ఎప్పుడు తినాలి? ఎంత తినాలన్నది వాటికీ స్పష్టంగా గోచరిస్తుంది. ఆ ధర్మాన్ని అనుసరిస్తూ జీవయాత్ర సాగించుచున్నాయి. పగలు ఆహారాన్ని తినే ప్రాణులు పగటి పూటే తిని రాత్రికి 12 గంటలు పూర్తి విశ్రాంతిని (ఉపవాసం 12 గంటలు) శరీరానికి ఇచ్చి, మరుసటి రోజుకు శరీరాన్ని శక్తివంతంగా చేసుకోగలుగుచున్నాయి. అదే రాత్రికి తిరిగి, రాత్రి సమయంలో ఆహారం తినే ప్రాణులు, పగటి పూట 12 గంటలు పూర్తిగా విశ్రాంతి నివ్వగలుగుచున్నాయి. కాలానుగుణంగా ప్రకృతిలో ఏమైనా మార్పులు సంభవించి వాటి శరీరాలకు రుగ్మతలు, రోగాలు సోకినప్పుడు ఎవరి మీదా ఆధారపడకుండా వాటి నుండి బయటపడే ప్రయత్నం, విధానం కూడా సృష్టికర్తే వాటికి అందించియున్నాడు. సృష్టికి అనుకూలంగా నడిచే ధర్మం వాటి కుంది కాబట్టి సృష్టిధర్మమైన ఉపవాస ధర్మాన్ని రుగ్మతలు వచ్చినప్పుడు అవి అనుసరిస్తాయి.
ఉపవాసధర్మం అంటే రోజూ ఆ ప్రాణులు తినే ఆహారాన్ని రుగ్మతలు వచ్చినప్పుడు తినకుండా అటు శరీరానికి, ఇటు జీర్ణకోశానికి విశ్రాంతి నివ్వడం. ఎక్కువ ప్రాణులు ఉపవాసంతో ఎక్కువగా మంచినీరును త్రాగుతూ ఉంటాయి. ఎన్ని రోజులు ఉపవాసం చేయాలనేది వాటికే తెలుస్తుంది. నోరు చేదు పోయి, జీర్ణకోశంలో తిరిగి జీర్ణాదిరాసాలు ఊరే వరకూ అంటే ఆకలయ్యే వరకూ ఉపవాసం చేస్తూ ఉంటాయి. వాటికి వచ్చిన ఇబ్బందిని బట్టి ఒక రోజో, రెండు రోజులో లేదా మరీ అవసరమైతే నాలుగురోజులో ఉపవాసాన్ని చేస్తూ ఉంటాయి. రోజూ అవి సుమారు 12 గంటలు రాత్రికి విశ్రాంతి నిస్తాయి కాబట్టి, శరీరంలో వ్యర్థపదార్థాలు ఎక్కువ పేరుకోవు కాబట్టి ఉపవాసాలు త్వరగా పూర్తి అయిపోతాయి. జ్ఞానం లేని మూగ జీవి అయినప్పటికీ మళ్ళీ ఆహారం దొరకదేమోనని, ఉపవాసంలో ఆహారం కనపడినప్పటికీ చస్తే ముట్టుకోదు. దొరికినదే ఛాన్సులే అని ఉపవాసం ప్రారంభించకుండా తినడం అనేది చేయడం లేదు. పైన చెప్పుకున్న నాలుగు కర్మలను, ఈ ఉపవాస ధర్మాన్ని సృష్టికర్త యొక్క ఆజ్ఞ ప్రకారము ప్రాణులు, జంతువులు పాటిస్తున్నాయి కాబట్టే వాటి ఆయుష్షు ఉన్నంత వరకు ఏ రోగాలు లేకుండా సుఖంగా జీవించగలుగుతున్నాయి. ఆకలయినప్పుడు ఆహరం తినడం అనే ధర్మాన్ని ఏ విధంగా పాటిస్తున్నాయో అలాగే రోగం వచ్చినప్పుడు ఉపవాస ధర్మాన్ని కూడా పాటించి వాటి జన్మను సార్థకం చేసుకొంటున్నాయి. ప్రతి ప్రాణీ ఒక జన్మ నుండి ఇంకొక జన్మను సృష్టిబద్ధంగా అందుకోగలుగుతున్నది. ఏ జన్మలోనూ సృష్టికి వ్యతిరేకమైన ఆహారాన్ని గానీ, సంగమాన్ని గానీ, నిద్రను గానీ, ఉపవాస ధర్మాన్ని గానీ తప్పడం లేదు. ఆ విధంగా ఎన్నో లక్షల జన్మలను అవి ధర్మంగా జీవించినందుకు దైవాన్ని చేరే జన్మ, ఉత్కృష్టమైన జన్మ చివరకు లభిస్తుంది. అదే మానవ జన్మ.
మనకు ఎన్నో జన్మల నోము ఫలంగా, పుణ్య ఫలంగా, అన్నిటి కంటే శ్రేష్ఠమైన జన్మగా మనస్సుగల మానవ జన్మ లభ్యమైనది. మనకు జంతుజన్మలలో ఆహారం, నిద్ర, భయము, సంగమము, ఉపవాస ధర్మాలతో పాటు అజ్ఞానం కూడా ఒక భాగంగా ఉండి పోయింది. మానవ జన్మలో కూడా ఆహరం, నిద్ర, సంగమము, ఉపవాస ధర్మం కొనసాగించవలసిన ధర్మాలు. జంతు జన్మల నుండి వచ్చిన భయాన్ని వీడి, దానితో పాటు మానవ జన్మను సార్థకత చేసుకొనే విధంగా అజ్ఞానాన్ని నశింపజేసి, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. జ్ఞానాన్ని పెంచుకోలేని అజ్ఞాన మానవులు పశువులతో సమానమని శాస్త్రాలు చెప్పుచున్నాయి. ఇహపరములందు సుఖమును గోరు మానవులు యావజ్జీవము ఆహార నియమాలను, ఉపవాస ధర్మాన్ని తప్పక పాటించవలెను. ఇవి రెండూ మానవుని మహోన్నత స్థానానికి తీసుకొని పోగలవు. ఈ రెండు నియమాలు గడిచిన ఎన్నో ప్రాణి జన్మలలో కంటే మానవ జన్మలో తప్పక పాటించవలసిన ధర్మాలు. గడిచిన జన్మలలో ఈ రెండు ధర్మాలను తప్పియున్నట్లైతే, ఆ శరీరానికి రోగాలు సంభవించి, త్వరగా నశించి, ఇంకో జన్మ అన్నా వెంటనే వచ్చే అవకాశం కల్గేది. కానీ ఆ జన్మలో అలాంటి అధర్మానికి ఏ ప్రాణీ ఒడిగట్ట లేదు. ఉపవాస, ఆహార నియమాలను ఈ జన్మలో (మానవ జన్మలో) పాటించక పోతే శరీరానికి రోగాలు సంభవించి, 100 సంవత్సరాల మానవ జన్మలో జ్ఞాన సముపార్జనకు ఆటంకం కలుగుతుంది. ఈ జన్మను వ్యర్థం చేసుకొంటే తిరిగి వచ్చేది కాదు. జ్ఞానంతో మానవ జన్మను సార్థకం చేసుకోవాలంటే మానవ జీవయాత్రకు ముఖ్యమైనది భౌతిక కాయము (శరీరము). కాయము (శరీరము) సరిగా లేనిదే కార్యము నెరవేరదు. ఆహార నియమాలు, ఉపవాస ధర్మాలతో గానీ ఈ కాయము సరిగా నడవదు. ఇది సృష్టి ధర్మం.
పూర్వం మనుషులు, ఋషులు ఈ ఆహార నియమాలను, ఉపవాస ధర్మాన్ని పాటించి యున్నారు కాబట్టి వారు 100 సంవత్సరాల పై బడి 150 సంవత్సరాల వరకూ జీవించగలిగేవారు. ఆ నియమాల ద్వారా వారు జ్ఞాన మార్గాన్ని పొందే ప్రయత్నం సాగిస్తూ, మానవ జన్మ యొక్క అర్థాన్ని సమాజానికి తెలియ జెప్పేవారు. కాలక్రమేణా మనుషులు నాగరికత పెరిగి ఆహార నియమాలను మార్పుచేయడం మొదలు పెట్టారు. ప్రకృతి సిద్ధమైన ఆహారం తిన్నంత కాలం ఉపవాస ధర్మాలు చేయడం, ప్రకృతి ధర్మంగా జీవించడం, ప్రకృతికి తిరిగి సహాయపడటం మొదలగు లక్షణాలన్నీ మనిషిలో గోచరించేవి. ఏ దేశంలో ఉన్నా పులి మాంసమే తింటుంది, అది దాని ధర్మం. తెలివితేటలు పెరిగిన దగ్గర నుండి మనిషి ఆహారమేమిటో మనిషికి తెలియకుండా ఉన్నది. ఎవరికి అనుకూలమైనట్లు వారు లేదా ఎవరికిష్టమైనట్లు వారు తింటున్నారే గానీ, శరీర ధర్మానికి అనుకూలంగా మనిషి ఆహారాన్ని స్వీకరించలేక పోతున్నాడు. ప్రకృతికి విరుద్ధమైన ఆహారాన్ని తినడం ప్రారంభించిన దగ్గర నుండి మనిషికి ప్రకృతి ధర్మాలు అందడం తగ్గిపోతాయి. ప్రకృతికి, మనకు ఉన్న సంబంధాలను ఆ రుచిగల ఆహారాలు తెంచివేస్తాయి. అప్పటి నుండి మనుషులకు ఉపవాసాలు చేసే ధర్మం మరుగున పడిపోతూ వచ్చింది. దానితోపాటు మిగతా ధర్మాలు అయిన నిద్ర, సంగమంలో కూడా తనకు ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడం చేస్తున్నాడు. ఇంద్రియ సుఖాలకు దాస్యం చేయడానికి అలవాటు పడ్డాడు. రుచిగల ఆహారం అలవాటైన దగ్గర నుండి మనిషికి రోగాలు, బాధలు ప్రారంభమవ్వడమే కాకుండా ఇంకొకరి మీద ఆధారపడడం అలవాటు అయ్యింది. మనకు వచ్చే రోగాలు మనచేత ఆ పని చేయించగలుగుచున్నాయి. వంద సంవత్సరాలు జీవించే ఏనుగు ఎవరి మీద ఆధారపడి అంత ఆరోగ్యంగా, ఆనందంగా జీవించుచున్నది. ప్రకృతి ఆధారం దానికి దొరికింది కాబట్టి వేరే ఆధారం దానికి అక్కర లేకుండా ఉండగలుగుతున్నది. వికృతమైన ఆహారం, వికృతమైన అలవాట్లకు దగ్గరవుతున్నాము కాబట్టి రోగాలకు చేరువై ప్రక్కవారికి భారం అవుతున్నాము. రుచుల యొక్క ప్రభావం మనిషిని ఉపవాస ధర్మం నుండి దూరం చేసింది. రోగం వచ్చిన రోజున కూడా తినకపోతే అవి ఎక్కడ అయిపోతాయో అన్నట్లు వాంఛతో ఉపవాస ధర్మాన్ని మరిచి శరీర విరుద్ధమైన పని చేస్తున్నాము. ఆ విధంగా మానవజన్మను దుఃఖ భూయిష్టం చేసుకొంటున్నాము. మానవ జీవితం అంటేనే ఆనందంతో కూడుకున్నది. అంటే ఆనందమయం మానవ జీవితం. ఎన్నో లక్షల జన్మల నుండి అలవాటుగా వస్తున్న ఉపవాస ధర్మాన్ని కడసారి జన్మ అయిన మానవ జన్మలో మనిషి రుచులను తినడం అలవాటు పడి వదిలివేయడం చేస్తున్నాడు. చూసారా! రుచులు ఎంతటి పవిత్రమైన ధర్మాన్ని మన నుండి దూరం చేయగలుగుచున్నాయో! ఎన్నో ఏళ్ల తరబడి తపస్సుజేసి, నిగ్రహించి సాధించిన తపః ఫలాన్ని విశ్వామిత్రుడు మేనక మాయలో పడి వ్యర్థం చేసుకున్నట్లు, మనం రుచుల మాయలో పడి ఉపవాస ధర్మాన్ని దూరం చేసుకొంటున్నాము. రోగాలను దగ్గరకు చేర్చుకుంటున్నాము.
ప్రకృతి సిద్ధమైన మనిషి ప్రకృతి ధర్మమైన ఉపవాసాన్ని వదలి ప్రకృతిలో జీవిస్తున్నాడు గానీ, జంతువులు ఎన్నో కోట్ల సంవత్సరాల నుండి అనాదిగా వస్తున్న ఉపవాస ధర్మాన్ని ఇంకా విడవకుండానే ఆరోగ్యాన్ని కాపాడుకొంటూ, ప్రకృతికీ వాటికీ ఉన్న సంబంధాన్ని తెంచుకోకుండా జీవించగలుగుచున్నాయి. ఆ జంతువులు మనతో స్నేహం కొన్ని సంవత్సరాలు చేసినప్పటికీ, మన ప్రకృతి విరుద్ధమైన అలవాట్లను అవి నేర్చుకోవడం లేదు. వాటి ధర్మాన్ని అవి ఏ రోజూ తప్పడం లేదు. చూశారా! అవి ఎంత నీతివంతంగా జీవించగలుగుచున్నాయో! ఆ ధర్మమే వాటిని బ్రతికినన్నాళ్ళు రక్షించుచున్నది. ఉదాహరణకు మనం ఇంట్లో కుక్కను పెంచుకొంటూ ఉంటాము. దానికి మనం తినే ఉప్పు, కారాలు, మషాలాలతో వండిన వంటలను, అన్నాన్ని కూడా పెడుతుంటాము. మనం తినే ఆహారాన్నే కుక్క కూడా తింటున్నది కాబట్టి మనలాగానే అప్పుడప్పుడూ దానికీ జ్వరం గానీ, రోగాలు గానీ వస్తుంటాయి. ప్రకృతి ధర్మాలను, ఉపవాస ధర్మాలను మరిచాము కాబట్టి మనం డాక్టరు వద్దకు వెళ్ళి వందలు వదిలించుకొని మందులు మింగే పని చేస్తాము. కుక్క ఏమి చేస్తుందో ఆలోచిద్దాము. దానికి అలంటి ఇబ్బంది అనిపించినప్పుడు వెంటనే పది పరకలు గడ్డి తిని, లోపల ఉన్న అజీర్ణ పదార్థాన్నీ కక్కివేసి, అప్పటి నుండి ఒక రోజో లేదా రెండు రోజులో ఏమీ ముట్టుకోకుండా ఉపవాస ధర్మాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఒక వేళ మనం అలవాటు ప్రకారం ఆ రోజు మంచి మాంసం కూర వండి ముందు పెట్టినప్పటికీ దానిని వాసనా చూసే ప్రయత్నం కూడా చేయదు. వారానికి ఒక్క రోజేగదా మాంసం వండేది, ఇప్పుడు తినకపోతే మళ్ళీ వారం దాకా మాంసం కూర దొరకదని కక్కుర్తిపడి తిని ఉపవాస ధర్మానికి కళంకం తీసుకొని వచ్చే పని కుక్క చేయదు. దానికి వచ్చిన ఇబ్బంది తగ్గిన దగ్గర నుండి ఆకలి పుడితే మరలా ఆహారం తినడం ప్రారంభిస్తుంది. అదే మనం అయితే నోరు చేదుగా ఉన్నప్పటికీ, బిళ్ళలు వేసుకొంటున్నాము గదా అని, మళ్ళీ వారం దాకా మాంసం దొరకదని కక్కుర్తిపడి దాన్ని తిని 5, 6 రోజులు వరకూ బాధపడుతూ ఉంటాము. కుక్క వచ్చిన ఇబ్బందిని ఉపవాసం అనే సహజమైన చికిత్స ద్వారా పూర్తిగా తగ్గించుకోగలిగితే, మనం మందులు వేసుకొని రోగాన్ని అణచిపెట్టుకొని, రోగం శరీరంలో పెరగడానికి, పునాది వేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాము. ఉపవాసం చేసి కుక్క బాగుపడితే, మందులు వేసుకొని మనం నాశనం అవుతున్నాము. అందువల్లనే కుక్కను విశ్వాసం ఉన్న జీవి అంటారు. సుమారు 200 సంవత్సరాలు తెల్లవారి స్నేహం చేసిన దౌర్భాగ్యానికి మనకున్న ఉపవాస ధర్మాన్ని వదిలిపెట్టి, రోగాలు వస్తే వారిలాగా పొట్టనిండా తిని మందులు వేసుకొనే స్థితికి మనిషి దిగజారాడు. తెల్లవాడి స్నేహం వలన మనలో ఉన్న మంచి వదిలిపెట్టి (ఉపవాస ధర్మాన్ని) చెడు అయిన మందులకు మారిపోయాము. అదే కుక్క మనలను చూసినప్పటికీ కూడా దాని ధర్మాన్ని వదలలేదు. మన ఇంట్లో పెరిగి, మనం పెట్టే రుచులను తిని, రోగాలు వచ్చినప్పుడు మనతో పాటు తినకుండా కుక్క ఉపవాసం ఎందుకు చేస్తున్నది? ఉపవాసం చేయడం అనేది ఎవరిని చూసి నేర్చుకున్నది? మన దగ్గర పెరుగుచున్నది కావున మనలని చూసి నేర్చుకొన్నది అని అనడానికి లేదు. దానిని ఉపవాసం చేయమని ఎవరు ప్రోత్సహించారు? ఆలోచించండి.
ఏ వైద్య శాస్త్రం చదువుకొని కుక్క ఉపవాసాన్ని చేస్తున్నది? ఏ వేదాలు దానికి ఆధారం? ఏ డాక్టరు సహాయంతో అది ఉపవాసం చేస్తున్నది? కుక్క చేసే ఉపవాసం ఏ వైద్య శాస్త్రానికి సంబంధించినది? ఉపవాసం అనేది ఏ వైద్య శాస్త్రానికి సంబంధించినది కాదు. ఆయుర్వేద శాస్త్రానికి సంబంధించినది అనుకున్నా పొరపాటే. వేదాలు అనేవి, వైద్యశాస్త్రాలు అనేవి మానవ జన్మలు ప్రారంభమయిన తరువాత ఎన్నో సంవత్సరాలు గడిచిన తరువాత గానీ పుట్టలేదు. కానీ ఉపవాసాలు అనేవి కొన్ని వందల కోట్ల సంవత్సరాలకు పూర్వం నుండి జంతువులు పుట్టిన దగ్గర నుండి పుట్టినవే. మనిషి కనుగొన్నది కాదు ఉపవాసధర్మమనేది. అది సహజ సిద్ధమైన ప్రకృతి ధర్మమే. భూమి మీద పుట్టిన అన్ని లక్షల ప్రాణులకూ ఈ ధర్మం వర్తిస్తుంది. భూమి మీద ప్రాణులను పుట్టించిన సృష్టికర్త సృష్టించిన అద్భుతమైన, సహజమైన చికిత్స ఉపవాసం. అందువల్లనే కుక్కలు మన ఇంట్లో పెరిగినప్పటికీ, అవి ధర్మాన్ని అనుసరించేవి కాబట్టే మనలను చూసి చెడిపోకుండా సృష్టిధర్మం అయిన ఉపవాస ధర్మాన్ని ఆచరించగలుగుచున్నవి. అది ఉపవాసం చేయడానికి గల కారణం ప్రకృతి ధర్మం. మనం పోగొట్టుకున్న ఉపవాస ధర్మాన్ని, మన ఇంట్లో పెరిగే కుక్కను చూసి గానీ, సమాజంలో మనకళ్ళెదురు తిరిగే మిగతా జంతువులను చూసిగానీ, మరలా తిరిగి తెలుసుకొన్నా మనుషుల ఆరోగ్యం ఏనాడో బాగుపడి ఉండేది. ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడంలో ఏమీ చదువుకోని అజ్ఞాన జీవి అయిన కుక్కకు తెలిసినన్ని ఆరోగ్య సూత్రాలు బుద్ధి జీవి అయిన మనిషికి తెలియడం లేదంటే ఆరోగ్య విషయంలో మనిషి ఎంతకు దిగజారిపోయాడో స్పష్టమవుతున్నది.
మనది పుణ్యభూమి, వేదభూమి. దీనికి మూలం మన ఋషి సాంప్రదాయం. పూర్వం ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఉపవాసాన్ని ఋషులు ఒక ధర్మంగానే చేయడం జరిగింది. ఉపవాసాన్ని తపస్సుగా భావించి పవిత్రంగా చేసేవారు. కాలక్రమేణా ఋషి సంప్రదాయం మరుగున పడడంతో ఉపవాస ధర్మం కూడా మనుషులకు దూరం అవుతూ వచ్చింది. 19వ శతాబ్ధంలో (125 సంవత్సరాల క్రితం) జర్మనీ దేశంలో లూయి కూనే గారు ఉపవాస ధర్మాన్ని వైద్యంగా, చికిత్సగా ప్రారంభించడం జరిగింది. వీరు ఉపవాస విధానాన్ని ఎలా గుర్తించడం జరిగిందంటే, కూనే గారు ఒక పిల్లిని పెంచేవారట. దానికి ఒక రోజు కాలు తలుపు సందున పడి విరగడం ఆయన గమనించారు. అది ఎలా వైద్యం చేసుకొంటుందోనని వారు పిల్లిని పరీక్షించడం ప్రారంభించారు. కాలు విరిగిన రోజు నుండి ఆహారం ఏమీ ముట్టకుండా ఉపవాసం చేయడం ప్రారంభించింది. పిల్లికి పాలు పెట్టినప్పటికీ ముట్టలేదట. అప్పుడప్పుడూ నీరును త్రాగుతూ ఉండేదట. విరిగిన కాలును నాలుక పెట్టి నాకుతూ, అలా రోజుకు నాలుగైదు సార్లు చేస్తూ పూర్తి విశ్రాంతి తీసుకొనేదట. అలా వారం రోజులు పూర్తి ఉపవాసం చేసేసరికి కాలు నడకకు రావడం ప్రారంభం అయ్యిందట. పిల్లి వారం రోజులు తరువాత గానీ ఆహారం (పాలు) ముట్టలేదట. విరిగిన దగ్గర నాలుక పెట్టి నాకడం వలన ఆ భాగానికి రక్తప్రసరణ ఎక్కువగా జరిగి త్వరగా ఇబ్బంది తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చేసుకొనే తడికట్లు, మట్టి పట్టీలు, తొట్టి స్నానాలు మొదలైనవి ఆ కోవకు చెందినవే. చూశారా! ఎంత విచిత్రమో పిల్లి నుండి ఆరోగ్యసూత్రాలను నేర్చుకొని మనుషులు తెలుసుకోవలసి వచ్చింది. పిల్లి కూనేగారికి అందించినదే ఈనాటి ప్రకృతి వైద్యశాస్త్రం. పిల్లి చేసిన ఉపవాస ధర్మాన్ని కూనేగారు ఉపవాస చికిత్సగా మార్చారు. ఉపవాస చికిత్స అయితే రోగం వచ్చిన వారికే పరిమితం అవుచున్నది. ప్రకృతి వైద్యం చేసేవారు మాత్రమే ఉపవాసాలు చేయాలన్నది సమాజంలో ముద్ర పడిపోయింది. అది శుద్ధ పొరపాటు.
84 లక్షల జీవరాసులలో ఒకడైన మనిషి జ్ఞానం ఉన్న ప్రాణి అంతే. 84 లక్షల జీవరాసులకూ వర్తించేది ఉపవాస ధర్మం. పిల్లిని చూసి నేర్చుకున్న ధర్మాన్ని ప్రకృతి వైద్యం క్రింద లెక్కగట్టడమో, లేదా ఉపవాస చికిత్సో అనుకుని ప్రజలు దూరంగా ఉండడం ధర్మం కాదు. పుట్టిన ప్రతి జీవి అవసరమైనప్పుడు ఉపవాస ధర్మాన్ని ఆచరించవలసిందే. ప్రకృతిలో మనిషి ఒక భాగం. ప్రకృతి ధర్మాలను గౌరవించడం అంటే మనలను మనం రక్షించుకోవడం అని అర్థం. సృష్టిధర్మమైన ఉపవాస ధర్మాన్ని ఆచరించడం అంటే మనలను మనం ఉద్ధరించుకోవడమే. సృష్టి ధర్మాలను వ్యతిరేకించడం మహా పాపం. పాపాలు అంటే రోగాలు. సృష్టి ధర్మమైన ఉపవాస ధర్మాన్ని వ్యతిరేకిస్తే రోగాలు తప్పవు.
రోగాలు వచ్చినప్పుడు లేదా శరీరంలో ఏవైనా రుగ్మతలు కలిగినప్పుడు, భగవంతుడు నోరు చేదును పెట్టి మన శరీరాన్ని వాటి నుండి రక్షించే ప్రయత్నం చేస్తాడు. అదే ఉపవాసం చేయవలసిన సమయం. శరీరం ఆహారాన్ని కోరనప్పుడు మానివేయడమే ఉపవాసం. శరీరంలో ఆహారం అరగదు కాబట్టే ఆ సమయంలో నోరు చేదు వచ్చి మనలను తినవద్దని సృష్టికర్త హెచ్చరిస్తూ ఉంటాడు. అయినా మనం దానిని లెక్క చేయక మందులు వేసుకొని తిని వేయడం చేస్తున్నాము. ఆయన ప్రయత్నిస్తుంటే మనమే చేతులారా చెడగొట్టుకుంటున్నాము. తద్వారా మన గోతిని మనమే తవ్వు కొంటున్నాము. రోగాలు వచ్చినప్పుడు, నోటికి ఆహారం సహించనప్పుడు తినే ఆహారం విషంగా శరీరాన్ని నాశనం చేస్తుంది. సృష్టి విరుద్ధమైన పని చేసినట్లు అవుతుంది. సమాజంలో ఎక్కువ మంది మందులు వేసుకొంటూ అలా తినివేయడమే చేస్తున్నారు. అందువల్లనే జ్వరాలు తగ్గడానికి 5, 6 రోజులు, టైఫాయిడ్ తగ్గడానికి 15 రోజులు పడుతున్నది. ఉపవాస ధర్మాన్ని ప్రారంభించడం వలన కొద్ది రోజులలోనే శరీరం శుభ్రపడే అవకాశం కలుగుతుంది. దేశంలో దీర్ఘరోగాలు పెరగడానికి, తరుణ వ్యాధులు ప్రబలడానికి ఉపవాస ధర్మాన్ని, ఆహార నియమాన్ని విస్మరించడమే కారణం.
ప్రకృతి ధర్మాలు, సృష్టిధర్మాలు, ఉపవాస ధర్మాలనేవి యుగయుగాలుండే ధర్మాలు. మనం ఈరోజు ఉండవచ్చు లేదా రేపు పోవచ్చు. కానీ అవి నిత్యమైనవి, సత్యమైనవి, శాశ్వతమైనవి. ఎంత మంది మనుషులు మారినా, ఎన్ని వైద్య విధానాలు క్రొత్తవి వచ్చినా ఇవి చలించని ధర్మాలు అని మాత్రం మరువకండి. తెలిసో తెలియకో దూరం చేసుకొన్న ఉపవాస ధర్మాన్ని తిరిగి గౌరవించండి. ఉపవాస ధర్మం ద్వారా శరీరాన్ని రోగాల బారి నుండి కాపాడండి. ఉపవాస ధర్మం అంటే మనకు భగవంతుడు అందించిన సహజమైన మందు. ఉపవాసం అంటే మన వల్ల కాదు అని గానీ, మనకెందుకు ఉపవాసాలు బాగానే ఉన్నాము గదా అని గానీ, ఈ వయస్సులో ఉపవాసాలేంటి అని గానీ, మందు బిళ్ళ ఒక్కటి వేసుకుంటే తగ్గే దానికి పొట్ట మాడ్చుకోవడం ఎందుకని గానీ, సమయం లేదని గానీ, భయం వేసి గానీ, ఎవరి మాటలో విని బెదిరిపోయిగానీ, మందులకు తగ్గని రోగాలు ఉపవాసాలు చేస్తే తగ్గుతాయా! అని ఆలోచిస్తూ ఉపవాస ధర్మాన్ని అశ్రద్ధ చేస్తే అటువంటి వారికి అంత నష్టం ఇంకొకటి లేదు, ఇంకొకటి ఉండదు. అన్ని రోగాలకు ఒకటే మందు. అదే ఉపవాస ధర్మం. మనలో చైతన్యానికి ప్రాణశక్తి ఎంత అవసరమో, దాహం అయినప్పుడు నీరు త్రాగడం ఎంత అవసరమో, ఆకలయినప్పుడు ఆహారం ఎంత అవసరమనుకొని తింటున్నామో, అలసి పోయినప్పుడు విశ్రాంతిని ఏ విధంగా తీసుకొంటున్నామో, అలాగే శరీరంలో రుగ్మతలు, రోగాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా అంత అవసరమనుకుని ఉపవాస ధర్మాన్ని పాటించడం కూడా నేర్చుకోవాలి. జ్ఞాన మార్గాన పయనించే ఓ బుద్ధిజీవీ! శరీరం కోరినప్పుడు ఉపవాసం చేయడం నీ ధర్మమని మరువకోయ్!! నీ కనీస ధర్మమైన ఉపవాస ధర్మాన్ని వీడి ఇరుకున పడబోకోయ్. అజ్ఞాన మార్గాన్ని వీడి జ్ఞానమార్గాన పయనించండి. అధర్మాన్ని వీడి ధర్మమార్గాన్ని అందుకోండి. అసత్యమును విడిచి సత్యాన్ని ఆశ్రయించండి. దుఃఖాలను వీడి సుఖాలననుభవించండి. రోగమును వీడి ఆరోగ్యముగా జీవించండి. ప్రకృతిని వీడి పరమాత్మను చేరుకోండి. అదే మీ గమ్యం.

3. ఉపవాసం అంటే ఏమిటి?

ఏరకమైన ఆహారాన్నీ తినకుండా మానివేయడాన్నే ఉపవాసం అని అంటారు. 'అశన నిగ్రహంతపః ' తిండిని నిగ్రహించడమే తపస్సు. అందువల్లనే తపము లేదుపవాసవ్రతము కంటె అని భీష్మాచార్యుల వారు అన్నారు. ఉపవాసమంటే అంత పవిత్రమైనది, ఆరోగ్యవంతమైనది. రోగాలు అంటే పాపాలు అని, రోగాల నుండి విముక్తి పొందడానికి ఉపవాసమొక్కటేనని భావించి, ఆరోగ్యాన్ని అందించేది ఉపవాసం కనుక ఉపవాసం చేస్తే పుణ్యము వస్తుందని పెద్దలు చెప్పేవారు. ఉపవాసాలు చేస్తే ముక్తి లభిస్తుందనే వారు.
ప్రతిరోజూ రాత్రిపూట నిద్ర ద్వారా జ్ఞానేంద్రియాలు (చెవులు, కన్నులు, చర్మము, ముక్కు, నాలుక) మరియు కర్మేంద్రియాలు (వాక్కు, కాళ్ళు, చేతులు, మలద్వారము, మూత్రద్వారము) పూర్తి విశ్రాంతిని తీసుకొని మరలా మరసటి రోజు ఉదయానికి తిరిగి శక్తిని పెంపొందుచుకుంటున్నాయి. గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు, మెదడు, రక్తనాళాలు మొదలైనవి నిరంతరం పనిచేస్తూ ఉండవలసిందే. భగవంతుడు వీటికి అలా పనిచేయగల సామర్థ్యాన్ని అందించియున్నాడు. జీర్ణకోశానికి అంటే పొట్ట, ప్రేగులు, లివరు, పాంక్రియాస్ మొదలగు అవయవాలకు విశ్రాంతి లేకుండా నిరంతరం పనిచేసే సామర్థ్యాన్ని సృష్టికర్త ఇవ్వలేదు. ఈ అవయవాలు ప్రతిరోజూ విశాంత్రి తీసుకొంటేనే మరుసటి రోజు తిరిగి శక్తివంతంగా పనిచేయగలవు. విశ్రాంతి లోపిస్తే వీటిలో లోపాలు రావడం జరుగుతుంది. అంటే వాటికి విశ్రాంతి నివ్వడం మన ధర్మం. మనం దినచరులం. అంటే పగలే మనకు కళ్ళు కనపడతాయి కాబట్టి పగలు ఆహారాన్ని తిని రాత్రికి విశ్రాంతినివ్వాలన్నమాట. రాత్రికి 12 గంటల సమయం కాబట్టి అన్ని గంటలు ఈ అవయవాలు విశ్రాంతి తీసుకోవాలన్నమాట. మనిషికి తెలివి తేటలు పెరిగిన దగ్గర నుండి అర్థరాత్రి వరకూ తినడం చేస్తున్నాడు. అలా తినడం వలన జీర్ణకోశం అంతా విశ్రాంతి తీసుకోవలసిన రాత్రి సమయాల్లో కూడా పనిచేయవలసి వస్తున్నది. ఆ విధంగా పనిచేయడం వలన కొన్ని రోజులకు జీర్ణకోశం పనితనం తగ్గిపోవడం జరుగుచున్నది. జీర్ణకోశం సరిగా పనిచేయక పోతే అన్ని రోగాలకు ఆహ్వానం అందుతూ ఉంటుంది. మనిషిని ఏడిపించడంలో, చంపడంలో నేను గొప్ప అంటే నేను గొప్ప అని మనకున్న రోగాలన్నీ వాదించుకుంటూ ఉంటాయి. చివరవరకు వింటూ ఉన్న అజీర్ణ వ్యాధి ఆఖరుకు ఇలా అంటుంది. అన్నింటి కంటే నేను గొప్ప ఎందుకంటే అజీర్ణం పుట్టాకే మీరందరూ పుట్టారు. నేను రోగాలకు తల్లిలాంటి దాన్ని నాతోనే రోగాలు పుట్టడం మొదలు. నేను లేకపోతే మీరెవ్వరూ ఉండరు అని అజీర్ణ వ్యాధి తనకున్న గొప్పతనాన్ని చాటి చెప్పుకుంటుంది. చూశారా! ప్రేగులకు సరైన విశ్రాంతి నివ్వకపోతే అన్ని రోగాలకూ శరీరం ఎలా దారితీస్తుందో. జీర్ణకోశమే రోగాలకు పునాది అవుతుంది. అలాగే జీర్ణకోశమే ఆరోగ్యానికి కూడా పునాది. అలాంటి శక్తిగల జీర్ణకోశాన్ని రక్షించి, తిరిగి శక్తివంతంగా తీర్చిదిద్దేది ఉపవాసం. జీర్ణకోశానికి పూర్తి విశ్రాంతి నివ్వడమే ఉపవాసమని అర్థం. సృష్టిధర్మాలను తప్పకుండా పాటించే జంతువులు మిగతా జీవరాశులు ఏదైనా అనారోగ్యం సంభవించినప్పుడు దాని నుండి రక్షించుకోవడం కొరకు జీర్ణకోశానికి పూర్తి విశ్రాంతి నిచ్చి వచ్చిన రోగాల నుండి బయటపడగలుగుచున్నాయి.
జీర్ణకోశానికి విశ్రాంతినిస్తే రోగాలు ఎందుకు తగ్గుతాయో తెలుసుకుందాం. మనం పనిలేకుండా ఖాళీగా ఉన్న సమయాల్లోనే ఇల్లు సర్దుకోవడం, అలంకరించుకోవడం, శుభ్రం చేసుకోవడం చేస్తూ ఉంటాము. అలాగే మన శరీరం కూడా ఖాళీ ఉన్న సమయంలో శరీరంలో రోగపదార్థాలను బయటకు నెట్టివేయడం, కణాలను రిపేరు చేసుకోవడం, శరీరాన్ని శుభ్రం చేసుకోవడం చేస్తూ ఉంటుంది. ఖాళీ అంటే పొట్టలో ఆహారం లేనప్పుడు (రాత్రి సమయంలో) ఈ పనిచేసుకొంటూ ఉంటుంది. మనం కూడా వంట పని చేసేటప్పుడు ఇల్లును శుభ్రం చేసే పని చేయము గదా! పొట్టలో ఆహారం ఉన్నప్పుడు శరీరం రిపేరు ఎందుకు చేయలేదంటే మనలో ఉన్న శక్తి అంతా ముందు ఆహారాన్ని జీర్ణం చేయడానికే ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఆ సమయంలో విసర్జన క్రియకు శక్తి గానీ, ఖాళీగానీ శరీరానికి ఉండదు. శరీరానికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు పూర్తిగా రిపేరు చేస్తే గానీ ఆ ఇబ్బంది నుండి శరీరం వెంటనే బయటపడదు. పూర్తిగా రిపేరు చేయడం అంటే రాత్రి 12 గంటలతో పాటు (రోజూ మామూలుగా జరిగే రిపేరు) పగలు 12 గంటలు కూడా (రోగాలు వచ్చినప్పుడు) రిపేరు కార్యక్రమాన్ని శరీరం చేపట్టడం. 24 గంటలూ శరీరం తన్ను తాను బాగుచేసుకోవడానికి అవకాశం కల్పించడమే ఉపవాసం. ఇదే ఉపవాసంలో ఉన్న అసలు రహస్యం. మనం ఆహారం తింటే ఆ ఆహారాన్ని జీర్ణం చేయడానికి శరీరానికి సుమారు 4—5 గంటలు సమయం పడుతుంది. దీనితోబాటు ఎంతో శక్తి శరీరంలోని ఆహారం జీర్ణానికి ఖర్చు అవుతుంది. ఆహారం తింటే కాసులు (శక్తి), కాలం రెండు విధాలా ఖర్చు తప్పదన్నమాట. మూడు పూటలా ఆహారం తింటాం అంటే సుమారు 12—15 గంటలతో పాటు, ఎంతో శక్తిని రోజూ వృధా చేసుకొంటూ ఉంటాము. అదే ఉపవాసంలో అయితే 12—15 గంటల సమయం ఆదా అవడమే గాక ఎంతో శక్తి శరీరానికి పొదుపు అవుచున్నది. ఉపవాసంలో ఆదా అయిన ఈ సమయం, శక్తి రెండూ కలిసి విసర్జన క్రియకు, రిపేరుకు పూర్తి సహకారం అందిస్తూ ఉంటాయి. అందువలన ఉపవాసంలో పగలు, రాత్రులూ శరీరం విసర్జన క్రియ జేసి శరీరాన్ని త్వరగా తిరిగి ఆరోగ్యవంతం చేయగలుగుతుంది.
మనం ఆహారం తినే రోజులలో శరీరం పగలు కొత్త కణాలను పుట్టించడం మరియు కణాలను (వయస్సు అయిన వాటిని) చంపడం చేస్తూ రాత్రి పూట జబ్బుతో ఉన్న కణాలను రిపేరు చేసుకుంటూ ఉంటుంది. అదే ఉపవాసంలో అయితే పూర్తిగా ఆహారం లేని కారణంగా కణాలు పుట్టడం, కణాలు చావడం పూర్తిగా(దరిదాపుగా) ఆగిపోయి, 24 గంటలూ కణాలను రిపేరు చేయడం మాత్రం శరీరం చేస్తూ ఉంటుంది. కణాల చావుపుట్టుకలకు రోజూ చాలా శక్తి వృధా అవుతూ ఉంటుంది. ఉపవాసంలో ఆ ప్రక్రియ ఆగడం వలన దాని ద్వారా చాలా శక్తి శరీరానికి పొదుపు అయ్యి ఉపవాసంలో మామూలు కంటే శక్తిగా ఉండగలుగుతాము. ఆహారం తింటే ఉన్నశక్తి అంతా ఖర్చు అయ్యి నీరసంగా ఉంటాము. అదే ఉపవాసంలో శక్తి పొదుపు అవుతున్నది కావున ఉపవాసం అంటే శక్తిని శరీరానికి పెంచుకోవడం అని అర్థం. శరీరానికి ఉన్న శక్తిని హరించి వేసేది ఆహారం అయితే శరీరానికి కొత్త శక్తిని పెంచేది ఉపవాసం. అందువల్లనే ఉపవాసానికి మన పూర్వీకులు అంత ప్రాధాన్యతను ఇచ్చియున్నారు. ఉదాహరణకు పొలాన్నిగెడ్డ విరిచి వేసవికాలంలో ఎండగడతారు. అది పొలానికి ఉపవాసం అని అర్థం. అలా పొలాన్ని ఆరగట్టడం వలన పొలానికి శక్తి పెరిగి పంటలు బాగా పండటాన్ని రైతులు గమనిస్తూ ఉంటారు. పొలాన్ని అలా ఆరగట్టకుండా పంట తరువాత పంట వేస్తూ వుంటే దిగుబడి తక్కువ రావడమే కాకుండా, తెగుళ్ళు ఎక్కువ రావడం కూడా చూస్తూ ఉంటారు. మనం ఉపవాసం చేయడం ద్వారా అదే ఫలితాన్ని పొందుతాము, చేయకపోతే అదే నష్టాన్ని కూడా పొందడం సహజం. ఉపవాసం ద్వారా (ఎండగట్టడం ద్వారా) ఆరిన నేల నీటిని, ఎరువును త్వరగా పీల్చుకోగలుగుతుంది. అలాగే ఉపవాసం తరువాత మన శరీరం కూడా ఆహారాన్ని, పోషకపదార్థాలను బాగా జీర్ణం చేయడమే కాకుండా త్వరగా స్వీకరించే శక్తి కూడా పెరుగుతుంది. అందువల్లనే జీర్ణాశయానికి బలం పెరిగి ఆరోగ్యానికి పునాదిగా మారుతుంది.
పంచభూతాలలో ఆకాశమనే భూతానికి చెందినదే ఉపవాసం. ప్రతి దానికీ అవకాశాన్ని ఇచ్చేదే ఆకాశం. ఆకాశమంటే ఖాళీ అని అర్థం. సంచిలో ఆకాశమనే ఖాళీ ఉంటేనే మనం అందులో ఏదైనా వస్తువును పెట్టుకోవడానికి కుదురుతుంది. సంచిలో ఖాళీ లేదంటే ఆకాశము లేదని అర్థం. అలాగే మన శరీరంలో ఉన్న ఖాళీని, కణాలలో ఉన్న ఖాళీని రోగ పదార్థం ఆక్రమించివేసినప్పుడు రోగాలు వస్తాయి. ఆ రోగ పదార్థాన్ని ఆ భాగాల నుండి మళ్లించి, బయటకు విసర్జించి, తిరిగి ఆ ఖాళీని ఏర్పరచి మంచి పదార్థాలు సరఫరా అయ్యేటట్లు చేయడమే ఉపవాసం. పూడుకొని పోయిన మురుగు కాలువలలో నీరు, మురుగు ముందుకు జరగదు. అంటే కాలువలో ఆకాశతత్వం (ఖాళీ) లోపించింది అని అర్థం. కాలువను త్రవ్వి వెడల్పు చేయడం అంటే ఆకాశతత్వాన్ని పెంచడం అని అర్థం. ఆకాశతత్వాన్ని పెంచడమే ఉపవాసమంటారు. శరీరాన్ని ఇరుకు నుండి విశాలత్వం చేయడమే ఉపవాసం.
రోజూ మనం ఆహారం తింటే ఆ ఆహారాన్ని అరిగించడానికి ఎంతో ఎక్కువ ప్రాణశక్తి ఖర్చు అయిపోతూ ఉంటుంది. మన శరీరంలో సమస్త కార్యక్రమాలను నిర్వహించేది ప్రాణశక్తి. ఉపవాసం చేయడం ద్వారా (ఆహారం లేని కారణంగా) మన శరీరంలో ప్రాణశక్తి అంతా పొదుపు అవుతుంది. ఆ పెరిగిన ప్రాణశక్తి (పొదుపైన ప్రాణశక్తి) మనలోని రోగపదార్థాన్ని, విష పదార్థాన్ని విసర్జించడానికి సహకరిస్తూ ఉంటుంది. అందువల్లనే ఉపవాసంలో రోగాలు త్వరగా తగ్గుతూ ఉంటాయి. ఉపవాసం అంటే ఇంకా ఏమిటో పూర్తిగా తెలుసుకుందాము.
ఉపవాసమంటే
- శరీరానికి పూర్తి విశ్రాంతి నిచ్చేది.
- శరీరానికి శక్తిని పెంచేది.
- రోగాలను తగ్గించేది.
- రోగ భయాన్ని దూరం చేసేది.
- శరీరానికి ప్రాణశక్తిని పెంచేది.
- అవరోధాలను తొలగించేది.
- నిలువ యున్న కొవ్వును కరిగించేది.
- శరీరాన్ని తగ్గించేది.
- విసర్జకావయవాలను శుద్ధి చేసేది.
- కోరికలను దూరం చేసేది.
- కోపతాపాలను తగ్గించేది.
- మనో నిగ్రహాన్ని పెంచేది.
- ఆకలిని పెంచేది.
- రుచిని కలిగించేది.
- మొండి వ్యాధులను తరిమికొట్టేది.
- ఆయుష్షును పెంచేది.
- తపోశక్తిని పెంచేది.
- ఆరోగ్యాన్ని అందించేది.
- పవిత్రమైనది, ధర్మమైనది.
- శరీర సమ్మతమైనది, శాస్త్రసమ్మతమైనది.
- డాక్టర్లను దూరం చేసేది.
- దైవాన్ని దగ్గర జేసేది.
అసలు ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరవడం లేదా భగవంతుని సమీపించడం అని అర్థం. ఉపవాసం ద్వారా ఇన్ని రకాల గుణాలు అందుకొనే అవకాశం మనిషికి కలుగుచున్నది కావున ఉపవాసం చేయడం ద్వారా దైవాన్ని చేరే అవకాశం లేదా బ్రహ్మానందాన్ని పొందే అవకాశం కలుగుతుంది. దైవాన్ని చేరుకోవడానికి శరీరం ఆరోగ్యంగా, అనుకూలంగా ఉండాలంటే ఉపవాస ధర్మాన్ని తప్పక పాటించాలి. దైవం అంటేనే ప్రకృతి. ఉపవాసాన్ని చేయడం అంటే ప్రకృతికి దగ్గరగా అవ్వడం లేదా ప్రకృతితో ఏకమవ్వడం. ప్రకృతికి దూరం అయిన మనిషి తల్లికి దూరం అయిన పసివానిలా రోదించవలసిందే. ఉపవాసాన్ని గౌరవించడం అంటే ప్రకృతి మాతను గౌరవించడం అని మరువకండి.

4. ఉపవాసం ఎందుకు చేయాలి?

పంచభూతాలతో నిండియున్నది ప్రకృతి. మన శరీరమూ పంచభూతాలతోనే నిర్మితమై ప్రకృతిలోనే పుట్టుచున్నది, ప్రకృతిలోనే అభివృద్ధి చెందుచున్నది, ప్రకృతిలోనే తిరిగి కలిసిపోవుచున్నది. పంచభూతములను ఆధారముగా చేసుకొని సృష్టిలో నున్న జీవరాసులన్నీ జీవయాత్రను సాగించుచూ గమ్యాన్ని చేరుకుంటున్నాయి. పంచ భూతములనగా గాలి, నీరు, భూమి, ఆకాశము, సూర్యుడు మొదలైనవి. శరీరానికి కావలసిన ప్రాణశక్తిని అందించడానికి గాలి, దేహాన్ని చల్లబరిచి శుభ్రపరచడానికి నీరు, పోషక పదార్థాలు గల ఆహారాన్ని అందించడానికి భూమి, ఆహారము, గాలి, నీరు శరీరంలో ప్రయాణించడానికి గల ఖాళీని అందించేది ఆకాశము మరియు శరీరానికి కావలసిన తేజస్సును, చైతన్యమును, జీవశక్తిని అందించడానికి సూర్యుడు మొదలైనవి పంచభూతాలుగా మనలను, అన్ని జీవరాసులను పోషిస్తున్నాయి. ప్రతి జీవి ఆయుష్షు ఉన్నంత కాలం ఆరోగ్యంగా జీవించడానికి ఈ ఐదే మూలాధారం. ఐదు పంచభూతాలు శరీరానికి సక్రమంగా అందితే ఆరోగ్యంగా, అందకపోతే అనారోగ్యంగా శరీరం ఉంటుంది.
పంచభూతాలను జంతువులు రోజూ సక్రమంగా ఉపయోగించుకుంటూ ఆరోగ్యవంతంగా, సహజంగా జీవించగలుగుచున్నాయి. పరమాత్మ యొక్క సృష్టికి అనుకూలంగా జీవించే జీవరాసులన్నీ, మందులు, డాక్టర్లు, హాస్పిటల్స్ అవసరం లేకుండానే జీవించగలిగినప్పటికీ, సృష్టికి భిన్నంగా వికృతమైన జీవయాత్రను సాగిస్తున్న మనుషులకు డాక్టర్లు, మందులు తప్పనిసరి అవుచున్నవి. ఈ ఐదు భూతాలలో వచ్చే లోపాల కారణంగానే మన శరీరం రోగాలకు, వికృత రూపాలకు దారితీస్తున్నది. అనగా మంచి ప్రాణశక్తిని పీల్చుకోలేక పోయినా, ఎక్కువ నీటి ద్వారా శరీరాన్ని శుద్ధి చేయలేకపోయినా, భూమి నుండి వచ్చే మంచి ఆహారాన్ని సరిగా తినలేక పోయినా, శరీరంలో నాడీ రక్త ప్రవాహాలకు కావలసిన ఖాళీ లేకుండా మూసుకొని పోయినా (ఆకాశము - ఖాళీ) మరియు సూర్యుని నుండి విడుదలయ్యే రోగనిరోధకశక్తిని సంగ్రహించలేకపోయినా మనకు వాటి ఫలితంగా రకరకాల రోగాలు సంభవించడం జరుగుతుంది. ప్రస్తుతం మనకున్న రోగాలన్నీ ఈ ఐదు రకాల లోపాల కారణంగా సంక్రమించేవే. వీటిని తిరిగి సవరించగలిగిన వారికి రోగాలు పూర్తిగా నివారింపబడతాయి. రుచిగా ఉండడానికి సాంబారులో ఉప్పు, కారం, చింతపండు, తాళింపు గింజలు, సాంబారు పొడి, నూనె మొదలైనవి అన్నీ వేసి కాస్తూ ఉంటారు. కాసిన సాంబారులో ఏది లోపించినా రుచిలో భేదం వస్తుంది. ఆ భేదాన్ని పోగొట్టి రుచిని రప్పించడానికి లోపించిన రుచిని (ఉప్పు, కారం, పులుపు) తిరిగి కలపగలిగితేనే సాధ్యపడుతుంది. అంతేగానీ తగ్గింది కారం అయితే ఉప్పు ఇంకాస్త వేసినా ఆ లోటు తీరదు గదా! అలాగే మనకు పంచభూతాల లోపం కారణంగా రకరకాల రోగాలు వస్తుంటే మనము వాటిని తిరిగి సవరించకుండా, మరి ఏ ఇతర వైద్య విధానాలను ఆశ్రయించినప్పటికీ పూర్తి నివారణ జరుగదు. పాము ఒక చోట ఉంటే దెబ్బ వేరే చోట వేసి ప్రయోజనం ఏమి ఉంటుంది? ప్రస్తుతం మన సమాజంలో ఆరోగ్యం గురించి పడేపాట్లన్నీ ఈ విధంగానే సాగుచున్నవి. రోగాల సంఖ్య రోజు రోజుకీ పెరగడానికి ఇదే కారణం. అందువల్లనే ఇల్లు, వళ్ళు గుల్ల అవుతున్నది కానీ ఆరోగ్యం మాత్రం రావడం లేదు. మనం వాడే మందులకు, వైద్య విధానాలకు రోగం దెబ్బతినడం లేదుగానీ రోగాన్ని పట్టుకొని యున్న శరీరం మాత్రం దెబ్బతింటున్నది. ఈ రకంగా శరీరం దెబ్బ తినకుండా రోగానికే చికిత్స చేయగలిగితే మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఆయువు ఉన్నంతకాలం జీవించగలుగుతాము.
రాగి చెంబు చిల్లుపడితే రాగిముక్కనే వేసి అతికించుకొనే పనే మనందరము చేస్తున్నాము. అంతేగానీ ఇనుప ముక్కను రాగికి పెట్టి అతికించడం లేదు. మరి మన విషయంలో కూడా అలా ఎందుకు చేసుకోలేక పోతున్నామో ఆలోచించండి. సహజమైన, ప్రకృతి సిద్ధమైన శరీరానికి కృత్రిమమైన మందులను వేసి లోపాలను సవరించాలనుకొంటున్నాము. అది ఎలా సాధ్యపడుతుంది? పంచభూతాల శరీరానికి లోపాలు (రోగాలు) వస్తే పంచభూతాలతో చేసే చికిత్స మాత్రమే తగినవి. పాలల్లో నీళ్ళలాగా ఈ చికిత్సలు శరీరంలో కలిసిపోతాయి. ఈ విధమైన చికిత్సల వలన శరీరానికి ఏమీ తేడాలు (సైడ్ ఎఫెక్ట్స్) రాకుండా ఉండటానికి ఇదే కారణం. పంచభూతాల శరీరానికి మందుల ద్వారా చేసే కృత్రిమమైన చికిత్సలు సరిపడవు. బియ్యంలో రాళ్ళవలె ఈ చికిత్సలు, శరీరం వేరుగా ఉంటాయి. అందువల్లనే ఇక్కడ రకరకాల సైడ్ ఎఫెక్ట్స్, రియాక్షన్ లూ వస్తూ శరీరానికి హానికల్గుతూ ఉంటుంది. శరీరం తెలిపే ఈ విధమైన లక్షణాలను బట్టి అయినా మనం అర్థం చేసుకొని మారితే జీవితంలో సుఖపడవచ్చు.
మంచి గాలిని పీల్చుకొంటూ, ఆకలైనప్పుడు, పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు మంచి నీరును ఎక్కువగా తీసుకొంటూ, ఎండలో తిరుగుతూ, భూమి నుండి వచ్చిన ఆహారాన్ని యధావిధిగా తింటూ, రాత్రికి ప్రతిరోజూ ఉపవాసం చేస్తూ శరీరానికి ఆకాశతత్వాన్ని (అవకాశము - ఖాళీ) పెంపొందించుకొంటూ జంతువులు జీవించుచున్నాయి. పగలు తినే జంతువులు 12 గంటలు తింటూ రాత్రికి 12 గంటలు పూర్తి విశ్రాంతినిస్తే, రాత్రికి తినే జంతువులు పగలు 12 గంటలు పూర్తి విశ్రాంతి నిచ్చి శరీరానికి ఉపవాస ధర్మాన్ని ప్రతిరోజు అవలంభిస్తున్నాయి. అవి ప్రతి రోజూ ఆకాశతత్వం అయిన ఉపవాసాన్ని కొనసాగించడం వలన 12 గంటలు ఆహారం ద్వారా మరియు మిగతా భూతాల ద్వారా స్వీకరించినది అంతా మరుసటి రోజు ఉదయానికల్లా ఖాళీ అయ్యి మళ్ళీ తిరిగి ఆహారం తినడానికి శరీరం సిద్ధం అవుచున్నది. ఈ విధమైన దినచర్య వాటికి రోజూ జరుగుచున్నది. మన విషయం ఆలోచిస్తే శరీరాన్ని పోషించడానికి మనం స్వీకరించే పంచభూతాలు రాత్రికి సరైన విశ్రాంతి ఇవ్వనందువల్ల ఉదయానికల్లా అవి (గాలి, నీరు, ఆహారము) పూర్తిగా శరీరము నుండి ఖాళీ అవ్వడం లేదు. శరీరానికి కావలసిన నీరును పూర్తిగా స్వీకరించక, సరైన ప్రాణ వాయువును ఎక్కువగా పీల్చుకోక తీసుకొనే ఆహారం కూడా సహజసిద్ధంగా లేకుండా జేసి తినడం వలన అవి మరుసటి రోజు ఉదయానికల్లా విసర్జింపబడడం లేదు. నిన్న తిన్న ఆహారం ద్వారా వచ్చిన వ్యర్థపదార్థాలు పూర్తిగా శరీరం నుండి ఖాళీ కాకుండానే మళ్ళీ తరువాత రోజు తినడానికి సిద్ధం అవుతున్నాము. ఇక్కడ శరీరంలో ఆకాశతత్వం లోపిస్తూ వస్తున్నది. అంటే శరీరంలో ఉన్న ఖాళీ రోజు రోజుకీ తగ్గుపోతూ ఉంటుంది. ఉన్న ఖాళీలో నిలువ ఉన్న వ్యర్థపదార్థాలు శరీరంలో మిగిలిపోయి, రోగ పదార్థాలుగా స్థానం ఏర్పరచుకొని శరీరంలో స్థిరపడుతూ ఉంటాయి. ఇలా కొన్ని రోజులు గడిచేసరికి శరీరంలో రోగపదార్థం ఎక్కువ అయ్యి రోగ లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. రోగపదార్థం పెరిగిన దగ్గర నుండి మనము పంచభూతాలను సరిగా స్వీకరించలేక పోతుంటాము. సరిగా ఆకలి వేయక ఆహారం తినడం తగ్గుతుంది. సరిగా నీరు త్రాగబుద్ధిగాదు, ఎక్కువ సార్లు గాలి పీల్చుకోవలసి వస్తూ ఉంటుంది. ఎండలోనికి వెళితే శరీరం మండుతుండటం మొదలగునవి వస్తూ ఉంటాయి. మనలో ఉన్న ఆకాశతత్వాన్ని మంచి పదార్థం బదులు చెడు పదార్థాలు ఆక్రమించి వేయడం వలన రోగాలు వస్తూ వుంటాయి. వాటిని పూర్తిగా నివారించి ఆకాశతత్వాన్ని పెంచగలిగితే మనకు ఆరోగ్యం తిరిగి కలుగుతుంది. ఆకాశతత్వం గురించి కొద్దిగా తెలుసుకుందాం.
సృష్టి అంతా ఉన్నది ఆకాశంలోనే. అన్నింటికి అవకాశమిచ్చునది ఆకాశము(ఆకాశమనగా అవకాశము). అన్నీ భూతములున్నది ఆకాశములోనే. అలాగే మన శరీరంలో కూడా ఆకాశమనే ఖాళీ లేకపోతే మిగతా నాలుగు భూతాలు ప్రవేశించడానికి వీలుండదు. అందువలన అన్నింటి కంటే ముఖ్యమైనది ఆకాశతత్వం. గాలి లేకుండా మనం క్షణం ఉండలేక పోవచ్చు, కానీ ఆ గాలిని మన ఊపిరితిత్తులలోనికి పీల్చుకోవాలంటే ఊపిరితిత్తులలో ఆకాశమనే అవకాశం లేదా ఖాళీ ఉండబట్టే గదా మనం ప్రాణశక్తిని పీల్చుకోగలుగుచున్నాము. అదే శ్వాస కోశాలు కఫంతో నిండిపోయి ఉంటే గాలి పట్టే ఖాళీ లేక మనం ఇబ్బంది పడుతూ ఉంటాము. బయట ఎంత ప్రాణశక్తి ఉన్నప్పటికీ మనలో గాలి పట్టే అవకాశం లేకపోతే ఏమి ప్రయోజనం ఉంటుంది? అలాగే పొట్ట ఖాళీగా ఉంటేనే గదా మనం ఏదైనా ఆహారం తినడానికి వీలుండేది. ఎంత మంచి వాసనలు వచ్చినప్పటికీ పొట్ట ఖాళీగా లేకపోతే మనిషికి అసలు తినాలని కోరికే కలగదు. ఈ విధంగానే మిగతా రెండు భూతాలు కూడా శరీరంలోనికి సరిగా చేరలేవు. అన్ని భూతాలకు ఆధారమైనది, ప్రధానమైనదీ ఆకాశమేనని అర్థమవుచున్నది. అన్ని భూతాలలో వచ్చే లోపాల కారణంగానే మనకు రోగాలు వస్తున్నాయని అనుకున్నాము. ఆకాశమనే భూతాన్ని సవరించకుండా మిగతా నాలుగు భూతాలను సవరించినప్పటికీ ప్రయోజనం ఉండదు. శరీరాన్ని రక్షించాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ముందు ఆకాశతత్వాన్ని పెంపొందించుకోవాలి. ఏ మందులూ, ఏ వైద్య విధానాలూ ఆకాశతత్వాన్ని పెంపొందించడానికి సహకరించలేవు. మందుల వల్ల రోగలక్షణాలు తగ్గినప్పటికీ మనకు శరీరంలో తేలిగ్గా, ఆనందంగా ఉన్నట్టు అనిపించకపోవడానికి ఆకాశతత్వం వృద్ధి చెందక పోవడమే కారణం. ఆకాశతత్వం పెంపొందనిదే ఆరోగ్యానికి, ఆనందానికి అవకాశం రాదు.
ఆకాశతత్వాన్ని వృద్ధి చేయడం అనేది ఆరోగ్యానికి తొలిమెట్టు. శరీరంలో ఉన్న సహజమైన ఆకాశాన్ని లేదా ఖాళీని ఆక్రమించి వేసిన చెడు పదార్థాలను తొలగించడమే ఉపవాసం. ఉపవాసంలో ఆహారం లేని కారణంగా శరీరంలోనికి క్రొత్తగా చేరే పదార్థాలు ఏమీ ఉండవు. నిలువ ఉన్న చెడు రోజూ ఉపవాసంలో కదిలి వెళ్ళిపోతుంది. ఎంత చెడు పోయి ఖాళీ ఏర్పడుతుందో అంత మంచి మరలా తిరిగి చేరడానికి అవకాశముంటుంది. ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా చేరడం లేదా భగవంతుని సమీపించడం అని అర్థం. ఉపవాసం వలన శరీరంలో ఖాళీ ఏర్పడుతున్నది. కావున శరీరం, మనస్సు విశాలమై ఆనందాన్ని, దైవత్వాన్ని పొందే అవకాశం కలుగుచున్నది. ఋషులు, మునీశ్వరులు తక్కువ ఆహారాన్ని తీసుకొంటూ, శరీరంలో ఆకాశతత్వాన్ని పెంచుకొంటూ ఆత్మ జ్ఞానాన్ని పొందేవారు. శరీరం ఖాళీగా, విశ్రాంతిగా ఉన్నప్పుడే హాయిగా, ఆనందంగా ఉంటాము. ఉదాహరణకు ఉదయం పూట వ్యాయామం చేసిన తరువాత ఊపిరితిత్తులలో శ్లేష్మం, రొంపలు ఆవిరి అయ్యి ఊపిరితిత్తులు ఖాళీగా ఉంటాయి. తద్వారా మనకు వ్యాయామం చేసిన రోజున తేలిగ్గా, సుఖంగా ఉంటుంది. ఊపిరితిత్తులలో ఆకాశతత్వం పెరగడం వలనే ఈ ఆనందం. అదే కఫం పేరుకొనిపోయి ఉంటే బాధ, ఆయాసం తప్పడం లేదు. అలాగే సాఫీగా విరేచనం అయిన రోజున చాలా తేలిగ్గా, గాలిలో తేలినట్లు సుఖంగా ఉండటానికి కూడా ప్రేగుల్లో ఆకాశతత్వం ఏర్పడుటయే కారణం. అలాగే ఆహారం తినేటప్పుడు కొద్దిగా ఆనందంగానే ఉంటుంది. అదే పొట్టనిండిన తరువాత ఆనందం దూరం అయ్యి ఆయాసంగా, చిరాకుగా, బరువుగా ఉన్నట్లు ఉంటుంది. అదే ఉదయం పూట పొట్ట ఖాళీగా ఉంటే శక్తిగా, హాయిగా ఉంటున్నాము. ఎప్పుడు శరీరంలో ఆకాశతత్వం పెంపొందితే అప్పుడు మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటం గమనిస్తున్నాము. అదే ఉపవాసంలో అయితే శరీరం 24 గంటలూ ఆకాశతత్వం వృద్ధి చెందుతూ ఉంటుంది.
పంచభూతములలో శూన్యమైనది, విశాలమైనది ఆకాశమైయున్నది. మన అంతర్గత అవయవాలలో ఆకాశము అధికముగా ఉన్నప్పుడే అంతర్గత ప్రవాహములు స్వేచ్ఛగా జరుగును. అట్టి అంతర అవయవాలలో దోషములు చేరినప్పుడు అవకాశము (ఆకాశము) తగ్గును. అవకాశము లేనప్పుడు అంతర అవయవాలకు అవరోధము కల్గును. అట్టి అవరోధములే వివిధ రకములైన రోగములకు మూల కారణమగుచున్నవి. రక్త నాళములలో అవకాశము లోపించినప్పుడు, రక్త ప్రవాహములకు అవరోధములేర్పడి శరీరం తిమ్మిరెక్కుట, స్పర్శ కోల్పోవుట మొదలైనవి సంభవించుచూ ఉండును. అలాగే దేహం లావుగా అయినందువల్ల లేదా కొవ్వు పెరిగినందువల్ల అంతర అవయవముల ప్రవాహములకు అవరోధములు ఏర్పడును. అట్టి అవరోధములన్నింటినీ తొలగించి, అంతర అవయవములకు ఖాళీలను కల్పించి, ప్రవాహములను పెంచి ఉత్సాహమును, చైతన్యమును అందించునది ఉపవాస మొక్కటే. రోగములు వచ్చిన వారందరికీ రక్త, నాడీ, వాయు ప్రవాహములలో ఆటంకములు ఏర్పడును. కావున వాటిని పూర్తిగా నివారింపగలిగేది ఉపవాసమొక్కటేనని మరువకండి. రోగము లేని వారికి రోగము రాకుండా ఉన్న కొద్ది అవరోధములన్నింటినీ తొలగించి ఉపవాసము ఆరోగ్యాన్ని అందించును. తపము లేదు ఉపవాస వ్రతము కంటె అని భీష్మాచార్యులు అన్నట్లు ఉపవాసము చేయుటంటే తపస్సు చేసినట్లు, అంటే అంత పవిత్రమైనది ఉపవాసం. ప్రకృతి సిద్ధమైన మన దేహానికి, పంచభూతాల ప్రకృతి చికిత్సలే ఆధారమని మరువకండి. వికృతమైన చికిత్సలు సహజమైన దేహానికి సరిపడవని గ్రహించండి. పంచభూతాలను గౌరవించడం ప్రకృతి మాతను గౌరవించడం, ఆరాధించడం లాంటిది. ఉపవాసాలను తిరస్కరిస్తే ప్రకృతి మాతను తిరస్కరించినట్లే. మన జీవనానికి ప్రకృతే ఆధారం. ప్రకృతి నుండి ఉద్భవించిన ఉపవాస ధర్మం కూడా మన సహజ జీవనానికి ఆధారం అన్న విషయం భోదపడిన వారికి బాధలుండవు.

5. ఉపవాసంలో రోగాలు ఎందుకు తగ్గుతాయి?

రోగాలు వచ్చి మనిషిని పట్టుకోవడం లేదు, మనిషే కోరి రోగాలను తెచ్చుకొంటున్నాడు కాబట్టి మనిషి వదిలివేస్తే రోగాలు పోతాయి అని ప్రకృతి వైద్య పితామహులు కీ॥శే శ్రీ వైద్యరాజు వేగిరాజు కృష్ణంరాజు గారు (భీమవరం) అన్న మాటలు. తీసుకొనే ఆహారం, శరీరాన్ని నడిపే మనస్సు రెండూ మంచిగా ఉంటే నూటికి 75 శాతం రోగాలు రావు. సరైన వ్యాయామం కూడా దీనికి తోడైతే మంచి ఆరోగ్యంతో మనిషి వెలగవచ్చు. మనం తీసుకొనే ఆహారం స్వచ్ఛమైనదీ, సహజమైనదీ అయితే శరీరంలో జీర్ణం అయిన తరువాత తక్కువ వ్యర్థపదార్థాలను మిగుల్చుతుంది. తద్వారా శరీరం విసర్జన క్రియ చేసుకొనే విధంగా అనుకూలంగా ఉంటుంది. మనం తినే ఆహారం కేవలం రుచిని మాత్రమే అందించే విధంగా ఉంటే ఆహారం జీర్ణక్రియలోనూ ఇబ్బంది పెట్టడమే కాకుండా, శరీరంలో ఎక్కువ వ్యర్థపదార్థాలను జీర్ణక్రియ అనంతరం మిగుల్చుతుంది. సరిగా జీర్ణం కాని ఆహారం ద్వారా మనలో మంచి కణాలు తయారు కాలేవు. మనం తీసుకున్న ఆహారం, గాలి, నీరు ద్వారా వచ్చిన విష పదార్థాలు, వ్యర్థపదార్థాలు శరీరం నుండి బయటకు పోవడానికి నాలుగు విసర్జకావయవాలు ఉన్నాయి. మనం తీసుకొన్న ఆహారం కణాలు వినియోగించుకొన్న తరువాత కొన్ని టాక్సిక్ ఆమ్లాలు (విషపదార్థాలు) కూడా ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఇవన్నీ శరీరం నుండి విసర్జింపబడితే ఏ ఇబ్బందీ లేదు. మనలో విసర్జకావయవాలు సరిగా పనిచేయలేనప్పుడు శరీరంలో ఉత్పన్నమయ్యేవి ఎక్కువగా ఉంటే బయటకు విసర్జింపబడేవి తక్కువగా ఉంటాయి. ఒకటి లేదా రెండు విసర్జకావయవాలు సరిగా పనిచేయడం తగ్గిస్తే విషపదార్థాలు మరీ ఎక్కువగా రోజు రోజూ పుడుతుంటాయి. ఆవిధంగా శరీరంలో నిలువ ఉండి పోయే విషపదార్థాలు టిష్యూలలో(కణాలు) ఎక్కువగా నిలువ ఉండి కణాలు త్వరగా చనిపోవడమో లేదా జబ్బున పడటమో జరుగుతుంది. ఆ విధంగా జబ్బునపడిన కణాలు సరిగా పనిచేయలేవు, శక్తిని ఉత్పత్తి చేయలేవు. ఈ విధంగా రోగాలకు పునాది పడుతూ ఉంటున్నది. దీనంతటికి కారణం విసర్జన క్రియ సరిగా పనిచేయకపోవడమే. మన నాలుగు విసర్జకావయవాలు సరిగా వాటి పని అవి ఎందుకు చేయలేకపోతున్నాయో, వాటి ద్వారా శరీరంలో రోగాలు ఏ విధంగా పుడుతున్నాయో తెలుసుకుందాము.
మనలో రోగాలు పుట్టడానికి శరీరం నుండి చెడును విసర్జించే విసర్జకావయవాలు సరిగా పనిచేయక పోవడమే ప్రధాన కారణమని చెప్పవచ్చు. నాలుగు విసర్జకావయవాలు అనగా పెద్దప్రేగులు, కిడ్నీలు, చర్మం, ఊపిరితిత్తులు ముఖ్యమైనవి. వీటి గురించి విపులంగా తెలుసుకుందాము.
1. పెద్దప్రేగులు: చిన్న ప్రేగులు ఐదు మీటర్ల పొడుగు పూర్తి అయిన దగ్గర నుండి పెద్దప్రేగు ప్రారంభం అవుతుంది. పెద్దప్రేగు మీటరున్నర పొడవు ఉంటుంది. మనం తిన్న ఆహారం పొట్ట, చిన్నప్రేగులలో పూర్తిగా జీర్ణం అయిన తరువాత రసంగా మారుతుంది. ఆ రసం అక్కడ నుండి ప్రేగుల గోడల ద్వారా వెళ్ళి రక్తంలో కలిసిపోతుంది. జీర్ణం కాగా మిగిలిన పదార్థాలు, పీచు పదార్థాలు, చిన్న ప్రేగులలో ఉన్న కొన్ని వ్యర్థ పదార్థాలు అన్నీ కలిసి పెద్ద ప్రేగులోనికి చేరతాయి. పెద్దప్రేగులో ఆ పదార్థాలు ఇంకో మారు పదిశాతం జీర్ణక్రియకు గురి అవుతాయి. అది పూర్తి అయిన దగ్గర నుండి ఆ పదార్థాలన్నీ మలం రూపంలో బయటకు విసర్జింపబడుతూ ఉంటాయి. ఎప్పుడు తయారైన మలం అప్పుడు విసర్జింపబడితే ప్రేగులో హానికరమైన బాక్టీరియాలు గానీ, విష పదార్థాలు గానీ తయారయ్యే అవకాశం ఉండదు. ఉదయం తిన్న ఆహారం ద్వారా తయారైన మలం రాత్రికి, రాత్రికి తిన్న ఆహారం ద్వారా తయారైన మలం మరుసటి రోజు ఉదయానికి విసర్జింపబడితే ఈ విసర్జకావయవం శుభ్రంగా ఉన్నట్టే. అదే మనం మూడు పూటలా తింటే విరేచనం కూడా మూడు సార్లు వెళ్ళవలసిందే. అప్పుడే శరీరం అంతా తేలిగ్గా ఆరోగ్యంగా ఉంటుంది. ఎన్ని సార్లు ఆహారం తింటే అన్నిసార్లు విరేచనం వెళ్ళితే జంతువుల వలే మనమూ ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ విధంగా నూటికి 99 మందికి అవ్వదనే చెప్పవచ్చు. సాధారణంగా అందరికీ ఈ రోజు తిన్న ఆహారం ద్వారా వచ్చే మలం రెండు మూడు రోజుల తరువాత గానీ విసర్జింపబడటం లేదంటే మీకు ఆశ్చర్యం కలుగవచ్చు. అందువల్లనే మన రోగాలకు మలం ప్రేగే పునాదిగా అవుతున్నదని చెప్పవచ్చు.
సర్వరోగములూ మలం నుండే పుడుతున్నవని ఆయుర్వేద శాస్త్రం కూడా చెప్పుచున్నది. ముందు మన ఇబ్బందులు ప్రారంభం అయ్యేది పెద్ద ప్రేగులోనే కానీ వేరే విసర్జకావయవాల నుండి కాదు. పెద్ద ప్రేగులలో జరిగే ఇబ్బందిని ప్రేగులు సరిగా సంకేతాల ద్వారా అందివ్వలేక పోతాయి. దీనికి కారణం ప్రేగులకు (మలం ప్రేగుకు) సంకేతాలను అందించే నరాలు మిగతా భాగాల వలే కాకుండా తక్కువగా ఉంటాయి. అందువల్ల ప్రేగులలో రోజూ ఎన్ని రకాల క్రిములు అక్కడి నుండి తయారయ్యి శరీరానికి హాని కలిగిస్తున్నప్పటికీ మనకు తెలియజేయలేని స్థితిలో మలం ప్రేగు ఉంటుంది. బాగా ఎక్కువ ఇబ్బంది వస్తేనే కడుపు నొప్పిగా మనకు తెలియజేస్తుంది. అక్కడ జరిగే నష్టాన్ని మనం పూర్తిగా తెలుసుకోలేక పోతున్నాము. పెద్ద ప్రేగు ద్వారా ఎక్కువ మోసం ఆ విధంగానే జరుగుచున్నది. శరీర ఆరోగ్యం ఆధారపడేది సుఖంగా విరేచనం అయ్యేదాన్నిబట్టే. శరీరంలో ఏ కణాన్ని తీసుకొన్నా అంటే కిడ్నీ, పొట్ట, మెదడు మొదలగు అవయవాల యొక్క కణాల శుభ్రం, ఆరోగ్యం మలం ప్రేగు యొక్క శుభ్రతపైనే ఆధారపడి ఉంటుంది. రాత్రి భోజనం తరువాత మిగిలిన అన్నం, కూరలను మంచి గిన్నెలో పెట్టి మూత వేసినప్పటికీ తరువాత రోజు ఉదయానికి చెడువాసన రావడం మనం చూస్తుంటాము. ఇంకో 5, 6 గంటలు అలా ఉంచితే అందులోనుండే తీగలుగా రావడం, పురుగులు పట్టడం జరుగుచున్నది. మంచి ఆహారపదార్థాలు 15 గంటలు ఆ విధంగా నిలువ ఉంచితేనే అన్ని క్రిములు అందులో నుండి పుడుతుంటే, ఇక పనికి రాని మలం, గాలి ఆడని మలం నుండి ఇంకా ఎన్ని క్రిములు, సూక్ష్మజీవులు అవసరమవుతాయో ఆలోచించండి. అందువల్లనే మన మలం అంత దుర్వాసన వస్తూ ఉంటుంది. ప్రేగులకు పీల్చుకొనే గుణం ఉన్నందువల్ల ప్రేగులలో పుట్టే చెడును పీల్చుకొంటాయి. ఆ విధంగా రోజూ శరీరానికి క్రిములను ఇక్కడి నుండి తయారు చేసుకొంటూ ఆరోగ్యాన్ని పొందాలంటే అది సాధ్యపడేది కాదు.
ప్రస్తుత నాగరిక ప్రపంచంలో నూటికి 99 మందికి మలబద్ధకం రావడానికి గల కారణాలేమిటో తెలుసుకుందాం. విరేచనం సాఫీగా అవ్వాలంటే అన్నిటికంటే ముఖ్యమైనది పీచు పదార్థం ఎక్కువ ఉన్న ఆహారాలను ఎక్కువగా తినడం, అలాగే నీరు ఎక్కువగా త్రాగడం, విరేచనం సాఫీగా అవ్వాలని మనస్సు పెట్టడం, శారీరక శ్రమ మొదలైనవి అన్నీ సాఫీగా విరేచనం అవ్వడానికి సహకరిస్తాయి. మన అలవాట్లు ఎలా ఉన్నాయంటే ముత్యాల వంటి తెల్లని పీచు పదార్థం లేని బియ్యం ముఖ్యమైన ఆహారంగా తీసుకొంటున్నాము. అందులోకి తొక్కలు నున్నగా తీసివేసి, వేయించిన కూరలు లేదా ఎక్కువ నూనెతో వండిన కూరలు కొద్దిగా తింటాము. మనం రోజూ వాడే పచ్చళ్ళు, పులుసులు, సాంబారులు కొద్దిగా కూడా విరేచనానికి సహకరించవు. మాంసాహారంలో అసలు పీచు పదార్థం లేని కారణంగా మలబద్ధకానికి దారితీస్తుంది. ఎక్కువగా మాంసాహారాన్ని వాడడం, కేక్ లు, బ్రెడ్ విరివిగా తినడం, కూల్ డ్రింక్ లు ఎక్కువగా వాడడం, పీచు పదార్థం లేని టిఫిన్లు రోజూ తినడం మొదలైనవన్నీ విరేచనం నిలువ ఉండేటట్లు చేస్తాయి. విరేచనం ప్రేగులలో సాఫీగా జరిగి వెళ్ళడానికి అవసరమైన నీటిని ఏ ఒక్కరూ త్రాగకపోవడం వలన, పళ్ళు, పళ్ళ రసాలను పిప్పి తీసివేసి త్రాగడం వలన మనం కోరి రోగాలను పట్టుకోవడం అవుతున్నది. పైగా చెమట పట్టే పని అసలు లేక, ఎక్కువ తింటే ఎక్కడ లావు అవుతామనే భయంతో తినేది కూడా కొద్దిగా తినడంతో ప్రేగులలో మలం చాలా కొద్దిగానే తయారయ్యి, ముందుకు జరిగే స్థితిని కోల్పోతుంది. ఒత్తిడి ఎక్కువ ఉంటే త్వరగా ముందుకు జరిగే అవకాశముంటుందిగానీ, కొద్ది మలం జరగాలంటే ప్రేగులలో ఎక్కువ సమయం పడుతుంది. ఈ లోపు మలం గట్టిగా అయ్యిపోతుంది. ఆ గట్టి మలం ప్రేగులలోనే ఎక్కువ రోజులు నిలువ ఉండి రోజూ క్రిములను తయారు చేస్తూ ఉంటుంది. దేశంలో రోజూ రోజుకీ రోగాలు పెరగడానికి మలబద్ధకమే ముఖ్యమైన కారణం. అన్నింటికీ ఇదే పునాదిగా అవుతున్నది.
పూర్వం రోజులలో అన్ని రకాల వైద్యవిధానాల డాక్టర్లూ విరేచనం సాఫీగా అవుతున్నదా అని ప్రతి రోగినీ అడిగేవారు. ముందు అక్కడ నుండి శరీరానికి రోగాలు పుట్టకుండా ఆపి తరువాత వైద్యం చేసేవారు. మనం ఈ రోజులలో విరేచనానికి ప్రాధాన్యతను ఇచ్చే వైద్యుడుగానీ, అవ్వడం లేదని ఆలోచించి పట్టించుకొనే రోగి గానీ లేరు అనే చెప్పవచ్చు. కడుపులో నెప్పికి డాక్టరు వద్దకు వెళితే, నెప్పికి మాత్రమే మందు ఇచ్చి కడుపును వదిలివేస్తున్నారు. నెప్పికి కారణమైన మలాన్ని గురించి ఎవరూ ఆలోచించడం లేదు. దానికి ఎవరూ చికిత్స చేయడం లేదు. శరీరంలో శత్రువులను ఎదుర్కొనే రోగ నిరోధక వ్యవస్థ మూలపడిపోవడానికి, వచ్చిన చిన్న చిన్న రోగాలే దీర్ఘరోగాలుగా మారడానికి కారణమైన మలాన్ని కప్పి పూడ్చి పైకి పూతలు, మందులు వేసుకొంటూ ఇంకా ఎన్నాళ్ళు ఈ శరీరాన్ని మోసం చేసుకొంటాము. రోగాల బారి నుండి బయటపడి శరీరాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా తీర్చిదిద్దుకోవాలంటే ముందు మలాన్ని కడిగే ప్రయత్నం చేయడం మన ప్రథమ కర్తవ్యం. ఏ వైద్య విధానం అయితే మలం ప్రేగును పూర్తిగా శుభ్రం చేస్తూ వైద్యాన్ని ప్రారంభిస్తుందో ఆ విధానం వలన శరీరానికి, మనస్సుకు పూర్తి న్యాయం జరుగుతుంది. దీని గురించి ఆలోచించకుండా చేసే చికిత్సలన్నీ మనల్నీ, శరీరాన్ని మోసం చేయడమే అవుతుంది.
అదే ఉపవాస విధానంలో అయితే ఆహారాన్ని తీసుకోని కారణంగా కొత్తగా మలం తయారయ్యే అవకాశం అసలు లేదు. అంటే శరీరంలోనికి కొత్తగా చెడు తయారవ్వకుండా ఆపి, నిలువ ఉన్న మలాన్ని మొదటి రోజు నుండి ఎనిమా ద్వారా ప్రతి రోజూ ఒకటి రెండు సార్లుగా కడిగి వేస్తూ ఉంటారు. ఉపవాసం ప్రారంభమయిన రోజు నుండి శరీరంలోనికి మలం ద్వారా క్రొత్త క్రిములు, బాక్టీరియాలు తయారవడం ఆగుతుంది. నిలువ ఉన్న మలం రోజు రోజుకీ తేలిగ్గా ఎనిమా ద్వారా బయటకు పోతుండేసరికి శరీరానికి కొత్తగా ప్రాణం పోసినట్లు, గాలిలో తేలిపోయినట్లు ఉంటుంది. రోగాలకు ప్రధాన కారణమైన మలాన్ని నివారించగలుగుచున్నాము కాబట్టి ఈ ఉపవాస విధానంలో రోగాలు నిదానిస్తాయి (తగ్గుతుంటాయి). శరీరాన్ని విషపదార్థాల బారి నుండి రక్షించడం వలన రోజు రోజుకీ రోగ నిరోధక వ్యవస్థ తిరిగి శక్తి పుంజుకొంటూ రోగాలను తగ్గిస్తూ ఉంటుంది. దీనంతటికీ కారణం రోగాలకు పునాది అయిన మలాన్ని కడిగి వేసే ప్రయత్నం ఉపవాస విధానంలో జరగడం. అందువల్లనే ఉపవాసంలో రోగాలు మందులు లేకుండా తేలిగ్గా తగ్గే అవకాశం కలుగుతున్నది. అన్నింటి కంటే ముఖ్యమైన మలం ప్రేగు అనే విసర్జకావయవాన్ని పూర్తిగా శుభ్రం చేయడమనేది ఆరోగ్యానికి తొలిమెట్టు. రోగాలు తగ్గడానికి కూడా ఇదే మూలాధారం.
2. కిడ్నీలు (మూత్రపిండాలు): మనకు రెండు కిడ్నీలు ఉంటాయి. ఇవి రెండూ మనకు రోజూ రక్తాన్ని వడపోస్తూ, శరీరానికి అక్కర లేని పదార్థాలను మూత్రం ద్వారా విసర్జిస్తూ ఉంటాయి. రెండు కిడ్నీలు కలిపి రోజుకు సుమారు 180 లీటర్ల నీటిని వడకడుతూ ఉంటాయి. అందులో మనకు మూత్రం ద్వారా ఒక లీటరు నుండి రెండు లీటర్ల వరకూ బయటకు పోతూ ఉంటే, మిగతా నీరు తిరిగి శరీరం వెనక్కు తీసుకొంటూ శరీరంలో నీటి నిష్పత్తిని కాపాడుకొంటూ ఉంటుంది. మనం తిన్న ఆహారం జీర్ణమయిన తరువాత శరీరంలో మిగిలే వ్యర్థ పదార్థాలు అయిన ఉప్పు, యూరియా, యూరిక్ యాసిడ్ మొదలగునవి అన్నీ మూత్రం ద్వారా బయటకు పోతూ ఉంటాయి.
మూత్రంలో బయటకు పోయే పదార్థాలు
నీరు - 96%
యూరియా - 2%
ఈ క్రిందవి అన్నీ - 2%
యూరిక్ యాసిడ్
క్రియాటినిన్
సోడియం
పొటాషియం
అమ్మోనియం
క్లోరైడ్స్
ఫాస్ఫేట్స్
సల్ఫేట్స్
ఆక్సలేట్స్
ఈ రకమైన వ్యర్థపదార్థాలు శరీరం నుండి సరిగా విసర్జింపబడకపోతే రక్తంలో ఆమ్ల క్షార నిష్పత్తులలో బేధాలు వస్తాయి. ముఖ్యంగా మూత్రంలో విసర్జింపబడేది ఉప్పు. ఉప్పును మనం చాలా ఎక్కువగా వాడడం వలన దాన్నంతటినీ మన కిడ్నీలు ఎక్కువగా వడపోసి విసర్జిస్తూ ఉండవలసిందే. ఉప్పు సరిగా విసర్జింపబడనప్పుడు అది లోపలే కణాల బయట ఉండే ద్రవంలో ఎక్కువగా నిలువ ఉండి, కణం బయట పొరను దెబ్బతీస్తూ ఉంటుంది. తరువాత నిదానంగా కణం లోపలకు చేరి కణం లోపల భాగాన్ని కూడా విషపూరితం చేసి కణ ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. నీరు తక్కువగా త్రాగడం వలన మనకు మూత్రం తక్కువగా వస్తుంది. తక్కువ మూత్రంలో ఎక్కువ వ్యర్థపదార్థాలు బయటకు పోవు. ఉప్పును తింటూ రోజూ మంచి నీరును 5, 6 గ్లాసులు త్రాగినప్పటికీ ఆ నీరు మనం తిన్న ఉప్పును జీర్ణం చేసుకోవడానికే సరిపోతుంది గానీ, మనలో ఉన్న వ్వర్థ పదార్థాలను జీర్ణం చేసుకోవడానికి చాలదు. అందువల్లనే మన మూత్రం మరీ పచ్చగా, ఎక్కువ వాసనతో బయటకు రావడం జరుగుతుంది.
మనం త్రాగిన మంచినీరు రక్తంలో కలిసి కణాలకు చేరుతూ ఉంటుంది. తిరుగు ప్రయాణంలో కణాలలోని వ్వర్థపదార్థాలను, విష పదార్థాలను స్వీకరించి మూత్రంగా బయటకు పోతుంది. శరీరంలో జరిగే ప్రతి రసాయనిక చర్యకు నీరు అవసరం. అలాగే శరీరంలోని విసర్జక పదార్థాలన్నింటిని మనం పూర్తిగా విసర్జించాలంటే ఎక్కువ నీరును త్రాగుతూ ఎక్కువసార్లు మూత్రం పోయడమే మార్గం. నీరు సరిగ్గా త్రాగక మూత్రం సరిగా పోయలేని వారికి రక్తం అంతా విష పదార్థాలతో నిండి, శరీరంలోనే నీరు మిగిలిపోతూ ఉంటుంది. అందువల్లనే కిడ్నీలు తేడాలు వచ్చినప్పుడు రక్తశుద్ధి సరిగా జరగక ఎక్కువమంది చనిపోతూ ఉంటారు. రక్తం ప్రతిరోజూ శుద్ధికావాలంటే రోజుకి 5, 6 లీటర్ల మంచి నీరును పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు త్రాగితేనే మూత్రం సాఫీగా అయ్యి, శరీరం శుద్ధిగా ఉంటుంది. నీరు సరిగా త్రాగని వారికి వ్యర్థపదార్థాలు, విషపదార్ధాలన్నీ రక్తంలోనే కలిసి తిరుగుతుంటాయి గానీ మూత్రం ద్వారా బయటకు పోవు. ఆహారాన్ని తినడమే ముఖ్యమనుకుంటారు గానీ ఆహారం కంటే నీరు ముఖ్యమనుకొని ఎవరూ త్రాగరు. పొట్ట ఖాళీగా ఉంటే ఎప్పుడు తిందామని ఆలోచనే గాని నీరు త్రాగుదామని ఎవరికీ బోధపడటం లేదు. నీరు ఎక్కువ త్రాగితే ఎక్కువ సార్లు దొడ్లోకి మూత్రానికి తిరగవలసి వస్తుందని త్రాగడం మానివేసి రోగాలను ఆహ్వానిస్తున్న వారు నూటికి 75 శాతం మంది ఉంటున్నారు. దాహం అయినప్పుడల్లా కూల్ డ్రింక్ లో, కొబ్బరినీళ్ళో, సోడాలో త్రాగి సరిపెడుతూ నీరును తగ్గించి వేస్తున్నారు. త్రాగే కొద్ది నీళ్ళు కూడా తినేటప్పుడు త్రాగడం వలన అవి జీర్ణానికే సరిపోతాయి కానీ, మూత్రం ద్వారా శరీరంలో నిలువ ఉన్న చెడును శుద్ధిచేయడానికి చాలవు. నీరు ఎక్కువ త్రాగితే శరీరం నీరు పట్టేస్తుందేమోనని కొందరు తగ్గిస్తే, ఎక్కువ సార్లు మూత్రం వెళితే ఒంట్లో ఉన్న సారం అంతా పోయి నీరసం వస్తుందేమోనని తగ్గించి మరికొందరు త్రాగుతుంటారు. ఎక్కువ నీరు త్రాగితే కిడ్నీలకు పని ఎక్కువ అవుతుందేమోనని ఆలోచించి నీరును తగ్గించే మహాశయులు కూడా ఉన్నారు.
కష్టపడి పనిచేసే వారికి దాహం అవుతూ ఉంటుంది. దాహం అయిన వారు నీరు త్రాగుతూ ఉంటారు. నీరు ఎక్కువగా త్రాగిన వారికి మూత్రం ద్వారా శరీరం శుభ్రపడుతూ ఉంటుంది. ఏ.సి.లు, కూలర్లు, ఫ్యాన్లు వాడటం వలన, చలికాలం వలన నీరు సరిగా త్రాగక ఎక్కువ వ్యర్థపదార్థాలు శరీరంలోనే ఉండిపోతాయి. మంచినీరు ఎంత పోస్తే మనలో ఉన్న చెడ్డ నీరు అంత బయటకు పోతూ ఉంటుంది. కిడ్నీలలో రాళ్ళు వచ్చినవి అంటే అప్పుడు నీరు త్రాగమని డాక్టర్లు చెప్పుచూ ఉంటారు గానీ, మంచి నీరు త్రాగి శరీరాన్ని రోజూ శుద్ధి చేసుకోమని ఏ ఒక్కరూ చెప్పరు. యూరిన్ ఇన్ ఫెక్షన్ లు ఎన్ని వచ్చినా, రక్త దోషాలు ఎన్ని వచ్చినా, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులొచ్చినా, రక రకాల ఇన్ ఫెక్షన్ లూ, రోగాలూ వచ్చినప్పడైనా నీరును త్రాగించి శరీరాన్ని శుద్ధి చేయించే ప్రక్రియను ఏ ఒక్కరూ బోధించరు. అందువల్లనే రోగాలు తిరిగి వస్తూ 100 సంవత్సరాలు పని చేయవలసిన కిడ్నీలు నడివయస్సులోనే దెబ్బతింటూ, శరీరం నీరు పట్టి రోగాలతో, మానసికమైన దిగులుతో జీవించవలసి వస్తున్నది.
విరేచనం తరువాత శరీరానికి ఎక్కువ వ్యర్థపదార్థాలను శరీరంలో నిలువ ఉండేటట్లు చేసేది ఈ విసర్జకావయవం. ఈ విసర్జకావయవం బాగా పనిచేసేటట్లు చేస్తే దీర్ఘరోగాలన్నీ తగ్గుతుంటాయి. ఉపవాసంలో 5 నుండి 6 లీటర్ల మంచి నీరును త్రాగడం వలన రక్తం రోజు రోజుకూ శుభ్రపడుతూ ఉంటుంది. అదీగాక తేనెను ఉపవాసంలో వాడడం వలన కూడా శరీరం శుద్ధి అవుతూ ఉంటుంది. ఉపవాసం ప్రారంభించిన రోజు నుండి కొత్త వ్యర్థ పదార్థాలు శరీరంలో తయారవడం బదులు నిలువ ఉన్న వ్వర్థపదార్థాలన్నీ రోజు రోజుకీ మూత్రంలో కదలి వెళ్ళిపోతూ ఉంటాయి. శరీరంలో టాక్సిక్ పదార్థాలు పూర్తిగా విసర్జింపబడి రక్తానికి స్వచ్ఛత చేకూరుతుంది కాబట్టి ఉపవాసంలో రోగాలు పూర్తిగా రోజు రోజుకీ తగ్గుతుంటాయి.
3. చర్మం: శరీరంలో భాగాలు దెబ్బతినకుండా కాపాడడానికి చర్మం ఒక కవచం. చెమట రూపంలో చెడును శరీరం నుండి విసర్జిస్తుంది. చర్మం వేడికి దెబ్బతినకుండా, చర్మం లోపల ఉన్న నీరు ఆవిరవుతూ చర్మాన్ని నిత్యం రక్షిస్తూ ఉంటుంది. చర్మం లోపల చెమటను తయారుచేసే చెమట గ్రంథులు ఉంటాయి. చెమట గ్రంథులకు సూక్ష్మమైన రక్తనాళాల సరఫరా ఉంటుంది. చెమట గ్రంథుల నుండి తయారైన చెమట బయటకు విసర్జింప బడడానికి చర్మానికి సూక్ష్మమైన (కనబడని విధంగా) రంధ్రాలు (పోర్స్) ఉంటాయి. ఎప్పుడైతే చర్మం వేడికి గురి అవుతుందో అంటే 0.25°C నుండి 0.5°C వేడి పెరుగుతుందో అప్పుడు చెమట గ్రంథులు ప్రభావితం అయ్యి చెమటను ఉత్పత్తి చేస్తాయి. ఎప్పుడైతే బయట చల్లగా ఉంటుందో చర్మంలో సూక్ష్మమైన రక్తనాళాలు సంకోచించుకొని చర్మానికి రక్తప్రసరణ తగ్గిపోతుంది. చర్మానికి రక్తప్రసరణ తగ్గిన దగ్గర నుండి చర్మానికి ఆహారం సరఫరా అవడం కూడా తగ్గిపోతూ ఉంటుంది. అందువల్లనే చర్మవ్యాధులు వస్తే త్వరగా తగ్గవు. మందులు ఎన్నివాడినా పూర్తిగా నివారణ జరుగదు. బాగా ఎండలో పనిచేసేవారికి చెమట బాగా పడుతూ చర్మంలోని వ్యర్థ పదార్థాలన్నీ పూర్తిగా విసర్జింపబడుతూ ఉంటాయి. చెమటపట్టే పనిచేసే వారికి చర్మవ్యాధులు సామాన్యంగా దూరంగా ఉంటాయి. మల మూత్రాలతో పోల్చుకుంటే చెమట ద్వారా విసర్జింపబడే చెడు పదార్థాలు చాలా తక్కువ అని చెప్పవచ్చు.
చెమటలో విసర్జింపబడే పదార్థాలు
నీరు - 99.4 శాతం
వ్యర్థ పదార్థాలు - 0.4 శాతం
ఈ క్రిందవి అన్నీ - 0.2 శాతం
పొటాషియం
సోడియం
క్లోరైడ్
సల్ఫేట్
విరేచనం సాఫీగా అవ్వని వారికి తినే అర్హతలేదని ఎవరూ అనలేదు గానీ, చెమట పట్టని వారికి తినే అర్హత లేదని గాంధీగారు అన్న మాటలు నిజం. చెమట ద్వారా తక్కువ వ్యర్థపదార్థాలు పోతున్నప్పటికీ, చెమటకున్న ప్రాధాన్యత వేరు కాబట్టి గాంధీగారు అలా అని ఉంటారు. కష్టపడి పనిచేసే వారికే చెమట పడుతుంది. పనిచేయడం ద్వారా తిన్న ఆహారం బాగా అరుగుతుంది. ఆహారం త్వరగా ప్రేగులలో కదులుతుంది. వారికి సాఫీగా విరేచనం అవుతుంది. పనిచేసే వారికి దాహం అవ్వడం వలన ఎక్కువ నీరు త్రాగుతుంటారు. తద్వారా మూత్రం కూడా సాఫీగా అవుతూ ఉంటుంది. శరీరంలోని వ్యర్థపదార్థాలు చెమట పట్టే వారికి త్వరగా కదిలి అన్ని విసర్జకావయవాల ద్వారా బయటకు పోయే అవకాశం కల్గుతుంది. గాలి ఆడక చెమట పట్టినప్పుడు ఆ చెమటలో వెళ్ళే చెడు పదార్థాలు కొద్దిగానే ఉంటాయి. కాని ఎండలో పనిచేసేటప్పుడు పట్టే చెమటలో ఎక్కువ వ్యర్థపదార్థాలు చర్మం నుండి పూర్తిగా విసర్జింపబడతాయి. మన చర్మానికి కొన్ని కోట్ల చర్మ రంధ్రాలు ఉంటాయి. ఎవరైతే రోజూ చెమటను కార్చరో వారికి చర్మ రంధ్రాలు పూడుకొని పోతూ, ఎక్కువ వ్యర్థ పదార్థాలు చర్మంలోనే ఉండిపోతాయి. అందువల్లనే చెమట ఎక్కువగా వాసన వస్తూ ఉంటుంది. చర్మం ద్వారా బయటకు పోయే పదార్థాలు కొద్దిగా అయినప్పటికీ, పైగా చెమటలో ఉన్నది 99.4 శాతం నీరు అయినప్పటికీ ఎందుకు అంత వాసన వస్తున్నదో ఆలోచించండి. చిన్నప్పటి నుండి చెమట పట్టే పనులు చేయక ఎన్నో ఏళ్ళగా వ్యర్థపదార్థాలను చర్మంలో పోగుచేసుకొంటూ వస్తూ ఉన్నాము. అందువల్లనే వయస్సు పెరిగిన దగ్గర నుండి చర్మవ్యాధులు, దీర్ఘ రోగాలు వస్తూ ఉంటాయి.
ఎక్కడ చెమట పడితే ఎక్కడ జిడ్డు అవుతుందనో, రాసుకున్న పౌడర్లు ఎక్కడ కారిపోతాయనో వేసుకున్న బట్టలు ఎక్కడ చెమటతో తడుస్తాయనో, అడుగడుగునా ఏసీలు, ఫాన్లు వేసుకుంటూ చెమట పట్టకుండా చేసుకొంటున్నాము. లోపల ఉన్న చెడు బయటకు పోవటం కూడా మనిషికి ఇష్టం ఉండదు. పైకి చర్మాన్ని సింగారించుకుంటున్నారే గానీ లోపల ఉన్న చెడును బయటకు పంపే ఏర్పాటు ఎవరూ చేయటం లేదు. వాతావరణం ఎంత చల్లగా ఉంటే చర్మంలో అంత ఎక్కువ వ్యర్థపదార్థాలు పూడుకొని పోతాయి. అందువల్లనే, చలికాలంలో చర్మవ్యాధులు ఎక్కువ అవుతూ ఉంటాయి. చర్మంలో పోగయిన వ్యర్థ పదార్థాలను విసర్జింప చేయడానికి ఏ మందులు, ఏవైద్య విధానాలు ఏమీ సహకరించలేవు. అందువల్లనే చర్మవ్యాధులు మందుల వల్ల నయం కావు. చర్మం ద్వారా పోవల్సిన చెడు పూర్తిగా చర్మం నుండి పోయే మార్గం ఎవరూ ఆలోచించడం లేదు. చర్మం ద్వారా పోవలసిన పదార్థాలు చెమట పట్టని వారికి తిరిగి శరీరం అంతా వ్యాపిస్తూ, అవి మిగతా విసర్జకావయవాల మీద ఆధారపడి బయటకు వెళ్ళవలసి వస్తున్నది. మిగతా అవయవాలు ఎంత పనిని సమర్థవంతంగా చేయగలుగుతాయి. ఎక్కువ శాతం చెడు శరీరంలోనే మిగిలిపోతూ ఉంటుంది. గ్యాసు స్టౌకు ఉన్న చిన్న చిన్న బెజ్జాలు పూడుకొనిపోతే అప్పుడప్పుడూ పిన్నీసు పెట్టి పొడిచి వాడుకోవడం చేస్తున్నాము. అలాగే మనకున్న సూక్ష్మమైన చర్మరంధ్రాలు పూడుకొనిపోతుంటే ఎన్ని సంవత్సరాలకైనా వాటిని బాగుచేసుకొనే ప్రయత్నం చేయలేక పోతున్నారు. చివరకు రోగాలు వచ్చినప్పుడన్నా చర్మాన్ని శుభ్రం చేసే ప్రయత్నం కూడా చేయడం లేదు. కట్టుకునే బట్టలు మీద ఏవైనా మరకలు పడితే వాటిని కట్టుకోవడం మానివేస్తాము. చర్మం మీద మచ్చలు, పుండ్లు, చర్మవ్యాధులు మొదలైనవి వచ్చినప్పటికీ వాటిని పూర్తిగా తగ్గించుకొనే ప్రయత్నం, శ్రద్ధ మనిషి తీసుకోలేక పోతున్నాడు. రోజూ కట్టుకున్న బట్టలను శుభ్రం చేసుకోగలుగుచున్నాము గానీ చర్మాన్ని మాత్రం చేసుకోలేక పోతున్నాము.
ఉపవాసం ద్వారా చర్మంలో నిలువ ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ నాని రోజు రోజూ విసర్జింప బడుతూ ఉంటాయి. చర్మాన్ని పూర్తిగా శుభ్రం చేయడానికి శరీర మర్దనలు ఉపవాసంలో చేస్తారు. దీని ద్వారా చర్మానికి బాగా ఎక్కువ రక్తప్రసరణ జరుగుతుంది. తరువాత నీటి ఆవిరి పట్టడం ద్వారా చర్మంలోని మురికి, వ్యర్థ పదార్థాలు అన్నీ చెమట రూపంలో కారిపోతుంటాయి. ఎన్నో ఏళ్ళ తరబడి నిలువ ఉన్న పదార్థాలన్నీ కూడా కదలి బయటకు పోతుంటాయి. అలాగే సూర్య స్నానం కూడా చేయిస్తారు. సూర్య కిరణాల ద్వారా చర్మంలోని పదార్థాలను విసర్జింపజేసి, చర్మాన్ని శుభ్రం చేస్తారు. అలాగే మట్టి పూయడం ద్వారా కూడా చర్మాన్ని శుభ్రం చేయడం ఉపవాసాలలో చేస్తారు. ఇన్ని రకాలుగా చర్మంలో ఉన్న వ్యర్థ పదార్థాలను విసర్జింప చేయడం జరుగుచున్నది కావున ఉపవాసంలో ఈ విసర్జకావయవం ద్వారా పూర్తిగా రక్షణ శరీరానికి అందుచున్నది. చర్మ వ్యాధులు ఉపవాసంలో తగ్గడం ప్రారంభిస్తాయి. శరీరంలో రోగాలు పేరుకొని పోవడానికి కారణమైన విసర్జకావయవాన్ని (చర్మాన్ని) శుద్ధిచేస్తూ, రోగాలు పుట్టకుండా ఉపవాసంలో చేస్తున్నాము కాబట్టి అన్ని రోగాలు తగ్గే అవకాశముంటుంది.
4. ఊపిరితిత్తులు: మనకున్న రెండు ఊపిరి తిత్తులూ కలిపి రెండున్నర లీటర్ల నుండి మూడు లీటర్ల వరకూ గాలిని పీల్చుకొనే శక్తిని కలిగి ఉంటాయి. మనం పీల్చుకొనే గాలిలో ప్రాణశక్తి అధికంగా ఉంటే, వదిలే గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ (బొగ్గు పులుసు వాయువు) అధికంగా ఉంటుంది. మనం తిన్న ఆహారంలో ఉన్న కొవ్వు, పిండి పదార్థాలు జీర్ణం అయ్యి కణాలలో శక్తిగా మారిన తరువాత వాటి నుండి కార్బన్ డై ఆక్సైడ్ అనే వ్యర్థ పదార్థం విడుదల అవుతూ ఉంటుంది. మనం పీల్చుకొనే గాలిలో ఉన్న ప్రాణశక్తిని రక్తం మోసుకొని శరీరానికి, కణాలకు అందించి మరలా తిరుగు ప్రయాణంలో ఆ కణాలలో ఉన్న వ్యర్థపదార్థం అయిన కార్బన్ డై ఆక్సైడ్ ను ఊపిరితిత్తులలోనికి చేర్చే పని రక్తం చేస్తూ ఉంటుంది. ఎవరైతే ఎక్కువ ప్రాణశక్తిని పీల్చుకోలేక పోతారో వారు ఎక్కువ కార్బన్ డై ఆక్సైడ్ ను బయటకు విసర్జించలేరు. లోపలకు వెళ్ళే మంచిని బట్టే బయటకు వచ్చే చెడు ఆధారపడి ఉంటుంది. మంచి లోపలకు వెళ్ళనిదే (ప్రాణశక్తి) చెడు బయటకు రాదు. ఎక్కువ ప్రాణశక్తిని పీల్చుకోగలిగిన వారికి రక్తం శుద్ధిగా ఉంటుంది. ప్రాణశక్తి సరిగా అందని వారికి శరీరంలోని కణాలు త్వరగా చనిపోతూ ఉంటాయి. మరికొన్ని కణాలు రోగగ్రస్తమవుతూ ఉంటాయి. కణాలకు ప్రాణశక్తి సరిగా అందకపోతే శక్తివంతంగా పనిచేయలేవు. మనలోని ఎక్కువ శాతం వ్యర్థపదార్థాలను దహనం చేయడానికి ప్రాణశక్తి ఉపయోగపడుతుంది. మన శ్వాసలు నిముషానికి 18 సార్లు ఆడుతూ ఉంటాయి. మన శరీరంలో ఎక్కువ వ్యర్థపదార్థాలు తయారయ్యి, అవి రక్తంలోకి విడుదల అయినప్పుడు వాటిని శుద్ధి చేయడానికి ఎక్కువ ప్రాణశక్తి అవసరం అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఎక్కువ సార్లు శ్వాసలు పీల్చుకొంటూ ఉంటాము. మన రెండు ఊపిరితిత్తులు విశాలంగా ఉంటేనే శరీరాన్ని శుద్ధి చేయడానికి కావలసినంత ప్రాణవాయువు అందుతుంది.
శారీరక శ్రమ చేయని వారికి చేతులు అటూ ఇటూ సరిగా ఆడవు. రెక్కలు ఆడిన వారికి ఊపిరితిత్తుల చివరవరకూ గాలి వెళ్ళే అవకాశముంటుంది. అదీగాక పనిచేసే వారికి పనిలో ఎక్కువ ప్రాణశక్తిని పీల్చుకోవడం ద్వారా రాకపోకలు (గాలి) బాగా జరుగుతాయి. గాలికి వేడిని పుట్టించే గుణం ఉంది. గాలి యొక్క రాపిడికి ఊపిరి తిత్తులలో శ్లేష్మాలు, రొంపలు పూర్తిగా ఏ రోజువి ఆ రోజు ఆవిరవుతూ ఉంటాయి. పనిచేసేటప్పుడు మనం పీల్చుకొనే ఎక్కువ ప్రాణశక్తి కారణంగా పనిలో ఎక్కువ ఆనందంగా ఉంటుంది. పని చేసిన తరువాత గానీ, వ్యాయామాలు చేసిన తరువాత గానీ చాలా హుషారుగా, శక్తిగా ఉండడం గమనిస్తూ ఉంటాం. కష్టపడి పనిచేసే వారికి పొట్ట పెరిగే అవకాశం తక్కువ ఉంటుంది. అందువలన ఊపిరితిత్తులు పూర్తిగా గాలిని పీల్చుకోగలుగుతాయి. పని రూపంలో వారు పీల్చుకొనే ఎక్కువ ప్రాణవాయువు శరీరంలోని ఎక్కువ వ్యర్థపదార్థాలను విసర్జింపజేయడానికి సహకరిస్తున్నది.
శ్రమ చేయని వారికి ఎక్కువ గాలిని పీల్చుకొనే అవకాశం ఎప్పుడూ రాదు. పని చేయని కారణంగా శరీరం లావు, బరువు పెరుగుతూ ఉంటుంది. ఒక కేజీ బరువు పెరిగితే దాని కారణంగా శరీరంలో 3,000 కిలోమీటర్ల పొడవుండే రక్తనాళాలు ఎక్కువగా తయారవుతాయి. తద్వారా కొన్ని కోట్ల కణాలు ఎక్కువ పెరుగుతాయి. ఆ కణాలకు ప్రాణశక్తిని అందించడానికి మనకున్న రెండు ఊపిరితిత్తులూ ఎక్కువ పని చేస్తూ ఉండాలి. 10 నుండి 20 కేజీలు బరువు పెరిగిన వారికి శరీరంలో ప్రాణశక్తి లోపం బాగా ఎక్కువగా వస్తుంది. మనం పీల్చుకొనే ప్రాణవాయువు అంతా శరీరాన్ని, రక్తాన్ని పూర్తిగా శుభ్రం చేయలేదు. తద్వారా ఎక్కువ శాతం వ్యర్థ పదార్థాలు శరీరంలోనే మిగిలిపోతుంటాయి. ప్రాణశక్తి చాలనందు వల్లే లావుగా ఉన్నవారికి అలుపు ఎక్కువగా వస్తుంటుంది. అలాగే పొట్ట పెరిగిన వారికి ఊపిరితిత్తుల క్రింద భాగాలు మూసుకొనిపోయి ఎక్కువ గాలి పట్టదు. శరీరం బరువు పెరగడం ఒక నష్టమైతే, ఊపిరితిత్తులు మూసుకొని పోవడం మరొక నష్టం. రెండు విధాలా ప్రాణవాయువు లోపం చాలా ఎక్కువగా ఉంటుంది. లావుగా ఉన్నవారికి అన్ని రోగాలు రావడం, ఏ పనీ చేయలేక పోవడం, ఆయుష్షు తగ్గిపోవడం, ఏ రోజు గుండె ఆగిపోతుందో తెలియక పోవడం మొదలైనవి అన్నీ ప్రాణశక్తి లోపం కారణంగా వచ్చేవే. ఈ స్థితి వచ్చిన దగ్గర నుండి శరీరంలో వ్యర్థ పదార్థాలు, పనికిరాని కణాలు విపరీతంగా వృద్ధి చెందుతూ వుంటాయి. ఇద్దరకు వచ్చిన భోజనాన్ని (క్యారేజీని) నలుగురు తింటే అది నలుగురికీ పూర్తిగా సరిపోక అర్ధాకలితోనే లేవటం జరుగుతుంది. లావుగా ఉన్నవారికి ప్రాణశక్తి కూడా అలానే చాలీచాలనట్లుగా ఉంటుంది. భగవంతుడు కావలసినంత ప్రాణశక్తిని అన్ని విధాలుగా అందిస్తున్నప్పటికీ మనకి దాన్ని స్వీకరించే అదృష్టం లేకపోతే ఎవరు మాత్రం ఏమి చేయగలరు? సరిగా గాలి అందనందుకు శరీరంలో మిగతా భాగాలు, మిగతా మూడు విసర్జకావయవాలుకూడా సరిగా విసర్జించలేవు. రోజు రోజుకీ రోగాలకు బలం పెరుగుతూ శరీరంలో గట్టి పునాదిని వేసుకొంటూ ఉంటాయి. మనం రోగాలకు మందులు వేయడం చేయవచ్చును గానీ రోగం పుట్టడానికి కారణమైన ప్రాణశక్తి లోపాన్ని నివారించడానికి మందులు వేయలేముగదా! ప్రాణశక్తిని పెంపొందించుకోవడానికి ఏ వైద్య విధానాలూ, ఏ డాక్టర్లూ సహకరించలేరు. అసలు వచ్చిన ప్రాణశక్తి లోపాన్ని నివారించే ప్రయత్నం ఏ డాక్టరూ చేయకుండానే కొసరు వైద్యాలన్నీ చేస్తుంటారు. అందువల్లనే శ్వాసకు సంబంధించిన జబ్బులు వచ్చిన వారికి జీవితంలో నివారణ జరగడం లేదు. శరీరాన్ని, మనస్సుని నడిపే ప్రాణవాయువు యొక్క ప్రాధాన్యతను తెలుసుకొనలేక ఊపిరితిత్తులను పాడుచేసుకొంటున్నాము.
సిగరెట్లు త్రాగి, పొగతో ఊపిరితిత్తులను పాడుచేసుకొంటూ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారే గానీ మన చేతులతో మన ఆరోగ్యాన్ని, ఆయుష్షును పాడుచేసుకొంటున్నామని గ్రహించలేక పోయేవారు ఎందరో. వీటికి తోడు ఐస్ క్రీమ్ లు, స్వీట్లు, కూల్ డ్రింక్ లూ తీసుకొంటూ ప్రాణశక్తితో నిండవలసిన ఊపిరితిత్తులను కఫంతో నింపుకొనే వారు మరికొందరు. శ్వాసలకు ఆటంకాలు కలిగించే ఆ కఫాన్ని ఊపిరితిత్తులు నెట్టివేసి, ఆ అవరోధాన్ని తొలగించి తిరిగి ప్రాణవాయువును నింపుకొనే ప్రయత్నం చేసుకొంటాయి. మళ్ళీ ఇక్కడ కూడా రకరకాల మందులు వేసి ఆ కఫం బయటకు పోకుండా అణచివేసుకొంటూ దగ్గకుండా హాయిగా ఉందామనుకొనేవారు మరి కొందరు. మనం తినేది పూర్తిగా పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు. వాటి కారణంగా శరీరంలో ఎక్కువ బొగ్గుపులుసు వాయువు పెరుగుతూ ఉంటుంది. దాన్ని శుద్ధి చేస్తే ప్రాణశక్తి లేక అవి శరీరంలోనే ఉండి రకరకాల టాక్సిక్ పదార్థాలను, రోగపదార్థాలను సృష్టిస్తూ ఉంటాయి. ఈ విధంగా మనలో జరిగే నష్టాన్ని నివారించుకోలేక పోతే రోగాలు పూర్తిగా తగ్గవు. రోగం ఎక్కడ పుడితే అక్కడి నుండే చికిత్స ప్రారంభం అవ్వాలి. అప్పుడే మనకు వచ్చే రోగాలు పూర్తిగా నయం అవుతాయి.
ఉపవాసం ప్రారంభించిన రోజు నుండి ఆహారం లేని కారణంగా పొట్టఖాళీగా ఉంటుంది. ఆహారం లేకపోతే ఆహారాన్ని జీర్ణం చేయడానికి కావలసిన ప్రాణశక్తి అంతా పొదుపు అయ్యి మనలో ఉన్న బొగ్గు పులుసు వాయువును, విషపదార్థాలను వెలువరించడానికి సహకరిస్తుంది. ఊపిరితిత్తులు విశాలంగా ఉండి ఉపవాసంలో ఎక్కువ ప్రాణవాయువును పీల్చుకోగలిగి, ఎక్కువ చెడు గాలిని వదిలే విధంగా ఉంటాయి. పైగా మనం వాడే తేనె, నిమ్మకాయ నీళ్ళకు ఉపవాసంలో ఊపిరితిత్తులలోని కఫాలు, రొంపలు హరించి వేయబడి శ్వాసనాళాలు ఖాళీగా అవుతాయి. పూర్తిగా మూడు లీటర్ల ప్రాణశక్తిని పీల్చుకొనే విధంగా ఊపిరితిత్తులు ఉంటాయి. ఎప్పటి నుండో ఊపిరితిత్తులలో నిలువ ఉండి శ్వాసకోశాలకు అవరోధాలు కలిగించే పదార్థాలన్నీ విసర్జింపబడతాయి. శరీరంలో పూర్తి రక్తం అంతా శుభ్రం అవుతూ ఉంటుంది. మనిషికి ఉన్న ఎక్కువ పొట్ట, బరువు ఉపవాసంలో తగ్గడం ద్వారా తరువాత ప్రాణశక్తి శరీరానికి సరిపోతూ ఉంటుంది. ఉపవాసం ప్రారంభించిన రెండవ రోజు నుండి ముందు ఊపిరితిత్తులు శుభ్రం అవుతూ, శరీరానికి మంచి ప్రాణశక్తిని అందిస్తూ, మిగతా విసర్జకావయవాలు సక్రమంగా పనిచేసేటట్లు ఉపవాసం చేయగలదు. ఉపవాసంలో అన్ని రోగాల నివారణకు ప్రాణశక్తి సక్రమంగా అందుతుంది కాబట్టి రోగాలు రోజు రోజుకీ మందులు వేసిన దానికంటే త్వరగా తగ్గుతూ ఉంటాయి. మనం వీటిని శుభ్రం చేయకుండా ఎన్ని మందులు వేసినా బూడిదలో పోసిన పన్నీరు లాగా మన డబ్బు అంతా వృధా అవడం తప్ప వేరే ప్రయోజనం ఏమీ ఉండదు.
రోగాలు వచ్చి మనిషిని పట్టుకోవడం లేదు, మనిషే కోరి రోగాలను పట్టుకుంటున్నాడన్నది నిజమేనని ఒప్పుకుంటారు గదూ! పొలానికి ఒక పంట కాలువ ఉంటే ఒకటే మురుగు కాలువ ఉంటుంది. కానీ మనకు శరీరాన్ని సృష్టించిన సృష్టికర్త ఆహారం తీసుకొనే ద్వారాన్ని ఒక దాన్ని పెట్టి, ఆహారం ద్వారా వచ్చిన వ్యర్థపదార్థాలు బయటకు పోవడానికి నాలుగు విసర్జకావయవాలను నిర్మించి యున్నాడు. అంటే మనం తినే ఆహారం ద్వారా తయారయ్యే వ్యర్థ పదార్థాలు నాలుగు విసర్జకావయవాల ద్వారా విసర్జింపబడితేనేగానీ శరీరంలో మిగల కుండా పోవన్న మాట. మనం తినే ఆహారం ద్వారా అన్ని ఎక్కువ చెడు పదార్థాలు తయారవుతాయనే దీని అర్థం. భగవంతుడు ఇచ్చిన సహజమైన ఆహారాన్ని తింటే ఆయన ఇచ్చిన నాలుగు అవయవాలు శరీరాన్ని శుద్ధి చేయడానికి పూర్తిగా సరిపోతాయి. కానీ మనం ఆవిధంగా కాక ఉప్పు, నూనె, నెయ్యి, పంచదార మొదలైనవి అన్నీ తింటూ ఉన్నాము. కాబట్టి మనకున్న నాలుగు అవయవాలు పరిపూర్ణంగా పనిచేసినప్పటికీ ఎంతో కొంత చెడు శరీరంలో మిగిలిపోతూ ఉంటుంది. ఆ విధంగా ఎక్కువ చెడు తయారవుతున్న ఆహారాన్ని రోజూ తింటూ ఉంటే విసర్జకావయవాలు సరిగా పనిచేయలేక కాలక్రమేణా పూడుకొని పోతూ ఉంటాయి. ఇక అక్కడ నుండి శరీరంలో ఎక్కువ శాతం చెడు నిలువ ఉండి పోతూ తక్కువ శాతం మాత్రమే విసర్జింపబడుతూ ఉంటుంది. ఆహారం ద్వారా రోజూ వచ్చే చెడు కొంత శరీరంలో మిగిలిపోయి అనర్థాలకు కారణమైతే, మరి కొంత నిలువ ఉన్న చెడు నుండి క్రిములు, టాక్సిన్స్, విషపదార్థాలు పుట్టి శరీరానికి కొత్త కొత్త రోగాలను పరిచయం చేస్తూ ఉంటాయి. అవే లోపల పునాదిగా ఏర్పడుతూ అవయవాలను దెబ్బతీస్తూ ఉంటాయి.
నాలుగు విసర్జకావయవాల పనితీరు సక్రమంగా లేక శరీరంలో తయారైన వ్యర్థ పదార్థాలు వాయుగుండం పడ్డప్పుడు నీరు అంతా అక్కడే గుండ్రంగా తిరుగుతున్నట్లు శరీరంలోనే గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. పొలంలో నీరు ఏ ప్రక్క పల్లంగా ఉంటే ఆ ప్రక్కన ఎక్కువగా నిలువ ఉంటుంది. అలాగే మనలో ఉన్న చెడు పదార్థాలు కూడా ఏ భాగాన కదలికలు లేకుండా ఖాళీగా ఉంటే ఆ భాగాన చేరి నిలువ ఉంటూ ఉంటాయి. ఉదాహరణకు బంగారం అంతా ఒక్కటే ముద్ద. అలాగే రోగ పదార్థం కూడా ఒకటే. బంగారం మనం చేసే దాన్ని బట్టి రకరకాల వస్తువులుగా మార్పు చెందుతుంది. అలాగే రోగ పదార్థం కూడా మనం చేసుకొనే దాన్ని బట్టి రకరకాల రోగాలుగా మార్పు చెందుతుంది. ఆ బంగారాన్ని మెడలో వేసుకొంటే గొలుసు అంటారు. అలాగే ఆరోగ పదార్థం మెడలో జేరితే మెడనొప్పి లేదా స్పాండిలైసిస్ అంటారు. అదే బంగారాన్ని పొట్టకు పెట్టుకుంటే వడ్డాణము అని కాలుకి పెట్టుకుంటే పట్టా అని, తలకు పెట్టుకుంటే పాపిడి పట్టీ అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాము. అలాగే అదే రోగ పదార్థం పొట్టలో చేరితే గ్యాస్ ట్రబుల్, ఊపిరితిత్తులలో చేరితే ఆస్త్మా లేదా బ్రాంకైటిస్ అని, కీళ్ళలో చేరితే కీళ్ళనొప్పులు లేదా ఆర్ధరైటిస్ అని, తలలో చేరితే తలనొప్పి లేదా మైగ్రైన్ నొప్పి (పార్శ్వపు నొప్పి) అని రకరకాలుగా పేర్లు పెట్టి రోగాలుగా పిలుచుకోవడం జరుగుచున్నది. పేర్లు వేరైనా, రూపాలు వేరైనా ఉన్న దేవుడు ఒక్కడే అని అందరం నమ్ముతున్నాము. అలాగే రోగాలు ఎన్నైనా, లక్షణాలు వేరైనా వాటన్నింటికీ కారణమైన పదార్థం మాత్రం ఒక్కటేనని తెలియాలి. అన్ని రోగాలకు కారణమైన పదార్థం మాత్రం ఒక్కటేనని తెలియాలి. అన్ని రోగాలకు కారణమైన పదార్థం ఒక్కటే అయినప్పుడు చికిత్స కూడా ఒక్కటే అవుతుంది గదా! అవును, ఒక్కటే చికిత్స. అదే ఉపవాస చికిత్స. అలాకాకుండా ఒక్కో రోగాన్ని, ఒక్కో భాగాన్ని, ఒక్కొక్క డాక్టరు పంచుకొని చికిత్స చేసినప్పటికీ రోగాలు పూర్తిగా పోవటం లేదంటే, ఆ చికిత్సలు ఆ రోగ పదార్థాన్ని నివారించే విధంగా లేవనే చెప్పవచ్చు. అసలున్న రోగ పదార్థానికి చికిత్స చేయకుండా లేదా రోగ పదార్థం పుట్టకుండా చేయకుండా రోగ లక్షణాలకు చికిత్సలు చేస్తూ ఉంటే, లోపల రోజు రోజుకూ వడ్డీరూపంలో క్రిములు పెరిగిపోతూ ఆ కొత్త రోగాలకు దారి తీస్తాయి. నేటి సమాజంలో ఉపవాస విధానాన్ని మరిచి చేయిస్తున్న చికిత్సలు ఈ విధంగా ఉండబట్టే దేశంలో రోజూ రోజుకీ రోగాల సంఖ్య పెరుగుతూ ఉన్నది. వచ్చిన రోగంతో కాలయాపన చేయడమే జరుగుచున్నది కానీ రోగం మాత్రం శరీరం నుండి వదలడం లేదు. రోగాలను శరీరం నుండి వదిలించుకొనే చికిత్సలు నేర్చుకోవాలి గానీ రోగాలతో కాలక్షేపం జేయడం గానీ, ఆడుకోవడం గానీ చేస్తే మొక్కేమ్రాను అయినట్లు చిన్న రోగాలే పెద్ద దీర్ఘరోగాలు అవుతాయి. రోగాలను దీర్ఘరోగాలుగా మార్చుతున్నాయి మందులు.
మనం బాత్ రూమ్ లో వాడిన నీరు బయటకు వచ్చి నిలువలేకుండా కదిలి వెళ్ళితే వాసనరాదు. క్రిములు, దోమలు అక్కడ పుట్టవు. అలాగే మనలో కూడా వ్యర్థ పదార్థాలు నిలువ ఉండకుండా కదిలి బయటకు వెళ్లిపోతే శరీరంలో వాసనలు ఉండవు. క్రిములు, టాక్సిన్స్ లోపల పుట్టవు. బాత్ రూమ్ బయట నీరు నిలిస్తే అక్కడ రోజు రోజుకీ వాసనతో క్రిములు చేరుతూ ఉంటాయి. దానిపై మనం వాసన రాకుండా బ్లీచింగ్ పౌడర్ గానీ, సున్నంగానీ వేస్తే ఒకటి రెండు రోజులు పనిచేస్తుంది. మూడవ రోజు మామూలే. అలాగే మనలో వ్యర్థ పదార్థాలు సరిగాపోనప్పుడు తయారైన టాక్సిన్స్, బాక్టీరియా క్రిములను చంపడానికి మందులు వాడితే అవి రెండు మూడు రోజులే పనిచేస్తాయి. తరువాత మరలా మామూలే. బాత్ రూమ్ బయట మురుగు నీరు నిలువకుండా పూడ్చడమో లేదా మురుగు గుంటను తీసి వేసి పూర్తిగా శుభ్రం చేయడమో చేస్తే దానితో ఆ ఇబ్బంది పూర్తిగా పోతుంది. అలాగే ఉపవాసంలో మనలో నిలువవున్న వ్యర్థ పదార్థాలను పూర్తిగా విసర్జించి నాలుగు విసర్జకావయవాలను పూర్తిగా శుభ్రం చేస్తున్నాము కాబట్టి రోగానికి కారణమైన పదార్థం పునాదులతో తీసివేయబడుచున్నది. అన్ని రోగాలకు కారణమైన ఒకే పదార్థాన్ని పూర్తిగా కడిగివేస్తున్నాము కాబట్టి ఉపవాసంలో రోగాలు తగ్గుతాయి. రోగాలతో కాలయాపన ఇక్కడ ఉపవాసంలో జరుగడం లేదు కాబట్టి రోగానికి పునాది లేకుండా కదిలి బయటకు రావడం జరుగుచున్నది. అందువలన రోగాలు, దీర్ఘ రోగాలుగా మారే అవకాశం ఒక్క శాతం కూడా లేదు. ఉపవాసంలో రోగాలు తగ్గడానికి ఇదే కారణం. వచ్చిన రోగాలను పూర్తిగా తగ్గించుకొనే మార్గమున్నది కనుక ఉపవాసాల ద్వారా శరీరానికి రక్షణ కల్పిద్దాము.

6. ఉపవాసంతో చికిత్సలు

పంచభూతాల ప్రకృతి చికిత్సలో ఉపవాస విధానం ఒక చికిత్స. ఉపవాస విధానంలో శరీరంలో ఎన్నో నెలలు, సంవత్సరాల తరబడి నిలువ ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ కదిలి మనలో ఉన్న విసర్జకావయవాల ద్వారా బయటకు పోయే మార్పు కలుగుతుంది. ఉపవాసం ద్వారా శరీరంలో నిలువ ఉన్న వ్యర్థపదార్థాలన్నీ కదిలినప్పటికీ ఆ పదార్థాలు బయటకు పోయే ద్వారాలు అయిన విసర్జకావయవాలు పూడుకొని పోయి ఉంటే అవి ఎలా బయటకు రాగలుగుతాయి. అదీ గాక వాటిని (విసర్జకావయవాలు) ఎన్నో ఏళ్ళ తరబడి శుభ్రం చేసే పనిగానీ, కడిగే పని గానీ ఎవరూ చేయడం లేదు. ప్రతి రోజూ శారీరక శ్రమ చేసే వారికి అన్ని విసర్జకావయవాలలో చెడు రోజూ ఎంతో కొంత బయటకు పోతూ ఉంటుంది కాబట్టి వారికి ఎక్కువగా మూసుకొని పోవు. రోగాలకు కారణమైన ఆ చెడును లోపల ఉంచుకొని పైకి మాత్రం చికిత్సలు చేస్తూ ఉన్నాము. అందువల్లనే శ్రమలేని వారికి విసర్జకావయవాలు సరిగా పనిచేయలేక పోతుంటాయి. వాటిని శుభ్రం చేయడానికే ఉపవాసంలో చికిత్సలను ఉపయోగించేది. కాలువలు పూడుకొని లేదా మూసుకొని పోయినప్పుడు పైనుండి వచ్చే మురుగునీరు ఎలా సాఫీగా పోగలదు? మనలో కూడా అదే జరుగుచున్నది? రెండు, మూడు సంవత్సరాలకు ఒక్కసారైన కాలువలను వెడల్పు చేసి మరమ్మతులను (రిపేరు) చేస్తారు. మన విసర్జకావయవాలు ఇన్నాళ్ళూ అంత భాగ్యానికి కూడా నోచుకోలేదు. సెప్టిక్ ట్యాంకును (లావెట్రిన్ ట్యాంకును) అన్నా 10 సంవత్సరాలకు ఒకసారైనా శుభ్రం చేయగలుగుచున్నారు గానీ మనలో ఉన్న విసర్జకావయవాలను శుద్ధి చేసే తలంపే మనిషికి రావడం లేదు. ఎన్ని రోగాలు వచ్చినప్పటికీ ఇంకొక వైద్య విధానంలో ఇవి శుభ్రం కావడం లేదు. అదృష్టం బాగుండి ప్రకృతి వైద్యానికి వచ్చిన వారికి అక్కడితో శని వదులుతుంది. ప్రకృతి వైద్య విధానంలో చికిత్సలు అయిన జల చికిత్స, వాయు చికిత్స, సూర్యకిరణ చికిత్స, మృత్తికా చికిత్స అని నాలుగు చికిత్సలను ఉపవాస చికిత్సలో భాగంగా శరీరాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. కాలువలను మరమ్మత్తులు చేసినట్లు మనం కూడా ఈ చికిత్సల ద్వారా నాలుగు విసర్జకావయవాలను మరమ్మతులు చేసి (రిపేర్లు), శుభ్రం చేస్తూ ఉంటే ఉపవాసం వలన ప్రయోజనం ఉంటుంది. పంచ భూతాల శరీరానికి పంచ భూతాలతో చికిత్స చేయడం ధర్మమైనది, సరియైనది. పాలు పొంగినప్పుడు నీళ్ళు తోడు తీసుకొన్నట్లు, శరీరానికి రోగాలొచ్చినప్పుడు ప్రకృతి చికిత్సల తోడు సరియైనది. పాలల్లో నీళ్ళు కలిసి పోయినట్లు శరీరానికి ప్రకృతి చికిత్సలు కలిసిపోతాయి. పంచభూతాల శరీరానికి పంచభూతాలతో చికిత్సలు సహజమైనవి. కొన్ని ముఖ్యమైన చికిత్సల గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాము. ముందుగా చల్లదనానికి, వెచ్చ దనానికి శరీరం ఏ విధంగా స్పదిస్తుందో తెలుసుకుందాము.
చల్లని నీటి ధర్మం: చర్మానికి రెండు రకాల స్వీకార గుణాలు (రెసెప్టార్స్) ఉన్నాయి. వేడిని స్వీకరించే గుణం మరియు చలిని స్వీకరించే గుణం. వేరు వేరు భాగాల్లో వేడిని తెలిపేవి, మరియు చలిని తెలిపే రిసెప్టార్ లు వేరు వేరు సంఖ్యల్లో ఉంటాయి. మొత్తం మీద చల్లదనాన్ని స్వీకరించే రిసెప్టార్లే 15 శాతం ఎక్కువగా వేడిని స్వీకరించే వాటి కంటే ఉంటాయి. చర్మంలో ఉన్న ఉష్ణోగ్రతను తెలిపే కణాలు నరాల ద్వారా మెదడుకి సంకేతాలను అందిస్తాయి. చల్లదనాన్ని స్వీకరించేవి చర్మంలో అధికంగా ఉన్న మూలాన వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంటు లాంటి శక్తి ఎక్కువగా ఉంటుంది. ఆ శక్తి మెదడులోని హైపోథాలమస్ కు చేరుతుంది. అక్కడ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే భాగం ఉంటుంది. చల్లని నీటితో చర్మానికి చికిత్సలు చేసేటప్పుడు జరిగే మార్పులను గమనిద్దాం. చర్మంలో ఉన్న రక్తం కారణంగా చర్మం వేడిగా ఉంటుంది. చర్మాన్ని చల్లని నీటితో తడిపినప్పుడు, చర్మంలో ఉన్న రక్తం చల్లదనానికి గురి అయ్యి కొద్దిగా చల్లబడుతుంది. చల్లదనం ద్వారా ఉత్పన్నమయ్యే కరెంటులాంటి శక్తి మరియు కొద్దిగా చల్లబడ్డ రక్తం రెండూ కలిసి ఉష్ణోగ్రతను నియంత్రించే భాగానికి చేరుకుంటాయి. ఆ చల్లదనం నుండి శరీరాన్ని కాపాడడం కొరకు మెదడులోని భాగం నరాల వ్యవస్థను, చలిని ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తుంది. వెంటనే అక్కడ నుండి ఇంకా చల్లదనం చర్మానికి పెరగకుండా కాపాడడానికి ప్రయత్నిస్తుంది. మనం చర్మాన్ని తడపడం ప్రారంభించిన దగ్గర నుండి అర నిముషములోపులోనే మెదడు నుండి సంకేతాలు నరాల ద్వారా చర్మానికి చేరుకుంటాయి. అప్పటి నుండి చల్లదనం ద్వారా చర్మం దెబ్బ తినకుండా ఎదుర్కొంటుంది.
1. చల్లదనానికి చర్మం బిగుసుకొనిపోయి చర్మ పరిమాణం కొద్దిగా తగ్గుతుంది.
2. చర్మంలో సిరలు, ధమనులు (ఆర్టరీస్- వీన్స్) రెండూ కలిసే చోట రక్తనాళాలు మూసుకొని పోతాయి. చర్మానికి ఇంకా రక్తప్రసరణ జరుగకుండా చేయడానికి ఈ విధమైన పన్నాగం మెదడులోని భాగం చేపడుతుంది.
3. తడిచిన దగ్గర చర్మానికున్న సూక్ష్మమైన రక్తనాళాలు కూడా మూసుకొని పోయి, ఆ భాగం చర్మానికి రక్తప్రసరణ జరుగకుండా ఆగిపోతుంది. రక్త ప్రసరణ ఆ భాగానికి ఆగడం వలన చర్మానికున్న చల్లదనం రక్తానికి చేరదు. అప్పటి నుండి మనకు చలి అనిపించదు.
మనం చన్నీటితో స్నానం చేసేటప్పుడు ముందు రెండు మూడు చెంబులు పోసుకున్నప్పుడు చలిగా ఉంటుంది. ముందు పోసుకున్న నీటి వలన చర్మంలో ఉన్న రక్తం కొద్దిగా చల్లబడటం వలన అలా అనిపిస్తుంది. నాలుగవ చెంబు పోసుకునేటప్పటికీ మెదడు నుండి ఆజ్ఞలు చర్మానికి వచ్చి చేరతాయి. పైన చెప్పుకున్న మూడు రకాల మార్పులు చర్మంలో వెంటనే జరుగుతాయి. అందువల్లనే మనకు నాలుగో, అయిదో చెంబు పోసుకునేటప్పటికి చలి అనిపించక పోవడానికి పైన చెప్పిన మూడు కారణాలే కారణం.
ముందు జరిగిన చల్లని చర్యకు ప్రతిచర్యగా ఓ రకమైన రసాయన పదార్థం శరీరంలో విడుదల అవుతుంది. ఆ రసాయన పదార్థం కారణంగా మూసుకొని పోయిన రక్తనాళాలు (సంకోచించినవి) మరలా వ్యాకోచించి ఎక్కువ శాతం రక్తం (మునిపటి కంటే) రక్తనాళాలలోనికి, అతి సూక్ష్మమైన రక్తనాళాలలోనికి ప్రవేశించడం జరుగుతుంది. ముందు తడిపినప్పుడు చర్మానికున్న రక్తం అంతా లోపలకు వెళ్ళడం చర్య (యాక్షన్) అయితే, కొద్ది సమయం తరువాత శరీరం లోపల నుండి ఎక్కువ రక్తం చర్మానికి తిరిగి రావడాన్ని ప్రతిచర్య (రియాక్షన్) అంటారు. ఇక్కడ చర్య కంటే ప్రతిచర్య ఎక్కువగా ఉన్నది. మనం ఒక మాట అంటే ఎదుటివారు మనల్ని రెండు అంటారు. మనం ఒక దెబ్బ వేస్తే ఎదుటివారు మనల్ని రెండు వేస్తారు, అదన్నమాట అసలు కథ. మనం చేసినట్లే మన శరీరం కూడా ఎక్కువ రక్తాన్ని చర్మానికి పంపిస్తున్నది. చల్లబడ్డ చర్మాన్ని వేడిచేయడానికి చేరుకున్న ఎక్కువ రక్తం అంతా ఎక్కువ సేపు చర్మంలోనే ఉండిపోతుంది. అందువల్లనే మనం చన్నీటి స్నానం చేసినప్పుడు మధ్యలో నుండి శరీరం మెల్లగా వేడెక్కడం గమనిస్తాము. స్నానం పూర్తి అయ్యాక శరీరం ఇంకా వెచ్చగా ఉన్నట్లు అనిపించడానికి చర్మానికి చేరి ఉన్న ఎక్కువ రక్తమే కారణం. మన పెద్దలు భోజనం చేసిన తరువాత స్నానం చేయకూడదని చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏమిటంటే మనం తిన్న భోజనాన్ని జీర్ణం చేయడానికి పొట్టకు చేరుకున్న రక్తం అంతా స్నానం వలన తిరిగి చర్మానికి చేరి ఎక్కువసేపు ఉండిపోతుంది. దానివలన జీర్ణక్రియ ఆలస్యం అవుతుందని లేదా సరిగా అవ్వదని దాని అర్థం.
ఉపవాసంలో చేసే చికిత్సలలో అయితే ఏ భాగాన్ని మట్టితో గానీ నీటితో గానీ చల్లబరిస్తే ఆ భాగానికి పైన చెప్పుకున్న విధంగా రక్త ప్రసరణ జరుగుతుంది. చర్మం ఎక్కడ చల్లబరిస్తే అక్కడే కాకుండా, ఆ ప్రక్క శరీర భాగంలో ఉన్న మిగతా అవయవాలకు కూడా రక్తప్రసరణ ఎక్కువగా జరుగుతుంది. శరీరం లోపల భాగాలయిన గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు, మెదడు, గొంతు, ప్రేగులు మొదలైనవి. ఆ చల్లని చికిత్సలు ఏ ప్రక్క చేస్తే ఆ ప్రక్క ఉన్న పై అవయవాలకు కూడా ఎక్కువ రక్తప్రసరణ జరుగుతుంది. చన్నీటితో చేసే చికిత్సల ద్వారా మన శరీరంలోని ఏ భాగానికి రక్తప్రసరణ పెంచుకోవాలన్నా అవకాశముంటుంది. శారీరక శ్రమ చేయని వారందరికీ చర్మానికి, మిగతా భాగాలకు రక్త ప్రసరణ చాలా తక్కువగా జరుగుతుంటుంది. అందువల్లనే తక్కువ వయస్సులోనే ముసలితనం వచ్చినట్లు, ఏమీ పని చేయలేనట్లు, అవయవాలు పట్లు తప్పుతున్నట్లు ఉంటాయి. మన శరీరంలోని అన్ని అవయవాలకు, భాగాలకు ఆహారాన్ని మోసుకొని వెళ్ళేది, మరలా చెడును వాటి నుండి తిరిగి విసర్జకావయవాలకు మోసుకొని వచ్చేది రక్తప్రసరణే (రక్తమే). రక్తంలో గాలి, నీరు, ఆహారం కలిసి ప్రయాణిస్తూ ఉంటాయి. ఏ భాగానికి అయితే రక్తప్రసరణ సక్రమంగా ఉండదో ఆ భాగానికి గాలి (ప్రాణశక్తి), నీరు, ఆహారం సరిగా అందవు. పైగా రక్తప్రసరణ సరిగా లేని కారణంగా రక్తం తిరుగు ప్రయాణంలో కణాలతో ఉన్న చెడు, విసర్జక పదార్థాలను మోసుకుని వచ్చే పని కూడా సక్రమంగా జరుగదు. మనం మూడు పూటలా మంచి ఆహారం తిన్నప్పటికీ, ఆ ఆహారంలో ఉన్న పోషకపదార్థాలు రక్తంలో కలిసినప్పటికీ రక్త ప్రసరణ మందకొడిగా (సరిగాలేక) సాగేవారికి ప్రయోజనం తక్కువగా ఉంటుంది. పని చేసుకొనే వారికి తిన్నది కొద్దిగా అయినా అది కణాలకు పూర్తిగా చేరుతుంది. అందువల్లనే వారికి రోగాలు తక్కువగా వస్తుంటాయి. అమెరికా వారు మంచి పోషకాహారం తిన్నప్పటికీ ఎక్కువ రోగాలు రావడానికి కారణం సరైన వ్యాయామం లేక రక్తప్రసరణ సక్రమంగా జరగనందువల్లే. రక్తప్రసరణను పెంచడానికి ఏ రకమైన మందులు లేవు, పని చేయవు. అందువల్లనే మందులిచ్చే డాక్టర్లు కూడా నడవండి, వ్యాయామం చేయండి అని చెప్పడం. రక్త ప్రసరణ లోపం కారణంగా శరీరంలో ఉన్న అవయవాల పనితనం బాగా దెబ్బతింటుంది. మనం భోజనాన్ని సరిపడా తినకపోతే ఎంత నిరసంగా ఉంటామో అలాగే లోపలి భాగాలు ఆహారం సరిగా అందక (రక్త ప్రసరణ లేక) శక్తిహీనంగా ఉండి వాటి పనితనాన్ని కోల్పోతుంటాయి. ఆ కారణంగా వచ్చే రోగాలను ఏ విధంగా నివారణ చేస్తే తగ్గుతాయన్నది ఆలోచించాలి. పొట్టనిండా తినడం మందులు మింగడం వరకే మనిషి ఆలోచిస్తున్నాడు గానీ వచ్చిన రోగం పూర్తిగా పోగొట్టుకొనే ప్రయత్నం చేయడం లేదు. రోగులకు అనుకూలంగా డాక్టర్లు ఉంటున్నారుగానీ రోగాలకు అనుకూలంగా వైద్యం మాత్రం జరగడం లేదు. మానవ జాతికి రోగాల నుండి విముక్తి దొరకక పోవడానికి కారణాలు ఇవే.
మన పూర్వీకులు, ఋషులు శరీరానికి రక్తప్రసరణ దోషాలు రాకుండా చేయడానికి కొన్ని పద్ధతులను ఆచార వ్యవహారాలలో ఇమిడ్చి, వాటిని నిత్యం దైవపరంగా చేయమని చెప్పడం జరిగింది. ఈ కాలపు వారికి అవన్నీ చాదస్తాలు, మూఢనమ్మకాలుగా కనిపిస్తున్నాయి. ఆ పద్ధతులను ఆచరించే వారిని వింతగా చెప్పుకొనే రోజులొచ్చాయి. శరీరానికి రక్త ప్రసరణ కొరకు వారు పెట్టిన వాటిలో ముఖ్యమైనవి, మడికట్టుకొని తడిబట్టలతో వంటలు, ఉదయం చన్నీటితో బావి, కాలువ లేదా నదిలో స్నానాలు, భోజనాలకి ముందు, తరువాత కాళ్ళు కడుక్కోవడం, బయట నుండి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోవడం, కార్తీక ధనుర్మాసాలలో తెల్లవారుజామున కాలువ లేదా చెరువు స్నానాలు, తడి వలన కాళ్ళు చేతులు పుండ్లు పడకుండా పసుపు రాయడం, అప్పుడప్పుడు గోరింటాకు (పండగల పేరు చెప్పుకొని) పెట్టుకోవడం మొదలైనవి. ఆడవారు తలస్నానం చేసిన తరువాత మనలాగా ఫ్యాన్లు కింద నుంచోకుండా గుడ్డను తలకు ముడిపెట్టుకోవడం వలన ఎక్కువ సమయం చల్లదనం తలకు, మెదడుకు అంది రక్తప్రసరణ బాగా జరిగే అవకాశం ఉండేది. అలా పెట్టుకొని పూజ దగ్గర కూర్చోవడం వలన మనసు ప్రశాంతంగా, హాయిగా, నిలకడగా దైవారాధనకు అనుకూలంగా ఉండేది. వాటన్నింటినీ దూరం చేసుకొనే మనం ఈనాడు డాక్టర్లకూ, రోగాలకూ దగ్గరవుతున్నాము. ఐదు పైసలు ఖర్చు లేకుండా ఆరోగ్యం వచ్చే విలువైన ఆరోగ్య సూత్రాలను మనిషి ఆచరించలేక పోవడం అన్నింటికంటే దురదృష్టకరమైన విషయం. ఈ కాలపు పెద్దవాళ్ళకు పూర్వపు ఆచారాల విలువలు, ప్రయోజనాలు ఏమీ తెలియదనే చెప్పాలి. వారు తెలుసుకొని పిన్నలకు చెబితే వాటి ఉపయోగం, అర్థం స్పష్టంగా నాటుతుంది. అప్పుడే సమాజంలో ఇలాంటి మంచి అలవాట్లు పోకుండా ముందు తరాల వారికి అందే విధంగా ఉంటాయి. అలాగే చన్నీటి స్నానాలు ఎక్కువగా చేయటం వలన (రెండు మూడు సార్లు) మన పూర్వీకులకు ఇంకో మంచి ప్రయోజనం కూడా జరిగేది, అది శరీరం బరువు పెరగక పోవడం. మీకు ఈ మాట వింటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది గదూ! చల్లని నీరు పోసుకొంటే బరువు తగ్గడం ఏమిటని వింతగా ఉందా? నిజమండి, అదే సృష్టి రహస్యం. శరీరంలోని రక్తం గోరు వెచ్చగా ఉంటుంది. చల్లని నీరును మనం గోరు వెచ్చగా చేయాలంటే కొంత కిరోసన్ గానీ, గ్యాసు గానీ ఖర్చు అవుతుంది. అదే మనం చల్లని నీటితో తలారా స్నానం చేస్తున్నప్పుడు చల్లబడ్డ చర్మాన్నంతటిని వేడి చేయడానికి (రక్తానికున్న వేడి వరకు) మనలోని శక్తి లేదా కేలరీలు అవసరమవుతాయి (గ్యాసు లాగా ఖర్చు). అంటే మనం తిన్న ఆహారం ద్వారా వచ్చిన శక్తి లేదా కేలరీలు ఈ రూపంలో కొన్ని అదనంగా ఖర్చు అవుతాయి. తద్వారా పూర్వీకులకు శక్తి కొవ్వుగా మారే అవకాశం తక్కువగా ఉండేది. అందువల్లనే కాలువల్లో, చెరువుల్లో అరగంట స్నానం చేసిన తరువాత బాగా ఆకలెక్కువ అవ్వడంలోని అసలు రహస్యం. నిలువ ఉన్న శక్తి ఆ సమయంలో అయిపోతుంది కాబట్టి మనకు వెంటనే బాగా ఆకలవుతుంది. ఎక్కువ సమయం నీళ్ళలో ఉండే పల్లెకార్లు (జాలర్లు) సన్నగా ఉంటూ, ఎక్కువ ఆహారం తినడానికి కారణం అదే. వేడి నీటి స్నానం చేస్తే రక్తం వేడికి ఆ నీటి వేడి సరిపోతుంది కాబట్టి శరీరంలోని శక్తి ఖర్చు అవ్వవలసిన అవసరం లేదు. మన పెద్దలు కుంకుడు కాయలతో తల స్నానం చేసే రోజు తప్ప మిగతా అన్ని రోజులలో కూడా చల్లని నీటినే చేయడం జరిగేది. ఈ రోజుల్లో చల్లని నీరు పడదనే వారు నూటికి 80 మంది ఉంటున్నారు. అది సరైన మాట కాదు. చల్లని నీటికి దూరం అవ్వడమంటే ప్రకృతికి దూరం అయినట్లే. చల్లని నీటికి శరీరాన్ని అలవాటు చేసి, నీటితో చికిత్సలు ద్వారా శరీర రక్త ప్రసరణ, మంచి ఆరోగ్యము వచ్చే విధంగా తెలియజేసేవే ప్రకృతి వైద్యంలోని చికిత్సలు. ప్రకృతి నీటిలో ఇమిడ్చిన ఆరోగ్యాన్ని తిరిగిపొందే ప్రయత్నమే ఈ ఉపవాసంలో చికిత్సల యొక్క ముఖ్య ఉద్ధేశ్యము. నీరు సహజమైనది. నీటి ద్వారా వచ్చే ఆరోగ్యము కూడా సహజమైనదే అవుతుంది గదా. లక్ష్మణుని ప్రాణాలను సంజీవని కాపాడినట్లు, సహజారోగ్యమును ఆశించే మానవులను ఈ జలచికిత్సలు ఆవిధంగా కాపాడగలవని నా విశ్వాసం.
వేడి నీటి ధర్మం: చల్లని నీటి ద్వారా శరీరం ఒక రకంగా స్పందిస్తే, వేడి నీటికి శరీరం వేరే విధంగా స్పందిస్తుంది. చలికి సంకోచించుకొనే గుణం ఉంటే, వేడికి వ్యాకోచించుకొనే గుణం ఉంటుంది. చర్మాన్ని చల్లబరిస్తే ముందు సంకోచించుకొని తరువాత వ్యాకోచించుకొంటుంది అని ఇంతకు ముందు తెలుసుకొన్నాం. ఇప్పుడు వేడి పెడితే చర్మం ఏమవుతుందో చూద్దాం. చర్మానికి వేడి తగిలిన వెంటనే ఆ చర్మభాగంలోని సూక్ష్మమైన రక్తనాళాలు ముందు వ్యాకోచిస్తాయి. దాని కారణంగా లోపల రక్తనాళాలలో నుండి సూక్ష్మమైన రక్తనాళాలలోనికి ఎక్కువ రక్తం ప్రవేశిస్తుంది. అందువల్లనే కొద్దిగా కాలినప్పుడు గానీ, వేడి నీరుగానీ, వేడి కూరలు గానీ మీదపడ్డప్పుడు ఆ భాగంలో చర్మం ఎర్రగా అవ్వడం మనం గమనిస్తూ ఉంటాము. పైన చెప్పుకున్న మార్పే అప్పుడు జరుగుతుంది. మనం వేడి ఏ ప్రక్కన పెడితే ఆ ప్రక్కకు సంబంధించిన లోపలి అవయవాలలో కూడా రక్తప్రసరణలో మార్పులు రావడం జరుగుతుంది. ఎక్కువ సమయం రక్తం ఈ విధంగా వేడి పెట్టిన భాగానికే రావడం జరుగుతుంది. రక్తం ఈ విధంగా రావడాన్ని చర్య (యాక్షన్) అంటారు. వేడి మనం పెట్టినంత సేపు రక్తనాళాలు వ్యాకోచించుకొనే ఉంటాయి. వచ్చిన రక్తం వెనక్కు వెళ్ళదు కాబట్టి మనకు వేడి పెట్టిన దగ్గర చెమట రావడం ప్రారంభమవుతుంది. సూక్ష్మమైన రక్తనాళాలలోనికి ఎక్కువ ప్రాణశక్తి ప్రవేశించడం వలన చెమట ఎక్కువగా పడుతుంది. చర్మానికి వచ్చిన రక్తం వెనక్కు వెళ్ళదు కాబట్టి వేడినీటికి ప్రతిచర్య (రియాక్షన్) ఉండదు. అదే చల్లని నీటికయితే చర్య, ప్రతిచర్య రెండూ ఉంటాయి. అందువల్లనే వేడినీటికి ఉపయోగం తక్కువ ఉంటుంది. దీని వలన ఎప్పుడు వేడినీటితో చికిత్సలు చేసినా తరువాత ఆ భాగాన్ని మరలా చన్నీటితో చికిత్స చేసి గానీ ఆపకూడదు. ఎందువలనంటే వేడికి వ్యాకోచించిన రక్తనాళాలు, కండరాలు తిరిగి సంకోచించు కోవాలంటే చల్లని నీరును ఆ భాగానికి ఉపయోగించాలి. అప్పుడు చల్లదనానికి ఆ భాగం సంకోచించుకొని, మామూలు రక్త ప్రసరణకు అవకాశం కలుగుతుంది. చల్లని నీటికి జరిగినట్లు వేడి నీటికి రక్త ప్రసరణ బాగా జరుగదు. అందువల్లనే వేడి నీటి స్నానం అయ్యిన తరువాత మనకు చలి అనిపిస్తుంది. వేడినీటి స్నానం చేసే వారికి చర్మం పొడిగా, ఎండిపోయినట్లు తెల్లగా అనిపిస్తుంది. వేడి నీటిని వాడినప్పటికీ కొద్దిసేపు చేయగానే మరలా చల్లని నీటితో ప్రారంభించి, చల్లని నీటితోనే స్నానం ఆపితే దాని వలన నష్టం ఉండదు. ఈ విధంగా చేయాలంటే మనస్సు ఒప్పుకోదు. వేడి నీటిని నాలుగూ చెంబులు పోసుకొని తరువాత చల్లని నీరును వాడాలంటే మరీ చలిగా అనిపిస్తుంది. అలా చేయలేము కాబట్టి వేడినీటితో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని మాత్రం మరువకండి. పాంచ భౌతిక శరీరానికి పంచ భూతాలతో చేసే చికిత్సల గురించి తెలుసుకుందాము.
I. జల చికిత్సలు: వేడి నీటిని గానీ, చల్లని నీటిని గానీ ఈ చికిత్సలకు వాడతారు.
1. చల్లని నీటితో పాదస్నానం: వెడల్పాటి బేసిన్ లో లేదా తొట్టిలో చల్లని నీటిని పోయాలి. మనం కుర్చీలో కూర్చొని రెండు పాదాలను గిలకల వరకూ అందులో ముంచి యుంచాలి. ఆ విధంగా చల్లని నీటిలో 12 నుండి 15 నిముషాల వరకూ కాళ్ళను ఉంచాలి. మధ్య మధ్యలో ఎప్పుడన్నా కాళ్ళతో నీటిని కదుపుతూ ఉండాలి. ఆ టైము అయిన తరువాత కాళ్ళను తీసి పది నిముషాలు అటూ ఇటూ నడవడమో లేదా పొడిగుడ్డ పెట్టి వేడి వచ్చే వరకూ పాదాలను రుద్దడం మంచిది. రక్తప్రసరణను మళ్ళీ వెనుకకు పంపించడం కొరకు అలా చేయాలి. అంతకంటే ఎక్కువ సమయం నీటిలో ఉంచరాదు. ఈ చల్లని నీటి పాదస్నానం వలన తలలో, ఛాతిలో రక్తపు ఒత్తిడి తగ్గుతుంది. పొట్టకు, ఊపిరితిత్తులకు ఉపయోగంతోపాటు కాళ్ళలో అలసత్వాన్ని తగ్గించడానికి, కాళ్ళు పీకులు అరికట్టడం, ప్రేగుల యొక్క పనితనాన్ని మెరుగు చేయడానికి పనికి వస్తుంది. అలాగే కాళ్ళు తిమ్మిర్లు ఎక్కే వారికి, స్పర్శ తెలియని వారికిది ప్రయోజనకారి.
2. వేడి నీటితో పాదస్నానం: వెడల్పాటి బేసిన్ లో గోరువెచ్చటి నీటిని పోసి అందులో రెండు పాదాలను ముంచాలి. మాడు మీద కొద్దిగా, తడపడం గానీ తడిగుడ్డ గానీ వేయాలి. నాలుగు నిముషాలు గడిచిన తరువాత నీటి వేడిని మనం భరించగలిగినంత వరకూ పెంచుకోవచ్చు. ఆ విధంగా ఒకటి రెండు సార్లు వేడి నీటిని కలుపుకొంటూ 10 నుండి 15 నిముషాల వరకూ పాదాలను బేసిన్ లో ఉంచాలి. పాదాలను తీసి వేసిన తరువాత బేసిన్ లో చల్లని నీరు పోసి రెండు నిముషాల సేపు అందులో ఉంచడం చేయాలి. లేదా 4, 5 చెంబుల చల్లని నీటితో కాళ్ళను కడుక్కోవాలి. వేడి నీటి పాదస్నానం వలన గుండె బరువుగా ఉన్నవారికి, గుండె నొప్పిగా ఉన్నవారికి ఉపయోగం కలుగుతుంది. రొంపలు ఉన్నవారికి, గొంతు రొంప ఉన్నవారికి సహకరిస్తుంది. కాళ్ళ నొప్పులను తగ్గించడం కొరకు బాగా పనికి వస్తుంది. నిద్ర సరిగా పట్టని వారికి ఈ పాద స్నానం చేసి పడుకొంటే చక్కటి నిద్రపడుతుంది.
3. వేడినీటి, చన్నీటి పాదస్నానాలు: రెండు బేసిన్ లు ప్రక్క ప్రక్కనే పెట్టాలి. ఒక దానిలో వేడినీరు, ఇంకో దానిలో చల్లని నీరు పోయాలి. తల మీద తడిగుడ్డ పెట్టుకొని ముందు ఐదు నిముషాలు వేడినీటిలో ముంచి యుంచాలి. తరువాత పాదాలను వేడి నీటి నుండి తీసి ఒక నిముషము చల్లని బేషిన్ లో ముంచి యుంచాలి. తరువాత మరలా ఐదు నిముషాలు వేడి నీటిలో ఉంచి, ఒక నిముషము చల్లని నీటిలో ముంచాలి. ఈ విధంగా ఇంకొక సారి చేయాలి. ఈ విధంగా మార్చి చేసే స్నానాల వలన కాళ్ళకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. వేడి నీటిలో పెట్టిన వెంటనే కాళ్ళలోని రక్తం అంతా పాదాలకు చేరుకుంటుంది. చన్నీటిలో ముంచడం వలన పాదాలలోని రక్తం అంతా తిరిగి కాళ్ళపైకి వెళుతుంది. ఈ విధంగా పైకీ, క్రిందకు రక్త ప్రసరణ బాగా జరగడం వలన మూసుకొని పోయిన రక్తనాళాలు తిరిగి బాగయ్యే అవకాశం ఉంటుంది. బాగా తిమ్మిర్లు, మడాల నెప్పులు ఉన్నవారికి చాలా బాగా గుణాన్ని ఇవ్వగలదు. అలాగే ఎప్పుడూ కాళ్ళు చల్లబడే వారు అంటే కాళ్ళు చల్లగా ఉండే వారికి ఇది చేస్తే పాదాలు వేడిగా అవుతాయి. రక్తపు ఒత్తిడి ఎక్కువ అయ్యి వచ్చే తలనెప్పులు, నరాలకు సంబంధించి వచ్చే తల నెప్పులు దీని ద్వారా తగ్గుముఖం పడతాయి. శరీరం అలసటగా ఉన్నప్పుడు దానిని తొలగించడానికి, నిద్ర పట్టడానికి, కాళ్ళకు నీరు పట్టినప్పుడు నీరు తగ్గడానికి ఈ విధానం బాగా పనికి వస్తుంది.
4. చేతికి చికిత్సలు: గిన్నెలో చల్లని నీరు పోసి ఎడమ చేతిని గుత్తి వరకూ అందులో ముంచి 10 నుండి 15 నిముషాలు వరకూ అందులో ఉంచితే గుండెకు రక్తప్రసరణ బాగా పెరుగుతుంది. గుండెకు రక్తాన్ని అందించే కరోనరీ ఆర్టరీలు ప్రభావితం అయ్యి ఎక్కువ రక్తప్రసరణ గుండెకు అందించి గుండెనెప్పులు రాకుండా కాపాడగలదు. అదే కుడి చేతిని వేడినీటితో కాపడం గానీ, వేడినీటిలో గానీ ముంచడం చేస్తే నుదుటి మీద వేడెక్కడం, చర్మం వేడెక్కడం జరుగుతుంది.
5. కాపడాలు (వేడి పెట్టడం): ఏ భాగంలో నెప్పియున్నా లేదా ఏ భాగంలో రక్తప్రసరణ పెంచుకోవాలన్నా ఈ కాపడాలు ఉపయోగిస్తాయి. ఏ భాగం దగ్గరైతే మనం కాపడాలు పెట్టుకోవాలనుకుంటామో, ముందు ఆ భాగానికి కొద్దిగా నువ్వుల నూనెను మర్ధనా చేసుకోవాలి. ఆ విధంగా మర్ధన 10 నిముషాలు చేయడం మంచిది. మనం పెట్టే వేడి వలన చర్మం దెబ్బతినకుండా ఉండడానికి నూనెను రాయాలంటున్నాము. తరువాత మరిగించిన నీళ్ళను గిన్నెలోనికి తీసుకొని, గుడ్డను ఆ నీటిలో ముంచి ఆ నీటిని పిండివేసి, అ గుడ్డ యొక్క వేడిని మనం అనుకున్నచోట పెట్టుకోవాలి. వేడి నీటి బ్యాగ్గులు ఉన్నా, అందులో వేడి నీటిని పోసుకొని కాపడం పెట్టవచ్చు. కాపడాన్ని ఎక్కువ వేడితో పెట్టినప్పుడు 10 నిమిషాలు మించి పెట్టరాదు. అదే గోరు వెచ్చని నీటితో అయితే 15—20 నిమిషాల వరకు పెట్టవచ్చు. కాపడం పెట్టేటప్పుడు మన మనస్సు కాపడం పెట్టుకొనే భాగం మీదే లగ్నం చేయాలి. కొద్ది కొద్దిగా తగ్గుతున్నట్లు ఊహించాలి. కండరాలలో, జాయింట్లలో నెప్పి ఉన్నప్పుడు వేడి పెట్టడం వలన ఆ భాగాలు వేడికి ప్రభావితం అయ్యి బిగపట్టడం, నెప్పి బాగా తగ్గుతాయి. గోరువెచ్చని నీటితో ఎక్కువసేపు కాపడం పెట్టడం వలన కండరాల నెప్పులు బాగా సర్దుకొని కండరాలకు మత్తు కలుగుతుంది. పొట్టలో నెప్పి, పొట్టలో గ్యాసు, ప్రేగులు మెలితిప్పడం ఉన్నప్పుడు వేడినీటి కాపడం పొట్టమీద చేసి లోపలకు వేడి నీరును త్రాగితే అవి సర్దుకుంటాయి. పొట్ట మీద వేడి పెట్టడం ద్వారా ప్రేగులలోని కదలికలు తగ్గుతాయి. ప్రేగులలోని జీర్ణాదిరసాలను (గ్యాస్ట్రిక్ యాసిడ్) వేడి కాపడం తగ్గిస్తుంది. పొట్టలో లివరు భాగం మీద వేడి కాపడాలు పెట్టడం ద్వారా లివరుకు రక్తప్రసరణ పెరిగి లివరు యొక్క పని తీరు మెరుగవుతుంది. కీళ్ళలో, మోకాళ్ళలో నెప్పులున్న వారు వేడి పెట్టడం వలన ముందు కొద్ది ఉపశమనం ఉంటుంది. 10 నిమిషాలు మించి వేడి పెట్టరాదు. మనం పెట్టే వేడి కీళ్ళలోనికి ఎక్కువ వెళ్ళలేదు. ఈ వేడి కారణంగా కీళ్ళలోని వేడి తగ్గే (ఇన్ ట్రా ఆర్టిక్యులర్ టెంపరేచర్) అవకాశముంటుంది. తరువాత వెంటనే కీళ్ళకు చల్లటి తడిగుడ్డలు లేదా మట్టి వేయడం గానీ చేయాలి. దీని ద్వారా కీళ్ళలో వేడి బాగా ఉత్పన్నమవుతుంది. ఏ భాగంలో వేడినీటి కాపడాన్ని పెట్టినప్పటికీ, ఆ భాగాన్ని తరువాత చల్లని నీటితో గానీ, మట్టితో గుడ్డలు గానీ వేయాలి. ఆ చల్లని గుడ్డను 10—15 నిమిషాల వరకు ఉంచవచ్చు. మనస్సును పట్టీ వేసిన ప్రాంతంలో ఉంచి, అక్కడ జరిగే మార్పులను గమనిస్తూ రక్తప్రసరణ బాగా జరిగే విధంగా ఆలోచించాలి.
6.తడికట్లు: నెప్పులున్న వారు ముందు కాపడం పెట్టిన తరువాత ఆ భాగానికి ఈ తడికట్లు వేయాలి. మెత్తని కాటను గుడ్డను చల్లని నీటితో తడిపి ఆ భాగాన్ని ఈ గుడ్డ పెట్టి లేదా చుట్టి పైన ఇంకొక నీటిని పీల్చుకోని పొడి గుడ్డను చుట్టి వేయాలి. ఆ తడికట్టు మీద గాలి ఆడకుండా పొడి గుడ్డను చుట్టి వేయాలి. దీని ద్వారా ఆ భాగానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. జ్వరం వచ్చినప్పుడు పొట్టకు కాపడం లేకుండా తడికట్టు వేస్తే వెంటనే చెమట పట్టే అవకాశముంటుంది. చలి తగ్గే అవకాశముంటుంది. నెప్పులు లేకుండా కేవలం రక్తప్రసరణను పెంచడానికైతే ఆ భాగానికి తడిగుడ్డ వేయడం వలన ఉపయోగం ఉంటుంది. ఈ విధంగా ఏ భాగానికి తడికట్లు వేస్తే ఆ భాగానికి వెంటనే రక్తప్రసరణ జరుగుతుంది. 15—20 నిమిషాల వరకు ఉంచవచ్చు.
7. తొట్టి స్నానాలు: ఇందులో మూడు, నాలుగు రకాల తొట్టి స్నానాలు ఉన్నాయి. వేడి నీటిని, చల్లని నీటిని కూడా తొట్టె స్నానానికి వాడతారు.
గుండ్రని తొట్టెలో చల్లని నీటిని పోసి అందులో కాళ్ళు బయట పెట్టి కూర్చోవాలి. తొడల దగ్గర నుండి బొడ్డు భాగం వరకు నీటిలో మునిగి యుండాలి. బొడ్డు పై భాగం, తొడల క్రింద భాగం నీటితో తడవకూడదు. శరీరంలోని ఎక్కువ భాగం రక్తం మనం తొట్టిలో తడిపిన భాగానికి చేరుకుంటుంది. తొట్టి స్నానం ద్వారా ఎక్కువ శాతం రక్తాన్ని పెద్ద ప్రేగులకు, గర్భాశయానికి, పొత్తి కడుపుకు పంపే అవకాశం కలుగుతుంది. తొట్టి స్నానం 15 - 20 నిమిషాల వరకు చేయవచ్చు. తొట్టి స్నానం చేసేటప్పుడు పొత్తికడుపు మీద చేతిని పెట్టి రుద్దుతూ ఉండాలి. దీని ద్వారా రక్తప్రసరణ ఆ భాగాలకు చేరే అవకాశం ఉంటుంది. రోగి యొక్క పరిస్థితిని, రోగాన్నీ బట్టి తొట్టి స్నానం చేయించే విధానం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఈ తొట్టి స్నానాలు చాలా ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తాయి. అన్ని రకాల దీర్ఘరోగాలు నివారించడానికి ఇవి అవసరం. అలాగే పక్షవాతము, సమస్తమైన నాడీ వ్యాధులు, గర్భకోశ వ్యాధులు, బహిష్టుకు సంబంధించిన వ్యాధులు, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు, మూలశంఖ (మొలలు), దాంపత్య జీవితానికి సంబంధించిన లోపాలు, గ్యాసు, మలబద్ధకం, జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధులు, కఫాన్ని తగ్గించడం కొరకు మొదలగు అన్ని వ్యాధులకు ఈ తొట్టి స్నాన విధానం అద్భుతంగా పనిచేయగలదు. ప్రతి ఇంటిలో ఒక తొట్టి తప్పని సరిగా ఉండాలి. అంత ముఖ్యమైనది.
8. నీటి ఆవిరి: చెమట పట్టే వారికి ప్రతిరోజూ చెమటలో వ్యర్థపదార్థాలు బయటకు పోతూ ఉంటాయి. చెమట పట్టకుండా చర్మంలో చేదు పదార్థాలు మిగిలిపోయే వారికి నీటి ఆవిరి ద్వారా పోగొట్టవచ్చు. ఉపవాసంతో చర్మంలోని వ్యర్థపదార్థాలను, ఉప్పును పూర్తిగా బయటకు పోయేటట్లు చేయడానికి ఈ నీటి ఆవిరి విధానం బాగా పనికి వస్తుంది. ఉపవాసం చేసే వారే ఆవిరి పట్టుకోవాలనేమీ లేదు. వారానికి, పది రోజులకు ఒకసారి మాములు రోజులలో కూడా పట్టుకోవచ్చు. ఆవిరి పట్టే విధానం తెలుసుకుందాం.
ఆవిరి పట్టే ముందు శరీరం అంతటకు నూనె మర్దనా (నువ్వుల నూనె) బాగా చేయించుకోవచ్చు. అవకాశం లేని వారు వారే చేతులతో నూనెను రాసుకోవడం మంచిది. మనం పట్టే వేడినీటి ఆవిరికి చర్మం దెబ్బతినకుండా ఈ నూనె సహకరించగలరు. అదీగాక నూనె మర్దన చేయడం ద్వారా చర్మానికి రక్తప్రసరణ బాగా పెరుగుతుంది. మర్దన ద్వారా చర్మంలోని సూక్ష్మమైన రంధ్రాలు తెరచుకొనే అవకాశం కలుగుతుంది. అందువలన చెమటతో ఎక్కువ వ్యర్థపదార్థాలు బయటకు పోయే అవకాశం కలుగుతుంది. ఆవిరి పట్టే ముందు నూనె మర్దన ముఖ్యం. ఆవిరి పట్టుకొనే ముందు రెండు గ్లాసులు మంచినీరు తప్పని సరిగా త్రాగాలి. మన శరీరంలోని ఎక్కువ నీరు చెమట రూపంలో బయటకు పోవడం కారణంగా శరీరానికి నీరసం వచ్చే అవకాశం ఉంటుంది (నీరు తగ్గి). ముందే రెండు మూడు గ్లాసులు నీరు త్రాగడం వలన మనలో నుండి బయటకు వచ్చే చెమట స్థానంలో మనం త్రాగే నీరు చేరి మనకు ఇబ్బంది రాకుండా చేస్తుంది. ఆవిరి పట్టే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలలో మొదటిది నీరు త్రాగడం అయితే, రెండవది మాడు మీద తడపడం, తడిగుడ్డ పెట్టుకోవడం చాల ముఖ్యమైనది. దీని వలన తలకు, మెదడుకు రక్తప్రసరణ తగ్గకుండా ఉంటుంది. తడిపిన దగ్గరకు రక్తం వెళ్ళుతుంది కాబట్టి తలకు కావలసిన రక్తం అందిన తరువాతే మిగతా రక్తం అంతా చర్మానికి చేరుకుంటుంది. తల తడపకపోతే మెదడుకు వెళ్ళవలసిన రక్తం కూడా చర్మానికి వచ్చి తల డిమ్ గా అవ్వడమో లేదా కళ్ళు తిరిగి పడిపోవడమో లేదా బాగా నీరసం రావడమో జరగవచ్చు.
ప్రకృతాశ్రమాలలో అయితే ఆవిరి పట్టడానికి ఒక పెట్టె ఉంటుంది. అందులో కూర్చొని పట్టుకోవచ్చు. మన ఇంట్లో కూడా ఆవిరి పట్టుకొనే విధానం వుంది. మనం ఒంటికి నూనె రాసుకొనేటప్పుడే పొయ్యి మీద పెద్ద నీళ్ళ బిందె లేదా కాగులో నీటిని సగం వరకూ పోసి మూతను గట్టిగా పెట్టి మరిగించి ప్రయత్నం చేయాలి. ఆ బిందె అడుగు బాగా వెడల్పు ఉండి, పైన మూతి చిన్నదిగా యున్నదైతే ఆవిరి పట్టుకోవడానికి తేలికగా ఉంటుంది. నీళ్లు బాగా బుడగలు వచ్చే వరకూ మరగనివ్వాలి. మరిగేటప్పుడు నీటి మోత వినబడాలి. అలాగే కరెంటు రైసు కుక్కర్ ఉన్నవారైతే దానితో పట్టుకోవచ్చు. అందులో నీరు నాలుగోవంతు పోసి బాగా మరగనివ్వాలి. బాత్ రూమ్ లో ఒక స్టూలు వేసుకోవాలి. అలాగే (డబుల్ కాట్ బెడ్ షీట్) రెండు మంచాలకు సరిపడే పెద్ద రగ్గులాంటి లావు దుప్పటిని దగ్గర పెట్టుకోవాలి. మరిగించిన నీటి బిందెను పొయ్యిమీద నుండి దింపి మూతతో బాత్ రూమ్ లో పెట్టుకోవాలి. ఆవిరి పట్టే ముందు బట్టలను పూర్తిగా తీసివేసి, స్టూలు మీద ముందుకు జరిగి కూర్చొని, కాళ్ళను వెడల్పుగా పెట్టి, కాళ్ళ మధ్యలో బిందెను నేలమీద మూతతోపాటే ఉంచి పెట్టుకోవాలి. నీళ్లు త్రాగి, తల తడుపుకొని ఆ విధంగా కూర్చొని దుప్పటిని పూర్తిగా కప్పుకోవాలి. దుప్పటిలో మనం, స్టూలు, బిందె పూర్తిగా గాలి ఆడకుండా (వెలుతురు రాకుండా) కప్పివేయబడి ఉండాలి. అప్పుడు బిందెపై మూతను ముందు ఒక పావు వంతు మాత్రమే (కొద్దిగా) ప్రక్కకు జరపాలి. ఐదు నిముషాలు గడిచిన తరువాత ఇంకొద్దిగా జరుపుకోవాలి. మూడవసారి పూర్తిగా మూతను తీయవచ్చు. లేదా నాలుగవ సరి మూతను పూర్తిగా తీయవచ్చు. ఆఖరుకు (పూర్తిగా మూత తీసిన తరువాత) గరిటె దగ్గరగా పెట్టుకొని దానితో నీటిలో కదిపితే ఇంకా బాగా ఆవిరి వస్తుంది. పది నుండి ఇరవై నిముషాల సమయం లోపులో బిందెలో ఆవిరి పూర్తిగా అవ్వడం, మనకు బాగా చెమట పట్టడం జరుగుతుంది. ఆవిరి పట్టుకునేటప్పుడు తల దుప్పటి లోపల ఉండటం వలన భయం అనిపించేవారుగానీ, గాలి ఆడడం లేదని ఇబ్బంది పడేవారు గానీ తలను బయటపెట్టి, మెడ వరకూ దుప్పటి కప్పుకుంటే సరిపోతుంది. అదే రైస్ కుక్కరుతో పట్టుకొనే వారు అయితే బిందె స్థానంలో అది పెట్టి, కరెంటుతో నీరు మరుగుతుండగానే మనం ఆవిరి పట్టుకుంటూ ఉండాలి. 10 - 15 నిమిషాలు గడిచిన తరువాత కరెంటు కట్టి వేస్తే సరిపోతుంది. ఆవిరి పట్టుకోవడం పూర్తి అయిన తరువాత దుప్పటిని తీసివేసి, శరీరాన్ని గాలికి 5, 6 నిముషాలు చెమట ఇంక నివ్వాలి. తరువాత చల్లని నీటితో తలకు స్నానం చేయాలి. ఎక్కువ నీరు పోసుకోవడం మంచిది.
ప్రకృతాశ్రమంలో పట్టే ఆవిరైతే ఎక్కువ చెమట ఒక్క రోజే పోయే అవకాశం ఉంటుంది. దాని ద్వారా కొద్దిగా నీరసం అనిపించవచ్చు. అందులో కూడా తేలిగ్గా పట్టుకొంటే ఎవరికీ నీరసం రాదు. పెట్టెలో కూర్చొని పట్టే ఆవిరి అయితే వారానికి రెండు రోజులే పట్టుకోవాలి. ఇంట్లో పట్టుకొనే ఆవిరి అయితే రోజు మార్చి రోజు పట్టుకోవచ్చు. దీని ద్వారా నీరసం వచ్చే అవకాశం అసలు లేదు. గమనిక: నీరసంగా ఉన్నవారు గానీ, బి.పి. బాగా ఎక్కువగా ఉన్న వారు గానీ, విరేచనాలు, వాంతులు అవుతున్న వారుగానీ ఆవిరి పట్టకూడదు. అలాగే బాగా రక్తం తక్కువ ఉన్నవారు, గుండెజబ్బుతో బాధపడేవారు డాక్టరు సలహా మీదే ఆవిరి పట్టుకోవాలి.
ఆవిరి పట్టేటప్పుడు శరీరంలో మార్పు: నీటి ఆవిరితో శరీరం వేడెక్కుతున్నప్పుడు, చర్మానికున్న సూక్ష్మమైన రక్తనాళాలు తెరుచుకొని, వాటిలోనికి ఎక్కువ ప్రాణశక్తి ప్రవేశిస్తుంది. దానితో చెమట పట్టడం ప్రారంభిస్తుంది. ఆవిరి పట్టేటప్పుడు మామూలు కంటే కూడా గుండె రక్తాన్ని ఎక్కువగా చిమ్ముతూ ఉంటుంది. శరీరాన్ని వేడిచేసినప్పుడు మన ఉదరభాగంలో ఉన్నస్ల్పీన్ సంకోచించుకొని అందులో నిలువ వుండే ఎర్రరక్తకణాలను రక్తంలోకి విడుదల జేస్తుంది. అందువలన రక్తంలోనికి కొత్తగా ఎర్రరక్తకణాలు వచ్చి కలుస్తాయి. ఆవిరి పట్టేటప్పుడు టిష్యూలలో, కండరాలలో, రక్తనాళాలలో చుట్టూ ఉన్న ద్రవం కొంత వచ్చి రక్తంలో కలుస్తుంది. వీటి ద్వారా రక్తంలోని ప్లాస్మా పలుచబడుతుంది.
ఈ విధంగా ఆవిరి పట్టేటప్పుడు 15 - 20 నిమిషాల సమయంలో రక్తపరిమాణం పెరగడం, రక్తంలోని ఎర్రరక్తకణాల కారణంగా శ్వాసక్రియ తగ్గుతుంది. ఎప్పుడైతే చర్మం వేడిపెరిగిందో అప్పుడు కొద్దిగా బి.పి. పెరుగుతుంది. చెమట పట్టడం అనేది వేడిని బట్టి, మెటబాలిక్ రేటును బట్టి, శరీరంలో ఉన్న ఉప్పును బట్టి, చెమట గ్రంథులను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇంట్లో పట్టే ఆవిరిలో అయితే అరలీటరు నుండి లీటరు వరకు చెమట పడితే, పెట్టెలో పట్టిన ఆవిరిలో లీటరు నుండి లీటరున్నర చెమట పడుతుంది. శరీరంలో ఉప్పు బాగా ఎక్కువ ఉన్నవారికి చెమట తక్కువగా పడుతుంది. ఆవిరి పట్టేటప్పుడు పట్టే చెమటలో సుమారు 10 - 20 గ్రాముల ఉప్పు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. చెమట బాగా కారిపోవడం వలన పెరిగిన రక్త పరిమాణం ఆవిరి పట్టడం పూర్తి అయ్యే సరికి తిరిగి మామూలుకు చేరుకుంటుంది. ఆవిరి పట్టడం వలన కిడ్నీల ద్వారా వెళ్ళవలసిన ఉప్పు, యూరియా చెమట ద్వారా పోయే అవకాశం కలుగుతుంది. ఆవిరి పట్టడం ద్వారా కిడ్నీలపై ఉండే ఎడ్రినల్ గ్రంథులు ప్రభావితం అయ్యి రక్తంలోని ఇస్నోఫిల్స్ ను తగ్గించడానికి సహకరిస్తాయి. ఆవిరి పట్టిన దగ్గర నుండి మూడు రోజుల వరకు రక్తంలో ఇసినోఫిల్స్ తగ్గుతూ ఉంటాయి. ఇసినోఫీలియా ఉన్న వారికి ఆవిరి చాలా బాగా సహకరించగలదు. ఆవిరి ద్వారా శరీరంలోని పాత నీరు చెమట ద్వారా బయటకు పోతూ ఉంటే, మంచినీటి ద్వారా ఆ తగ్గిన నీటి శాతాన్ని అందిస్తూ ఉండాలి. చెరువుకు పాతనీరును తీసివేసి క్రొత్తనీరును పెట్టినట్లు, ఉపవాసంతో నీటి ఆవిరి ద్వారా మన శరీరాన్ని ఆ విధంగా చేసుకోవచ్చు.
II. మృత్తికా చికిత్స (మట్టి - భూమి): మట్టితో చేసే చికిత్సలను మృత్తికా చికిత్స అంటారు. మట్టి నుండి వచ్చే ఆహారములను ఆధారంగా చేసుకొని సమస్త జీవరాశులు జీవించుచున్నవి. మట్టిలో ఉత్కృష్టమైన ఓషధీ గుణాలు ఉన్నాయి. అయితే మట్టి రకాలలో పంట కాలువలలో పేరుకొని యుండు ఒండ్రుమట్టి చాలా శ్రేష్టమైనది. లేదా నల్లని బంక మట్టిని తెప్పించి నానబెట్టుకొని దానిని వాడవచ్చు. అలాగే ఎర్రటి పుట్టమట్టిని నానబెట్టి కూడా వాడుకోవచ్చు.
1. మట్టి పట్టీలు: ఒక పలుచని మెత్తని గుడ్డను పరిచి అందులో నాని చల్లగా ఉన్న ఒండ్రుమట్టిని నాలుగైదు అంగుళాల వెడల్పున, 10 - 12 అంగుళాల పొడవున, రెండు మూడు అంగుళాలు మందాన మట్టి వేసి, గుడ్డను నాలుగు ప్రక్కలా పైకి మడిచి దానిని తీసుకొని వెళ్ళి బొడ్డు క్రింద (పొత్తి కడుపు మీద) వేసుకోవాలి. దీనిని ఎనిమా చేసుకొనే ముందు 15 నిముషాలు వేసుకొని తీసి వేయడం మంచిది. దీని ద్వారా వచ్చే చల్లదనం పెద్దప్రేగును సంకోచింప చేస్తుంది. తద్వారా పెద్దప్రేగులోనున్న మలం ఆ సంకోచానికి ముందుకు కదిలే అవకాశం ఉంటుంది. మట్టి చల్లదనానికి పొట్ట భాగంలోని రక్తం అంతా పొత్తికడుపుకు చేరుకుంటుంది. ఆ భాగంలో చల్లని చర్యకు ప్రతి చర్యగా వేడిపుడుతుంది. దీని కారణంగా పొట్టలో మిగతా భాగాలకు కూడా ఎక్కువ రక్త ప్రసరణ జరిగే అవకాశం వుంది. పేగులలోని కదలికలను పెంచడానికి మట్టి పట్టీలు వాడవచ్చు. మట్టి అవకాశం లేని వారు చల్లటి తడిగుడ్డను (ఫ్రిజ్ నీరు పనికి రాదు) పొత్తికడుపు మీద వేసుకోవచ్చు. రెండు పూటలా మట్టి పట్టీలను వాడవచ్చు.
2. మట్టి పూత: మంచి ఒండ్రు మట్టిని చర్మవ్యాధులు వచ్చిన వారికి పూర్తి శరీరం అంతా పూస్తారు. శరీరానికి పట్టినంత మట్టిని పూయవచ్చు. మట్టిని రాసుకున్న తరువాత ఎండలోకి వెళ్ళకుండా నీడను కూర్చోవాలి. మట్టిలోని చల్లదనం అంతా శరీరం నుండి వచ్చే వేడికి 20 -25 నిముషాలలో పూర్తిగా తగ్గిపోయి మట్టి ఎండిపోతుంది. మట్టిలో నున్న ఔషధ గుణాలు చర్మానికున్న దోషాలను నివారించడానికి సహకరిస్తాయి. మట్టి ద్వారా చర్మానికి వచ్చినంత చల్లదనం మరో విధంగా రాదు. చర్మానికి రక్తప్రసరణ సరిగా జరగనందువల్లే ఎక్కువ చర్మ వ్యాధులు వస్తుంటాయి. మట్టి పూత వలన చర్మానికి ఎక్కువ రక్త ప్రసరణ జరుగుతుంది. తద్వారా ఎక్కువ ప్రాణశక్తి చర్మానికి వచ్చి చర్మ సంబంధ వ్యాధులను తగ్గించడానికి సహకరిస్తుంది. మట్టిపూత ద్వారా చర్మానికున్న దురదలు బాగా తగ్గుతాయి. సామాన్యంగా చర్మవ్యాధులున్న వారికి చర్మం బిగపడుతూ, పొడిగా, ఎండిపోయినట్లు ఉండి చాలా బాధగా ఉంటుంది. వారికి ఉపవాసంలో మట్టి పూయడం వలన ఆ బాధలన్నీ సర్దుకొంటాయి. మట్టి పూయడం ద్వారా చర్మానికి వచ్చిన ఎక్కువ రక్తం చర్మాన్ని తొందరగా రిపేరు చేసుకొనే అవకాశం కల్పిస్తుంది. దీర్ఘ చర్మవ్యాధులకి, సోరియాసిస్, గజ్జి, తామర, నీరు పట్టిన శరీరం, మొటిమలు, దురదలు, చర్మ అలర్జీలు మొదలగు చర్మ సంబంధ వ్యాధుల నుండి ఉపశమనం పొందడానికి మట్టి పూతను వాడవచ్చు. బాగా కీళ్ల నెప్పులు వున్నవారు నూనె రాసి వేడి నీటి కాపడం పెట్టిన తరువాత మోకాళ్ళకు ఈ మట్టిని దళసరిగా, గుండ్రంగా పూసి పైన గుడ్డ పెట్టి చుట్టివేస్తే పడిపోకుండా ఉంటుంది. ఆలా 20 నిమిషాలు ఉంచి కడిగి వేస్తే బాధలు తగ్గుతాయి. మోకాళ్ళు, మిగతా కీళ్లు బాగా నీరు పట్టి వచ్చి ఉంటే ఆ భాగాలకు వేసే మట్టిలో కొద్దిగా ఉప్పును నానబెట్టి పూర్తిగా కలిపినా తరువాత ఆ మట్టిని పట్టీ క్రింద (పైన చెప్పినట్లు) వేస్తే నీరు, వాపులు త్వరగా లాగేస్తాయి. ఉప్పుకు నీరును లాగేసే గుణం ఉన్నందువల్ల ఈ విధంగా చేయవచ్చు. కీళ్ళ నెప్పులకు మట్టి పట్టీలు రెండు పూటలా చేయడం మంచిది.
III. సూర్య చికిత్స: సూర్యుడు లేనిదే సృష్టిలేదు. ఆరోగ్యాన్ని కాపాడేది, ప్రసాదించేది సూర్యుడే. ప్రతి ప్రాణిలోని జీవ చైతన్యమునకు సూర్యుడే మూలాధారం. మనలోని ప్రతి అణువును చైతన్యవంతం చేసి నడిపించేది సూర్యశక్తే. సూర్యుని కిరణములలో సమస్త దోషములను హరించి వేయు ఒక మహత్తర శక్తి కలదు. ఎండ తగలని మొక్కలు పెరగవు. ఎండలేనిదే పూవులు పూయవు. కాయలు కాయవు. పంటలు పండవు. సూర్యుడు లేనిదే మేఘాలు తయారుగావు. తద్వారా వర్షాలు కూడా కురవవు. ప్రకృతిలోని ప్రతి దానికి సూర్యుడే ఆధారం. కుళ్ళిన, పుచ్చిన గింజ ధాన్యాలను, ఆహారపు వస్తువులను ఎండలో పోయుట ద్వారా పురుగులు, పుచ్చులు నశిస్తాయి. విత్తనాలను చల్లే ముందు రైతులు గింజధాన్యాలను ఎండలో బోసి ఎండబెట్టి, తొలకరి చినుకులు పడ్డ తరువాత గానీ చల్లరు. మనం గింజలను ఎండలో పోస్తే ఎంత వేడెక్కుతున్నాయో అంత వేడెక్కే వరకు ఆ గింజలను పొయ్యి మీద బాణలిలో పోసి వేడి చేసి, వాటిని పొలంలో చల్లితే ఒక్కగింజ కూడా మొక్కరాదు. పొయ్యిమీద వచ్చే అదే వేడికి జీవశక్తులు నశిస్తే, అదే వేడి సూర్యుడు ద్వారా వస్తే గింజలకు లేని ప్రాణశక్తి తిరిగి అంది నవ చైతన్యంతో మొలుస్తాయి. వేడి అంతా మనకు ఒకే విధంగా ఉన్నట్లు తెలిసినప్పటికీ జీవమున్న వేడి సూర్యుడి నుండి వచ్చే కాంతి. సూర్యుడు అంటేనే అసలైన సత్యం. ఆ సత్యాన్ని మనం కళ్ళతో దర్శించలేము. కానీ ఆ సత్యాన్నుండి వచ్చే కిరణాలను దర్శించవచ్చు. ఆ కిరణాల ద్వారా మన జీవితాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా తీర్చిదిద్దుకోవచ్చు.
సూర్య కిరణాలు మన శరీరాన్ని పావనం చేస్తాయి. కనిపించే దైవం సూర్యుడు. ఆయన కిరణాలు మన శరీరాన్ని కాంతివంతంగా చేస్తాయి. మనకు ఎనలేని ప్రాణశక్తిని అవి అందిస్తాయి. సూర్య కిరణాలకు దూరం అయితే దైవానికి దూరం అయినట్లే. ఉదయం 9 గంటల లోపు మరలా సాయం కాలం 4 గంటల తర్వాత సూర్యకిరణాలు మందపాటి తేమ పోర మరియు ఓజోన్ పొరగుండా భూమిని చేరతాయి. దాని ద్వారా ఆ సమయంలో మన చర్మం మీద పడ్డ కిరణాలు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. అలాగే మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు పలుచని ఓజోన్, తేమ పొరగుండా భూమిని చేరడం వలన శరీరం దెబ్బతింటుంది. సూర్య కిరణాలు శరీరంలో విటమిన్ 'డి' ని తయారు చేయడానికి అవసరం. మన ఇంటి కిటికీలకు వాడే రంగుటద్దాలు సూర్యకిరణాల యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి మరియు ఆ రంగుల ప్రభావం మన ఆరోగ్యాన్ని కాపాడే విధంగా అలోచించి మన పూర్వీకులు వాటిని పెట్టారు. మన చర్మం లో ఉండే మెలానిన్ అనే పదార్థం ఉన్నశాతాన్ని బట్టి చర్మం రంగు ఆధారపడి ఉంటుంది. నల్లగా ఉన్నవారికి ఈ పదార్థం ఎక్కువగా ఉంటుంది. తెల్లటి చర్మం గల వారికీ ఈ మెలానిన్ పదార్థం చర్మపు అడుగు పొరలలో ఉంటుంది. ఎర్రగా ఉన్న వారు పగలస్తమానం గట్టి ఎండలో నాలుగురోజులు తిరిగితే చర్మం లోపల పొరల్లో ఉన్న మెలానిన్ పదార్థం చర్మం పైకి జరుగుతుంది. అందువలనే ఎండలో తిరిగేవారు నల్లబడటం, నీడను కూర్చొనే వారు తెల్లబడటంలో గల కారణం. అంటే ఎంత తెల్లటి రంగు ఉంటే అంత ఆరోగ్యానికి మంచిది కాదు. ఎంత నల్లగా ఉంటే అంత ఆరోగ్యానికి, సూర్యకిరణాలు తట్టుకోవడానికి అంత అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎండలు ఎక్కువగా ఉన్న దేశాల వారు ఎక్కువ ఆరోగ్యంగా, నల్లగా ఉంటారు (నీగ్రో వారు). మనం మన శరీరాలను ఎండ తగిలేట్లు చేసుకొంటూ రోజూ రోగ నిరోధక శక్తిని, ప్రాణశక్తిని పెంచుకొందాము. ఎండలో తిరుగుతూ సూర్యుడు నుండి కొంత వేడిని రోజూ అందుకొందాము. రోగాలను నిరోధించే కవచాన్ని సూర్యుడు నుండి స్వీకరిద్దాం.
ఆదిత్య పేటికా స్నానం: రకరకాల రంగు అద్దాల ద్వారా సూర్య కిరణాలను మన శరీరం మీద పడేటట్లు చేస్తారు. రంగు అద్దాలను ఒక పెట్టెకు బిగించి మనకున్న రోగాలను బట్టి అద్దాల రంగులను మారుస్తూ చేసే చికిత్స. దీని ద్వారా దీర్ఘ రోగాలు, చర్మవ్యాధులు, జీర్ణ కోశ వ్యాధులు మొదలగు వాటిని నయం చేయడానికి ప్రకృతాశ్రమాలలో వాడటం జరుగుతుంది.
IV. పవనచికిత్స: మన శరీరానికి ప్రాణవాయువును అందించి ప్రాణశక్తులను పెంచేది గాలి. అట్టి ప్రాణశక్తిని ఎంత స్వీకరించ గలిగితే అంత ఆరోగ్యముగా, అంత చైతన్యముగా శరీరము ఉంటుంది. మంచి ప్రాణశక్తిని పీల్చుకోనందువల్ల మనకు ఎన్నో రకాల రోగాలు వస్తుంటాయి. వాటన్నింటిని నివారించుటకు ఉపవాసంలో మంచి చెట్ల క్రింద, గాలి వెలుతురు గల ప్రదేశములో విశ్రమించుట వలన రోగాలు త్వరగా తగ్గే అవకాశముంటుంది. అలాగే ఉపవాసానంతరం చేసే ప్రాణాయామం ద్వారా శరీరంలో ప్రాణశక్తి నిలువలు బాగా ఉండేటట్లు చేయవచ్చును. ప్రాణాయామం ద్వారా ప్రాణశక్తిని పొదుపు చేయవచ్చును.
మన శరీరం పుట్టి పెరుగుచున్నది పంచభూతాలతోనే. ఐదు భూతాలలోని లోపాల కారణంగా మనకు రోగాలు సంక్రమించుచున్నవి. ఐదు భూతాలలో లోపాలు రాకుండా చూసుకొనే మిగతా 84 లక్షల జీవరాసులూ సృష్టిలో ఆరోగ్యంగా, సుఖంగానే జీవించ గలుగుచున్నాయి. పంచభూతాలయిన గాలి, నీరు, ఆకాశము, భూమి, సూర్యుడు మొదలగు వాటిని సక్రమంగా వినియోగించుకోనందు వల్ల వచ్చే లోపాలను, రోగాలను నివారించాలంటే మరలా తిరిగి వాటిని సక్రమంగా అందించడం ద్వారానే సాధ్యమవుతుంది. ఐదు భూతాల ద్వారా వచ్చిన లోపాలను నివారించకుండా, మనం మరో విధంగా ఆ లోపాలను, రోగాలను తగ్గించే ప్రయత్నంలో శరీరం దెబ్బతింటుందే గానీ బాగుపడదు. ఈ ఐదింటినీ అందించినప్పటికీ మనకు రోగం కుదుటపడక పోతే అప్పుడు మిగతా వైద్య విధానాలను ఆశ్రయించడం మన ధర్మమవుతుంది. అప్పుడు ఆ వైద్య విధానం ద్వారా మన శరీరానికి మేలు జరుగుతుంది. శరీరానికి వచ్చిన ఆపద నుండి పూర్తిగా మనం ఒడ్డున పడినట్లు అవుతుంది. అవకాశమిస్తే శరీరం తనంతటదే తిరిగి బాగుపడే శక్తిని సృష్టికర్త అందించియున్నాడు. ఆ శక్తిని ఉపయోగించుకున్న వారికి రోగాలు సహజంగా, ప్రకృతి సిద్ధంగానే నయమవుతాయి. ప్రకృతి పరమైన మన శరీరానికి ప్రకృతి చికిత్సలే పరమోత్కృష్ణమైనవని నమ్మండి. ప్రకృతి పరమైన ఈ దేహాన్ని వికృతి విధానములు ఎన్నడూ జయించలేవని గ్రహించండి. ప్రకృతిని ఆశ్రయించండి. ప్రకృతి జీవన విధానమును అలవరచుకోండి. ప్రకృతి సిద్ధమైన అమృతాహారాన్ని, సహజాహారాన్ని సేవించండి. సహజ ప్రకృతి జలములను విరివిగా స్వీకరించండి. దైవదత్తమైన సూర్యకిరణాలతో శరీరాన్ని పావనం చేయండి. ప్రకృతి సిద్ధమైన సహజ వాయువులను పీల్చండి. సహజాకాశంలో హాయిగా విహరించండి. ఆయురారోగ్యములను, సుఖశాంతులను పొందండి. ప్రకృతిని నమ్మినవారికి మరణ భయముండదు. మందులతో పని ఉండదు. మనస్సు నిర్మలంగా, నిలకడగా ఉంటుంది. మనుగడ చక్కగా సాగుతుంది. దేహము పరిశుభ్రంగా ఉంటుంది. ధర్మంగా మనిషి జీవయాత్ర సాగుతుంది. తద్వారా మానవ జీవిత పరమావధికి మార్గము లభిస్తుంది. సాగించండి మీ కృషి అవుతారు మీరు ఒక ఋషి.

7. ఉపవాసం ఎన్ని రకాలు?

ఉపవాసాన్ని ముఖ్యంగా నాలుగు రకాలుగా విభజించారు. అవి
1. నిర్జలోప వాసాలు
2. జలోప వాసాలు
3. రసోప వాసాలు
4. ఫలోప వాసాలు
శరీరతత్వాన్ని బట్టి, రోగాన్ని బట్టి ఏరకమైన ఉపవాసం చేయించాలో వైద్యులు నిర్ణయించుతారు. ఉపవాసంలో తీసుకొనే ద్రవాన్ని బట్టి నాలుగు రకాలుగా ఉపవాసాలను విడగొట్టారు. నాలుగు రకాల ఉపవాసాలు శరీరాన్ని శుద్ధి చేయడంలో వేరు వేరు ఫలితాలను అందిస్తుంటాయి. నాలుగు రకాల ఉపవాసాల యొక్క ఉపయోగాన్ని విడి విడిగా తెలుసుకుందాం.
1. నిర్జలోపవాసాలు: అసలు నీరు కూడా ముట్టకుండా చేసే ఉపవాసాన్ని నిర్జలోపవాసం అంటారు. శరీరానికి గాలి తరువాత ముఖ్యమైన వాటిలో ముందు స్థానం నీటిది. నీటి ద్వారా కూడా శరీరానికి ఎక్కువ ప్రాణశక్తి అందుతూ ఉంటుంది. శరీరానికి నీరు ప్రతి దినం రెండు నుండి మూడు లీటర్లైనా తప్పనిసరిగా కావాలని శాస్త్రాలు చెప్పుచున్నాయి. అంత ముఖ్యమైన నీటిని శరీరానికి అందివ్వకుండా చేసే ఉపవాసాల వలన శరీరానికి మేలు కంటే కీడే ఎక్కువ అని చెప్పవచ్చు. శరీరంలో బాగా నీరు ఎక్కువ నిలువ ఉండి ఉబ్బిన శరీరం గల రోగికి ఈ రకమైన నిర్జలోపవాసాన్ని చేయించవచ్చని కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. శరీరంలో అవసరానికి మించి ఎంత ఎక్కువ నీరు నిలువ ఉన్నప్పటికీ అది లోపల ఉన్న ఉప్పుతో కలిసి పోయి కణాలకు కణాలకు మధ్యలో (ఎక్స్ ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్) గానీ, మరియు కణం లోపల గానీ నిలువ వుండి పోతుంది. అలా నిలువ ఉండి పోయిన ఉప్పునీరు రోజూ ఉదయం నుండి రాత్రి వరకూ మన అవసరాలకు ఉపయోగపడడానికి రాదు. రోజూ మన అవసరాలకు నీరు అంటే శరీరం ఎండకు దెబ్బ తినకుండా కావలసిన నీరు, మూత్రం ద్వారా, చెమట ద్వారా బయటకు పోయే నీరు మరియు ఊపిరితిత్తులలో ఆవిరయ్యే నీరు అని అర్థం. ఈ నీటిని మనం ప్రతిరోజూ త్రాగక పోతే శరీరానికి నీరు తగ్గి (డీ హైడ్రేషన్) ఇబ్బందులలో పడుతుంది. మనం ఎప్పుడు నీరు త్రాగుతామా అని నోరు ఎండిపోతూ, కళ్ళు మండుతూ, మూత్రం కూడా మండుతూ ఉండటం, శరీరం నీటి కొరకు పిలిచే పిలుపులన్నమాట అవి. నీరు అసలు త్రాగనప్పుడు శరీరానికి ఉపవాసంతో ఈ స్థితి వస్తుంది. శరీరానికి నీరు ఇప్పుడు ముఖ్యం కాబట్టి ఉపవాసంతో నీటి కొరకే ఎదురు చూస్తుంది గానీ ఉపవాసంతో చేపట్టవలసిన విసర్జన క్రియ ప్రారంభించదు.
వేసవి కాలంలో మనకు బాగా దాహం అయినప్పుడు నీరు దొరకక పోయినా నీరే త్రాగాలని ప్రయత్నిస్తాము గానే ప్రక్కనే ఆహరం అందుబాటులో ఉన్నా దానిని తినే ప్రయత్నం చేయము గదా! అదే పని నిర్జలోపవాసంలో శరీరం చేస్తుంది గానీ విసర్జన క్రియ చేయదు. శరీరంలో చేదు అంత బయటకు మోసుకొని వచ్చేది ముఖ్యంగా నీరే. మనలోని వ్యర్థపదార్థాలన్నీ నీటిలో కరిగి గానీ బయటకు రావన్నమాట. పైగా మనలో నిలువ యున్న ఎక్కువ నీరు గానీ, ఎక్కువ ఉప్పు గానీ శరీరం నుండి బయటకు పోవాలంటే మనం ప్రతిరోజూ పై నుండి ఎక్కువ మంచి నీరు త్రాగవలసిందే. ఈ విధంగా నిర్జలోపవాసంలో జరగడం లేదు కాబట్టి ఈ రకమైన ఉపవాసం మనకు ఆరోగ్యాన్ని అందివ్వటానికి ఉపయోగపడదన్నమాట. మనం తెలుసు కోవలసిందేమిటంటే నిర్జలోపవాసం నిరుపయోగమని.
అందువలనేనేమో చావడానికి సిద్ధపడి నిరాహారదీక్షలు చేసేవాడు అసలు నీరు కూడా ముట్టకుండా చేయడంలో ఉన్న అసలు రహస్యం అదన్నమాట. మన క్షేమం కొరకు, మన రాష్ట్రం కొరకు, కీర్తిశేషులు పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగం ఈ సందర్భంలో మన అందరకూ గుర్తుకు వస్తుంది. ఆయన 54 రోజులు నీరు ముట్టకుండా ఉపవాసాలు చేసి చివరకు ప్రాణాలను రాష్ట్రం కొరకు అర్పించారు. నిర్జలోపవాసాలు శరీరాన్ని మొదటి రోజు నుండి రోజు రోజుకీ క్షీణింపజేస్తాయన్నది. ఇక్కడ అర్థం అవుతున్నది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొన్న వారు ఇలాంటి ఉపవాసలకు స్వస్తి పలుకుతారని ఆశిస్తున్నాను. అపక్వాహారాన్ని తినే ఋషులో, యోగులో వారి పరిస్థితులకు అనుకూలంగా అడవులలో ఇలాంటి ఉపవాసాలు చేసి ఉండవచ్చు. యజ్ఞాలు, హోమాలు చేసేటప్పుడు కదలకుండా ఎక్కువ గంటలు (మూత్రానికి కూడా లేవకుండా) మనస్సును లగ్నం చేయడానికి వారు నిర్జలోపవాసాన్ని ప్రవేశపెట్టి యుండవచ్చు. వారి ఆహార పద్ధతులు, అలవాట్లు వేరుగా ఉంటాయి. కాబట్టి ఈ రకమైన ఉపవాసాలను వారి ఆరోగ్యం కొరకు ప్రవేశపెట్టకుండా మంచి కార్యాలను ఆటంకం లేకుండా పూర్తి చేయడానికి ప్రవేశపెట్టి ఉంటారని నా నమ్మకం.
మన ఇండ్లలో ఆడవారు కార్తీక మాసాల పేరు చెప్పుకొనో, వ్రతాల పేర్లు చెప్పుకొనో ఉదయం నుండి సాయంకాలం వరకూ అసలు నీరు కూడా ముట్టకుండా చేస్తే ఎక్కువ పుణ్యమనో, ఆరోగ్యమనో లేదా బరువు తగ్గుతారనో నిర్జలోపవాసాలు చేస్తుంటారు. మనం తినే ఆహారాలు ఉపవాసం ముందు రోజు, ఉపవాసం తరువాత రోజు మంచిగా ఉండవు (ఉప్పు, నూనెలు లేకుండా) కాబట్టి, ఇలాంటి ఉపవాసం ఈ కాలానికి అనుకూలం కాదని చెప్పవచ్చు. ఈ రకమైన ఉపవాసాలు చేసి తేడాలు తెచ్చుకొని తర్వాత మాకు ఉపవాసాలు పడవనో, కడుపులో మంటలు వస్తాయనో లేదా ఇంకా ఏదేదో అయ్యిపోయిందని ఉపవాసాల మీద ఒక చెడ్డ అభిప్రాయాన్ని మిగుల్చుకుంటారు. ఆరోగ్యానికి ఉపవాసాలు మంచిదని మాలాంటి వారు చెప్పినా లేదా ఎక్కడన్నా చదివినా పూర్వపు అనుభవం గుర్తుకువచ్చి ఉపవాసాలు మాకు పడవు అని అనుకుంటారు. నీరు కూడా త్రాగకుండా చేసే ఉపవాసాలు అటు ఆరోగ్యానికి గానీ ఇటు ఆధ్యాత్మికానికి గానీ అనుకూలం గాదని గ్రహించండి.
2. జలోపవాసాలు: నీరు మాత్రమే త్రాగి చేసే ఉపవాసాలను జలోపవాసాలు అంటారు. ఈ ఉపవాసాలను జంతువులు , పక్షులు, మిగతా జీవరాసులన్నీ చేస్తుంటాయి. ఆ ప్రాణులన్నీ రోగాలు వచ్చినప్పుడు కేవలం నీరు మాత్రమే త్రాగి ఎటూ కదలకుండా పూర్తిగా శరీరానికి విశ్రాంతి నిస్తాయి. అవి బుద్ధిజీవులు కాదు కాబట్టి వాటికి ఈ రకమైన ఉపవాసాలు హాని లేకుండా పూర్తి ఆరోగ్యానికి సహకరించ గలుగుచున్నాయి. అదీ కాక జంతువులు మలమూత్రాలను ఎప్పటి కప్పుడు వదిలేస్తూ, ఆకలయినప్పుడే ఆహారాన్ని తింటూ రాత్రికి పూర్తి విశ్రాంతినిస్తూ జీవనాన్ని గడుపుతాయి. కాబట్టి వాటికి ఎప్పుడూ నాలుగైదు రోజులు మించి ఉపవాసాన్ని చేసే అవసరం రాదు. అందువలన కేవలం నీరు మాత్రమే త్రాగి నాలుగైదు రోజులు ఉపవాసాలు చేయడం వలన ఏ మాత్రం హాని జరుగకుండా పూర్తి ప్రయోజనం కలుగుతుంది. ఈ రకమైన ఉపవాసాలను మనిషి వాటి నుండి చూసి తెలుసుకొన్నవే. జలోపవాసాలను మనిషి ఆచరించడంలో కలిగే ప్రయోజనాలతో పాటు వచ్చే ఇబ్బందులను కూడా కొద్దిగా తెలుసుకోవడం మంచిది.
భారతదేశంతోపాటు మిగతా దేశ ప్రజలకు కూడా ఉపవాసాలు చేయడం అంటే తెలిసిన పద్ధతి. అందరు ఆచరించే పద్ధతి ఈ జలోపవాసపు పద్దతే. ఈ పద్దతిలో ఎక్కువ మంది ఉదయం నుండి రాత్రి వరకూ గంట గంటకు గోరువెచ్చటి నీరుగానీ, కుండలోగానీ నీరు త్రాగడం చేస్తారు. మరికొంత మంది త్రాగే నీటిలో నాలుగైదు సార్లు ఒక కాయ నిమ్మరసాన్ని పిండించి వాడుతూ, వాటితో మంచినీరు మామూలుగా త్రాగించుతారు. కొంత మంది మధ్యలో రెండు లేదా మూడు సార్లు తేనె కూడా వాడిస్తూ చేయిస్తారు. ఇంకా కొన్ని ప్రకృతాశ్రమాలలో అయితే తేనె బదులు బెల్లం నీళ్లు ఇస్తూ కూడా చేయిస్తారు. ఈ రకమైన ఉపవాసాలు ఆరు లేదా ఏడు రోజులకు మించి చేయకూడదని, అలా చేస్తే శరీరం, కణజాలం దెబ్బతింటుందని ప్రకృతి వైద్యులు కొంతమంది అనడమే కాకుండా శాస్త్రజ్ఞులు కూడా చెబుతుంటారు. ఈ రకమైన ఉపవాసాలను మాత్రమే చేయించే వారికీ తెలిసిన విషయమేమిటంటే ఏడు రోజులు మించితే అవి దీర్ఘోపవాసాలు అవుతాయి అని అందువలన దీర్ఘోపవాసాలు చేయడం శరీరానికి మంచిది కాదన్నది వీరి అభిప్రాయం.
పూర్వకాలంలో ఋషులు, మునులు ఎక్కువగా పళ్ళు, కందమూలాలు, అపక్వాహారం (పచ్చివి) ఎక్కువగా తినేవారు. వారికి ఇబ్బందులు వచ్చినప్పుడు ఉపవాసాలు కేవలం నీరు తీసుకొనే చేసేవారు. వారికి మనో నిగ్రహం ఎక్కువగా ఉండటమే గాక శరీరంలో ఎక్కువ వ్యర్థపదార్థాలు (మంచి ఆహారం తిన్నందువల్ల) పేరుకొనేవి కాదు. అందువలన ఉపవాసాలు ఐదారురోజులు చేస్తే సరిపోయేది. తరువాత రసోపవాసాలు, ఫలోపవాసాలు ప్రారంభించేవారు. వారి వరకూ అది సరిపోయింది. విశ్రాంతిగా ఉంటూ తక్కువ రోజులు చేయడం వలన శరీరానికి ఇబ్బంది పెద్దగా అనిపించదు. పైన చెప్పుకున్న ఉపవాసపు పద్ధతులవలన కలిగే లాభనష్టాలను ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం.
I. కేవలం నీటితోనే ఉపవాసం:
1. శరీరంలోని వ్యర్థపదార్థాలన్నీ ఉపవాసంతో పూర్తిగా నీటిలో కరిగి విసర్జకావయవాల ద్వారా బయటకు రావడానికి ఎక్కువగా త్రాగే నీరు సహకరిస్తుంది.
2. శరీరానికి ఆహారం లేని కారణంగా పొట్ట , ప్రేగులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం ద్వారా శరీరం పూర్తిగా 24 గంటలూ విసర్జన క్రియ కొనసాగించడానికి ఈ ఉపవాసం బాగా ఉపయోగపడుతుంది.
ఇబ్బందులు:
1. మొదటి రెండు రోజులు బాగా ఆకలి ఎక్కువతో పాటు, కేవలం నీటి వలన నీరసం ఎక్కువగా ఉంటుంది.
2. టీ, కాఫీలు త్రాగినందువల్ల వచ్చే మనసు మందం (డిమ్ గా) కాకుండా, ఉపవాసంలో ఆహారం ఏమి లేకుండా కేవలం నీటి వలన శరీరానికి గ్లూకోజు అందక కూడా మొదటి రోజు సాయంకాలం నుండి మనస్సు మందంగా ఉంటుంది. (నిన్నటి ఆహారం ద్వారా అందిన గ్లూకోజు లివరులో నిలువ ఉండి ఉపవాసంలో మధ్యాహ్నం వరకూ వచ్చి అయిపోతుంది)
3. మనిషి శరీరానికి విశ్రాంతి నిచ్చినప్పటికీ మనస్సు రకరకాలుగా 24 గంటలూ పనిచేస్తూనే ఉంటుంది. ఈ మనస్సు ఉపవాసంలో కూడా శక్తివంతంగా పనిచేయాలంటే కేవలం శరీరాన్ని శుద్ధిచేసే నీరు మాత్రమే త్రాగడంతో సరిపోదు. శరీరంలో నిలువ యున్న కొవ్వు నుండి వచ్చే గ్లూకోజు పూర్తిగా మనస్సును శక్తివంతం చేయడానికి చాలదు. పైగా ఉపవాసం ప్రారంభించిన మొదటి రెండు మూడు రోజులలో నిలువయున్న క్రొవ్వు కరగడం ప్రారంభమవ్వదు. కేవలం శరీరంలోని ఎక్కువ నీరు మాత్రమే ఆ రెండు మూడు రోజుల్లో తగ్గుతుంది. గ్లూకోజు మనస్సుకు చాలక శక్తిహీనంగా ఉంటుంది.
4. మూడు లేదా నాలుగవ రోజు నుండి నీరు ఎక్కువగా త్రాగడం వలన విసర్జన క్రియ బాగానే జరుగుతూ ఉంటుంది. కానీ శరీరాన్ని నడిపే మనస్సుకి ఆహరం (గ్లూకోజు) లేక కొన్ని కణాలు మెల్లగా దెబ్బతినడం ప్రారంభిస్తాయి.
5. ఐదు లేదా ఆరో రోజు ఉపవాసానికి వచ్చేసరికి మనస్సు చురుగ్గా పనిచేయలేక, శరీరంలో కొవ్వు కూడా గ్లూకోజు లోపం వలన బాగా కరిగాక నీరసం రావడం ప్రారంభమవుతుంది.
6. శారీరకంగా, మానసికంగా నీరసం వస్తుంది కాబట్టి ఆరవ రోజో లేదా ఏడవరోజో ఉపవాసాన్ని విరమించేద్దామనిపిస్తుంది. శరీరంలో చేదు బాగా కదిలి వెళుతున్నప్పటికీ ఓపిక లేక ఉపవాసాన్ని విరమించి రసోపవాసం ప్రారంభించవలసి వస్తుంది. ఈ విధంగా నీరసం వచ్చినప్పుడు కూడా ఇంకా ఈ రకమైన ఉపవాసాలు కొనసాగిస్తే శరీరం బాగా దెబ్బతింటుంది. అందువల్లనే వారం రోజుల కంటే ఎవరూ ఉపవాసాలు చేయకూడదని చెప్పడం జరుగుచున్నది.
7. బాగా లావున్న వారు బరువు తగ్గడానికి బలవంతంగా ఎక్కువ రోజులు చేయడానికి ప్రయత్నిస్తారు. శరీరాన్ని ఇబ్బంది పెడుతూ అలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు.
8. కేవలం నీరు త్రాగినప్పుడు శరీరంలోని చేదు బహిష్కరింపబడినట్లు రసోపవాసంలో జరుగదు. వారం రోజులలోనే శరీరంలోని చెడు అంతా పోయేటట్లైతే తరువాత రసోపవాసంలోనికి వెళ్లడమనేది కరక్టే. శరీరం పూర్తిగా శుద్ధి అయ్యి, ఆకలి వేయకముందే జలోపవాసాన్ని విరమించి రసోపవాసానికి వెళ్ళవలసి వస్తుంది. జలోపవాసం వలన కొంత ఉపయోగంతోపాటు ఎక్కువగా నష్టం కూడా శరీరానికి, మనస్సుకు కలుగుతుంది కాబట్టి ఒకటి లేదా రెండు రోజులకు మించి ఈ ఉపవాసాలు చేయకూడదన్నది నా అభిప్రాయం.
9. శాస్త్రం ప్రకారం మనస్సు శక్తి వంతంగా పనిచేయాలంటే ప్రతి నిత్యం తప్పని సరిగా ఆహారం ద్వారా 800 కేలరీల శక్తిని అందివ్వాలి. అలా ఈ జలోపవాసాలలో అందడంలేదు కాబట్టే ఈ ఉపవాసాలు దూరంగా ఉంచటం మంచిది.
10. వెనుకటి రోజుల్లో మన పూర్వీకుల అలవాట్లు, ఆలోచనలు, ఆరోగ్యం వేరు. అలాగే వాళ్ళ బలం వేరు. వారు జలోపవాసాలలో వచ్చే ఇబ్బందులను కూడా పడిపోకుండా, నీరసానికి తట్టుకొని పట్టుదలగా ఉపవాసాలు పూర్తి చేసేవారు. కాని ఈ రోజులలో రోగాలు వేరు, ఆలోచనలు వేరు, అలవాట్లు వేరు కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఆలోచిస్తే ఈ కాలానికి జలోపవాసాలు అనుకూలం కాదని తెలుస్తున్నది.
II. నిమ్మకాయ నీళ్లతో ఉపవాసం: పై విధంగానే నీళ్లు త్రాగుతూ అప్పుడప్పుడూ (సుమారు 3 గంటలకు ఒకసారి) నిమ్మరసాన్ని పిండుకొని త్రాగడం. నిమ్మరసాన్ని వాడడం వలన శరీరానికి రోగ నిరోధక శక్తి పెరిగి, త్వరగా రోగపదార్థం బయటకు పోతుందని వాడతారు. పూర్వం మన రాష్ట్రంలో ఉపవాసాలు ఈ విధంగానే ఉండేవి. ప్రస్తుతం కొన్ని చోట్ల ఇంకా ఈ విధంగానే నడుస్తున్నవి. వెనుకటి రోజులలో ఈ రకంగా ఉపవాసాలను 21 రోజులు చేయించేవారు. ఈ ఉపవాసాలలో ఎక్కువ నీరసం, కళ్ళు ఎక్కువగా తిరగడం, పడిపోవడం తరచూ జరిగేవని ఉపవాసాలను చేసే వారు చెప్పడం ద్వారా తెలిసింది. ఖాళీ నీళ్ళు త్రాగి ఉపవాసం చేస్తే ఏమి జరుగుచున్నదో, అదే ప్రయోజనం, అదే ఇబ్బంది (నష్టం) ఈ రకమైన ఉపవాసంలో కూడా కలుగుతుంది. ఈ కాలం ప్రజలకు ఈ రకమైన ఉపవాసాలు కూడా ఆరోగ్యానికి మంచివి కాదు. వీటి వాళ్ళ నష్టమే ఎక్కువ ఉంటుంది. వీటితో కూడా దీర్ఘోపవాసాలు చేయకూడదు.
III. మూడుసార్లు తేనె నీళ్లు లేదా మూడు సార్లు బెల్లం నీళ్లతో ఉపవాసం: పైరకంగా నీళ్లను తీసుకొంటూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తేనె నీళ్లు గానీ, బెల్లం నీళ్లు గానీ త్రాగడం చేస్తారు. రెండు స్పూనులు తేనెతో పాటు ఒక నిమ్మకాయ రసం, నీళ్ళు కలుపుకొని మూడు పూటలా ఈ విధంగా తయారుచేసుకొని త్రాగుతారు. తేనెను రోజుకు ఆరుస్పూన్లు కొంత మంది వాడిస్తే మరికొంత మంది 10 స్పూన్లు వాడిస్తారు. ఈ రకంగా వాడినప్పటికీ 250 కేలరీలకు మించి మనస్సుకు శక్తి అందడంలేదు. దీని కారణంగా ఉపవాసంలో నీరసం రావడం, మనస్సుకి శక్తి చాలనట్టుగా డిమ్ గా పనిచేయడం జరుగుతుంది. కానీ జలోపవాసాలకంటే ఇంకా కొద్దిగా ఎక్కువ రోజులు చేయగలుగుతారు. అలా చేసినప్పటికీ కూడా శరీరంలో చెడు పూర్తిగా పోయి ఆకలి పూర్తిగా అయ్యేవరకూ నీరసం రాకుండా ఈ ఉపవాసాలు కాపాడలేవు. నీరసం కారణంగా ఆకలి లేకుండానే ఈ ఉపవాసాలని విరమించి రసోపవాసాలలో ఎక్కువ రోజులు చేయవలసి వస్తుంది. ఈ విధంగా ఉపవాసాలను వారం పదిరోజులకు మించి చేయడం వలన శరీరానికి మనస్సుకు నష్టం ఉంటుంది. మెదడులో కణాలు చనిపోవడం జరుగుతుంది. మనకు పైకి తెలియక పోయినప్పటికీ లోపల జరిగే నష్టం మాత్రం తప్పదు. అదే తేనెకు బదులు బెల్లం వాడడం వలన నీరసం, నష్టం ఎక్కువగా ఉంటుంది. తేనెలో శక్తితో పాటు విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉండి త్వరగా శక్తినిస్తే, ఇవన్నీ లేని కారణంగా బెల్లం వాడితే అపకారం ఎక్కువ ఉంటుంది. ఈ రకమైన ఉపవాసాలు మన రాష్ట్రంలో ఎక్కువ ఆశ్రమాలలో ప్రస్తుతం నడుస్తున్నవి. ఈ రకంగా ఉపవాసాలు చేయిస్తున్న వారందరూ దీర్ఘోపవాసాలు మంచిది కాదంటారు. ఈ రకమైన ఉపవాసాలను దీర్ఘంగా చేయాలన్నా అది జరిగేది గాక, పైగా నీరసం వచ్చేస్తుంది కాబట్టి దీర్ఘోపవాసాలు మంచివి గాదని వారి అభిప్రాయం కాబోలు. అవసరమైతే ఇంకోసారి తేనె నీళ్లు గానీ, బెల్లం నీళ్లు గానీ త్రాగవచ్చంటారు. అంతకు మించి వాడితే తేనె బలం కాబట్టి అది ఉపవాసమవ్వదేమోనని వారి అభిప్రాయమేమో?
IV. రోజూ పావుకేజీ తేనెతో జలోపవాసం: ఇది మేము చేయించే ఉపవాసపు పధ్ధతి మనస్సుకు కావలసిన 800 కేలరీల శక్తి పావుకేజీ తేనె ద్వారా అందిస్తున్నాము. కాబట్టి మనస్సుకు, శరీరానికి ఉపవాసంలో ఎన్నడూ నీరసం రాదు. ఈ పావుకేజీ తేనెను ప్రతి రెండు గంటలకు ఉదయం నుండి రాత్రి వరకూ 8 సార్లుగా తడవకు నాలుగు స్పూన్లు చొప్పున ఒక నిమ్మకాయ రసాన్ని కలుపుకొంటూ త్రాగాలి. దీని కారణంగా శరీరంలో చెడు పూర్తిగా బహిష్కరింపబడి పూర్తిగా ఆకలి పుట్టే వరకూ నీరసం రాకుండా కాపాడగలుగుచున్నది ఈ ఉపవాసం. అందువలన శరీరం శుద్ధి కావడానికి ఎన్ని రోజులు పట్టిననూ ఏ మాత్రం నష్టం కలుగదు. దీర్ఘోపవాసాలు ఎన్నిరోజులు చేసినా ఈ విధానం ద్వారా ప్రయోజనమే గానీ హాని కలుగదు. ప్రస్తుత సమాజంలో ఎక్కువ అనారోగ్యంతో, ఎక్కువగా చెడు పదార్థాలు తిని శరీరాన్ని పూర్తిగా పాడు చేసుకొని, విసర్జన క్రియ సరిగా లేనివారు ఎక్కువ మంది ఉంటున్నారు. ఇలాంటి వారందరికీ మామూలుగా చేసే ఉపవాసం రోజులు చాలవు. వీరికి దీర్ఘోపవాసాలు చాలా అవసరం. అటువంటి వారికి మేము చేయించే ఉపవాస విధానం చక్కగా సహకరించగలదు.
ఉపవాస విధానం ముఖ్యంగా రెండు రకాల ప్రయోజనాలను అందివ్వాలి. అప్పుడు శరీరం త్వరగా, పూర్తిగా విసర్జన క్రియ చేయగలదు. మొదటిది శరీరంలోని చెడు పదార్థాలు పూర్తిగా విసర్జింపబడే వరకూ శరీరానికి, మనస్సుకు శక్తి తగ్గకుండా కాపాడగలగాలి. రెండవది శరీరంలోని వ్యర్థ పదార్థాలు కదిలి నాలుగు విసర్జకావయవాల ద్వారా విసర్జింపబడేటందుకు కావలసిన నీరును కూడా అందివ్వగలగాలి. మా ఉపవాసంలో కేవలం మంచి నీరు ఐదు లీటర్లు త్రాగాలని సూచించడం జరుగుచున్నది. ఇటు ఐదు లీటర్ల మంచినీరు, అటు 8 గ్లాసుల తేనె నీరు రెండూ కలిపి పరిపూర్ణమైన ఉపవాస విధానంగా తయారు అవడం జరిగింది. ఇది ఈనాటి కాలప్రజలకు ఆమోద యోగ్యంగా ఉన్నది. అల్లోపతి వైద్యులు కూడా ఈ ఉపవాస విధానాన్ని సరియైనదిగా ఆమోదిస్తున్నారు. వైద్యవిజ్ఞాన శాస్త్ర సమ్మతంగా రూపొందించడం జరిగింది. తేనెను ఉపవాసంలో పావు కేజీ ఇవ్వడం వలన అది ఉపవాసం కాదని (అవ్వదని) కొందరు వైద్యులు అభిప్రాయపడితే, అంత తేనె త్రాగడం ప్రమాదమని మరికొందరు అభిప్రాయపడవచ్చు. తేనెను పావుకేజీ ఇచ్చినప్పటికీ అది ఉపవాసం ఎందుకు అవుతుందో, అంత తేనె త్రాగడం వలన నష్టం ఎందుకు లేదో ఉపవాసానికి తేనెకు ఉన్న సంబంధాన్ని తెలిపే అధ్యాయంలో పూర్తిగా, విపులంగా తెలుసుకోగలరని ఆశిస్తున్నాను.
ఉపవాస విధానాల పోలిక
ఎక్కువ: ఎక్కువ (పావుకేజీ) తేనెతో ఉపవాసాలు
తక్కువ: తక్కువ తేనెతో లేదా బెల్లం నీరుతో లేదా ఒట్టి నిమ్మరసంతో ఉపవాసాలు
1. ఎక్కువ: రోజుకు 8 సార్లు తేనె నీరు + 5 లీటర్ల మంచినీరుతో చేస్తారు.
1. తక్కువ: మూడు, నాలుగు సార్లు తేనె నీరు లేదా బెల్లం నీరు లేదా ఒట్టి నిమ్మకాయ నీళ్ళతో ఎక్కువ మంచినీరు త్రాగి చేస్తారు.
2. ఎక్కువ: ఉపవాసంలో ఉన్నన్ని రోజులు మనస్సు హుషారుగా ఉంటుంది.
2. తక్కువ: ముందు వారం రోజులు హుషారుగా ఉండి తరువాత మందం అవుతూ ఉంటుంది.
3. ఎక్కువ: మెదడు కణాలు అసలు దెబ్బతినవు.
3. తక్కువ: ఎక్కువ రోజులు చేస్తే కణాలు దెబ్బతింటాయి.
4. ఎక్కువ: శరీరానికి నిత్యం కావలసిన 800 కేలరీల శక్తి అందుతున్నది.
4. తక్కువ: కొంత మాత్రమే అందుతుంది.
5. ఎక్కువ: ఉపవాసంలో ఉన్నట్టు నీరసం గానీ, ఆ భావన గానీ అసలు రాదు.
5. తక్కువ: ముందు ఐదారు రోజులు బాగుండి, అక్కడి నుండి నీరసంగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది.
6. ఎక్కువ: దీర్ఘోపవాసాలకు ఈ విధానం చాలా అనుకూలంగా ఉంటుంది. శరీరానికి ఏ మాత్రం హాని ఉండదు.
6. తక్కువ: దీర్ఘోపవాసాలు ఈ పద్ధతిలో చేయకూడదు.
7. ఎక్కువ: పూర్తి ఆకలయ్యే వరకూ, శరీరం కోరినన్ని రోజులు ఉపవాసం చేయవచ్చు.
7. తక్కువ: పూర్తి ఆకలి పుట్టకపోయినా నీరసం వస్తే ఉపవాసాలు విరమించి, రసోపవాసాలు చేయిస్తారు.
8. ఎక్కువ: హై బి.పి., ఎక్కువ షుగరు జబ్బులున్న వారికి కూడా చక్కగా పనిచేస్తాయి.
8. తక్కువ: నీరసించి కోమాలోనికి వెళ్ళే అవకాశం ఉంటుంది.
9. ఎక్కువ: అన్ని వయసుల వారికీ అనుకూలంగా ఉంటాయి.
9. తక్కువ: బాగా శరీరం లావుంటేనే అనుకూలంగా ఉంటాయి.
10. ఎక్కువ: ఎక్కువ రోజులు చేయడం వలన కోరికలు, అలవాట్ల మీద నిగ్రహం వస్తుంది.
10. తక్కువ: తక్కువ రోజులు చేయడం వలన రుచుల మీద వ్యామోహం వదలదు.
11. ఎక్కువ: పూర్తి ఆకలయ్యే వరకూ ఉపవాసంలో నీరసం అసలు రాదు.
11. తక్కువ: ఆకలి పూర్తిగా అవ్వకుండానే నీరసం వచ్చే అవకాశముంటుంది.
12. ఎక్కువ: ఈ విధానం ప్రకృతి పరంగా, వైద్య విజ్ఞాన పరంగా, శాస్త్ర సమ్మతంగా ఉంది.
12. తక్కువ: ప్రకృతి పరంగానే ధర్మంగా ఉంది.
13. ఎక్కువ: కొద్దిపాటి పని చేసుకొన్నప్పటికీ నష్టం అసలుండదు.
13. తక్కువ: పూర్తి విశ్రాంతి తీసుకొంటేనే చేయగలుగుతారు.
14. ఎక్కువ: ఎక్కువ రోజులు ఉపవాసాల కారణంగా ఎక్కువ బరువు తగ్గే అవకాశముంటుంది.
14. తక్కువ: ఎక్కువరోజులు ఉపవాసాలు చేయలేని కారణంగా తక్కువ బరువు తగ్గుతారు.
15. ఎక్కువ: ఉపవాసంలో విసర్జన క్రియ పూర్తిగా, బాగానే జరుగుతుంది.
15. తక్కువ: విసర్జన క్రియ ఇక్కడ కూడా బాగానే జరుగుతుంది. కానీ కొన్ని రోజులే.
16. ఎక్కువ: ఉపవాసాలలోనే విసర్జన క్రియ పూర్తి అవుతుంది.
16. తక్కువ: ఉపవాసాలలో విసర్జన క్రియ పూర్తిగా అవ్వదు కానీ రసోపవాసాలలో తరువాత కొద్దిగా అవుతుంది.
17. ఎక్కువ: ఉపవాసం ఎన్నిరోజులు చేసినప్పటికీ మాంసకృత్తులు కరిగే అవకాశమేలేదు.
17. తక్కువ: ఎక్కువరోజులు చేసినప్పుడు అలాంటిది జరిగే అవకాశముంటుంది.
18. ఎక్కువ: చర్మవ్యాధులకు ఉపవాసాలు ఎక్కువ రోజులు చేస్తే గానీ తగ్గవు. చర్మవ్యాధులకు ఈ విధానం అనుకూలంగా ఉంటుంది.
18. తక్కువ: ఎక్కువ రోజులు చేసే అవకాశం లేనందున, తరువాత ఆహారంలో గానీ మెల్లగా తగ్గుతూ ఉండవు.
19. ఎక్కువ: దీర్ఘరోగాలు మరి యేయితర రోగాలున్నప్పటికీ ఈ విధానం ద్వారా తేలిగ్గా చేయవచ్చు.
19. తక్కువ: గుండెజబ్బులు అలాంటివి ఉన్నప్పుడు చేయించడానికి ఈ విధానం పనికిరాదు.
20. ఎక్కువ: రోజు రోజుకీ శక్తి పెరుగుతూ ఉంటుంది.
20. తక్కువ: వారం పది రోజుల వరకూ శక్తిగా ఉండి అక్కడ నుండి అందరకూ నీరసం కొద్దిగా వస్తూ ఉంటుంది.
21. ఎక్కువ: ఈ ఉపవాసంలో కళ్ళు తిరిగి పడిపోయే ప్రమాదం ఉండదు.
21. తక్కువ: ఎప్పుడన్నా జరిగే అవకాశముంటుంది.
22. ఎక్కువ: ఉపవాసం అంటే ఇంత తేలికగా చేయగలుగుతాము అని అనుకోలేదని అందరూ అంటుంటారు.
22. తక్కువ: కొంతమందికే అలా అనిపించవచ్చు.
23. ఎక్కువ: ఈ కాలం ప్రజలకు భయం లేని విధానంగా, అనుకూలంగా ఉంది.
23. తక్కువ: ప్రస్తుత సమాజ ప్రజలు భయపడినా, ఎక్కువమంది ఈ ఉపవాసాలు చేయకుండానే ప్రకృతి వైద్యం చేస్తున్నారు.
24. ఎక్కువ: మళ్ళీ ఎప్పుడు ఉపవాసాలను చేద్దామా అన్నట్లు ఈ విధానం ప్రజల హృదయాల్లో నాటుకొని పోతున్నది.
24. తక్కువ: ఈ ఉపవాసాలు ఎప్పుడు పూర్తి అవుతాయో అన్నట్లు మొదటిసారి నుండే అనిపించే అవకాశముంది.
3. రసోపవాసాలు: పళ్ళ రసాలను ఆహారంగా అందిస్తూ చేయించే ఉపవాసాలను రసోపవాసాలు అంటారు. ఈ రసోపవాసాలను జలోపవాసాలు విరమించిన తరువాత ప్రారంభిస్తారు. జలోపవాసాలలో శరీరం చెడును పూర్తిగా విసర్జించుకొని ఆకలి ప్రారంభమయినప్పుడు, ఆ ఆకలికి అనుకూలంగా తేలికపాటి పళ్ళరసాలను ఇంకా ఆకలి పెరగడానికి ఇవ్వడం జరుగుచున్నది. జలోపవాసాలు చేస్తుండగా మధ్యలో లేదా వారం పదిరోజులలో (ఐదారు రోజులకో) నీరసం రావడమో లేదా మనస్సుకు శక్తిచాలకో ఆకలి పుట్టకుండానే ఆ రకమైన ఉపవాసాలను విరమించి పళ్ళరసాలలోనికి వస్తే ఈ రసోపవాసాలలో ఉపయోగం తక్కువ ఉంటుంది. జలోపవాసంలో జరిగినన్ని గంటలు విసర్జన క్రియ రసోపవాసంలో జరిగే అవకాశం లేదు. రసోపవాసంలో రసాలను జీర్ణం చేయడానికి ఎక్కువ శక్తి , ఎక్కువ సమయం వృధా అవ్వడం వలన విసర్జన క్రియ సమయం తగ్గిపోతుంది. దీని కారణంగా రసోపవాసాలలో చెడు విసర్జనకు ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. పైగా రసోపవాసాలలో విసర్జన క్రియ పూర్తిగాక పోయినా ఆకలి రోజు రోజుకూ పుడుతూ ఉంటుంది. చెడును విసర్జించే కార్యక్రమం నుండి మనలోని శక్తి జీర్ణక్రియకు పూర్తిగా మారిపోతుంది.
అదే మేము చేయించే జలోపవాసాలలో అయితే చెడు అంతా పూర్తిగా పోయి, ఆ ఉపవాసాలలోనే ఆకలి పూర్తిగా పుట్టి, ఈ రసోపవాసాలలో ఇంకా ఆకలి పెరిగిపోతుంది. అందువలన పళ్ళ రసాలలో రెండు నుండి నాలుగు రోజుల కంటే మా ఉపవాసాలు చేసిన వారుండలేరు. పళ్ళరసాలు ఆహారంగా ఇవ్వడం ప్రారంభించిన దగ్గర నుండి పళ్ళరసాల ద్వారా శరీరంలో ఎంతో కొంత క్రొత్త వ్యర్థ పదార్థం ప్రతిరోజు తయారవడం ప్రారంభమవుతుంది. శరీరం రసోపవాసాలు ప్రారంభమయిన రెండు, మూడు రోజుల నుండి క్రొత్తగా తయారయ్యే వ్యర్థాన్ని బయటకు నెట్టే ప్రయత్నంలోబడి, పాత వ్యర్థపదార్థాలను కదపడం గానీ, బయటకు నెట్టడం గానీ చేయలేక పోతుంది. ఈ రసోపవాసాలను ఎన్ని రోజులు చేయగలిగితే అంత మంచిదే. ఈ రసోపవాసాలను జలోపవాసాన్ని విరమించడానికే వాడడం అనుకూలం గానీ, జలోపవాసంలో శుద్ధికావలసిన శరీరాన్ని తీసుకొని వచ్చి రసోపవాసాలలో అవుతుందని ఆశిస్తే ఆశించిన ఫలితాలుండవు. ప్రేగులకు శ్రమలేకుండా శక్తిని అందించే తేనె నీళ్ళ ఉపవాసాలతో పోలిస్తే రసోపవాసాలలో శుద్ధి అయ్యేది చాలా తక్కువ.
ఈ మధ్యకాలంలో ఉపవాసాలు సరిక్రొత్తగా రూపు దిద్దుకొన్నాయి. ఎక్కువ శాతం ప్రకృతి ఆశ్రమాలలో ఈ రకమైన రసోపవాసాలతోనే అసలు ఉపవాసాలు ప్రారంభమవుతున్నాయి. ఉపవాసాలంటే ఎక్కువమంది బెదిరిపోవడంతో పాటు, ఎక్కువ రోజులు ప్రకృతాశ్రమాలలో ఉండే సదుపాయం లేని వారందరి కొరకూ ఈ విధానాన్ని ఆశ్రమాలతో బాటు ప్రకృతి వైద్యం క్లినిక్కులలో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ రసోపవాస విధానంలో ముఖ్యంగా నిమ్మరసం, పలుచని నారింజరసం, బత్తాయి రసం, కమలారసం, తేనె నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, బార్లీ నీరు మరియు హెర్బల్ టీ మొదలగునవి రోజుకు మూడు నుండి ఐదు సార్లు రోగి పరిస్థితి ననుసరించి ఇస్తుంటారు. ఈ విధానంలో వారం రోజులు మొదలు కొని నెల రోజుల వరకు కూడా రసోపవాసము చేయవచ్చని అంటారు. జలోపవాసంలో చేసే ఉపవాసాల వలన వచ్చే ఇబ్బందుల దృష్ట్యా, ఆ రకమైన ఉపవాసాలను విరమించి ఈ రసోపవాసాలను ప్రారంభించియుండవచ్చు. తింటున్న కొలదీ ఆకలి పెరగడం సహజం. పొట్టేలు (గొర్రెపోతు) కవ్వించిన కొలదీ మీదకు రావడం సహజం. కవ్వించక పోతే ఏమీ అనదు. అలాగే పళ్ళ రసాలను ఇస్తున్న కొలదీ మొదటి రోజు ఉపవాసం నుండి ఆకలి పెరుగుతూనే ఉంటుంది గానీ తరగదు. శరీరం, మనస్సు అలా ఆకలి కొరకు ఎదురు చూస్తున్నప్పుడు విసర్జన క్రియ మందకొడిగానే (మెల్లగా జరగడం) ఉంటుంది. ఆ రకమైన రసోపవాసాలలో పూర్తి విసర్జన క్రియ (24 గంటలూ) ఎప్పుడూ ప్రారంభమవదు. దీనికి కారణం మనం త్రాగే రసాలను జీర్ణం చేయడానికి రోజులో సగభాగం సరిపోతుంది. తేనెతో కలిపి జలోపవాసాలు చేసే విధానాలతో పోలిస్తే రసోపవాసాలు 50 నుండి 60 శాతం ఉపయోగంలో వెనకడుగు పడినట్లే. ఉపవాసాలు చేయలేని వారికి ఈ రసోపవాసాలు అని కూడా కొందరు అంటుంటారు. మేము చేయించే తేనె నీళ్ళ ఉపవాసాన్ని చేయలేని మనిషి అంటూ ఉండడని నా నమ్మకం. అందువలన ఈ రసోపవాసాలను తేనె నీళ్ళ ఉపవాసానంతరం చేయించడం జరుగుతున్నది.
4. ఫలోపవాసాలు: ఫలాలు తింటూ చేసే ఉపవాసాలను ఫలోపవాసాలు అంటారు. మేము జలోపవాసం, రసోపవాసం పూర్తి చేసిన వారికి ఈ ఫలోపవాసాన్ని ప్రారంభిస్తాము. మా దగ్గర రెండు రోజుల నుండి పదిరోజుల వరకూ ఫలోపవాసం చేయగలుగుతారు. రసాలతోగూడిన అన్ని రకాల పండ్లను తినిపించడం జరుగుతుంది. ఈ ఫలోపవాసాన్ని ఎన్ని రోజులు చేస్తే అంత రక్త శుద్ధి జరుగుతుంది. అంత ఆకలి కూడా పెరుగుతుంది. రక్తం మారడం ద్వారా విటమిన్లు, మినరల్స్ లోపం తగ్గడం ద్వారా శరీరంలోని రోగాలు తగ్గడానికి బాగా ఈ ఆహారం సహకరిస్తుంది. కొంతమంది ప్రకృతి వైద్యం క్లినిక్ లలో వారం రోజులు క్లీనింగ్ కోర్సులు పెట్టి అందులో భాగంగా ఉపవాసాలు లేకుండా రసాలు, ఫలాలతో పాటు పచ్చి కూరగాయ ముక్కలు కూడా పెడుతూ శరీరాన్ని శుద్ధి చేస్తుంటారు. దీని వలన నష్టం ఏమీ ఉండదు. ఉన్నదల్లా ఒకటే పెద్ద నష్టం. అది మీకు ఉపవాస మేమిటో, దాని ఆనందమేమిటో, అది ఎందుకు చేయాలో తెలిసే అవకాశముండదు.
మనం ఇప్పటి వరకు అన్ని రకాల ఉపవాసాలను ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో పూర్తిగా తెలుసుకున్నాము. ఏ రకమైన ఉపవాసానికి ప్రయోజనం ఎంత ఉంటుందో కూడా తెలుసుకున్నాము. శరీరానికి హాని కలుగకుండా, ఈనాటి పరిస్థితులకు అనుకూలంగా, మన ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని మంచి ఉపవాసపు విధానాన్ని ఆశ్రయించి (డాక్టర్ సలహా మీదట) ఉపవాసాల మీద భయాన్ని తొలగించుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని ఆశిస్తున్నాను.

8. ఉపవాసంలో నిమ్మకాయ ప్రాముఖ్యత

పుల్లని పండ్లు అన్నింటిలో నిమ్మకాయకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఉపవాసంలో ఆహారం మీద వాంఛను పోగేట్టే గుణం నిమ్మరసానికి ఉంది. అందువల్లనే తేనె + నిమ్మకాయ నీళ్ళు త్రాగిన తరువాత ఏమీ తినాలనిపించదు. పుల్లని పండ్లను తిన్న తరువాత వక్కపొడులుగానీ, స్వీట్లు గానీ, మరి ఇతర పదార్థాలుగానీ గంట రెండు గంటల వరకూ తినాలనిపించదు. నోట్లో పెట్టబుద్ధి కాదు. నోట్లో వున్న ఆ పులుపు కారణంగానే ఈ విధంగా అనిపించడం. దంతాలకు ఆ పులుపు తగిలిన తరువాత ఏమీ తినాలని గానీ, నమలాలని గానీ లేకపోవడం సహజం. ప్రతి రెండు గంటలకు ఒకసారి నిమ్మరసాన్ని తేనెతో కలుపుకొని త్రాగడం వలన రోజంతా వాంఛలు లేకుండా ఉపవాసాన్ని సాగించవచ్చు. తేనె ఒక్కదాన్నే నీళ్ళలో కలుపుకుని త్రాగడం వలన కొన్ని రోజులు త్రాగగానే తేనెకు మొహం మొత్తడం (వెగటు పుట్టడం) మొదలగు ఇబ్బందులు ఉంటాయి. అదే నిమ్మరసంతో తేనెను కలపడం వలన ఎక్కువ రోజులు ఇబ్బంది లేకుండా తేనె, నిమ్మరసం ఇష్టంగా ఉండి అందరూ త్రాగగలుగుతారు. పుల్ల పుల్లగా, తియ్య తియ్యగా ఈ నీళ్ళు ఉండే సరికి అన్ని రకాల స్వభావం గల వ్యక్తులకు ఇవి ఇష్టంగానే ఉంటాయి.
నిమ్మరసంలోని నిజాలు:
1. ఉపవాసంలో శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఇందులో ఉన్న విటమిన్ 'సి' బాగా సహకరిస్తుంది.
2. ఉపవాసంలో శరీరం అన్ని రకాల రోగాలను, ఇన్ ఫెక్షన్ లను ఎదుర్కొనే శక్తి నిమ్మరసం కల్పిస్తుంది.
3. కాలేయం నుండి ఎక్కువ పైత్యరసం ఉపవాసంలో రాకుండా నిమ్మరసం చేస్తుంది. దీని కారణంగా త్రేపులు అవీ రావడం తగ్గుతాయి.
4. ముఖ్యంగా ఊపిరితిత్తులలో నిలవయున్న కఫాన్ని కరిగించి బయటకు విసర్జింపజేయడానికి నిమ్మరసం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ముక్కు రొంపలను, సైనస్ ఇబ్బందులను ఉపవాసంలో నివారించి, శరీరానికి ఎక్కువ ప్రాణశక్తి అందే ఏర్పాటుకు సహకరించగలదు.
5. ఉపవాసంలో పొట్ట ప్రేగులలో ఉత్పన్నమయ్యే గ్యాస్ ను బయటకు నెట్టడానికి సహకరిస్తుంది.
6. ప్రేగులలో ఉండే అపకారం కలిగించే బాక్టీరియాను మరియు పెద్ద ప్రేగులలో ఉండే నులి పురుగులు మొదలుగు వాటిని సంహరించడానికి నిమ్మకాయ ఔషధంగా పనిచేస్తుంది.
7. కడుపులో మంట, అల్సర్స్ లను పూర్తిగా నయం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. నిమ్మరసం త్రాగక ముందు యాసిడ్ స్వభావం అయినప్పటికీ అది లాలాజలంతో, నీటితో, తేనెతో కలిసిన నిముషం నుండి క్షార స్వభావాన్ని కలిగియుంటుంది. పుల్లని నిమ్మరసానికి పొట్టలో పుండ్లు మాడే అవకాశముంటుంది.
8. నిమ్మరసంలో ఉన్న విటమిన్ 'సి' కారణంగా శరీరంలోని రక్తనాళాలకు మంచి బలం చేకూరుతుంది.
9. నిమ్మరసంలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా గుండె మరియు శరీరంలోని కణజాలం పూర్తి ఆరోగ్యవంతం అవుతాయి.
10. నిమ్మరసాన్ని ముందే పిండి ఉంచితే దెబ్బతింటుంది. నిమ్మకాయలను ఫ్రిజ్ లలో పెట్టరాదు. మగ్గిన నిమ్మకాయ రసాన్ని ఉపవాసంలో వాడడం మంచిది.
కడుపులో మంటనో, ప్రేగులలో అల్సర్ అనో, గ్యాస్ ట్రబులనో ఉపవాసంలో నిమ్మరసాన్ని వాడడానికి భయపడనవసరం లేదు. ఇన్ని మంచి గుణాలున్న నిమ్మరసాన్ని తేనెతో కలిపి ఉదయంపూట ఒక్కసారి త్రాగితే చాలా మంచిది అని అందరూ అంటుంటారు. అంత మంచి కలయిక ఉన్న నీళ్ళను రోజుకి ఎనిమిదిసార్లు త్రాగితే మీ ఆరోగ్యం ఇంకా ఎంత మంచిగా ఉంటుందో ఆలోచించండి. ఆలసించకండి. మనకు మంచి ఆరోగ్యాన్ని అందివ్వడం కొరకు భగవంతుడు నిమ్మకాయను పుట్టిస్తే, నాకు పడదని నిమ్మకాయను దూరం చేసే కంటే ఉపవాసం ద్వారా అనారోగ్యాన్ని దూరం చేసి నిమ్మకాయకు దగ్గరవడం ప్రకృతి ధర్మం. అది మన ధర్మం కూడా!

9. ఉపవాసంలో నీటి ప్రాముఖ్యత

శరీరాన్ని శుద్ధి చేసి, పవిత్రం జేసేది నీరే. శరీరంలో 68 శాతం నీరు ఉంటుంది. మిగతా 32 శాతం పదార్థం ఉంటుందన్నమాట. శరీరంలో ఉన్నది ఎక్కువ నీరు, తక్కువ పదార్థం కాబట్టి మనం అందివ్వవలసింది, శరీరానికి కావలసింది కూడా ఎక్కువ వంతు నీరు తక్కువ వంతు పదార్థమేనని దీన్ని బట్టి తెలుస్తున్నది. నీటికున్న విలువ తెలిసో తెలియకో మనం నిత్యం చేసే తప్పులలో మొదటిది, పదార్థం ఎక్కువ శరీరానికి అందిస్తుంటామేగానీ నీటిని మాత్రం తక్కువ అందించడం జరుగుచున్నది. మూడు వంతులు ఆహారం తింటే ఒక వంతు నీరు అందిస్తున్నాము. పూర్తి వ్యతిరేకంగా శరీరంలోని నీటి వ్యవస్థను దెబ్బతీస్తున్నాము. శరీరంలోని అన్ని రసాయనిక చర్యలు గాలి, నీటి సమక్షంలోనే జరుగుతాయి. చెట్టు మొదట్లో మూడు వంతులు ఎరువు వేసి, ఒక వంతు నీరు పోసి చూడండి ఏమవుతుందో. అదే మనం చేస్తున్నాము. వేసిన ఎరువుకు మూడు నాలుగు రెట్లు నీరు పోస్తే గానీ ఆ ఎరువు ఆ నీటిలో కరిగి మొదలు నుండి చివర వరకూ నీటిద్వారానే ఆహారం (ఎరువు) ప్రయాణం చేసి ఆకుల వరకూ చేరదు. ఈ విధంగానే మనలో కూడా నిత్యం జరుగుతూ ఉంటుంది. పదార్థం ఎక్కువగా తినడమే గాకుండా, పైగా ఉప్పు ఎక్కువ వాడడం అందరూ చేస్తున్నారు. మనం త్రాగిన ఒక వంతు నీరు ఆ ఆహారాన్ని ప్రేగుల నుండి కణాల వరకు మోసుకొని వెళ్ళడానికే సరిపోతుంది గానీ కణాలలోని చెడును గానీ, వ్యర్థపదార్థాలను గానీ తిరుగు ప్రయాణంలో మోసుకొని రావడానికి మాత్రం చాలడం లేదు. ఇదే మన మందరం చేసే పెద్ద తప్పు. దీని కారణంగానే మన శరీరంలో ఎక్కువ చెడ్డ పదార్థాలు, ఉప్పు, విషపదార్థాలు పేరుకోవడం జరుగుచున్నది. ఆ పేరుకొని పోయిన పదార్థాలన్నింటినీ శరీరం నుండి బయటకు పంపించాలంటే ఉపవాసం చేస్తూ ఎక్కువ నీటిని (సుమారు 5 - 7 లీటర్లు) త్రాగడమే తప్ప మరొక మార్గం మనిషికి లేదు. ఉపవాసంలో కూడా అలవాటు లేదని నీరు సరిగా త్రాగకుండా, పూర్వం చేసిన తప్పునే మరలా ఉపవాసంలో కూడా చేస్తే ఉపవాసం వ్యర్థం అవుతుంది. ఉపవాసంలో మనం వాడే తేనె రక్తాన్ని, శరీరాన్ని పది శాతం శుభ్రపరచగలిగితే ఖాళీ మంచి నీరు మాత్రం 90 శాతం శుభ్రపరచగలదు. డబ్బులు పెట్టి తేనెను కొని వాడమంటే ఎక్కువ మంది వాడతారు గానీ ఉచితంగా భగవంతుడు అందించిన నీరు ఎక్కువ త్రాగమంటే ఉపవాసంలో మనిషి ఇంకా ఆలోచిస్తూనే ఉంటాడు. ఉచితంగా వచ్చిన నీరు త్రాగడానికి మనస్సు అంగీకరించక పోతే సీసా 12 రూపాయలు పెట్టి కొని త్రాగగలిగినా అదీ మంచిదే.
మంచి లోపలకు వెళితేనే చెడు బయటకు రావడం జరుగుతుంది. మంచి అనే మంచినీరు లోపలకు త్రాగితేనే చెడు అనే మూత్రం బయటకు వస్తుంది. మనలో చెడు బయటకు పోవాలంటే మంచిని తప్పకుండా ఆశ్రయించాలన్నమాట. రోజూ ఆహారం ద్వారా ఉప్పును ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఆ ఎక్కువ ఉప్పు శరీరంలో నిలువ ఉండిపోయి, నీటిని కూడా ఎక్కువగా నిలువచేస్తుంది. ఆ విధంగా నిలువ యున్న ఎక్కువ నీరు ప్రాణశక్తికి, రక్త ప్రసరణలకు ఆటంకం కలిగిస్తూ ఉంటుంది. ఆ ఎక్కువ నీరు పోతేగానీ శరీరంలో విసర్జన క్రియ ఉపవాసంలో ప్రారంభం కాదు. ఉపవాసంలో అన్ని అవయవాలకు, కణాలకు రక్తప్రసరణ బాగా జరిగి విసర్జన క్రియ శక్తివంతంగా జరగాలంటే శరీరంలో అవసరానికి మించియున్న ఉప్పునీరును మంచినీరు ఎక్కువగా త్రాగి తగ్గించే ఆలోచన చేయాలి. మంచి నీరు ఎక్కువగా త్రాగడం వలననే పూర్తిగా లోపల ఉన్న చెడ్డ నీరు బయటకు రోజూ వచ్చేస్తూ ఉంటుంది.
నీటిలోని నిజాలు:
1. ఉపవాసంలో, రాత్రి సమయాల్లో కణాల నుండి రక్తంలోకి వచ్చిన ఎక్కువ చెడు పదార్థాలన్నీ ఉదయమే లీటరు నీరు త్రాగడం వలన అందులో కరిగి మూత్రం ద్వారా బయటకు పోయే అవకాశముంటుంది.
2. ఉపవాసంలో ఎక్కువ మంచినీరు త్రాగండి అని రోగికి చెప్పితే, అలవాటుగా రోజూ త్రాగేకంటే ఇంకొద్దిగా ఎక్కువ త్రాగుతాడు గానీ పూర్తిగా 5 లీటర్లు త్రాగడు. అందువల్ల మేము చెప్పేది ఏమిటంటే ఉదయం పరగడపున లీటరు తరువాత ప్రతి రెండు గంటలకు ఒక్కసారి రెండు పెద్ద గ్లాసులు చొప్పున రోజుకి ఎనిమిది సార్లు అంటే 16 గ్లాసుల నీరు తప్పని సరిగా ఉపవాసంలో త్రాగాలి. అలా టైము ప్రకారం త్రాగాలని మీరు పెట్టుకోకపోతే కుదిరినప్పుడు త్రాగి, కుదరనప్పుడు మానివేయడం చేస్తారు. ఒక్కోసారి పనిలో పడి కూడా మరిచే అవకాశముంటుంది. ఉపవాసంలో తేనె నీళ్ళకంటే కూడా ఎక్కువ శ్రద్ధతో మంచినీరు టైము ప్రకారం త్రాగేవారికి లాభం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో చెడు ఎప్పుడూ కదలుతూ ఉంటుంది కాబట్టి మంచి నీరును ఉదయం నుండి రాత్రివరకూ (7 గంటల వరకు) అలా అందించడం మంచిది.
3. ఉపవాసంలో నీరు తక్కువ త్రాగిన వారికి లోపల నిలువయున్న వ్యర్థ పదార్థాలు సరిగా నానవు. కదలవు.
4. నీరు తక్కువ త్రాగిన వారికి ఉపవాసాలు ఇంకా కొన్ని ఎక్కువ రోజులు పడతాయి గానీ, త్వరగా పూర్తి కావు.
5. నీరు తక్కువ త్రాగిన వారికి మలం సరిగా నానక నిలువయున్న మలం రోజూ కదిలి వెళ్ళడం తగ్గుతుంది.
6. ఎంత నీరు ఎక్కువ త్రాగితే అంత మూత్రం ఉపవాసంలో రావడం జరుగుతుంది. మూత్రం ఎక్కువ వస్తే బాత్ రూమ్ ల చుట్టూ ఎక్కువ సార్లు తిరగాలని నీరును తగ్గిస్తే అది చెడుని లోపల ఇంకా దాచుకోవడం అవుతుంది.
7. చలికాలం, వర్షాకాలం అని మంచి నీరును ఉపవాసంలో త్రాగడం ఎట్టి పరిస్థితులలోనూ తగ్గించకూడదు.
8. ఫ్రిజ్ లలోని చల్లని నీరు ఉపవాసంలో త్రాగడానికి వీలు లేదు. అలా త్రాగడం వలన నోటిలో, ప్రేగులలో కదలవలసిన చెడ్డ పదార్థం చల్లదనం కారణంగా ఆలస్యమవుతుంది. శరీరంలోని శక్తి కొంత ఈ నీటిని గోరువెచ్చగా (39 C) వేడి చేయడానికి వృధా అవుతుంది. మాములు నీరు పొయ్యి మీద వేడి చేయడానికంటే ఫ్రిజ్ లోని నీటిను వేడి చేయడానికి గ్యాసు ఎక్కువ ఖర్చు అవుతుంది. చల్లని నీరు వేడి అయ్యేవరకూ ప్రేగుల నుండి రక్తంలో కలవకుండా అలా ఆగుతాయి. అందువల్లనే గోరువెచ్చని నీటిలో తేనె వేసుకొని త్రాగితే మంచిది అంటారు. అలాగే మంచినీరును కూడా ఆస్తమాలు, అలర్జీలు, దగ్గు, కడుపులో మంటలు, అల్సర్స్ ఉన్నవారు గోరువెచ్చగా పెట్టుకొని త్రాగితే మంచిది. వేడి నీటిలో కరిగిన తేనె ప్రేగులలోని మ్యూకస్ ని పలుచబరిచి ఆమ్లగుణాన్ని తగ్గిస్తుంది. దీనికి భిన్నంగా తేనె కలిపిన నీరు చల్లగా ఉంటే అది ఆమ్ల గుణాన్ని పెంచుతుంది.
9. శరీరం బాగా నీరుపట్టి ఉబ్బిన వారికి లోపల ఎక్కువ నీరు నిలువ వుంది కదా; మళ్ళీ బయట నుండి నీరు త్రాగితే ఇంకా శరీరానికి పట్టేస్తుందనుకొని నీరు త్రాగడం తగ్గిస్తే పొరపాటే. మనం మంచి నీరును ఎంత ఎక్కువ త్రాగితే అంత ఉప్పు నీరు బయటకు వస్తుంది.
10. ఉపవాసంలో ఆహారం తినడం లేదు గదా అని (రోజూ తినేటప్పుడే నీరు త్రాగడం అలవాటు) నీరు త్రాగడం తగ్గిస్తే తల డిమ్ గా, కళ్ళు మంటలుగా, శరీరం వేడిగా ఉండటం జరుగుతుంది. నీరు సరిగా త్రాగక తేనె వేడిచేసింది. నాకు ఉపవాసం పడటం లేదని రకరకాలుగా మాటలు అనవలసి వస్తుంది.
11. లో బి.పి. ఉండి ఉపవాసాన్ని ప్రారంభించేవారు ఉప్పు పూర్తిగా మానివేసినప్పటికీ, ఐదు లీటర్ల నీరును టైము ప్రకారము తీసుకొంటూ ఉంటే వారికి ఉపవాసంలో బి.పి. తగ్గిపోయి నీరసం వచ్చే ప్రమాదం అసలుండదు. నీరు సరిగా త్రాగకపోతే బి.పి. తగ్గిపోయే ప్రమాదం వుంది.
12. తేనె పావు కేజీ వాడడం వలన ఎక్కువగా నీటిని త్రాగితే గానీ తేనె జీర్ణం కావడానికి (కలవడానికి) గానీ, మూత్రం సరిగా రావడానికిగానీ వీలుండదు. అంత తేనె వాడడం వలన శరీర కణాలలో ఉత్పన్నమయ్యే వేడి వలన శరీరంలో వేడి ఎక్కువగా ఉంటుంది. తేనెతో గ్లాసుడు నీరు త్రాగాము గదా అని మరలా మంచి నీరు త్రాగక పోతే అసలు మూత్రం రాదు లేదా కొద్దిగానే వస్తుంది. మూత్రం జారీగా అవ్వడానికి విడిగా నీరు త్రాగడమే మార్గం.
నీళ్ళలో బట్టలు నానబెట్టి, సబ్బుపెట్టి సరిగా జాడించక పోతే ఉతికి ప్రయోజన మేముంటుంది. నీరు ఎక్కువగా ఉంటే బట్టలు జాడించడం త్వరగా పూర్తి అవుతుంది. అలాగే మనలో కూడా నీరు ఎక్కువగా త్రాగితే చెడు తొందరగా నానడం, వదలడం అన్నీ తొందరగానే పూర్తి అవుతాయి. నీరు చాలని ఉపవాసం నూనె చాలని దీపం వంటిది. నీటి విలువ తెలిస్తే మనకు బ్రతుకు విలువ తెలిసినట్లే. ఉపవాసం వల్ల వచ్చే ఉపయోగమంతా ఈ నీటి మీదే ఆధారపడి వుంది. వెలలేని నీటితో విలువకట్టలేని ఆరోగ్యాన్ని ఉపవాసం ద్వారా ఉచితంగా పొందే అవకాశం భగవంతుడు మన అందరికీ అందించాడు. ఆలసించక అందుకున్నవారు అదృష్టవంతులు. పని అనుకోకుండా పదే పదే పవిత్ర జలాన్ని సేవిస్తూ, జీవితాన్ని పావనం చేసే ప్రయత్నం ప్రారంభిద్దాం.

10. ఉపవాసంలో తేనె ప్రాముఖ్యత

తేనెతో చేసే ఉపవాసాలు జలోపవాసాలు అని అనవచ్చు. సాధారణంగా తేనె త్రాగితే చేసే ఉపవాసాలను రసోపవాసాల క్రింద అందరు లెక్క గడతారు. రసోపవాసాలలో ఏదో ఒక రసం లేదా తేలికపాటి ఆహారం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. తేనె కూడా ఆహారమే కాబట్టి తేనెతో చేసే ఉపవాసాలను రసోపవాసాలుగా అందరూ అంచనా వేసి యుండవచ్చు. కానీ మా అంచనా ప్రకారం తేనె ఆహారం అయినప్పటికీ ఏ రకమైన జీర్ణక్రియకూ గురికాకుండా ప్రేగులు, పొట్టకు శ్రమ కాకుండా రక్తంలో నీరు లాగానే వెళ్ళి కలుస్తుంది. కాబట్టి తేనెతో ఉపవాసాలను జలోపవాసాల క్రింద జేర్చడమే జరిగింది.
నోటి ద్వారా తీసుకొనే సెలైన్ తేనె: మనకు సెలైన్ ఎక్కిస్తే అది ఏకంగా రక్తంలోకి చేరి వెంటనే శక్తిని ఎలా ఇస్తున్నదో, అలాగే తేనె కూడా నోట్లో నుండి తీసుకున్న వెంటనే ఏ రకమైన జీర్ణక్రియ అవసరం లేకుండా సెలైన్ లాగా పొట్ట ప్రేగులనుండి రక్తంలో చేరి కలుస్తుంది. అందువలననే తేనెను ఓరల్ (నోటి ద్వారా) సెలైన్ అంటారు. ఈ గుణం కలిగియున్నందువల్ల తేనెను ఉపవాసంలో వాడడం జరుగుచున్నది. తేనె ఆ విధంగా రక్తంలోకి చేరి శక్తిని ఇవ్వడం జరుగుచున్నందువల్ల ఉపవాసంలో తేనె వాడినందువల్ల కూడా విసర్జన క్రియకు ఆటంకం రాకుండా, మనకు 24 గంటలూ విసర్జన క్రియ జరుగుతూనే ఉంటుంది. అంటే ఇటు శక్తినిస్తూ, అటు పూర్తి విసర్జన క్రియ జరిగే అవకాశం తేనె కల్పిస్తున్నది. అదే కేవలం జలోపవాసం అయితే విసర్జన క్రియ జరుగుతూనే ఉంటుంది గానీ నీరసం వస్తుంది. అదే రసోపవాసం అయితే శరీరానికి శక్తి నివ్వడం బదులు శరీరంలోని శక్తిని కొంత హరించి వేస్తూ (జీర్ణక్రియ వలన), విసర్జన క్రియకు కొంత ఆటంకం కలిగిస్తూ ఉంటుంది. ఒక టిక్కెట్టుకు రెండు సినిమాలు చూపించినట్లు, ఒక్క తేనె తీసుకొంటేనే ఉపవాసంలో రెండు ప్రయోజనాలు (శక్తి రావడం, విసర్జన క్రియ చక్కగా జరగడం) కలగడం వలన తేనెతో ఉపవాసాలు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి అనవచ్చు.
ఉపవాసం అంటే శరీరానికి పూర్తిగా విశ్రాంతినివ్వడం అని అర్థం. ముఖ్యంగా పొట్ట ప్రేగులకు ఇస్తేనే అది ఉపవాసం అవుతుంది. ఏమీ ఆహరం తినకుండా, త్రాగకుండా ఉంటేనే అది ఉపవాసం క్రిందకు వస్తుంది. శరీర ధర్మం ప్రకారం శరీరం పనిచేసినా, పనిచేయకపోయినా అది నడవడానికి కొంత శక్తి కావాలి. ఉపవాసం పేరు చెప్పుకొని పొట్ట, ప్రేగులకు విశ్రాంతి నిచ్చి మనం పడుకొన్నప్పటికీ, గుండె, ఊపిరి తిత్తులు, కిడ్నీలు, మెదడు, రక్తనాళాలు మొదలగునవి నిరంతరం పనిచేస్తూ ఉండవలసిందే. పైగా అవసరమయితే ఉపవాసంతో ఇంకొద్దిగా ఎక్కువ పని కూడా చేసి శరీరాన్ని శుద్ధి చేయవలసిన బాధ్యత కూడా వీటి మీద ఉంది. ఆ అవయవాలు నిరంతరం శక్తివంతంగా పనిచేయాలంటే ముఖ్యంగా 800 కేలరీల శక్తి కేవలం వాటి కొరకు కావాలన్నమాట. మనం విశ్రాంతి తీసుకొన్నా, పని చేస్తూ ఉన్నా, ఆ అవయవాల కొరకు ప్రతి రోజూ ఆ శక్తిని ఆహరం ద్వారా అందివ్వవలసిందే. శరీరాన్ని అన్ని కోణాల నుండి పూర్తిగా అధ్యయనం చేసే ఆధునిక వైద్య విజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్పుచున్న విషయం ఇది. ఈ 800 కేలరీల శక్తి కొరకే జ్వరాలు, రోగాలు వచ్చినప్పుడు కూడా ఏదొకటి కొద్దిగా తినండి లేకపోతే శరీరం దెబ్బతింటుంది అని గట్టిగా డాక్టర్లు చెప్పడంలో ఉన్న అసలు రహస్యం.
నిరంతరంగా పనిచేసే అన్ని అవయవాలలో అన్నింటి కంటే మెదడు పనిచేయడానికి ముఖ్యంగా ఈ శక్తి ఎక్కువ అవసరముంటుంది. మనం ఆహారం తినకపోయినప్పటికీ మనలో నిలువ వున్న కొవ్వు పదార్థం అవసరానికి కరుగుతూ, ఆ 800 కేలరీల శక్తిని సమకూర్చవచ్చని కొంత మంది అభిప్రాయ పడుతూ వుంటారు. మనం పూర్తిగా ఆహారం మానివేస్తే నిలువ వున్న కొవ్వు కరగడమనేది నిజమే కానీ నిలువ ఉన్న క్రొవ్వు ఆక్సిజన్ తో కలిసి శక్తిగా మారడం అనేది అతి మెల్లగా జరిగే ప్రక్రియ. అదే గ్లూకోజు ఆక్సిజన్ తో కలిసి శక్తి నివ్వడం చాలా త్వరగా జరిగే ప్రక్రియ. నిలువ ఉన్న క్రొవ్వు కొద్దికొద్దిగా కరిగి శక్తిని (గ్లూకోజు) మెల్లగా అందిస్తున్నప్పటికీ, ఆ కొద్ది శక్తి మన కదలికలకూ, మనం చేసే పనులకు కొంత పోగా మిగతా కొద్దీ శక్తి మాత్రమే మెదడుకు అందుతూ ఉంటుంది. మనం ఆహారం తినడం మానివేస్తే మెదడు పని చేయడానికి కావలసిన గ్లూకోజు (శక్తి) సరిగా అందదన్న మాట. అందువల్లేనేమో మనకు కుదరనప్పుడు ఏమీ ఆహారం తినకుండా ఎక్కువ గంటలు పొట్టను ఖాళీగా ఉంచినప్పుడు, బాగా ఆకలయినప్పుడు మనస్సు మందంగా, డిమ్ గా ఉండి సరిగా పనిచేయనట్లు అనిపిస్తుంది. మెదడుకు గ్లూకోజు సరిగ్గా అందకపోతే శక్తి హీనంగా ఉండి, సరిగా పనిచేయలేదన్నమాట. తిరిగి ఆహారం అందివ్వగానే మందంపోయి శక్తి పెరగడం గమనిస్తాం. అదే అలా మందంగా, డిమ్ గా మెదడు ఉన్నప్పుడు తేనె నాకితే వెంటనే 10-15 నిమిషాలలో శక్తిని పుంజుకోవడం స్పష్టంగా తెలుస్తుంది.
నిలువ వున్న క్రొవ్వు కరగడం ద్వారా వచ్చిన శక్తి మెదడు పని చేయడానికి సరిపోతుంది అని కొంత మంది అభిప్రాయం కూడా. 40 కేజీల కొవ్వు నిలువ వున్న మనిషికి మంచి నీరు, మంచి గాలి అందిస్తూ ఉంటే సుమారు ఆ కొవ్వు పూర్తిగా కరిగే వరకూ (సుమారు 40-50 రోజులు) ఆ మనిషి ఆరోగ్యంగా, శక్తిగా ఉండాలి గదా. మానసికంగా కూడా హుషారుగా ఉండాలి. మరి అలా ఏ ఒక్కరూ ఉండలేక పోతున్నారంటే అది కరెక్టు కాదనే దాని భావం. మన మనస్సు నిలువ ఉన్న క్రొవ్వు ద్వారా వచ్చే గ్లూకోజును ఎక్కువగా వాడుకోకుండా (ఆ గ్లూకోజు చాలదు కాబట్టి) ప్రతి రోజూ ఆహారం ద్వారా అందే గ్లూకోజునే ముఖ్యంగా వాడుకొంటుంది అని శాస్త్రం చెప్పుచున్నది. సింహాలు నిలువ వున్న మాంసాన్ని తినకుండా ఎప్పుడు ఆకలయితే అప్పుడు స్వచ్ఛమైన మాంసాన్ని తిన్నట్లే మన మనస్సు కూడా చేస్తుంది అన్నమాట. అందువలన ఉపవాసంలో 800 కేలరీల శక్తిని అందించే విధంగా ఉంటే ఉపవాసం వలన శరీరానికి గానీ, మెదడుకు గానీ నష్టం ఉండదు.
ఉపవాసంతో 800 కేలరీల శక్తిని అందించే ప్రయత్నం: ఉపవాసంతో నాలుగు గ్లాసుల పళ్ళరసం త్రాగితే అది 800 కేలరీలు సరిపోవచ్చు. పళ్ళరసం వలన ప్రేగులు పనిచేస్తే గానీ ఆ శక్తి శరీరానికి అందదు. ప్రేగులు పనిచేస్తే అది పూర్తి ఉపవాసం కాదు. అయితే ప్రేగులకు పనిలేకుండా 800 కేలరీల శక్తి శరీరానికి అందితే అది పూర్తి ఉపవాసం అవుతుంది. అలా పనిలేకుండా, శరీరానికి శ్రమ లేకుండా శక్తి రావాలంటే సెలైన్ అన్నా ఎక్కించుకోవాలి లేదా సెలైన్ లాంటి తేనెనన్నా తప్పని సరిగా త్రాగాలి. వంద గ్రాముల తేనెలో సుమారు 325 కేలరీల శక్తి ఉంటుంది. మనకు అధమం 800 కేలరీల శక్తి కావాలంటే రోజుకి పావు కేజీ తేనెను (250 గ్రా) తప్పనిసరిగా ఉపవాసంలో వాడాలన్న మాట. తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని, ఎక్కువ సేపు శక్తిని ధారగా అందివ్వగల అరుదైన ఆహారం తేనె. తేనె లాగా ఈ విధంగా శక్తినిచ్చే ఆహారం ఇంకొకటి లేదనే చెప్పవచ్చు. తేనెలో ఉన్న డెక్స్ టిన్ అనే పదార్థం కారణంగా త్వరగా రక్తంలో కలిసి శక్తిని వెంటనే ఇవ్వగలుగుతుంది.
తేనెలోని గొప్పతనం: తేనెలో 75 శాతం శక్తినిచ్చే గ్లూకోజు మరియు ఫ్రక్టోజు ఉంటాయి. అందులో గ్లూకోజు 34 శాతం ఉంటుంది. గ్లూకోజు ఏ మార్పు చెందకుండా (జీర్ణక్రియ అవసరం లేకుండా) త్రాగినది త్రాగినట్లుగా ప్రేగులనుండి తిన్నగా రక్తంలోకి ప్రవేశిస్తుంది. ఆ రక్త నాళాల ద్వారా తిన్నగా లివరులోనికి (కాలేయము) చేరుతుంది. అక్కడ నుండి ధారగా శరీరపు కణజాలాల్లోను వ్యాపించి వెంటనే శక్తినిస్తుంది. తేనె త్రాగిన దగ్గర నుండి సుమారు గంట వరకూ తేనెలో ఉన్న ఈ గ్లూకోజు శక్తిని అందివ్వగలుగుతుంది. తేనెలో గ్లూకోజుతో పాటు (34 శాతం) ఫ్రక్టోజు 39 శాతం ఉంటుంది. ఈ ఫ్రక్టోజు గ్లూకోజు మాదిరే ఒక్కసారే రక్తంలోనికి చేరకుండా మెల్లగా, కొద్దికొద్దిగా ప్రేగుల నుండి పీల్చబడి కాలేయానికి చేర్చబడుతుంది. దీని కారణంగా తేనెలోని ఫ్రక్టోజు తేనె త్రాగిన దగ్గర నుండి సుమారు రెండు గంటల వరకూ శక్తినిస్తూనే ఉంటుంది. నాలుగు స్పూన్లు తేనెను త్రాగితే దాని ద్వారా మనకు శ్రమ (ప్రేగులకు, పొట్టకు) లేకుండా రెండు గంటలపాటు శక్తి వస్తుందని తెలుస్తున్నది. తేనె ద్వారా వచ్చిన శక్తి ఉపవాసంలో మనం వాడుకున్నా, వాడుకోకపోయినా ఖర్చు అయిపోతుంది. తేనె ద్వారా వచ్చిన శక్తి లివరులో మార్పు చెందే అవకాశముండదు. తేనె ద్వారా వచ్చే శక్తి మెదడుకు, గుండె మొదలగు భాగాలకు సక్రమంగా ఎప్పుడూ అందుతూ ఉండాలి అంటే తేనెను ప్రతి రెండు గంటలకు ఒకసారి చొప్పున విడగొడితే, తడవకు నాలుగు టీ స్పూన్లు నిండుగా వేసుకొంటే రెండు గంటల వరకూ శక్తి సరిపోతుంది. అంటే తేనె త్రాగిన ప్రతిసారీ శరీరానికి 100 కేలరీల చొప్పున శక్తి అందుతూ ఉంటుంది. రోజుకి ఎనిమిది సార్లు తేనెను త్రాగవలసివస్తున్నది. రోజుకి ఎనిమిది సార్లు తేనెను త్రాగే కంటే పావుకేజీ తేనెను ఒకసారో లేదా రెండు సార్లు గానో త్రాగితే సరిపోదా అని మీకు సందేహం కలుగవచ్చు. ఉదయం 10 గంటలకు పొట్ట నిండుగా భోజనం చేసి వెళ్లినప్పటికీ రాత్రి వరకూ నీరసం రాకుండా ఆ భోజనం చేయలేదుగదా! అలాగే ఒక్కసారే ఎక్కువ తేనెను త్రాగినప్పుడు మెదడు, మిగతా భాగాలు వాడుకోగా మిగిలిన శక్తి మనం చేసే పనులకు ఖర్చు అవ్వడం మొదలెడుతుంది. నిలువ వున్న క్రొవ్వు కరిగి, మన మిగతా పనులకు ఖర్చు అవ్వాల్సిన శక్తి ఆ రూపంలో ఆగి తేనె ద్వారా వచ్చిన శక్తి ముందు ఖర్చు అవుతుంది. దీని ద్వారా ఉపవాసంలో బరువు తగ్గడం ఆగడమే కాకుండా నీరసం రావడం మొదలవుతుంది. అందువలన తేనెను పని అనుకోకుండా ప్రతి రెండు గంటలకూ ఒకసారి తప్పని సరిగా త్రాగవలసిందే.
తేనెను ఈ విధంగా త్రాగడం వలన ఉపవాసంలో మనస్సు చురుగ్గా పని చేస్తుంది. మనస్సు చురుగ్గా ఉంటే దాన్ని అనుసరించి నడిచే అవయవాలు, భాగాలు కూడా చురుగ్గా పనిచేయగలవన్న మాట. ఉపవాసంలో మనస్సు, విసర్జకావయవాలు చురుగ్గా, శక్తిగా పనిచేస్తే త్వరగా చెడు పూర్తిగా విసర్జింపబడుతుంది. అంతేగానీ శరీరాన్ని నడిపే మనస్సే ఉపవాసంలో మందంగా ఉంటే ఇంక ప్రయోజనం ఏముంటుంది? పంచదార, బెల్లంను కూడా తేనె మాదిరే తీపి అని వాటిని ఉపవాసంలో త్రాగుదామంటే కుదరదు. పంచదార, బెల్లంను ప్రేగులు వేరేలా జీర్ణించుకుంటాయి. అవి ముందు గ్లూకోజుగా మారాలంటే హైడ్రాలిసిస్ కు గురి కావాలి. ఇవన్నీ ప్రేగులలో జరగాలి. కాబట్టి ప్రేగులకు అవి పని కల్పించడం అవుతుంది.
మరికొన్ని ప్రయోజనాలు:
1. తేనెలో ప్రోటీన్ స్వభావం కలిగియుండే ఆహార పదార్థాలు, ఎంజైములూ సమృద్ధిగా ఉన్నాయి. వీటికి దేహంలో జరిగే రసాయన చర్యలను అనేక రెట్లు త్వరితం చేసే సామర్థ్యం ఉంది. తేనెలో ఉన్న అన్ని రకాల ఎన్ జైమ్ లు ఉపవాసంలో శరీరానికి రోగ నివారణగా సహకరించగలవు.
2. తేనెలో బాక్టీరియం నాసికా గుణాలే (యాంటీ బయోటిక్) కాకుండా, శిలీంధ్రనాశక గుణాలు (యాంటీమైకోటిక్) కూడా ఉన్నందువల్ల ఉపవాసంలో శరీరానికి అపకారం చేసే క్రిములను ఎదుర్కోవడానికి తేనె చక్కగా పనికి వస్తుంది.
3. ఉపవాసంలో రక్తంలోని చక్కెర శాతం తగ్గి పోయినప్పుడు గుండె, రక్తనాళాల వ్యవస్థ చురుకుదనం పెంచడానికి తేనెలోని గ్లూకోజు చక్కగా పనికి వస్తుంది.
4. అధిక ఆమ్లతని, జఠరరసాల విడుదలని తేనె అదుపు చేస్తుంది. దీని కారణంగా అల్సర్ తో బాధపడే వారికి తేనెతో ఉపవాసం చేస్తే అల్సర్ పూర్తిగా మూసుకుని పోతుంది. కడుపులో మంటలు ఉన్నా తేనెతో ఉపవాసాలు చేయడం తేలిక.
5. షుగరు జబ్బు ఉన్న వారు తేనెతో ఉపవాసాలు చేయడం తేలిక, క్షేమం కూడా. దీనికి కారణం తేనెలో ఉన్న ఫ్రక్టోజు అనే సుగరు. ఇది రక్తంలో నూరు శాతం ఒక్కసారే పెరగకుండా కొద్దికొద్దిగా శక్తిని అందిస్తూ ఉంటుంది.
మనస్సుకు శక్తినిచ్చి, శరీరాన్ని క్షేమంగా ఉపవాసం చేయించగల సత్తా ఒక్క తేనెకు మాత్రమే ఉంది. తేనెలేని ఉపవాసం నీరులేని మొక్కలాంటిది. నీరు లేని మొక్క ఎలా రోజు రోజుకీ ఎండి, నాశనం అవుతూ ఉంటుందో అలాగే మన శరీరం కూడా ఎండిపోతూ రోజురోజుకి దెబ్బ తింటూ ఉంటుంది. నీరు అందుతున్న మొక్క ఎన్ని రోజులు ఉన్నప్పటికీ వాడి పోకుండా ఉండగలదు. అలాగే తేనెతో చేసే ఉపవాసాలు ఎన్నిరోజులు చేసినప్పటికీ (దీర్ఘోపవాసాలు అయినప్పటికీ) శరీరానికి ఎన్నడూ హాని జరుగదు, ఇబ్బంది రాదు. అంతేగానీ తేనె ఆహారం అనుకొని లేదా తేనె బలం అనుకొని ఉపవాసాలలో త్రాగడం మానివేస్తే ఎక్కువ రోజులు ఉపవాసాలు చేయలేరు. అన్ని రోగాల వారూ శరీరంలో శక్తి లేకపోయినప్పటికీ లింగభేదం, వయో బేధం లేకుండా ఈ తేనెతో చేసే ఉపవాసాలను త్రికరణ శుద్ధిగా ప్రారంభించి దిగ్విజయంగా ముగిస్తారని ఆశిస్తున్నాను. అరుణోదయపు కాంతులు వచ్చిన వెంటనే రాత్రి నుండి ఉన్న మసక చీకట్లు పటాపంచలు అయినట్లు ఈ తేనె ఉపవాస విధానం మీలో ఎన్నో ఏళ్ళ నుండి గూడుగట్టిన ఉపవాస భయాన్ని పటాపంచలు చేయగలదని ఆకాంక్షిస్తున్నాను.

11. ఉపవాసంలో ఎనిమా ప్రాముఖ్యత

ఎనిమా అంటే ఆపరేషను ముందు, డెలివరీ ముందు సబ్బు నీరు కలిపి హాస్పిటల్ లో చేస్తారని ఎక్కువ మందికి గుర్తుకు వస్తుంది. అంతే గానీ ఆరోగ్యానికి, ఎనిమాకి ఉన్న సంబంధం ఎక్కువ మందికి తెలియదనే చెప్పాలి. ప్రతి ఇంట్లో ఎనిమా డబ్బా తప్పనిసరిగా ఉండవలసిన వస్తువు అని ప్రకృతి వైద్యం అనుసరించే వారికి మాత్రమే తెలుసు. ఉపవాసంలో ఎనిమా సుఖం ప్రకృతి వైద్యం అనుసరించే వారికే తెలుసు. ఆకలయిన వాడికి ఆహారం ఎంత అవసరమో, ఉపవాసంలో ఉన్నవాడికి ఎనిమా అంత అవసరమన్నమాట. ఆకలయిన వాడికి ఆహారం అందకపోతే ఎంత బాధగా, నీరసంగా, చిరాకుగా, కోపంగా ఉంటుందో - అలాగే ఉపవాసంలో ఉన్న వాడికి ఎనిమా చేయకపోతే పొట్టంతా భారంగా, చిరాకుగా, కోపంగా, నీరసంగా ఉండటం కూడా సహజమే. ఎనిమా డబ్బా లేనిదే అసలు ఉపవాసాలు ప్రారంభించడానికి వీలు లేదు.
మనిషి ఆహారం తింటున్నంత కాలం రోజుకి ఒకసారో లేదా రెండు రోజులకు ఒకసారో విరేచనం అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆహారం తింటూ ఉంటేనే మలం రోజూ జరుగుతుందన్నమాట. అంటే కాలువలో క్రొత్త నీరు వచ్చి పాత నీరును ముందుకు నెట్టినట్లు మనలో కూడా జరుగుచున్నది. ఉపవాసం ప్రారంభించిన రోజు నుండి ఆహారం (కొత్త నీరు) లేని కారణంగా పాత మలం (పాత నీరు) ఒత్తిడి లేక ముందుకు కదలదు. ఆలా కదలకుండా మలం ప్రేగులలో ఉండిపోతే, ఆ మలం నుండి క్రిములు, సూక్ష్మజీవులు తయారయ్యి ప్రేగుల గోడల గుండా రక్తంలోనికి ప్రవేశించి చివరకు శరీరమంతా వ్యాపిస్తాయి. కాలువలో నీరు ముందుకు ప్రవహించనప్పుడు, ఆ నీరు రోజురోజుకీ వాసనగా, నల్లగా మారి అందులోనే దోమలు, క్రిములు తయారయినట్లే మనలో కూడా జరుగుతుంది. మన శరీరంలో ఎప్పటినుండో నిలువ యున్న వ్యర్థ పదార్థాలు, వాటి ద్వారా తయారైన విష క్రిములను పునాదులు లేకుండా బయటకు నెట్టి వేయడానికి మనం ఉపవాసాన్ని ప్రారంభిస్తున్నాము. అంటే ఉపవాసం అనేది శరీరాన్ని లోపల కడిగి శుభ్రం చేసేది అని తెలుస్తున్నది. అప్పులన్నీ తీరాలంటే కొత్తగా అప్పులు చేయడం మాని పాత అప్పులు తీరిస్తేగానీ బాకీలు తీరనట్లు, నిలువ ఉన్న పాత చెడు పోవాలంటే కొత్తగా మలం నుండి చెడు పుట్టకుండా ఎనిమా చేస్తూ ఆపి, ఉపవాసం ద్వారా నిలువ ఉన్న చెడును పోగొడితే అప్పుడు శరీరం కాంతిగా, ఆరోగ్యంగా తయారవుతుంది.
ఉపవాసంలో ఎనిమా చేయకపోతే ఇంకొక నష్టం ఏమిటంటే మనలోని ప్రాణశక్తి, రక్తం అంతా మలం ఉండే పెద్ద ప్రేగు వద్దే 24 గంటలు కేంద్రీకృతమై పని చేస్తూ మిగతా భాగాలలో ఉన్న చెడును, రోగాన్ని రిపేరు చేయడం తగ్గిస్తుంది. అలాంటప్పుడు ఎన్ని రోజులు ఉపవాసాలు చేసినప్పటికీ శరీరం లోని వ్యర్థ పదార్థాలు బయటకు పోక ఆరోగ్యం రాదు. ఆకలి పుట్టదు. అలాంటి ఉపవాసాల వల్ల శరీరానికి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. అలా జరిగితే అది ఉపవాసం అవ్వదు.
ఉపవాసాలలో ప్రతిరోజూ ఎనిమా చేసుకుంటే ప్రయోజనమేమిటంటే శరీరంలో ఎక్కువ భాగం చెడు మలం రూపంలో బయటకు పోతుంది కాబట్టి, ఆ మలాన్ని ఎనిమా ద్వారా తీసివేయడంతో శరీరానికి ఎంతో శ్రమను తగ్గించిన వారమౌతాము. తద్వారా మనలోని ప్రాణశక్తి ఎక్కడకు చేరి శరీరాన్ని శుద్ధిచేయాలో అక్కడకు చేరి అన్ని రకములైన వ్యర్థ పదార్థాలను పూర్తిగా విసర్జించడానికి సహకరిస్తుంది. శరీరంలో నిలువయుండే చెడ్డ పదార్థాలకు, టాక్సిన్స్ కు, రకరకాల బాక్టీరియా మొదలగు వ్యర్థ పదార్థాలకు జన్మ స్థానం మలం. ఎనిమా ద్వారా రోగాలకు తల్లిలాంటి పెద్దప్రేగు నుండి మలాన్ని శుభ్రం చేయగలిగితే, మిగతా విసర్జకావయవాలు పిల్లలు లాంటివి కాబట్టి అవి తేలిగ్గానే శుభ్రం అయిపోతాయి. ప్రేగులో ఉండే మలం ఉన్నన్ని రోజులూ మనిషికి ఉపవాసంలో ఆకలి వేయదు, నీరసం రాదు. నోటి దుర్వాసన పోదు, నాలిక మీద పాచిపోదు. చివరకు తినాలని కోరిక కూడా పుట్టదంటే మీరు ఆశ్చర్యపోతారు. ఉపవాసం మొదటి వారం రోజులలో రెండు పూటలా ఎనిమా చేసినప్పటికీ వచ్చే మలం కంటే అక్కడి నుండి మలం నాని ఎక్కువ వాసనతో, మట్టి లాంటి మలం ఎక్కువగా పడుతుందంటే మీరు నమ్మరు. 60 రోజులు రోజూ ఎనిమా చేసుకొంటూ ఉపవాసం చేస్తున్నప్పటికీ చివరకు ఆ రోజు కూడా నిలువ ఉన్న పెంటికలు, నలుగుపాములు ఇవన్నీ వస్తాయంటే మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది.
సమాజంలో నూటికి 99 మందికి మలబద్ధకమే అంటే మీకు కోపం రావొచ్చేమో గానీ ఉన్న విషయం మాత్రం అంతే. జంతువుల మాదిరి ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు విరేచనం వెళ్ళేవారు తప్ప మిగతా వారందరూ ఉపవాసంలో రోజుకి ఒకసారి లేదా అవసరమైన వారు రెండుసార్లు ఎనిమా తప్పక చేయవలసిందే. ఉపవాసమున్నన్ని రోజులూ రోజూ ఎనిమా చేసినప్పటికీ ప్రేగులకు మేలు జరుగుతుందే గానీ కొద్దిగా కూడా అపకారం జరుగదు. కారణం ఎనిమాలో వాడేది కేవలం గోరువెచ్చటి నీరు, అవసరమైనప్పుడు వేపాకు నీరు లేదా నిమ్మకాయరసంతో కలిపిన నీరు మాత్రమే కాబట్టి. ఉపవాసంలో ఎనిమా తప్ప విరేచనం అవ్వడానికి మరియే ఇతర మందులు కానీ, గోళీలు గానీ, ఆముదం కానీ, ఉప్పు నీరు కానీ వాడడానికి వీలులేదు. అవన్నీ ఉపవాసం యొక్క ఉపయోగాన్ని దెబ్బతీస్తాయి. అందువలన ఎనిమా అంత తేలికైనదీ లేదు. ఎనిమా అంత ఉపయోగమైనదీ మనిషికి మరొకటి లేదు. తొందరగా పాత జీవితానికి స్వస్తిపలుకుదాం.

12. ఉపవాసం చేయాలనుకునే వారికి నా సలహా!

మందులు, ఆసుపత్రులు అందుబాటులో లేనంత కాలం మనిషి తనకొచ్చిన ఇబ్బందులను సహజ చికిత్సల ద్వారా, ఉపవాసాల ద్వారా, ఆయుర్వేద విధానం ద్వారా తగ్గించుకొనే వాడు. కాలక్రమేణా మనుషులు ఈ విధానాలను దూరం చేసుకొని తాత్కాలిక ఉపశమనాన్ని కోరుకుంటూ, రోగాలను దీర్ఘ రోగాలుగా మార్చుకొంటూ డాక్టర్లు, హాస్పిటల్స్ కు తిరగడం నిత్య కృత్యాలలో ఒక భాగంగా చేసుకొని జీవయాత్ర సాగిస్తున్నారు. రాను రాను మనిషి ఆరోగ్యం లేక రకరకాల బాధలను అనుభవిస్తున్నాడు. పుట్టిన పిల్లవాడి దగ్గర నుండి ముసలి వారి వరకూ నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఏ రోగాలూ రాకుండా నేను సుఖంగా జీవించగలుగుచున్నాను, నాకు ఏ రోగాలూ రావన్న నమ్మకంతో జీవించే వారు ఏ ఒక్కరూ కనిపించడం లేదు. మన అలవాట్లు ఆహారాలు పూర్తిగా విషమించి మనకు రోగాలు ఏ విధంగా వస్తున్నాయన్నది తెలుసుకొనే రోజు, ఆలోచించే రోజు మనిషికి వచ్చింది. మనిషి తిరిగి వికృతి నుండి ప్రకృతి వైపు పయనించవలసిన రోజులు వస్తున్నాయి. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు మనం పద్ధతులను పూర్తిగా మార్పు చేసుకొని మళ్ళీ సహజాహారం, సహజ వైద్యం వైపు మనస్సు మళ్ళించుకోవాలన్న తపన మనిషిలో గత కొన్ని సంవత్సరాల నుండి మొదలయ్యింది. కానీ ఇంకా ఆ రుచులు, వాసనల నుండి మారాలనుకున్నా బయట పడలేక పోతున్నారు. ఏ రకమైన మందులు లేకుండా మనిషికి సంపూర్ణారోగ్యాన్ని అందించే విధానం అయిన ప్రకృతి వైద్యం మరలా తిరిగి వెలుగులోనికి రాకపోతే మనిషికి మనుగడే లేదు. ఇన్నాళ్ళూ రుచుల మాయలో పడి ఈ విధానాలకు దూరం అయ్యి రోగాలకు చేరువైనారు.
గత 15-20 సంవత్సరాల నుండి ప్రకృతి వైద్య నియమాలను, ఉపవాస ధర్మాలను ప్రజలు సరిగా నియమబద్ధంగా ఉపయోగించు కోనందువల్ల ఆ ధర్మాలు కలుషితమైనవి. కేవలం శరీరం లావున్నవారికే ఉపవాసాలన్నట్టు లోకంలో ప్రచారంలోనికి వచ్చింది. ఉపవాసం యొక్క విలువలను ప్రజానీకానికి తిరిగి సక్రమమైన మార్గంలో అందించవలసిన బాధ్యత ప్రకృతి వైద్యులకు, ప్రకృతి వైద్యాభిమానులకూ ఉంది. ఉపవాస ధర్మానికి, ప్రకృతి ధర్మానికి మచ్చ తీసుకొని రాకుండా సక్రమంగా ఉపయోగించుకోగల వారికే ప్రకృతి వైద్యాన్ని అందించినప్పుడు, ఈ వైద్య ధర్మం రక్షించబడుతుంది. ప్రకృతి వైద్యం, ఉపవాసంలో ఉన్న గొప్పతనాన్ని ప్రజలు వారి ద్వారానే తెలుసుకొనే అవకాశం కలుగుతుంది. ఉపవాసంలో ఉన్న నిజాన్ని నూటికి 95 శాతం మంది తెలుసుకోలేక పోతున్నారు. ఉన్నది ఒకటైతే సమాజానికి తెలిసింది వేరేగా ఉంటున్నది. దీనంతటికీ కారణం అర్హత లేని వారు అందుకోవడమే. ఉదాహరణకు ఒక లడ్డును ముగ్గురికి రుచి చూపిస్తే ముగ్గురికీ మూడు రకాలుగా అనిపించవచ్చు. బాగా ఆకలయిన వాడికి పెడితే చాలా బాగుంది. తియ్యగా ఉంది అంటాడు. జ్వరం వచ్చిన వాడికి పెడితే చేదుగా ఉంది అంటాడు. అప్పుడే బాగా లడ్డు తిన్నవాడికి పెడితే నాకు అంతగా బాగాలేదు అంటాడు. ఒకే రకం లడ్డులో ఉన్న ఒక్క రుచిని మూడు రకాలుగా వేరుచేసి అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. అలాగే ఉపవాసాలను కూడా ప్రజలు చేసి, అనుభవించి వారి అభిప్రాయాన్ని రకరకాలుగా చెప్పుచుంటారు. బాగా ఆకలయిన వాడు లడ్డులో ఉన్న నిజాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోగలిగినట్లు, జీవితం అంతా ఆరోగ్యంగా, ఆనందంగా జీవిద్దామనే కోరిక ఉన్న వారికే ఉపవాసంలో ఉన్న గొప్పతనం ఉన్నది ఉన్నట్లుగా తెలుస్తుంది. కోరిక లేకుండా లడ్డును తిన్న ఇద్దరు లడ్డులో ఉన్న అసలైన రుచిని సరిగా చెప్పలేకపోయినట్లు పట్టుదల, శ్రద్ధ, నిగ్రహం లేనివారు ఉపవాసాలను చేసి ఉపవాసంలో ఉన్న అసలు సత్యాన్ని సమాజానికి చెప్పడం బదులు వారు అనుభవించింది చెబుతారు. వారిద్దరూ అనుభవించి చెప్పేది అసలు సత్యం, అసలు నిజం కాదు కదా! వారు చెప్పిందే లోకానికి నిజం అనిపిస్తుంది. ఇక్కడ ఇద్దరి అభిప్రాయం ఒకేలా కలుస్తున్నది. ఒకరు చెప్పిన నిజం వేరుగా ఉంది. ఇద్దరు చెప్పిందే బలం గాబట్టి లోకం అదే నమ్ముతుంది. ఒక్కరు చెప్పింది నిజం అయినప్పటికీ అది వ్యాప్తికాదు. నలుగురు నడిచిందే బాట అవుతుంది గానీ, ఒక్కరు నడిచేది బాటగాదు అని అందరికీ తెలుసు. ఇదే మోసం ప్రకృతి వైద్యానికి, ఉపవాస ధర్మానికి ఇన్నాళ్లుగా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుచున్నది. ఉపవాస ధర్మం ద్వారా సమాజానికి లోకహితం జరగాలంటే, ఆ ధర్మంలో ఉన్న సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా అనుభవించి, దానినే ప్రజలకు ప్రచారం చేయగల వ్యక్తులు ముందుకు రావాలన్నది నా మనవి. ఉపవాస ధర్మానికి పట్టిన మబ్బులు తొలగిపోయి మానవజాతి ఆయురారోగ్యములతో విలసిల్లే రోజులు రావాలంటే ధర్మాల్ని ధర్మంగానే ఉపయోగించుకోవాలన్నది నా సలహా.
ఉపవాస విధానాన్ని మొదటి సారి తెలుసుకోదలచిన వారు ప్రకృతి వైద్యుల సమక్షంలో ఉండి చేయడం చాలా ఉత్తమమైనది. పరిపూర్ణంగా అన్ని విషయాలను వారి సమక్షంలో తెలుసుకొని, ఉపవాసంలో భయాన్ని దూరం చేసుకొని, తిరిగి ఆ ధర్మాన్ని అవసరమొచ్చినప్పుడు ఇంటిలో వాడుకొనే విధంగా మనం తయారవ్వాలి. అంతేగానీ పుస్తకాలు చదివి ఆవేశంలో వెంటనే ఇంటిలో మొదలుపెట్టి ఆకలయినప్పుడు తినివేసి లేదా బాధ లొచ్చినప్పుడు మానివేయడం గానీ చేయకూడదు. ఉపవాస విధానం గురించి మీకు అనుభవం కలిగిన తరువాత మీరు తిరిగి మీ ఇంట్లో చేసుకొనేటప్పుడు నేను రాసిన ఉపవాసధర్మం చక్కగా సహకరించగలదు. అలాగే ఉపవాస ధర్మం గురించి పూర్తిగా తెలుసుకొని ఉపవాసం చేసే ముందు సిద్ధం కావడానికి ఈ గ్రంథం చక్కగా సహకరించగలదు. మీ అంతట మీరు ఈ గ్రంథం చదువుకొని ఇంట్లో ఉపవాసాలు చేయమని మాత్రం నా ఉద్దేశం కాదు. మంచి చెడును తెలుసుకుంటానికి మాత్రమే. మనిషికి రకరకాల రోగాలు - తెలిసి కొన్ని, తెలియకుండా కొన్ని ఉంటాయి. వాటి వల్ల ఇబ్బందులు లేకుండా మందులను మానివేసి ఉపవాసాలను డాక్టర్ల సలహా మేరకు పాటించడం మంచిది. అనుభజ్ఞులు అందుబాటులో లేకుండా ఉపవాసాలను ఆరంభించవద్దని నా సలహా.
మేము ప్రకృతి వైద్య విధానాన్ని, ఉపవాస విధానాన్ని వైద్యంగా మాత్రమే కాకుండా ప్రకృతి జీవన విధానంగా కూడా నేర్పడం జరుగుచున్నది. మీ ఆరోగ్యం ఈ వైద్యం ద్వారా సరిచేసిన తరువాత, జీవితాంతం మీకు మీరుగా అవసరం కల్గినప్పుడల్లా ఈ విధానాన్ని వాడుకొనేలాగా నేర్పాలని మా ప్రయత్నం. అంటే (జీవిత భాగస్వామిలా) "భార్యలాగ" ప్రకృతి జీవన విధానం కూడా మీ జీవితంలో భాగస్వామి అవ్వాలని మా తాపత్రయం. మీరు ఎవరి మీదా ఆధారపడకుండా, డాక్టర్ల చుట్టూ, హాస్పటల్స్ చుట్టూ, పదే పదే తిరగకుండా మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకునేటట్లు తయారు చేయాలన్నదే మా ధ్యేయం. జీవితాంతం మీరు సుఖంగా ఉండాలి అంటే దీనిని నమ్మాలి, ఆచరించాలి కాబట్టి అంత ఓర్పు, నిగ్రహం ఉన్నవారే ఈ ధర్మాల జోలికి రావాలని నా సలహా.
ఉప్రవాస ధర్మం ఒక చికిత్స కాదు. చికిత్సకు మించిన ధర్మం అందులో ఉన్నది. రోగాలు వచ్చినవారే చేయాలనుకొంటే అది పొరపాటు. ఇంటిల్లి పాదీ అవసరమైనప్పుడు వాడుకోవలసిన చక్కటి ఉపాయం ఈ ఉపవాసం. అలాంటి అపాయంలేని ఉపాయం అయిన ఉపవాస ధర్మాన్ని ఈ రోజు అనుకొని రేపు ప్రారంభించవద్దు. ఉపవాస ధర్మం గురించి పూర్తిగా అన్ని కోణాల నుండి ముందు తెలుసుకొని మనస్సును మంచిగా ఆ ధర్మానికి అనుకూలంగా స్థిరంగా సిద్ధంగా చేయాలి. ఉపవాస ధర్మం లోనికి దిగాక మరలా వెనకడుగు వేయకుండా జితేంద్రియులై ముందుకు సాగిపోయేటట్లు మనస్సును సిద్ధం చేయాలన్నది నా సలహా.
మనకు ఇష్టమొచ్చినట్లు ఆదుకోవడానికి, వాడుకోవడానికి ఉపవాసాన్ని ఉపయోగించరాదు. ఉపవాసం ఒక ధర్మం. ధర్మాలతో ఆడుకోవడం మహా పాపం. మనకు ఉపవాసాలు సరిగా ఉపయోగించుకొనే స్థితి లేనప్పుడు వాటి జోలికి పోవడం మంచిది గాదు. కన్న బిడ్డలను తల్లి సంరక్షించినట్లు, ప్రకృతి మనలను ఉపవాసాల ద్వారా సంరక్షించే ప్రయత్నం చేస్తుంది. అవకాశమొచ్చిన వారికి అదృష్టం పండినట్లే, ఉపవాసాలు చేయని వారికి రోగాలు ముదిరినట్లే. ఆరోగ్యాన్ని బాగుచేసుకోవడానికి మనిషికి ఇంతకంటే సులువైన మార్గం మరొకటి లేదని నా విశ్వాసం. ఉపవాస ధర్మం మారనిది, చలించనిది, కలకాలం ఉండే సత్యం. మనం ఈ రోజు ఉండి రేపు పోవచ్చు. యుగ యుగాలుండవలసిన ధర్మాన్ని మనం సరిగా వాడుకోక పోతే మనద్వారా లోకానికి చెడు జరిగే అవకాశం ఉంది. ఈ విధమైన నష్టం మన ద్వారా రాకూడదని ప్రతి భారతీయుడూ ప్రయత్నించవలసిన బాధ్యత ఉంది. లోక కళ్యాణం జరగాలంటే ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలి. చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఉపవాస ధర్మాన్ని, ప్రకృతి జీవన విధానాన్ని అవలంభించి, సంపూర్ణారోగ్యాన్ని పొంది సన్మార్గంలో జీవించే ప్రయత్నం సాగిద్దాం. ధర్మో రక్షితి రక్షితః అనే సామజిక సత్యాన్ని గ్రహించి భావితరాలకి ప్రకృతి ధర్మమే శ్రీరామ రక్షగా అందివ్వవలసిన బాధ్యత అందరిదీ. అది మనందరి బాధ్యతగా స్వీకరించాలని నా మనవి. ప్రకృతి ధర్మాన్ని శోధిస్తే ఎవరికి ఏది కావాలో అది దొరుకుతుందని నా ప్రగాఢ విశ్వాసం.

13. ఉపవాసంలో మనస్సు ఎలా ఉండాలి?

మానవుని మనస్సు సహజంగా ఆనందమయం. మనస్సును ఆరోగ్యంగా ఉంచుకుంటే అనారోగ్యాన్ని నివారించడం చాలా తేలిక. మన మనస్సు నుండి వచ్చే ఆలోచనలను బట్టే శరీరం నడుస్తూ ఉంటుంది. ఆలోచనలు మంచిగా ఉంటే అనారోగ్యం రాదు. ఆరోగ్యానికి, ఆలోచనలకు అవినాభావ సంబంధం ఉంది. ఆలోచనల నాణ్యతను బట్టే మెదడులో కణాల స్పందన ఉంటుంది. ఆలోచనలకు, మెదడులో ఉత్పత్తి అయ్యే రసాయనాలకు దగ్గర సంబంధం ఉంది. మనం సవ్యంగా ఆలోచించినప్పుడు ఆరోగ్యానికి (విజయం) తోడ్పడే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. అదే మనం అపసవ్యంగా ఆలోచించినప్పుడు అనారోగ్యానికి (అపజయం) తోడ్పడే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. మనస్సును అదుపు చేసుకోగలిగిన వారు ఆరోగ్యాన్ని విజయాన్ని సాధించుతారు. ఫలితాన్ని మనసారా కోరి ఆలోచిస్తున్నప్పుడు మెదడులోని కణాల మధ్య సంకేతాలను మార్పిడి చేయడానికి "సిరోటినిన్" అనే రసాయనం అనుసంధాన కర్తగా వ్యవహరిస్తుంది. చేసే పనిమీద కోరిక, ఆసక్తి సరిగా లేకుండా ఆలోచిస్తున్నప్పుడు "సిరోటినిన్" తగిన మోతాదులో విడుదల కాదు. అప్పుడు మనం ఆశించిన ఫలితాన్ని పొందలేము. ఉదాహరణకు మనకు ఇష్టమైన పనిని చేస్తున్నప్పుడు అలసిపోయినట్లు అనిపిస్తుంది. దీనంతటికీ మన ఆలోచనలే మూలాధారం. ఒక్క మనస్సుతోడ నున్నది సకలము అన్నట్లు మనస్సు పెట్టకుండా ఏ పని చేసినప్పటికీ ప్రయోజనం కలుగదు. చివరకు మిగిలేది నిరుత్సాహమే. మనపై మనకు విశ్వాసం ఉంటే సవ్యంగా ఆలోచించగలుగుతాము. మనకు ఆలోచించే గుణం ఉంది కాబట్టి మంచిగా ఆలోచించాలి. ఆలోచనల కారణంగా మనుష్యులకు మట్టిని మందుగా చేసి ఇచ్చినప్పటికీ రోగాలు తగ్గుతుంటాయి. ఆలోచనలు లేని పశువులకు అనారోగ్యం వచ్చినప్పుడు ఈ మట్టి బిళ్ళలు పనిచేయవు. నమ్మకం, విశ్వాసం మన ఆలోచనలకు బలాన్ని ఇస్తాయి. బ్రతికి నన్నాళ్లు మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకొనే విధానం అయినా ఉపవాస జీవన విధానాన్ని అవలంభించేటప్పుడు మన మనస్సు ఎలా ఉండాలనేది ఆలోచిద్దాము.
ఆహారం మీద:
1. ఉపవాసాన్ని ప్రారంభించే ముందు రోజు నుండే మనం రేపటి నుండి ఆహారం తినడంలేదు, వాసనలకు, రుచులకు, మనకు ఏమీ సంబంధం లేదు, రేపటి నుండి మన ఆహారం తేనె నీళ్ళు, మంచి నీరు మాత్రమే అని సిద్ధం కావాలి. టిఫిన్లు, టీ లు, భోజనాలు అన్ని తేనెతోనే అనుకోవాలి. ఈ విధంగా మానసికంగా సిద్ధమైతే మరుసటి రోజు నుండి ఆకలిగానీ, తినాలని గానీ, నీరసం గానీ అసలుండవు. మనస్సును అలా అరికట్టగలిగితే మొదటి రోజు సాయంకాలం నుండే జీర్ణాదిరాసాలు తయారవడం పూర్తిగా తగ్గుతాయి. ఉపవాసం యొక్క ఉపయోగం రెండవ రోజు నుండే ప్రారంభమవుతుంది. అలవాటు ప్రకారం మనస్సు చలిస్తూ ఉంటే ఉపవాసంలో ఉపయోగం ప్రారంభమయ్యే సరికి 3 నుండి ఐదు రోజుల వరకూ పట్టవచ్చు. చెట్టునున్న ఉసిరికాయను చూసి, ఆలోచించినంత మాత్రానికే నోట్లో ఊట ఊరడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే నోట్లో ఊట ఊరిందో, తరువాత పొట్టలో కూడా రసాలు ఊరే అవకాశం లేకపోలేదు. ఉసిరి కాయను తినక పోయినప్పటికీ తిన్న దాని కంటే ఆలోచనల ద్వారా ఎక్కువ నష్టం ఉంటుంది. ఉపవాసంలో ఉండగా ఘుమ ఘుమలు, వాసనల మీద మనస్సును నిల్పడం చేయరాదు. మనస్సును వాసనల మీద నిల్పితే కోరికలు ప్రారంభమవుతాయి. వచ్చే వాసనలను ఆలోచించకుండా, పట్టించుకోకుండా ఉంటే దాని అంతట అవే వచ్చిన దారిని పోతాయి. దేశంలో ఎవరో చనిపోతే మనకు బాధ అనిపించడం లేదు కదా! మన అనుకున్నప్పుడు మనకు బాధ కలుగుతున్నది. అలాగే రుచులు మనకు సంబంధించినవి అనుకొంటే ఆకలి ప్రారంభమవుతుంది. ఉపవాసంలో ఆహార సంబంధమైన ఆలోచనలు వచ్చినప్పటికీ గాలిలాగే వచ్చి గాలిలాగా వెళ్లి పోతుండాలే గానీ, ముసురు లాగా (వానజల్లు మెల్లగా) నిలువకూడదు. ఉపవాసంలో వచ్చే ఆలోచనలు ఈ విధంగా లేకపోతే శరీరం పూర్తిగా శుభ్రం అవ్వక ముందే మనలో ఆకలి లక్షణాలు ప్రారంభమయ్యి ఉపవాసాన్ని విరమించ వలసివస్తుంది. ఆలోచనలకు, ప్రేగులలో జీర్ణాది రసాలకు బాగా దగ్గర సంబంధం ఉంది. ఏడిస్తే కళ్ళవెంట నీళ్ళు ఎంత త్వరగా వస్తున్నాయో, అలాగే ఉపవాసంలో ఆహారం మీద కోరికతో ఆలోచిస్తే జీర్ణాదిరసాలు కూడా అంతే త్వరగా తయారవ్వగలవు.
ప్రేగులలో జీర్ణాదిరాసాలు తయారైతే అది ఉపవాసం అవ్వదు. ఆ రసాలు ఊరడం ప్రారంభమయితే మనలో శక్తి ఉత్పన్నమవ్వడం ఆగిపోతుంది. అక్కడ నుండి నీరసం ప్రారంభం అవుతుంది. చూసారా మన ఆలోచనలు మనకు ఉపవాసంలో ఉపయోగం రాకుండా ఎలా పాడు చేయగలుగుచున్నాయో? తినటం లేదు గదా ఎటూ, ఆలోచించుకొని అన్నా తృప్తి పడదాం అని కొంత మంది ఇష్టమైన వంటలను ఊహించుకొంటూ వుంటారు. డాక్టరుకు ఆ ఊహలు ఏమీ కనబడవు అని అనుకోవచ్చు. ఎదుటి వారిని మోసం చేసినప్పుటి కంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నప్పుడు ఇంకా ఎక్కువ నష్టం ఉంటుంది. మన మనస్సు మనలను బాగుచేయడానికీ పనికి వస్తుంది. పాడుచేయడానికీ పనికి వస్తుంది.
2. వైద్యుడి మీద: డాక్టరు పట్ల రోగికి ఉన్న విశ్వాసం స్వస్థతకు తోడ్పడుతుంది. ప్రతి మతం విశ్వాసం ద్వారా ఆరోగ్యాన్ని పునరుద్ధరించుకోవచ్చునని వివరించి చెబుతోంది. ముఖ్యంగా మంత్రాల వంటి ప్రక్రియలను వినియోగించి, రోగి విశ్వాసాన్ని ప్రేరేపించి, అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. రోగికి డాక్టరు మీద, వైద్య విధానం మీద పూర్తి నమ్మకం, విశ్వాసం రానిదే రోగం కుదరదు. మనం విశ్వసించిన డాక్టరు మనకు స్వచ్ఛమైన నీరు (డిస్టిల్ వాటర్) ఇన్ జక్షన్ చేసినప్పటికీ నెప్పి తగ్గుతుంది. అనేక రకాల దీర్ఘ వ్యాధులను కూడా విశ్వాసంతో నయం చేయవచ్చని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. వైద్యం ప్రారంభించే ముందు వైద్యుడిపై, వైద్య విధానంపై నమ్మకాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా ప్రకృతి విధానంపై అవగాహన పూర్తిగా రావాలి. డాక్టరు మీద మనకు నమ్మకం, విశ్వాసం రాకపోతే డాక్టరు యొక్క మాటలు మనకు బలాన్ని ఇవ్వవు. ఆ బలమే మందు కంటే కూడా చురుగ్గా పనిచేయగలదు. వైద్యుడి ద్వారా, ఉపవాస విధానం ద్వారా మన శరీరానికి, ఆరోగ్యానికి పూర్తి న్యాయం జరుగుతుంది అన్న నమ్మకంతో చికిత్స ప్రారంభిస్తే ఆశించిన ఫలితాలు వెంటనే లభిస్తాయి. తేలు కుట్టినప్పుడు నమ్మకమైన వ్యక్తి మంత్రం వేస్తే ఆ నమ్మకానికి నెప్పి వెంటనే తగ్గిపోతుంది. ఆ నమ్మకం వలన మన శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థ ప్రేరేపితమై, తేలు విషానికి విరుగుడు శరీరంలోనే ఉత్పత్తి అయ్యి వెంటనే స్వస్థత చేకూరుతుంది. ప్రకృతి వైద్యంలో డాక్టర్లు మందులు అంటూ ఏమి ఇవ్వరు. పైగా ఆహారం లేకుండా, రుచులను నిగ్రహించి మీరు ఉపవాసం చేయాలంటే మీకు డాక్టరు మీద ఉన్న నమ్మకంతోనే ఉపవాసాలను కొనసాగించడం సాధ్యమవుతుంది. డాక్టరు మీద నమ్మకం సన్నగిల్లితే ఉపవాసాలు ఎక్కువ రోజులు చేయలేరు. విశ్వాసమే ఇక్కడ ముఖ్యమైనది.
3. విశ్వాసం: అనారోగ్యానికి మూలకారణం మనస్సు కాబట్టి మనస్సును మార్చితే జబ్బు నయమవుతుంది. మనస్సును మార్చడానికి విశ్వాసం ఒక అస్త్రం. మనస్సులో మెదిలే ఆలోచనలు మెదడులో రసాయనిక ప్రక్రియలను ప్రారంభిస్తాయి. మెదడులో తయారయ్యే జీవరసాయనాలు ఆలోచనలకు అనుగుణంగా ఉంటాయి. మెదడు నుండి తయారైన జీవరసాయనాలు రక్త ప్రసరణలో కలిసి శరీరంలోని ప్రతి కణాన్ని ప్రభావితం చేస్తాయి. తద్వారా ఆలోచనలు శరీర కణాలలోని భౌతిక చర్యలకు కారణమవుతాయి. ఆలోచనలు శరీరంలో రసాయనాలుగా మార్పు చెందుతాయి. శరీరంలోని జీవకణాలలో ఉత్పన్నమయ్యే ప్రొటీనులు ఆలోచనలకు అనుకూలంగా ఉంటాయి. భౌతిక స్వరూపంలేని ఆలోచనలు శరీర కణాలలో భౌతిక స్వరూపాన్ని సంతరించుకుంటాయి. జబ్బు నయమవుతుంది అన్న విశ్వాసంతో ఉన్న రోగికి తొందరగా స్వస్థత చేకూరుతుంది. నయమవదు అనుకొనే వారికీ ఎన్ని రోజులు ఉపవాసాలు చేసినా ప్రయోజనం ఉండదు.
4. మనస్సు నిల్పాలి: ఉపవాసంలో మనస్సు పెడితేగానీ శరీరంలో జరిగే మార్పులు స్పష్టంగా తెలియవు. ఎక్కడ మనస్సుని లగ్నం చేస్తే అక్కడకు నాడీ, రక్త ప్రవాహాలు చురుగ్గా వెళతాయి. త్రాగే తేనె నీళ్ళ మీద మనస్సుండాలి. ఆ తేనె నీరు వెళ్లి ప్రతి కణానికి శక్తినివ్వాలనట్లు ఊహించాలి. ప్రతి కణం శక్తివంతం అవుతున్నట్లు భావించాలి. తేనె త్రాగిన తరువాత ఆకలి ఎప్పటికి అవుతున్నదో మనస్సు పెట్టి ఆలోచించాలి. ఏ రోజు ఏ రకమైన మార్పులు శరీరంలో గానీ, బాహ్యంగా గానీ జరుగుచున్నవో ఆలోచించాలి. ఎనిమా చేసుకున్నాక మనస్సును ప్రేగులవద్ద నిల్పాలి. తొట్టి స్నానాలు చేస్తున్నప్పుడు శరీరం తడిచే దగ్గర మనస్సు పెట్టి ఆలోచించాలి. రక్తప్రసరణలో జరిగే మార్పును పరిశీలించాలి. మన మనస్సును అక్కడకు పంపకపోతే రక్త ప్రసరణగానీ, నరాల ఆలోచనగానీ అక్కడ పనిచేయదు. పాద స్నానాలు చేస్తున్నప్పుడు కాళ్ళపై నిల్పాలి. మొదటి సారి ఉపవాసాలు చేస్తున్నప్పుడు ఏ రోజు మార్పులను ఆ రోజు మనస్సు పెట్టి పరిశీలించితే అవి భవిష్యత్తులో మీ యింటిలో ఉపవాసాలు చేసుకొనేటట్లు సహకరించగలదు. మనస్సు నిల్పితేనే అసలు మర్మం తెలుస్తుంది. ఉపవాసం విరమించే ముందు వచ్చే లక్షణాలను మనస్సు పెట్టి తెలుసుకొని సరిగా డాక్టరుకు చెప్పలేకపోతే ఇబ్బందులలో పడతాము. మనస్సు పెట్టకపోతే లోపల జరిగేది ఒకటైతే, మనం చెప్పేది ఒక రకంగా ఉంటుంది.
5. సంసార సుఖం: ఉపవాసంలో కామపరమైన ఆలోచనలు కలుగకుండా ఉండగలిగితే చాలా మంచిది. మన మనస్సులో ఆ కోరిక మొదలైనప్పుడు విసర్జన క్రియ ఆగుతుంది. శరీరాన్ని రిపేరు చేసుకొంటున్న శక్తి, రక్తం మన జననేంద్రియాలకు మళ్ళడం జరుగుతుంది. అంగాలకు రక్తప్రసరణ బాగా ఎక్కువగా జరిగితేనే ఆ పని పూర్తి అవుతుంది. ఆ భాగాలకు చేరిన రక్తం, నరాల ఆలోచన, శక్తి అంతా మరలా రిపేరుకు తిరిగి చేరుకొని ప్రారంభం కావడానికి గంట, రెండు గంటలు పట్టవచ్చు. మన ఆలోచనలు అటువైపు మళ్ళకుండా ఉంటే శక్తి మిగులుతుంది. ఉపవాసం త్వరగానూ పూర్తి అవుతుంది.
6. ఇరుగు, పొరుగు: మన స్నేహితులు, బంధువులు, ప్రక్కవారు అందించే ప్రోత్సాహం మనలను ముందుకు నడిపించగలదు. అదే నిరుత్సాహపరిస్తే క్రుంగిపోగలం. ఉపవాసంలో మంచి మాటలకు కొండంత బలం వస్తుంది. సమాజంలో ఉపవాసాల మీద ఎవరికీ మంచి అభిప్రాయం లేదనే చెప్పాలి. ఉపవాసాలు చేసే వారికంటే, చూసే వారే ఇబ్బందులు ఎక్కువగా పడుతున్నట్లుంటారు. ప్రక్కవారు ఎవరి అభిప్రాయాన్ని వారు మంచో చెడో మనకు తెలియజేస్తుంటారు. ఉపవాసంలో ఉన్నవారు ఎవరిమాటలను పట్టించుకోకుండా ఉండటం మంచిది. ఉపవాసాన్ని సరిగా చేయడం, విరమించడం రెండూ మన ఆధీనంలో ఉన్న వ్యూహాలే. మన సంకల్పం ఎటు మొగ్గు చూపితే అటు పని జరుగుతుంది. కిటుకంతా మన సంకల్పంలోనే ఉంది. మనకున్న సంకల్ప బలంతో ఉపవాసాలలో ముందుకు వెళ్ళాలి గానీ ప్రక్క వాళ్ళ మాటలకు నీరు కారి పోకూడదు. అనుమానం, భయం సమిష్టిగా మనం ఉపవాసాన్ని విరమించడానికి మూలకారణం అవుతాయి. భర్త పోయిన స్త్రీ ఎదురైతే మనకు ఆ రోజు అపజయం కలుగుతుందనేది మూఢనమ్మకం. మనం నిజంగా ఆవిడ ఎదురైన రోజు చెడు జరుగుతుందని సిద్ధపడి, అదే ఆలోచనలో అన్ని పనులు చేస్తూ ఉంటాము. మన ఊహలే కార్యరూపం దాల్చుతాయి. ఉపవాసంలో ఉండగా మనలను చూడడానికి వచ్చిన బంధువులు, స్నేహితులు ఇంక చాలు ఎన్ని రోజులు చేస్తారనే వారు కొందరు, పనికి రాకుండా చెడిపోతారు అనేవారు కొందరు, తినమని బలవంతం చేసేవారు కొందరు, బెదిరించే వారు మరికొందరుంటున్నారు. వారి మాటలు మనల్ని ఉపవాసంలో ముందుకు వెళ్ళనివ్వవు. ఉపవాసంలో ఉండగా వారితో వాదనలు చేయకుండా విని ఊరుకోవడం ఉత్తమమైన పని. మీకు ఉపవాసంలో మంచి జరుగుతుందని నమ్మకం ఉంటే చాలు. ఎవరి మాటలు మీకు హాని కలిగించవు.
7. ఊహాలు: ఊహలని బట్టి ఆలోచనలు వస్తుంటాయి. మనం ఉపవాసంలో ఉండగా మంచినే ఊహించాలి. మూడు గంటలు సినిమా చూసి వచ్చిన భాగ్యానికే మన ఆలోచనలు తరువాత ఒక గంట వరకూ ఆ సినిమా గురించే మెదులుతూ ఉంటాయి. మన ఊహలు సరిగా లేకపోయినా, లేదా భయపడుతూ ఉపవాసాలు చేసినా మన మనస్సులో జరిగే మార్పుల కారణంగా రసాయన గ్రంథులు అనేక ఆమ్లాలను రక్త ప్రసరణలోనికి విడుదల జేస్తాయి. కాలేయములో నున్న గ్లూకోజు నిల్వలు తగ్గిపోతాయి. గుండె వేగంగా కొట్టుకొంటూ ఉంటుంది. పర్యవసానంగా శరీరం పనిభారం పెరిగి నీరసించి పోతుంది. రక్తపీడనం అధికమౌతుంది. ఈ విధమైన మార్పులు ఉపవాసంలో విసర్జన క్రియకు భంగం కలిగిస్తూ ఉంటాయి. మన ఊహలు మంచిగా ఉండి, మనం అందిస్తున్నప్పుడు మెదడులోని అంతర భాగాలూ "డోఫమైన్" అనే రసాయనాన్ని విడుదల చేస్తాయి. మనం ఇష్టమైన పనులు చేస్తున్నప్పుడు మెదడులోని డోఫమైన్ రసాయనం ఆ పనిని చెయ్యటానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది. డోఫమైన్ ఆనందాన్ని అధికం చేస్తుంది. అందువల్లనే సంతోషం, సంతృప్తి శరీరానికి అదనపు శక్తి నిచ్చి ఉపవాసంలో ముందుకు నడిపిస్తాయి. మన ఆలోచనల ద్వారా మన మెదడులో ఉత్పన్నమయ్యే రసాయనాలు మనకు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఉపవాసాలలో ఉండగా శరీరం బరువు బాగా తగ్గిన రోజున అందరూ ఎక్కువ ఆనందంగా ఉంటారు. ఎప్పుడన్నా రెండు రోజులు బరువు తగ్గక పోయేసరికి ఎక్కువగా బెంగ పెట్టుకోవడమో లేదా నిరుత్సహపడడమో చేస్తారు. అతి ఆనందం, అతి దుఃఖం ఉపవాసాన్ని ఆటంక పరుస్తాయి. ఆ రెండు స్థితులలో రక్తంలోకి రకరకాల రసాయనాలు విడుదలవుతాయి. మంచి ఊహలు ఉండేటట్లు మంచి గ్రంథాలు, ఆధ్యాత్మికతను పెంపొందించే పుస్తకాలు, ఆరోగ్యాన్ని తెలియజేసే పుస్తకాలు మొదలైనవి ఉపవాసంలో చదవడం మంచిది. టి.వీ.లకు, సినిమాలకు దూరంగా ఉండటం మంచిది.
8. కోపం: మన మీద మనకు కోపం వచ్చినా, ఇతరుల మీద మనకు కోపం వచ్చినా, మన కోపం మనకు నష్టాన్ని కల్గిస్తుంది. కోపం రాబోయే రోగానికి బీజం వంటిది. కోపం, చిరాకు, భయం, టెన్షన్, ఏడ్వడం, దిగులు మొదలైనవి అన్నీ శరీరాన్ని, మనస్సును వెంటనే కలుషితం చేస్తాయి. అందువల్లనే మనిషి కోపం వచ్చినప్పుడు నాకు కోపం వస్తే నేను మనిషిని కాదు, నేను ఏమి చేస్తానో నాకు తెలియదు అని రకరకాలుగా అంటుంటాడు. మనిషిని పశువును చేసేది కోపం. మానవత్వం మనలో పెరగాలంటే కోపాన్ని దగ్గరకు రాకుండా చేయాలి. కోపం వచ్చిన మరుక్షణంలో మనలో ఏమి జరుగుతుందో ఆలోచిద్దాము. కోపం వచ్చినా ఏడ్చినా, మరుక్షణంలో మనలో హిస్టమిన్ అనే రసాయన పదార్థం రక్తంలోనికి విడుదల అవుతుంది. కోపం వచ్చినప్పుడు మెదడుకు ఎక్కువ ప్రాణశక్తి కావాలి. అందువలన గుండె ఎక్కువ రక్తాన్ని చిమ్మడం (మెదడుకు గాలిని అందించడం కొరకు) కొరకు ఎక్కువ కొట్టుకుంటుంది. కోపం వచ్చినప్పుడు మనుషులు అలుపు, ఆయాసంగా ఉండటానికి ఇవే కారణాలు. రక్తంలోనికి విడుదల అయిన రసాయనాల కారణంగా రక్తం అంతా వేడిగా అయిపోయి, అదే రక్తం తలకు ప్రయాణించడం వలన మన మాడు (తల) వెచ్చగా ఉంటుంది. కోపం వచ్చినప్పుడు, ఏడ్చినప్పుడు బుర్ర వేడెక్కడం అందరూ గమనిస్తుంటారు. ఈ రసాయన పదార్థంతో ఉన్న రక్తం ఊపిరితిత్తులకు చేరినప్పుడు మన శ్వాసనాళాలు "హిస్టమిన్" కారణంగా సంకోచించుకొంటాయి. సంకోచించుకొన్న శ్వాసనాళాల గుండా గాలి సరిగా రక్తాన్ని శుద్ధిచేయడానికి వెళ్ళలేదు. శ్వాస నాళాలలో ఉన్న ఆ రసాయన పదార్థాన్ని పలుచబరచడానికి ఎక్కువ జిగురు (నీరు) ఊపిరితిత్తులలో తయారవుతుంది. శ్వాసనాళాల్లో ఎక్కువగా తయారైన జిగురు శ్వాస క్రియకు ఆటంకం కలిగించకుండా ఉండటానికి శరీరం ఆ జిగురును ఊపిరితిత్తుల నుండి ముక్కుల ద్వారా బయటకు నెట్టి వేస్తుంటుంది. అప్పుడు మన ముక్కుల ద్వారా నీరు కారుతుంటుంది. ఏడ్చినప్పుడు, కోపంగా ఉన్నప్పుడు కళ్ళమ్మటా, ముక్కులమ్మటా నీరు రావడానికి అదే కారణం. ఏడ్చినప్పుడు వచ్చే నీరు వేడిగా కారుతూ ఉంటుంది. అదే బాగా నవ్వినప్పుడు కళ్ళమ్మటా వచ్చే నీరు చల్లగా ఉంటుంది. ఏడ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు శరీరాన్ని, మనస్సును పాడుచేసే రసాయనాలు తయారైతే, నవ్వినప్పుడు శరీరానికి ఉపయోగపడేవి తయారవుతాయి.
పోట్లాటలు, కోపగించుకోవటాలు, ఏడ్పులు ఇవన్నీ పూర్తి అయిన తరువాత కూడా మనలో ఆ ఆవేశము, ఉద్వేగము కొన్ని గంటలపాటు కొనసాగుతూనే ఉంటాయి. రక్తంలో ఉన్న ఆ రసాయనాలు పూర్తిగా రక్తం నుండి విరుగుడు అవ్వడానికి చాలా గంటలు పడుతుంది. కోపం క్షణంలో వచ్చినప్పటికీ ఆ నష్టం అంతా పోవడానికి ఎన్ని గంటలు శరీరం కష్టపడవలసి వస్తుందో చూడండి. అందువల్లనే తన కోపమే తన శత్రువు అన్నారు. ఉపవాసంలో వున్నవారు కోపాలకు, ఆవేశాలకు, చిరాకులకు లోనైతే మరీ నష్టం ఎక్కువ ఉంటుంది. ఉపవాసంలో మన శరీరాన్ని శుద్ధిచేయడానికి కావలసిన ప్రాణశక్తి, నీరు వేరే విధంగా (ఆ రసాయనానికి విరుగుడుగా) పని చేయడం ప్రారంభిస్తాయి. కోపం ద్వారా శరీరానికి కల్గిన నష్టాన్ని వెంటనే సరిచేయక పోతే శ్వాసక్రియ, మెదడు, గుండె దెబ్బ తింటాయి. కాబట్టి విసర్జన క్రియను పూర్తిగా (ఉపవాసాన్ని) ఆపి శరీరం ముందు ఆ పనిని చేపడుతుంది. మనం కోపంగా ఉన్నప్పుడు, ఏడ్చినప్పుడు మనకు ఆకలి పూర్తిగా చచ్చిపోవడానికి ఇదే కారణం. అసలు తినాలని మనస్సు ఉండదు. మన ఆలోచనలన్నీ కోపానికి అనుకూలంగానే పనిచేస్తాయి గానీ, జీర్ణాది రసాలను తయారుచేయలేవు. ఉపవాసంలో ఉన్న వారు ఇలాంటి వాటికి పాల్పడితే, ఉపవాసం ద్వారా ప్రయోజనానికి బదులు నష్టం ఎక్కువగా ఉంటుంది. ఉపవాసాలలో ఇలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకొంటారని ఇంత చెప్పవలసి వచ్చింది. మనస్సును ఆనందంగా, సంతోషంగా, తృప్తిగా ఉంచుకొంటే ఇవే ఉపవాసంలో ముందుగా పనిచేసి రోగాలను త్వరగా తగ్గించగలుగుతాయి.
పొట్టకు, శరీరానికి విశ్రాంతి నిచ్చినంత మాత్రాన అది ఉపవాసం అవదు. ఉపవాసానికి అనుకూలంగా మనం మనస్సును సిద్ధం చేస్తేనే అప్పుడది ఉపవాసం అవుతుంది. మనసు నిల్పకుండా మనం ఉపవాసాలను ప్రకృతి ఆశ్రమంలో జేరి చేసినప్పటికీ ప్రయోజనం ఉండదు. మనస్సును పూర్తిగా మార్చుకొంటే ఇంటి వద్దే ఉండి డాక్టరు సలహా ప్రకారం ఉపవాసాలు చేసినా ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. మనస్సుంటే మార్గముంటుంది అన్నారు పెద్దలు. మందు ప్రాణాన్ని పోయగలదు, ప్రాణాన్ని తీయగలదు. అలాగే ఉపవాసంలో వచ్చే ఆలోచనలు శక్తిని పెంచగలవు, శక్తిని తుంచగలవు. మన మనస్సును మనం ఉపయోగించుకొనే దాన్ని బట్టే మనం పొందే ప్రయోజనం ఉంటుంది. జీవితం సుఖ దుఃఖాల సమాహారం. దుఃఖం పాలు ఎక్కువైతే వ్యాధి నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయదు. మనం ఎన్ని రోజులు ఉపవాసాలు చేసినా ఫలితం కనిపించదు. మనస్సును ఉపవాసాలకు అనుకూలంగా తీర్చిదిద్దుకొని ఒడిదుడుకులను సవ్యంగా, శాంతంగా సవరించుకొంటూ, శరీరం కోరినన్ని రోజులు ఉపవాసాలు చేస్తూ, ఆశించిన ఫలితాలను అందుకొనే విధంగా ప్రయత్నిద్దాము. తన నీడే తనకు సాక్షి తన దేహములో, తన మనసే తనకు తోడు ఉపవాసంలో అని మరువకండి.

14. ఉపవాసం ఎలా ప్రారంభించాలి?

ఉపవాసం ప్రారంభించే రోజు నుండి ఉదయం 5-6 గంటల మధ్యలో నిద్రలేచి ప్రారంభించడం మంచిది. అంతే గానీ అలవాటు ప్రకారము 7-8 గంటల వరకూ పడుకొని, లేచిన దగ్గర నుండి ఉపవాసంలో హడావిడి పడకూడదు తెల్లవారుజామునే నిద్రలేవడం వలన ఎక్కువసార్లు మంచినీరు, తేనె నీళ్ళు త్రాగే అవకాశం కలుగుతుంది. అవి రెండూ ఎక్కువ సార్లు త్రాగడం వలన ఎక్కువ శక్తిగా ఉంటూ త్వరగా శరీరం శుభ్రం అయ్యే అవకాశం కలుగుతుంది.
నిద్రలేచిన వెంటనే పళ్ళుతోముకొని, బిందెలో మంచినీరు ఒక లీటరు ఒక్కసారే త్రాగాలి. అలవాటు లేని వారు క్రమేపీ పెంచుకొంటూ రెండు, మూడు రోజులలో లీటరు త్రాగగలిగితే మంచిది. ఒక్కసారే లీటరు నీరు త్రాగడం వలన రెండు ప్రయోజనాలు కలుగుతాయి. మొదటిది పొట్టలో పడ్డ లీటరు నీటి బరువు పొట్ట క్రింద నున్న పెద్దప్రేగు (మలం ప్రేగు) మీద పడుతుంది. ఆ ఒత్తిడి వలన పెద్దప్రేగులో నున్న మలం ముందుకు జరిగి మనకు వెంటనే విరేచనం వస్తున్నట్టు అనిపిస్తుంది. లీటరు నీరు త్రాగి మనస్సును పెద్దప్రేగు మీద పెట్టి, పది నిముషాలు అటూ ఇటూ నడుస్తుంటే ఉన్న మలం ఫ్రీగా కదులుతుంది. బాగా కదిలి అర్జంటు అయ్యే వరకూ దొడ్లోకి వెళ్ళకూడదు. ఈ విధంగా నీరు త్రాగి విరేచనాన్ని కదిపే ప్రక్రియ అలవాటుగా ఉపవాసం నుండి నేర్చుకొంటే, ఉపవాసం విరమించి ఆహారంలోనికి (పళ్ళు తినడం) వచ్చిన తరువాత ఎనిమా లేకుండా విరేచనం తేలిగ్గా అవుతుంది. ఎన్నిసార్లు విరేచనం అవ్వాలంటే అన్నిసార్లు సాఫీగా అయ్యేటట్లు ఈ విధానం దోహదం చేస్తుంది. రెండవది సన్నని వానజల్లు పడుతుంటే ఎప్పటి నీటిని అప్పుడు భూమి పీల్చి వేస్తూ ఉంటుంది. అదే జోరుగా (పెద్దగా) వాన ఒక్కసారే కురిస్తే, నీటిని భూమి పీల్చుకోగా, ఎక్కువ నీరు పల్లానికి పారుతూ వుంటుంది. అలాగే నీటిని ఒక గ్లాసో, రెండు గ్లాసులో త్రాగితే పొట్ట, చిన్నప్రేగులలో నుంచి పీల్చుకొని రక్తంలో కలుస్తాయి. ఒక్కసారే లీటరు లేదా లీటరంపావు త్రాగడం వలన పొట్ట, చిన్నప్రేవులు పీల్చుకోగా కొంత నీరు క్రిందకు పెద్దప్రేగులోనికి వెళ్ళడం జరుగుతుంది. అలా వెళ్ళిన ఆ నీటిను పెద్దప్రేగులోని ఎండి ఉన్న మలం పీల్చుకొని నానడం జరుగుతుంది. నానిన మలం ఎనిమా ద్వారా త్వరగా బయటకు రావడానికి అవకాశం కలుగుతుంది.
లీటరు నీరు త్రాగిన అరగంట తరువాత ఎనిమా చేసుకోవాలి. నీరు త్రాగిన తరువాత సాఫీగా విరేచనం అయినప్పటికీ ఎనిమా చేసుకోవలసిందే. నీరు త్రాగి ప్రయత్నం చేసినప్పటికీ విరేచనం మాములుగా అవ్వకపోతే కంగారు పడవలసిన పనిలేదు. మలబద్ధకం ఉన్నవారికి అంత తేలికగా విరేచనం కదలదు. ఎన్నడూ సబ్బులు కలుపరాదు. ఎనిమా ద్వారా ఒక లీటరు నుండి రెండు లీటర్ల నీటి వరకూ ఎక్కించుకోవచ్చు. ఎనిమా చేసుకునేటప్పుడు కుడి చేతి మీద (కుడి ప్రక్కకు) పడుకొని చేసుకోవడం మంచిది. ఎనిమా ద్వారా ఎక్కించిన నీళ్ళన్నీ (మలంతో కలిసి) బయటకు పోవడానికి 10-15 నిముషాలు సమయం పడుతుంది. విరేచనం అయ్యే సమయంలో మధ్యలో నుంచొని బొడ్డు క్రింద, పైన చేతులతో నొక్కుకొని మరలా కూర్చొంటే ప్రేగులో మలం, నీరు బాగా కదలి బయటకు త్వరగా వస్తాయి. ఈ విధంగా రెండు, మూడు సార్లు పొట్ట నొక్కడం చేస్తే మంచిది. మలబద్ధకం ఉన్నవారు సాయంత్రం 5-6 గంటలకు మరలా ఎనిమా చేసుకోవడం మంచిది. ఈ విధంగా ఉపవాసంలో ఉన్నన్ని రోజులు ఉదయం పూట ఎనిమా తప్పని సరిగా చేయవలసిందే.
ఉపవాసం ప్రారంభించిన రోజు నుండి అలవాటు ప్రకారం బెడ్ కాఫీలు, టీలు త్రాగడం పూర్తిగా మానివేయాలి. ఎనిమా అయిన 15 నిముషాల తరువాత మొదటిసారి తేనె, నిమ్మకాయ నీళ్ళు త్రాగడం ప్రారంభించాలి. అంటే సుమారు ఉదయం 7 గంటలకు పెద్దగ్లాసుడు నీరు తీసుకోని (300 - 400 మీ.లీ) అందులో ఒక కాయ నిమ్మరసాన్ని పిండి (ముత్యాలు, కూసాలు పడకుండా) దానికి నాలుగు టీ స్పూనులు నిండుగా తేనెను బాగా కలుపుకొని మెల్లగా త్రాగాలి. తేనె త్రాగిన గంట తరువాత అంటే సుమారు 8 గంటలకు రెండు పెద్ద గ్లాసుల మంచినీరు త్రాగాలి. ఒక్కసారే త్రాగలేని వారు ఒక గ్లాసు త్రాగి, 15 నిముషాల తరువాత వేరొక గ్లాసు నీరు త్రాగవచ్చు. మరలా గంటకు అంటే 9 గంటలకు తేనె, నిమ్మకాయ నీళ్ళు త్రాగాలి. మళ్ళీ 10 గంటలకు రెండు గ్లాసుల మంచి నీరు త్రాగాలి. ఈ విధంగా గంటకు తేనె నీరు, తరువాత గంటకు మంచినీరు చొప్పున ఉదయం నుండి రాత్రి వరకు అలా త్రాగుతూనే ఉండాలి. అంతేగానీ ఆకలి అవడం లేదని గానీ, పనిలో ఉండిపోయానని గానీ త్రాగడం అశ్రద్ధ చేయరాదు. రాత్రి 7 గంటల నుండి మంచినీరు త్రాగడం తగ్గించుకోవచ్చు లేదా పూర్తిగా త్రాగడం మానివేయవచ్చు. ఎందువల్లనంటే ఆ సమయంలో ఎక్కువనీరు త్రాగితే రాత్రికి నిద్రలేకుండా మూత్రానికి తిరగడం సరిపోతుంది. తేనె నీరు మాత్రం పడుకొనే ముందు వరకూ ప్రతి రెండు గంటలకు ఒకసారి మాత్రం త్రాగవలసిందే. వేసవికాలం గానీ, ఎండలు ఎక్కువగా ఉన్నరోజులలో గానీ మంచి నీరు ఇంకా ఎక్కువగా (రెండు గ్లాసుల కంటే) తీసుకోవడం మంచిది.
తేనె, నిమ్మకాయ నీళ్ళను ఎప్పటికప్పుడు తయారు చేసుకొని వెంటనే త్రాగాలి గానీ, ముందే ఒక్కసారి కలిపి వేసి సీసాలో పోసుకొని, లేదా ఫ్రిజ్ లో పెట్టుకొని త్రాగడానికి వీలు లేదు, అలా కలపడం వలన తేనె, నిమ్మకాయ నీళ్ళు ఆక్సిజన్ తో రియాక్షన్ జరిగి (ఆక్సిడైజేషన్) చెడిపోతాయి. ఆలస్యమైతే ఆ నీరు చేదుగా తయారవుతుంది. ఆ నీటిని త్రాగడం వలన ఉపయోగం ఉండదు. తేనె, నిమ్మకాయ నీళ్ళు కలుపుకొనే సమయం లేక పోయినా, వీలు కుదరక పోయినా ఒట్టి తేనెను మెల్లగా నాకేసి, నీరు త్రాగేస్తే సరిపోతుంది. నీళ్ళను, నిమ్మకాయలను, తేనెను ఎప్పుడూ ఫ్రిజ్ లలో పెట్టి ఉపవాసానికి వాడకూడదు.
ఉపవాసంలో ప్రతిరోజూ ఉదయం చన్నీటి తల స్నానం చేయవలసిందే. సాయంత్రం కూడా స్నానం చేయవలసిందే. అవసరమయితే గోరు వెచ్చటి నీటితో చేయవచ్చు. ఉదయం పూట రెండు, మూడు బక్కెట్ల నీటిని మెల్లగా 10-15 నిముషాల సేపు తలమీద పోసుకోవడం మంచిది. ఉపవాసంలో శరీరం ఎక్కువ వేడెక్కుతూ ఉంటుంది. చల్లని నీరు తలకు పోసి శరీరాన్ని చల్లబరచడం ఆరోగ్యానికి మంచిది. ఉపవాసంలో మొదటి రోజు నుండి సిగరెట్లు, వక్కపొడులు, ఆహార పదార్థాలను తినడం పూర్తిగా మానివేయాలి. అవి ఏ మాత్రం తగిలినా అది ఉపవాసం అవదు. తినాలి, త్రాగాలి అనే భావన రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యమైనది. రాత్రికి పెందలకడనే నిద్రపోవడం ఉపవాసంలో మంచిది. ఎక్కువ సమయం విశ్రాంతి ఇస్తే, ఎక్కువ వ్యర్థపదార్థాలను శరీరం విసర్జించుకోవడానికి వీలు ఉంటుంది. అలాగే తొందరగా పడుకొంటే ఉదయమే నిద్రలేవటానికి తేలికవుతుంది.
ఉదయం లీటరు నీరు త్రాగడం, ఎనిమా చేసుకోవడం, తేనె నీళ్ళు, మంచి నీళ్ళు త్రాగడం, తలస్నానం చేయడం, విశ్రాంతిగా ఉండడం, పెందలకడనే పడుకోవడం, ఇవన్నీ ప్రతిరోజూ ఉపవాసం చేసినన్ని రోజులూ చేయవలసిందే. రోగి యొక్క రోగలక్షణాలను బట్టి, శరీరాన్ని బట్టి ఉపవాసంలో రెండు మూడు రోజుల తరువాత నుండి మట్టి పట్టీ, నీటి ఆవిరి, తొట్టి స్నానాలు, పాదస్నానాలు, తడికట్లు వగైరా చికిత్సలు ప్రారంభించడం జరుగుతుంది. వీటన్నిటి ద్వారా శరీరం త్వరగా శుద్ధి అవుతుంది.
పుస్తకాలు చదివి ఉపవాసాలు మీ అంతట మీరు ఇంట్లో ప్రారంభించడం వలన ప్రయోజనం కంటే నష్టాలు ఎక్కువగా ఉంటాయి. మొదటి సారి ఉపవాసాలు చేసేటప్పుడు డాక్టరు గారి సలహా మేరకు, ఆయన పర్యవేక్షణలో చేసి అన్నీ తెలుసుకోవడం లాభదాయకం. తర్వాత మీరు స్వంతంగా ఇంట్లోనే చేసుకోవచ్చు. తొందరపడి ఉపవాసాలను ప్రారంభించి, ఏదన్నా ఇబ్బందులు వస్తే బెదిరిపోయి, మీ శరీరానికి ఉపవాసం యొక్క స్నేహాన్ని దూరం చేసుకోకండి. ఇది నా మనవి.

15. ఉపవాసంలో మందులు ఎందుకు మానవచ్చు?

మనిషి రోజూ అసహజమైన ఆహారాలను తింటున్నందువల్ల అసహజమైన మందులను వేసుకోవలసి వస్తున్నది. మనం తినే ఆహారంలో రోజూ రోగాలను కలిగించే రుచులు ఉన్నందువల్ల, అవి శరీరం నుండి రోజూ విసర్జింపబడక, శరీరంలోనే ఉండిపోయి రోగాలను కలిగిస్తూ ఉంటాయి. మనకు ఆ విధంగానే రోగాలు రావడం జరుగుచున్నది. రోగాలు వచ్చినప్పటికీ మనం రుచులను వదలకుండానే వాటిని నివారించుకోవడానికి మందులను ఆశ్రయిస్తున్నాము. రోజూ ఆహరం ద్వారా రోగాన్ని పుట్టించుకొంటూ, మందు ద్వారా అణచుకొంటూ జీవయాత్ర సాగిన్నాము. ఉదాహరణకు బి.పి. వచ్చినవారు ఉప్పును పూర్తిగా మానితే బి.పి. పూర్తిగా తగ్గిపోతుంది. కానీ అది చేయక కొంత ఉప్పును తగ్గించి, కొద్ది ఉప్పును తింటున్నందుకు ఆ కొద్ది ఉప్పు వల్ల వచ్చిన బి.పి. ని తగ్గించుకోవడం కొరకు రోజూ మందు వాడవలసి వస్తున్నది. ఉప్పు సాంతం మారితే మందు అక్కరలేదని తెలుస్తున్నది. ఉప్పు సాంతం మానలేక మందులు అవసరమేగానీ వేరే విధంగా మందు పని ఏముంటుంది? మనం తినే ఏడు రకాల రుచులు శరీరంలో రకరకాల రోగాలను రోజూ పుట్టిస్తూ ఉంటాయి. అందువలనే రోజూ రకరకాల మందులు మనం మ్రింగవలసిన అవసరం వస్తున్నది. ఆ రుచులను మానిన వారు ఆ మందులను మ్రింగడం మానవచ్చు అని స్పష్టంగా తెలుస్తున్నది.
ఇక్కడ మనం ఆ ఏడు రకాల రుచులను పూర్తిగా తినడం అపి ఉపవాసం ప్రారంభించడం జరుగుచున్నది. రుచులను తినడం పూర్తిగా ఆపాము కాబట్టి, ఈ రోజూ నుండి రోగం పుట్టడం కూడా ఆగుతుంది. కానీ రోజూ మందులతో రోగాలను అణచడం వలన, మందులు ఒక్కసారే ఆపడం ద్వారా మొదటి ఒకటి రెండు రోజులు మానసికంగా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అంతే గానీ మందులు మానినప్పటికీ రోగం పెరగడం ఉండదు. రెండు రోజులు మాత్రం బి.పి. ఉన్నవారు (ఎక్కువగా వున్నవారు) బిళ్ళలు వేసుకోవలసి వస్తుంది. అవసరమైతే క్రమేపీ తగ్గించుకొంటూ రావలసి ఉంటుంది. ఒక్క బి.పి.కే మందులు ఒక్కసారే మానడం మంచిది కాదు. కొద్దిగా ఉన్నవారు మొదటి రోజు నుండే మానివేయవచ్చు. ఉపవాసం ప్రారంభించిన రోజు నుండి మనం ఉప్పును తినడం పూర్తిగా ఆపినప్పటికి, మనలో నిలువయున్న ఉప్పు పోవడం గానీ, రక్తనాళాలు మెత్తబడడం గానీ వెంటనే నాలుగు రోజులలో జరుగదు. అందువలన రోజు రోజుకీ బి.పి. కొద్దిగా తగ్గుతూ వస్తూ ఉంటుంది. సుగరు ఉన్నవారు పూర్తిగా బిళ్ళలను మొదటి రోజు నుండే ఆపివేయాలి. లేకపోతే సుగరు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. మొదటి రెండు మూడు రోజులు కొద్దిగా సుగరు పెరిగినప్పటికీ దాని వలన ప్రమాదం ఏమీ ఉండదు. అది క్రమేపీ సర్దుకొంటూ ఉంటుంది.
జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధులున్నవారు మందులను పూర్తిగా మానివేయవచ్చు. ఎనిమా చేయడం ద్వారా ప్రేగు శుద్ధి అయ్యి జీర్ణకోశానికి చాలా తేలికగా ఉంటుంది. అదీగాక పొట్ట, ప్రేగులు మొదటి రోజు నుండి పూర్తి విశ్రాంతిలో వుండి రోగాలు తేలిగ్గా తగ్గుతూ ఉంటాయి. పైగా మనం వాడే తేనె నీళ్ళు, మంచి నీళ్ళకు జీర్ణకోశం తేలిగ్గా ఉంటుంది. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులున్నవారు కూడా మొదటి రోజు నుండే మందులను మానివేయవచ్చు. తేనె, నిమ్మకాయ నీళ్ళకు నిలువయున్న కఫం పూర్తిగా తెగి పడిపోతూ ఉంటుంది. అదీగాక ఆహారం లేక కొత్త కఫం తయారు అవ్వడం ఉండదు. పొట్ట ఖాళీగా ఉండి, గాలి ఎక్కువగా ఊపిరి తిత్తులలోనికి వెళ్ళడం వలన కూడా ఉపవాసంలో వీరికి మందులు లేకుండానే రోజు రోజుకీ తేలిగ్గా ఉంటుంది.
కిడ్నీలకు సంబంధించి మరియు నీరు పట్టడం మొదలగు వ్యాధులున్నవారికి ఉప్పు పూర్తిగా మానివేయడం వలన ఉపవాసంలో మందు వేసిన దానికంటే ఎక్కువ నీరు మూత్రం ద్వారా పోతుంది. ఆవిరి స్నానం ద్వారా కొంత నీరు తగ్గిపోతుంది. ఈ నీరు పూర్తిగా బయటకు పోతే కిడ్నీలకు చాలా తేలికగా ఉంటుంది. మందు లేకుండానే కిడ్నీ జబ్బులు ఉపవాసంలో తేలికగా నయమవుతూ ఉంటాయి. అలాగే గుండెకు సంబంధించిన జబ్బులున్నవారు కూడా మందులను మొదటి రోజూ నుండే పూర్తిగా వదిలివేయవచ్చు. ఉపవాసం ప్రారంభించిన రోజు నుండి గుండెకు రక్త ప్రసరణ ఎక్కువగా జరగడం ప్రారంభమవుతుంది. అదీగాక తేనె ఉండడం వలన రక్తం గడ్డలు కట్టే అవకాశం ఉండదు. ఎక్కువ ప్రాణశక్తి కూడా ఉపవాసంలో గుండెకు అందుతూ ఉంటుంది. అదీగాక రోజురోజుకీ శరీరంలో అక్కరలేని నీటిశాతం తగ్గడం వలన కూడా గుండెకు మందులు లేకుండానే పనిచేయడం తేలికగా ఉంటుంది. కండరాలు, కీళ్ళ నొప్పులున్నవారు వేడినీటి చికిత్సలు చేయడం ద్వారా మందులు లేకుండానే ఉపవాసంలో నెప్పులు సర్దుకొంటూ ఉంటాయి. ఉపవాసంలో బరువు రోజు రోజుకి తగ్గడం ద్వారా మందుల పనిలేకుండానే శరీరం తేలిగ్గా ఉంటుంది కాబట్టి ఇంకా మందులెందుకు? నరాలు, రక్తనాళాలకు సంబంధించి రోజూ మందులు మ్రింగేవారు ఉపవాసం మొదటి రోజు నుండి మందులు మానవచ్చు. ఉపవాసంలో నాడీ ప్రవాహాలు, రక్త ప్రవాహాలు చాలా చురుగ్గా జరుగుతాయి. ఉపవాసం అంటేనే ఖాళీ ఏర్పడటం. ఉపవాసంలో రక్తనాళాల్లో నిలువయున్న క్రొవ్వు, కొలెస్ట్రాల్ రోజు రోజుకి తగ్గడం ద్వారా మందుల అవసరం అసలుండదు. మనం రోజూ వాడే రకరకాల మందులను ఉపవాసంలో వాడనవసరం లేదు కాబట్టి పూర్తిగా మానడం చేస్తున్నాము. మందు వాడవలసిన అవసరం వస్తే ఎప్పుడయినా వాడవచ్చు. రోగాలు దానంతటవే రోజూ ఉపవాసంలో తగ్గుతున్నప్పుడు మనం ఇంకా మందులు వేస్తుంటే బి.పి., సుగర్ మొదలైనవి నార్మల్ కంటే కూడా తగ్గిపోయి ప్రమాదం వచ్చే అవకాశముంటుంది. దీని కారణంగానే మనం ఉపవాసంలో మందులు మానవచ్చు అని చెప్పుచున్నాము.
మందులకు మించిన మందు ఉపవాసం. అలాంటి ఉపవాసాన్ని చేస్తున్నప్పుడు రోగాలు మందుల వల్ల కంటే కూడా స్పీడుగా తగ్గిపోతుంటాయి. రోజు రోజుకీ శరీరం సహజత్వానికి చేరుకుంటూ ఉంటుంది. ఉపవాసంలో పంచభూతాలే మందులుగా పనిచేస్తుంటాయి. సహజ వైద్యం చేస్తున్నందుకు రోగాలు కూడా సహజంగానే తగ్గుతుంటాయి. అప్పుడు అసహజమైన మందులు వాడనవసరం ఉండదు. ఉపవాసంలో మందులు మానివేస్తే ఏమవుతుందోనని భయపడనవసరం లేదు. భయపడితే ఇంకా రోగాలు పెరుగుతూ ఉంటాయి. ఉపవాసంలో ఉండగా చేసే చికిత్సల వల్ల మనకు ఉన్న ఇబ్బందులు మందులు లేకుండా కూడా తగ్గే అవకాశముంటుంది. రోజుకు 30 బిళ్లలు మింగే వారు కూడా ఉపవాసం మొదటి రోజు నుండి అన్నీ మానివేసి ఆరోగ్యంగా ఉన్నవారు చాలా మంది మా దగ్గరుంటున్నారు. తీపి ఉంటేనే చీమలు అక్కడకు చేరతాయన్నది నిజం. రుచులు లేనంత కాలం ఏ రోగాలూ మిమ్మల్ని ఏమీ చేయలేవు అన్నది కూడా నిజం. ఉపవాసానికి మించిన మందు లేదు, ఆకలిని మించిన రుచి లేదు. ఆలసించక అందుకోండి ఆ భాగ్యాన్ని.

16. ఉపవాసంలో ఎలా ఉంటుంది?

ఉపవాసంలో ఎలా ఉంటుందో, ఏమీ అవుతుందో అన్న భయం మనిషిని వేధిస్తూనే ఉంటుంది. ఉపవాసాన్ని గురించి ముందే ఏదేదో ఊహించుకొని, లేనిపోని భయాన్ని పెంచుకొని ఉపవాసాలకు దూరంగా ఉంటారు. లాభం ఎక్కువ ఉందంటే కష్టానికి కూడా వెనుకాడకుండా ఆ పనిలో అందరూ ముందడుగు వేస్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి దగ్గరకు నడిచి మెట్లు ఎక్కి వెళితే ఎక్కువ పుణ్యం వస్తుందనేగదా, ఎప్పుడూ అంత నడక అలవాటు లేని వారు కూడా ఏడుకొండలు ఎక్కడానికి వెనుకాడడం లేదు. ఉపవాసం చేస్తే మీకు ఆరోగ్యంలో ఎప్పుడూ రానంత లాభం వస్తుందంటే కూడా వెనుకాడుచున్నాడు. మనిషి విలువ కట్టే వాటి కోసం ప్రాకులాడుతాడు గానీ, విలువ కట్టలేని, కొనలేని సంపదలను అందుకోవడానికి ప్రయత్నించడు. ఇది మనిషికున్న బలహీనతేమో!
మందులు వేసుకొంటే సైడ్ ఎఫెక్ట్సు వస్తాయని తెలిసి కూడా మనిషి వాటి జోలికి పోకుండా జీవించే ప్రయత్నం చేయడం లేదు. అంటే ఉన్న ఇబ్బందికి బదులు మందు వేస్తే ఇంకొక ఇబ్బంది వస్తుందని తెలిసి కూడా వాటితో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఉపవాసాలు చేస్తే ఏవో నష్టాలు, సైడ్ ఎఫెక్ట్సు ఉంటాయని లేదా వస్తాయని అందరూ ఉపవాసాలను అనుమానిస్తూ ఉంటారు. ఉపవాసాలు చేస్తున్నప్పుడు వచ్చేవి యిబ్బందులు అనుకుంటే మనం మోసపోయినట్లే. అవి మన శరీరాన్ని శుద్ధి చేయడానికి భగవంతుడు కల్పించే చక్కటి అవకాశాలు. ఉపవాసంలో ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది. శరీరానికి హాని జరిగే పని ఎన్నడూ ఉపవాసం చేయదు. ధర్మాల వలన ఎప్పుడూ మేలే జరుగుతుంది గాని కీడు జరుగదన్నది సత్యం. మనిషిని బాగు చేయడానికి ధర్మాలున్నవిగాని, నాశనం చేయడానికి కాదు గదా! ఉపవాసమనేది ధర్మం కాబట్టి ఉపవాసం వలన శరీరానికి మంచి జరుగుతుంది అన్నది సత్యం. మనలను రక్షించేది ఉపవాసం. మోసం చేసే వారి మాటలు కమ్మగా, వినబుద్ధిగా ఉంటాయి. మంచి వారినే ఎక్కువగా అనుమానించడం లోకం తీరు. అందరూ ఉపవాసాన్ని అనుమానించడం కూడా అలాంటిదే! ఎవరో చెప్పిన చెడ్డ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, వాటినే వేదంగా తీసుకొంటూ ఉపవాసాలకు దూరం అవుతున్నాము అంటే అది మన ఖర్మం. అసలు ఉన్న విషయమేమిటో మీరే పూర్తిగా తెలుసుకొంటే ఎవరో చెప్పిన మాటలను నమ్మవలసిన పని ఉండదనుకుంటాను.
జరిగేది అంతా మన మంచికే: ఇల్లు శుభ్రంగా లేకపోతే అందులో మనం కాపురం ఎలా చేయలేమో, అలాగే శరీరం లోపల శుభ్రంగా లేకపోతే ఆరోగ్యం అనేది కాపురం చేయలేదు. శరీరం లోపల శుభ్రం చేసి, ఆరోగ్యాన్ని కాపురం చేయించే అవకాశాన్ని కల్పించేదే ఉపవాసం. ఇంటిలో మురికి పోవడానికి, ఇంటిని కడుక్కొనే బాధ్యత, పద్ధతి మన అందరికీ ఉంది. అలాగే ఒంటిలోని మురికి పోవడానికి, ఒంటిని లోపల కడుక్కొనే బాధ్యత మన అందరికీ ఉండాలి గదా! రోజూ తడిగుడ్డపెట్టి ఇంటిని తుడుచుకోవడం ఎలాంటిదో, స్నానం చేసి రోజూ శరీరాన్ని బయట కడుక్కోవడం కూడా అలాంటిదే. రోజూ అలా ఇంటిని తుడుచుకున్నప్పటికీ, పండుగ పండుగలకీ సర్ఫు వేసి, చీపురు పెట్టి, గట్టిగా రుద్ది ఎక్కువ నీటితో రెండు మూడు సార్లు ఇంటిని కడుక్కోవడం ఎవరన్నా మానుతున్నారా? అలాగే మన శరీరాన్ని కూడా పండుగ పండుగలకీ ఉపవాసం ద్వారా లోపల శుభ్రం చేయడం మానకూడదన్నమాట. పండుగల పుణ్యమా అని ఇళ్ళు శుభ్రపడుతున్నాయి గానీ, పండుగల పేరు చెప్పుకొని శుభ్రం చేయడం బదులు శరీరాన్ని మరీ పాడుచేసుకోవడం సాంప్రదాయం అయ్యింది. నాలుగు నెలలు తాళం వేసిన ఇంటిని శుభ్రం చేయడానికి ఎక్కువ సమయం, ఎక్కువ శక్తి ఖర్చు అవ్వడంతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా వస్తూ వుంటాయి. అలాగే ఎన్నో సంవత్సరాలు శరీరాన్ని లోపల కడుక్కోవడం చేతగాక వదిలేసి మొదట సారి కడగడం ప్రారంభిస్తే ఆ చెడు కదలక, ఉపవాసం ఎక్కువ రోజులు పట్టడమే కాకుండా కొన్ని ఇబ్బందులు కూడా రావడం సహజమే.
మంచి నీరు పోసి ఇంటిని కడగడం ప్రారంభించాం. అలాగే తేనె నీళ్ళు, మంచి నీరుతో శరీరాన్ని లోపల (ఉపవాసం ద్వారా) కడగడం ప్రారంభించాం. ఇంట్లో ముందు ఒక బక్కెట్ నీరు పోస్తే, దానికి మురికి బాగా నానడం ప్రారంభిస్తుంది. అలాగే మనలో కూడా ఆహారం తినకుండా తేనెనీళ్ళు, మంచి నీరు బాగా త్రాగుతుంటే రెండు మూడు రోజులలో శరీరంలోని చెడ్డపదార్థం నానడం ప్రారంభిస్తుంది. ఎక్కువ చెడు ఉన్న చోట మురికి నానడానికి లేదా కదలడానికి ఇంకా కాస్త ఎక్కువ సమయం పట్టినట్లే. మనలో కూడా చెడు ఎక్కువ ఉన్నవారికి నానడానికి లేదా కదలడానికి ఉపవాసంలో నాలుగైదు రోజులు ఎక్కువ పడుతుంది. పాలిష్ రాళ్ళను కడుగుతుంటే కొద్దిగా మోత తక్కువగా రావడమే కాకుండా మురికి తేలిగ్గా వదులుతుంది. అలాగే మనలో కూడా చెడు తక్కువ ఉన్నవారికి ఉపవాసంలో ఇబ్బందులు (విరేచనాలు, వాంతులు, నెప్పులు) లేకుండానే చెడ్డ పదార్థం తేలిగ్గా కదిలివెళుతుంది. అదే నాపరాళ్ళను కడుగుతుంటే మోత ఎక్కువగా రావడమే కాకుండా మురికి తొందరగా వదలదు. అలాగే మనలో కూడా చెడు బాగా పేరుకొని పోయి ఉన్నవారికి ఉపవాసంలో చిన్న చిన్న ఇబ్బందులతో గానీ మురికి కదలక, ఎక్కువ రోజులు ఉపవాసాలు పడతాయి. ఒక్కోసారి మురికి సరిగా పోనప్పుడు అక్కడ రుద్దడం లేదా గోకడం చేస్తాము. మామూలు కంటే ఎక్కువ శ్రద్ధ, శక్తి అలాంటి చోట పెడితే గానీ ఆ మురికి వదలదు. అలాగే మన శరీరంలో కూడా చెడు పదార్థం ఎక్కడన్నా గట్టిగా పేరుకొని పోయి మామూలుగా కదలనప్పుడు, ఆ చెడును కదపడానికి శరీరం ఎక్కువ శక్తిని అక్కడకు పంపి పూర్తిగా శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నంలో (ఇంటిలో రుద్దడం, గీకడం లాగ) మన శరీరంలో ఆ చెడు ఏ భాగాన ఉంటే ఆ భాగంలో మామూలు కంటే కూడా రిపేరు గట్టిగా జరగడం వలన మనకు అక్కడ కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంట్లో రుద్దేటప్పుడు, గీకేటప్పుడు అక్కడ మోతలు ఎలా వస్తున్నాయో, అలాగే మనలో కూడా నెప్పులు, చిన్న చిన్న బాధలు , కొద్ది ఇబ్బందులు రావడం సహజమన్నమాట. ఇంట్లో కడిగేటప్పుడు, రుద్దేటప్పుడు రకరకాల మోతలు వచ్చి చెవులకు ఇబ్బంది అనిపించినప్పటికీ ఇల్లును కడుక్కోవడం ఆపుచున్నామా? అలాగే శరీరం లోపల శుభ్రం అయ్యేటప్పుడు వచ్చే పొట్టలో తిప్పడం, గుడగుడలు, నెప్పులు మొదలగు వాటి వలన కొద్దిగా ఇబ్బంది అయినప్పటికీ వాటిని ఆపకూడదన్న మాట. కష్టమైనప్పటికీ పని అనుకోకుండా ఇల్లు కడుక్కోవడం మానుతున్నారా? చిన్న చిన్న ఇబ్బందులున్నప్పటికీ మనకెందుకులే అని వదిలి వేయకుండా శరీరాన్ని కడుక్కోవడం కూడా చేయాలన్నమాట.
ఇంటిని కడిగేటప్పుడు ఇంటిలోని మురికి అంతా ఇంటి నుండి బయటకు పోక తప్పదు. అలాగే ఉపవాసం చేస్తున్నప్పుడు శరీరంలో కదిలిన మురికి అంతా శరీరము నుండి బయటకు పోక తప్పదు. కడిగేటప్పుడు ఇంటిలోని మురికినీరు ఇంటికున్న ఒక బెజ్జం ద్వారా బయటకు పోతూ ఉంటుంది. అలాగే ఉపవాసం ద్వారా కదిలిన శరీరంలోని మురికి, చెడు మనకున్న నాలుగు విసర్జకావయవాల ద్వారానే (మలం, మూత్రం, చెమట, గాలి) కాకుండా నోటి ద్వారా (వాంతుల రూపంలో) కూడా బయటకు పోతూ ఉంటుంది. ఇంట్లో కడిగినప్పుడు కదిలిన మురికి ఇంట్లోనే ఉండిపోతే ఇల్లును కడిగిన ప్రయోజనం ఉండదుగదా! అలాగే ఉపవాసంలో శరీరంలో కదిలిన చెడు, వ్యర్థపదార్థాలు బయటకు పోకుండా (విరేచనాలు, వాంతులు అవ్వకుండా) శరీరంలోనే ఉండిపోతే ఉపవాసం చేసిన ప్రయోజనం ఏముంటుంది? ఇంటిలోని మురుగు బయటకు వెళ్ళేటప్పుడు మురుగుకన్నం పూడుకొనిపోతే పుల్లబెట్టి పొడుస్తూ ఆ మురుగు పోయేదాకా దగ్గరుండి శ్రద్ధ తీసుకుంటాము గదా! మరి అదే ధర్మం శరీరానికి కూడా వర్తించాలి గదా! ఉపవాసంలో ఒంటిలోని మురికి దానంతటది కదలి బయటకు పోతుంటే సహనం, ఓర్పు లేక చిరాకుపడుతుంటాం. ఆ చెడు అలా రాకుండా ఆగిపోతే బాగుంటుంది అనుకునేవారు కొందరైతే, ఆ చిన్న ఇబ్బందులను సహించలేక ఉపవాసాలను ఆపి తినేద్దాం అనుకునే వారు మరి కొందరు. అలా ఆపి తినివేయడమో, ఉపవాసాలను విరమించడమో చేస్తే శరీరం ఎన్నడూ శుభ్రం కాదు. ఉపవాసంలో అలా చిన్న చిన్న ఇబ్బందులు రావడాన్ని చూసి ఉపవాసం యొక్క సైడ్ ఎఫెక్ట్ అని ఎవరన్నా అనుకుంటే అది పొరపాటే. వాటి ద్వారా (విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి, ఎక్కిళ్ళు, జ్వరం, గుడగుడలు తేనుపులు మొదలగునవి) మన శరీరం చెడు నుండి పూర్తిగా విముక్తి పొందుతున్నది అని గ్రహించాలి. ఉపవాసంలో రకరకాల మార్పులు ఎందుకొస్తాయో, అవి ఏమిటో తెలుసుకొందాం.
1. తలనొప్పి: ఉపవాసం ప్రారంభించిన మొదటి రోజు సాయంకాలం నుండి కొంత మందికి తలనొప్పి ప్రారంభిస్తే, మరికొంత మందికి మరుసటి రోజు ఉదయం నుండి ప్రారంభమవుతుంది. టీ, కాఫీలు అలవాటుగా త్రాగే ప్రతి ఒక్కరికీ వాటిని ఉపవాసంలో మానడం వలన తప్పనిసరిగా తలనొప్పి వస్తుంది. మంచి అలవాటును మానివేస్తే శరీరం ఇబ్బంది పడదుగానీ చెడ్డ అలవాట్లను, చెడ్డ (టీ,కాఫీలు) స్నేహాన్ని ఒక్కసారే మానివేస్తే తలనొప్పులు తప్పవు. టీ, కాఫీలలో నరాలను ఉద్రేకపరిచే గుణం ఉన్న కారణంగా రోజూ ఆ మందు నరాలకు, అందుతూ ఒక్కరోజు సడన్ గా అందక పోయే సరికి శరీరంలో, తలలో నరాలన్నీ రోజూ లాంటి ఉద్రేకం లేక డిమ్ గా (మందంగా) అయిపోతాయి. అందువలన టీ, కాఫీలు త్రాగే వారికి ఉపవాసంలో మూడు నాలుగు రోజులు తలనొప్పులు తప్పవు. అలాగే సిగరెట్లు తాగేవారికి, బ్రాందీలు త్రాగేవారికి, ఒకరకమైన కిళ్ళీలు తినే వారికి కూడా ఉపవాసంలో తలనొప్పి ఉంటుంది. పై అలవాట్లు లేక పోయినప్పటికీ రోజూ లేదా అప్పుడప్పుడు తలనొప్పితో బాధపడేవారికి కూడా ఉపవాసంలో వస్తుంది. ఏసీ లో నుండి ఒక్కసారే ఎండలోనికి వస్తే ఎలా ఇబ్బంది అనిపిస్తుందో, అలాగే రోజూ అన్ని రకాలుగా, రకరకాల రుచులు తింటూ ఒక్క రోజూ మానివేస్తే అవి అన్నీ అందనందుకు కూడా ఇబ్బంది ఉంటుంది. అలవాటు లేని తేనెనీళ్ళు త్రాగడం, ఎక్కువగా మంచినీరు త్రాగడం, చన్నీళ్ళు తలకు పోసుకోవడం వలన కూడా మొదట రెండు రోజులు తలనొప్పి తప్పదు. ఉపవాసంలో రెండవ రోజున తలనొప్పి ఎక్కువ మందికి ఎక్కువగా ఉంటుంది. రెండుపూటలా చన్నీటి తలస్నానం చేస్తూ, నెప్పి ఎక్కువగా ఉంటే మాడు మీద 20 నిమిషాలు ఒండ్రు మట్టి (మట్టి లేకపోతే తడిగుడ్డ) వేసుకొంటే నెప్పి సర్దుకొంటుంది. అలా చేసినా తగ్గకుండా నెప్పి భరించలేకుండా ఉంటే తలనెప్పి బిళ్ళ వేసుకోవచ్చు. ఖాళీ కడుపు మీద బిళ్ల అని ఆలోచించనక్కరలేదు. తేనె ఆహారంగా పనిచేస్తుంది. కాబట్టి తేనె నీళ్ళతో బిళ్ళ వేసుకోవచ్చు. మూడవ రోజుకి కొద్దిగా సర్దుకుంటుంది. మొత్తం మీద మూడు నుండి ఆరు రోజులలో సామాన్యంగా అందరికీ తలనొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి. ఒక్కసారి తగ్గాక మళ్ళీ ఉపవాసంలో తలనొప్పి సామాన్యంగా ఎవరికీ రాదు. పొట్టలో వికారం, త్రిప్పడం మొదలగు లక్షణాలు వచ్చినప్పుడు వచ్చి వాంతి అయిన వెంటనే తగ్గిపోతుంది. అసలు తలనొప్పి ఎన్నడూ రానివారికి ఉపవాసంలో కూడా అసలు రాదు. తలనొప్పి వచ్చిందని కాఫీ, టీలు త్రాగడం గానీ, ఏదన్న తినడంగానీ, ఉపవాసాన్ని మానివేయడం గానీ ఎన్నడూ చేయరాదు. పడే బాధేదో ఉపవాసంలో నాలుగు రోజులు ఓర్చుకుంటే జీవితం అంతా తలనొప్పి లేకుండా, మందులు వాడకుండా హాయిగా జీవించవచ్చు.
2. నీరసం: ఉపవాసంలో ముందు రెండు మూడు రోజులలో ఉండే ఎక్కువ తలనొప్పి కారణంగా మనస్సుకు చిరాకుగా ఉంటుంది. ఏ పనీ చేయనీయదు. తొయ్యదు. శరీరాన్ని నడిపే మనస్సే ఆలా మందంగా ఉంటే శరీరం నీరసంగా గాక మరెలా ఉంటుంది. ఈ నీరసానికి కారణం టీ, కాఫీలు, సిగరెట్లు, ఆల్కహాల్, తినుబండారాలు మొదటి రోజునే మానివేయడం. ముఖ్యంగా శరీరానికి ఉప్పు అందక (ఆహారం ద్వారా) కొంత నీరసం. మొదటి రోజు మధ్యాహ్నం నుండి కొంత నీరసం ప్రారంభమయ్యి రెండవ రోజు పూర్తిగా నీరసం అనిపిస్తుంది. చాలా మంది మూడవ రోజు నుండి హుషారుగా వుంటారు. కొంత మందికి తలనొప్పి పూర్తిగా తగ్గితేగానీ నీరసం తగ్గదు. కొందరికి రెండవ రోజు ఎనిమా ద్వారా జాడించి విరేచనం వెళ్ళాక నీరసంగా ఉంటుంది. ఉపవాసం ప్రారంభమయిన నాలుగోరోజు నుండి ఉపవాసం విరమించే రెండు రోజుల ముందు వరకూ శరీరానికి అసలు నీరసం రాదు. మనం సరిగా చేస్తే ఉపవాసంలో శరీరానికెన్నడూ నీరసం రాదు. వచ్చేది ఉంటే అది మానసికమైన నీరసమే. టైముకు తేనె నీళ్ళు త్రాగక పోయినా, సరైన విశ్రాంతి శరీరానికి ఇవ్వకుండా ఉపవాసంలో తిరుగుతున్నా నీరసం వచ్చే అవకాశాలు ఉంటాయి. వికారాలు, వాంతులు వచ్చినప్పుడల్లా మరలా నీరసం అనిపిస్తుంది. కొంతమందికి విరేచనాలు ఎక్కువగా వెళ్ళి, నీరు సరిగా త్రాగనప్పుడు నీరసం వస్తుంది. ఉపవాసంలో అనుకోకుండా నీరసం ఎక్కువగా ఉంటే ఇంకా రెండు సార్లు తేనె నీళ్ళు త్రాగి చూడవచ్చు. అలా చేసినా నీరసం తగ్గకపోతే ఒకటి రెండు బొండాలు వాడవచ్చు. అంతేగానీ నీరసం వచ్చిందని ఆహరం తినడం చేసి లేని పోని ఇబ్బందులు తెచ్చుకోకూడదు. కొంత మందికి ఒక్కోరోజు మనస్సు సరిగా లేక. లేదా రకరకాల ఆలోచనలవల్ల, లేదా శరీరంలో వచ్చే మార్పుల వల్ల ఒక్కో రోజు నిద్రపట్టదు.అలాంటప్పుడు తరువాత రోజు నీరసం కొద్దిగా అనిపిస్తుంది. ఉపవాసంలో ఎక్కువ తిరిగినా, పనిచేసినా తరువాత రోజు నీరసంగా ఉంటుంది. ఎక్కువరోజులు ఉపవాసాలు చేయాలంటే ఏ రోజు కారోజు నీరసం రాకుండా జాగ్రత్త పడవలసిందే.
3. నోరు చేదు: ఉపవాసం ప్రారంభించిన మూడవ రోజు నుండి లేదా నాలుగవ రోజు నుండి నోరు చేదు రావడం ఎక్కువ మందికి ప్రారంభమవుతుంది. ప్రేగులు, లివరులో చెడ్డ పదార్థం ఎక్కువ ఉన్న వారికే అది కదిలి విసర్జింపబడుతున్నప్పుడు ఈ విధంగా నోరు చేదు వస్తుంది. మేము రిపేరులో ఉన్నాము. మాకు ఆహారము వద్దని పొట్ట, ప్రేగులు నోటి చేదు ద్వారా తెలియజేస్తున్నట్లు దాని అర్థం. మనకు ఆ విధంగా నోరు చేదు ఉన్నప్పుడు ఆహారం తినాలనే కోరిక తగ్గుతుంది. జ్వరం వచ్చినప్పుడు కూడా శరీరం రిపేరులో ఉంటుంది. కాబట్టి ఆ రోజు కూడా నోరు చేదు వస్తుంది. అలా నోరు చేదు రాకపోతే మనం ఉపవాసంలో కూడా తినాలను కుంటామని లేదా జ్వరం వచ్చినప్పుడు తింటామని, తినకుండా చేయడానికి భగవంతుడు అలా సహకరిస్తున్నాడు. ప్రేగులు, లివరు పూర్తిగా శుభ్రం అయ్యాక నోరు స్వచ్ఛంగా ఉంటుంది. నోరు చేదు పోవడానికి మూడు పూటలా బ్రష్ చేసినా అది పోదు. వేపపుల్ల బెట్టి రెండుపూటలా పళ్ళు తోముకొంటే కొద్దిగా నోరు తేలిగ్గా ఉంటుంది. ఉపవాసంలో నోరు చేదు రావడం ధర్మం. అంతేగాని ఉపవాసంలో ఇలా ఎందుకవుతుందని కంగారు పడనవసరం లేదు.
4. కడుపునొప్పి: ఉపవాసంలో కడుపు నొప్పి కొంతమందికి వస్తూ ఉంటుంది. కడుపు నొప్పి కొంత మందికి కొద్దిగా వస్తే, మరి కొంత మందికి ఓర్చుకోలేనంత, భరించలేనంత కూడా వస్తుంటుంది. ఉపవాసంలో రోజూ ఎనిమా చేస్తాము కాబట్టి, ఆ ఎనిమా నీళ్ళకు లోపల ఉన్న నిలువ మలం కదులుతూ ఉంటుంది. ఆ నీళ్ళకు కదిలి వెళ్లే మలం తేలిగ్గా నొప్పి లేకుండానే వెళ్ళిపోతుంది. ఎవరికైతే ప్రేగులలో మలం బాగా ఎండి పోయి, జిగురుగా అంటూ కొని ఉంటుందో ఆ మలం ఎనిమా నీళ్ళకు రోజూ నానుతూ ఉంటుంది. ఎనిమా నీళ్ళకు మలం నాని ప్రేగు నుండి మలం కదలనప్పుడు, ఆ మలాన్ని కదలడానికి మన శరీరంలోని శక్తి అంతా ప్రేగుల దగ్గరకు వచ్చి, ప్రేగులను మెలిపెడుతూ (కన్ ట్రాక్షన్స్) మలాన్ని కదిపే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంలో నిలువ వున్న మలంగానీ, జిగురుగానీ నెప్పితో కదులుతూ ప్రేగు నుండి ఊడుతూ ఉంటుంది. ప్రేగులు మెలిపెడుతున్నట్లు ఆ బాధను అనుభవించే వారికి తెలుస్తుంది. ఆ రకంగా శక్తి అంతా ఒక చోట చేరి అలా మెలిపెట్టందే ఆ మలం అంతా కదలదు కాబట్టి మనకు ఆ సమయంలో అంత నెప్పి అనిపిస్తుంది. ఉపవాసంలో శరీరాన్ని రక్షించుకోవడం బాధ్యత కాబట్టి నిలువ ఉన్న మలం ద్వారా శరీరం ఇక దెబ్బ తినకుండా మనలో శక్తి చేసే కృషే ఇది. మనిషికి ఆహారం తింటున్నప్పుడు రోజూ తిన్నదే వెళుతూ ఉంటుంది గానీ నిలువ ఉన్న మలం కదలదు. ఉపవాసంలో తింటం లేదు కాబట్టి నిలువ వున్న చెడు అంతా కదులుతుంది. మనిషికి కడుపులో గానీ, బొడ్డు దగ్గర గానీ నల్లగా నిలువ ఉన్న మలం ఎక్కువగా వచ్చి ప్లేటుకు అంటుకొని పోయే లక్షణాన్నీ కలిగి వుంటుంది. అంటే నెప్పి వచ్చిన తరువాత విరేచనం బాగా అవుతుందన్నమాట. ఆలా విరేచనం అయిన తరువాత నెప్పి పూర్తిగా సర్దుకు పోతుంది. కొంత మందికి ఒక రోజు, రెండు రోజులు కూడా ఉండవచ్చు. శరీరం ప్రయత్నించినప్పటికీ మలం కదలక పోతే నెప్పి అలానే ఉంటూ ఉంటుంది.
కొద్దిగా నెప్పి వచ్చిన తరువాత వెంటనే విరేచనం వెళ్ళి కొంత మందికి వెంటనే పూర్తిగా తగ్గిపోతుంది. నెప్పి కొద్దిగా ఉండి విరేచనం అవ్వకపోతే, విరేచనం అవ్వడం కొరకు అప్పుడు ఎనిమా చేసుకోవచ్చు. ఎనిమా చేసుకున్నా కొంత మందికి తగ్గదు. ఓర్చుకోలేని నెప్పి అనిపిస్తే తగ్గించుకోవడం కొరకు వెంటనే నెప్పి బిళ్ళ (పెయిన్ కిల్లర్) వేసుకొంటే 20 నిముషాలలో నెప్పి సర్దుకుంటుంది. నెప్పి తెలియకుండా బిళ్ళ వేసుకుంటున్నావు గానీ, రోగం తగ్గడానికి వేసుకోవడం లేదు. ఒకటి రెండు రోజుల తరువాత ఆ నిలువ ఉన్న మలం పూర్తిగా కదిలి ఎనిమాతో పోతుంది. బిళ్ళ వేసుకున్నా నెప్పి తగ్గక బాధపడే వారు వెంటనే ఇంజక్షన్ చేయించుకోవచ్చు. ఇంత అవసరం వచ్చేవారు 400 మందిలో ఒకరుండవచ్చు. మలం కదిలేటప్పుడు వచ్చే నెప్పికి మట్టి పట్టిలు వేసినా, కాపడాలు పెట్టినా కాలక్షేపానికే గానీ నెప్పిని తగ్గించలేవు. కొద్దిపాటి నెప్పికి అవి పని చేస్తాయి. కుడివైపు బొడ్డు క్రింద భాగం నుండి పెద్ద ప్రేగు ప్రారంభమవుతుంది. ప్రేగు ప్రారంభం నుండి ఎక్కువ మలం ఏళ్ళ తరబడి నిలువ వుంటుంది. అందువల్ల ఆ భాగంలోనే ఎక్కువ నొప్పి ఎక్కువ మందికి వస్తుంది. అదే భాగంలో 24 గంటల ప్రేగు (ఎపెన్ డిక్స్) కూడా ఉంటుంది. మలం కదిలేటప్పుడు వచ్చే నెప్పినే, ఆ భాగంలో రావడం వలన అది 24 గంటల జబ్బు లేదా ఆ నెప్పి అని కొంత మంది భయపడతారు. ఉపవాసంలో 24 గంటల నెప్పి వచ్చే అవకాశం లేదు పొట్టలో ఎంత నెప్పి వచ్చినప్పటికీ కంగారు పడవలసిన పని లేదు. ఉపవాసంలో బొడ్డు, బొడ్డు క్రింద భాగాల్లో వచ్చే నెప్పి అంతా మలానికి సంబంధించే ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో అవసరమయితే లేత కొబ్బరి నీళ్లు (ఉప్పగా ఉండే నీళ్లు) రెండు కాయలు త్రాగితే మలం తేలిగ్గా కదిలే అవకాశముంటుంది. అవసరాన్ని బట్టి నిమ్మకాయ నీళ్ళు, ఎనిమా లేదా వేపాకుతో మరగించిన నీటితో అయినా ఎనిమా చేసుకోవచ్చు. సామాన్యంగా ఉపవాసాల మధ్యలో గానీ, చివరి రోజుల్లో గానీ, ఇలాంటి నెప్పులు వచ్చే అవకాశముంటుంది. అన్ని రోజులకు ఆ మలం నానుతున్నదన్నమాట. ఆమ్మో అని భయపడకండి. మీ అందరికి నెప్పి వస్తుందని కంగారు పడనక్కరలేదు. నెప్పికి తట్టుకోలేక బిళ్ళ వాడవలసి వచ్చే వారు 100 కి నలుగురుంటారు. ఉపవాసంలో ఎన్నో ఎళ్ళ నుండి దాగియున్న చెడు అంతా పోతున్నందుకు సంతోషంగా ఉండాలి. అంతేగానీ మనకు కూడా అలాంటి నెప్పి వస్తుందేమోనని వెనుకడుగు వేయగూడదు.
5. విరేచనాలు: మాములుగా మనకు నాలుగైదు విరేచనాలు అయితే వేలాడిపోయి నీరసంగా ఉంటాము. వెంటనే హాస్పిటల్ కి వెళ్ళి బిళ్ళలు వేసుకోవడం, సెలైన్ పెట్టించుకోవడం చేస్తూ వుంటాము. విరేచనాల ద్వారా శరీరంలో నీరు తగ్గిపోతుంది కాబట్టి మనకు వెంటనే నీరసం వస్తుంది. కానీ ఉపవాసాలు చేసేటప్పుడు అయ్యే విరేచనాలతో నీరు ఎక్కువగా పోదు. అందువలన పదిసార్లు విరేచనాలు అయినప్పటికీ ఉపవాసాలలో నీరసం రాదు. రోజుకి 30 - 35 సార్లు వరకూ విరేచనాలు వెళ్ళిన వారికీ కూడా సెలైన్ పెట్టవలసినంత నీరసం రాదు. సామాన్యంగా 5 నుండి 10 సార్లుగా ఎక్కువమందికి విరేచనాలు అవుతుంటాయి. విరేచనాలతో కలిపి కూడా వాంతులు ఎవరికైనా వస్తే అటువంటి వారికి ఆహరం ఏమీ లోపలకు వెళ్ళక కొద్దిగా నీరసం వస్తుంది. మరీ అవసరమైనప్పుడు సెలైన్ ఎక్కించడం వలన నష్టం లేదు. మంచి నీళ్ళు ఎక్కువగా త్రాగడం వలన కొద్దిగా పెద్దప్రేగులోనికి వెళ్ళి అక్కడ మలం నానుతుంది. అలాగే ఎనిమా ద్వారా ఎక్కించిన నీటి వలన కూడా నానిన మలం ఉదయం ఎక్కువగా వెళ్ళినప్పటికీ ఇంకా ప్రేగులలో కొంత నీరు మిగిలి, ప్రేగులలో జిగురు ఎక్కువగా ఉన్నవారికి కదిలి అది కొద్దికొద్దిగా అప్పుడప్పుడూ వెళుతూ ఉంటుంది. అదీ గాక మలం ప్రేగులో జిగురు, ఎమిబియాసిస్ ఎక్కువగా ఉన్నవారికి ఉపవాసం చేస్తున్నప్పుడు శరీరంలోని శక్తి అంతా అక్కడకు వచ్చి రిపేరు కార్యక్రమంలో ఉన్నప్పుడు కొద్దికొద్దిగా మలం కదులుతూ ఉంటుంది. జిగురు మలం కదిలిన తరువాత ప్రేగులో ఎక్కువ సేపు నిలువ ఉండలేదు. దీనికి కారణం జిగురుకు జారే గుణం ఎక్కువ కాబట్టి. అందువల్ల ఎప్పుడు కదిలిన మలం అప్పుడు ఆసనం దగ్గరకు చేరి మనకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. అదే మలబద్ధకం ఎక్కువగా ఉన్నవారికైతే మలం ఉండలు కట్టి గట్టిగా ప్రేగులలో ఉండడం వలన ఉపవాసంలో మధ్యాహ్నం కదిలినప్పటికీ, అది రేపు ఉదయం ఎనిమా నీటితో కలిసిగానీ బయటకు రాదు. గట్టి మలం ఉండలు తొందరగా ప్రేగులలో జరగవు. మలబద్ధకం ఉన్నవారు ఉపవాసాలు చేసేటప్పుడు అసలు విరేచనాలు అవ్వకపోవడానికి ఇదే కారణం.
ప్రేగులలో కదిలే కొద్ది మలం అక్కడ ఉన్న కొద్ది నీటితో కలిసి వెంటనే జిగురుగా బయటకు రావడం జరుగుతుంది. ఆ విరేచనంలో నీరు కొద్దిగానే ఉంటుంది. ఉపవాసాలప్పుడు త్రాగిన నీరే ఎక్కువగా వస్తుంది గానీ శరీరంలోని నీరు ప్రేగులలోనికి రాదు. అందువల్లనే ఉపవాసాలలో అయ్యే విరేచనాలకు కంగారు పడనక్కర్లేదు. కాకపోతే ఎక్కువసార్లు దొడ్లోకి తిరగడం, అక్కడ పదే పదే కూర్చొని లేవడం వలన కాళ్ళ నెప్పులు, నీరసం అని కొంతమంది అంటుంటారు. విరేచనాల వల్ల కొద్దిగా ఇబ్బంది, నీరసం అనిపిస్తే మజ్జిగ ఒక గ్లాసుడు మెల్లగా త్రాగవచ్చు. అవసరమైతే ఇంకా వాడవచ్చు. మంచినీళ్ళను ఒక్కసారే రెండు గ్లాసులు స్పీడుగా త్రాగడం మాని, గోరువెచ్చని నీటిని మెల్లగా 10 నిమిషాలు త్రాగడం మంచిది. ఒక్కసారే త్రాగడం వలన మరలా కొద్దిగా విరేచనం వచ్చినట్లుంది. తేనె నిమ్మకాయ నీళ్ళు త్రాగడం కొద్దిగా తగ్గించి, అప్పుడప్పుడు తేనెను రెండు చెంచాలు నోట్లోనే ఎక్కువసేపు ఉంచుకొని మెల్లగా చప్పరించడం వలన నీరసం రాదు. చన్నీటితో ఎనిమా చేస్తే ఒక్కోసారి విరేచనాలు ఆగుతాయి. పొట్టమీద తడికట్టు లేదా మట్టి పట్టీలు వేయడం కొంతవరకు సహకరిస్తాయి. ఒక్కొక్కసారి ఎన్ని చేసినా వాటికి ఆపువుండదు. మరీ ఇబ్బంది ఎక్కువగా ఉంటే విరేచనాలు తగ్గడానికి ఒక్కబిళ్ళ వేయడం మంచిది. బిళ్ళ వేస్తే కొంతమందికి తగ్గుతాయి. ఎవరికన్నా బిళ్ళ వేసినా ఆగవు. అలాంటప్పుడు ఇన్ జెక్షన్ తప్పదు. నీరసం తగ్గడానికి మజ్జిగతో పాటు బాగా తీపిగా వున్న కొబ్బరి నీరు కొద్దిగా త్రాగవచ్చు. మోషన్స్ తగ్గిన దగ్గర నుండి మరలా యథావిధిగా ఉపవాసాలను కొనసాగించవలసిందే. మోషన్స్ అయ్యే లక్షణాలు ఉంటే ఉదయం పూట లీటరు నీరు త్రాగడం మానివేయాలి. విరేచనాల రూపంలో ప్రేగులలోని చెడు నంతా శరీరం కడిగి వేస్తుందన్నమాట.
6. కళ్ళు తిరగడం: మేము చేయించే తేనె, నిమ్మకాయ నీళ్ళ ఉపవాసాలలో సామాన్యంగా ఎవరికీ కళ్ళు తిరగవు. ఎవరైనా సక్రమంగా తేనె నీళ్ళు త్రాగక ఎక్కువ సమయం ఖాళీ వస్తే వారికి అలాంటప్పుడు అనిపిస్తుంది. ఉదయం 7 గంటలకు ఒకసారి తేనెనీళ్ళు త్రాగమని చెప్పినా ఆవిరిపట్టి, స్నానం చేసేదాక కొంత మంది తేనె నీళ్ళు త్రాగకుండా, పని అంతా అయ్యాక త్రాగుదాములే అని అశ్రద్ధ చేయడం వలన కళ్ళు తిరుగుతాయి. లావుగా ఉన్నవారు నిద్రలేవగానే ఉలిక్కిపడినట్లు ఒక్కసారే మంచం నుండి లేచి నుంచుంటే అలాంటప్పుడు తల ఊపినట్లు, కళ్ళు తిరిగినట్లు అవుతుంది. నిద్రలేచిన తరువాత ఒక నిముషం కూర్చొని లేవడం మంచిది. ఎక్కువ సేపు క్రింద కూర్చున్నవారు ఒక్కసారే లేచి వెంటనే నడిచే కంటే ఒక్క నిముషం నుంచొని కాసేపు తేరుకున్న తరువాత కదలడం మంచిది. ఉపవాసంలో మనలోని శక్తి అంతా లోపల రిపేరు కార్యక్రమంలో నిమగ్నమైయున్నందువల్ల బాహ్యంగా మన కదలికలకు ఆ శక్తి రావడానికి మాములు కంటే కొద్దిగా ఎక్కువ సేపు పడుతుంది. ఆ శక్తి అందడం ఆలస్యం అవ్వడం వలన కొద్దిగా కళ్ళు తిరగడం, తల ఊపడం ఉపవాసంలో ఎవరికైనా అనిపిస్తాయి. కొంత మందికి ఎనిమా చేసుకొని లేచేటప్పుడు అనిపిస్తే, మరికొందరకు విరేచనం దగ్గర 15 నిముషాలు కూర్చొని లేచేటప్పుడు ఉంటుంది. వాంతి అయిన తరువాత కొంతమందికి అనిపించవచ్చు. కళ్ళు తిరిగి పడి తలబద్దలు కొట్టుకునే కంటే విషయం తెలిసింది కాబట్టి ముందే జాగ్రత్త పడటం మంచిది. ఎవరైనా సరిగా తేనెనీళ్ళు త్రాగక కళ్ళు తిరిగిపడిపోతే, చూసిన వారందరూ ఉపవాసాలు చేస్తే ఇలా కళ్ళు తిరిగి పడిపోతారనుకుంటారు. ఆయన తప్పు అని ఎవరూ అనుకోరు. మన ద్వారా వైద్యానికి చెడ్డ పేరు రాకుండా చూడటం కూడా మన బాధ్యతే. మంచినీరు సరిగా త్రాగక పోయినా కళ్ళు తిరిగే అవకాశముంది. కళ్ళు తిరగకుండా జాగ్రత్త పడండి. ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోతే నీళ్ళు కొట్టి లేపి కొద్దిగా తేనె నాకిస్తే సరిపోతుంది.
7. కడుపులో మంట: ఉపవాసంలో జీర్ణాది రసాలు తయారవడం ఆగిపోతాయి. ఉపవాసంలో ఉన్న వారికి ఆహారం మీద కోరికలు పుట్టినా, తిండి గురించి ఎక్కువగా ఆలోచించినా, కోపం, టెన్షన్ మొదలగునవి వచ్చినా మరలా ప్రేగుల్లో కొంత యాసిడ్లు తయారయ్యే అవకాశముంటుంది. కొంత మందికి ఉపవాసం ప్రారంభమయినప్పటికీ ప్రేగుల్లో రసాలు ఊరడం ఆగవు. అందువలన కడుపులో కొద్దిగా మంటగా అనిపిస్తుంటుంది. తేనె నీళ్ళు త్రాగిన తరువాత అరగంట వరకు మంట లేకుండా తరువాత మంట మరలా ప్రారంభమవుతుంది. నీళ్ళు త్రాగిన కాసేపు మంట తగ్గి మరలా మొదలవుతుంది. ప్రేగుల్లో ఉన్న యాసిడ్లు పూర్తిగా పోవడానికి గోరువెచ్చని నీరు త్రాగి వాంతి చేసుకోవచ్చు. గోరువెచ్చటి నీటిలో కొద్దిగా ఉప్పు కూడా వేసి చేసుకొంటే తేలిగ్గా ఉంటుంది. ఆలా మంట వచ్చినప్పుడు గోరువెచ్చటి నీటిలో తేనె కలుపుకొని (నిమ్మకాయ ఇబ్బంది అనిపిస్తే మానవచ్చు). మెల్లగా త్రాగితే మంచిది. అలాగే మంచినీరు కూడా గోరువెచ్చటిది త్రాగవచ్చు. అవసరమైతే రెండు పూటలా వాంతి చేయడం వలన తేలిగ్గా ఉంటుంది. రెండు పూటలా పొట్టమీద మట్టి పట్టీలు వేయడం మంచిది. ఇంకా మరీ మంట తగ్గకపోతే కొబ్బరి నీరు గానీ, లేదా పలుచటి మజ్జిగ గానీ రెండు మూడుసార్లు త్రాగవచ్చు. ఒకటి, రెండు రోజులు అలా చేస్తే కడుపులో మంట పూర్తిగా తగ్గిపోతుంది. అంతేగానీ మంట తగ్గాలని పాలుగానీ, ఏదన్నా తింటంగానీ చేయరాదు. మంట తగ్గాక మరలా తేనె నీళ్ళతో ఉపవాసాలు సాగించవలసిందే. ఉపవాసంలో ఆలోచనలు సక్రమంగా ఉంటే ఇలాంటి ఇబ్బందులు ఉండవు.
8. ఎక్కిళ్ళు, వికారం, వాంతులు: ఉపవాసంలో మనం త్రాగే మంచినీళ్ళు, తేనె నీళ్ళకు ముందుగా మన లివరులోని చెడు ఎక్కువగా కదులుతుంది.అలాగే ప్రేగుల్లో ఉన్న చెడు కూడా నీటికి బాగా కదులుతుంది. ఉపవాసంలో ప్రేగులలో జీర్ణాదిరసాలు తయారైతే, వాటిని నెట్టి వేయడానికి మనకు వికారం అనిపిస్తుంది. లివరులో ఉన్న చెడు అంతా కదిలితే ఆ చెడు లివరు నుండి వచ్చే పైత్యరసంలో కలిసి ప్రేగులలోనికి చేరుతుంది. ఆహరం లేకుండా ప్రేగులలోనికి వచ్చిన పైత్యరసం వలన మనకు కొద్దిగా మంటగా ఉండి, పుల్లత్రేన్పులు వస్తూ వికారంగా ఉంటుంది. లివరులో చెడు ఎక్కువ ఉన్న వారికి, లివరు జబ్బులున్న వారికి ఉపవాసంలో ఎక్కువ వికారాలు వస్తుంటాయి. ప్రేగులలోనికి ఇలాంటి రసాలు వచ్చినప్పుడు మనకు ఏమీ తొయ్యదు సరిగదా పొట్టంతా ఉబ్బుతుంది. ఆయాసంగా కూడా అనిపిస్తుంది. కొంతమందికి కడుపులో గుడగుడలు ఎక్కువగా అనిపిస్తాయి. ప్రేగులలోనికి వచ్చిన చెడు అంతా వాంతుల రూపంలో బయటకు పోవలసిందే. వాంతి అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు గోరువెచ్చటి నీటిని 4 లేదా 5 గ్లాసులు గబగబా త్రాగేసి, రెండు వేళ్ళు నోట్లో పెట్టుకొని వాంతి చేసుకొంటే వెంటనే హాయిగా ఉంటుంది. మాములు నీటికి వాంతి సరిగా అవ్వకపోతే గోరువెచ్చటి నీటిలో అరస్పూను ఉప్పు వేసుకొని త్రాగి వాంతి చేసుకొంటే పూర్తిగా ఆ పసరంతా బయటకు పోతుంది. వేళ్ళు పెట్టి వాంతి చేసుకునేటప్పుడు గోళ్ళు గొంతులో పొడుచుకొని ఎవరికన్నా కొంచెం రక్తం వాంతి నీళ్లలో రావడం జరుగుతుంది. వాంతిలో రక్తం పడిందని కంగారు పడతారు. వేళ్ళు గొంతులో పొడుచుకోకుండా వాంతి చేసుకోవాలి. ఉప్పు నీరు బాగా పొట్ట నిండా త్రాగితే గానీ వాంతిరాదు. ఉప్పు నీరు వాంతిలో తిరిగి బయటకు రాకపోతే వెంటనే నీళ్ళ విరేచనాలు అవుతాయి. ఉప్పు నీళ్ళు త్రాగినప్పుడు పూర్తిగా వాంతిలో అన్నీ బయటకు వచ్చేటట్లు చూసుకోవాలి. వికారాలు తగ్గడానికి లివరు మీద వేడి నీటి కాపడాలు పెట్టి తరువాత మట్టి పట్టీలు వేస్తే మంచిది. రెండు పూటలా చేయవచ్చు.
వికారం ఉన్నంత సేపూ మనకు తేనె నీళ్ళు, మంచి నీరు అసలు త్రాగబుద్ధి వేయదు. వికారం వచ్చాక తలనొప్పి ప్రారంభిస్తుంది. వాంతి అయితేగానీ మనస్సుకు కుదురుండదు. వాంతి అయ్యాక తేనె నీళ్లు, మంచి నీరు ఇష్టం లేకపోతే కొద్దిగా కొబ్బరి నీరు త్రాగవచ్చు. అప్పుడప్పుడు నీరసం తగ్గడానికి కొద్దిగా తేనెను నాకవచ్చు. వాంతులు అయ్యాక ఎవరికన్నా గొంతులో మంట నొప్పి కొద్దిగా అనిపిస్తాయి. పొట్టలో కొద్దిగా మంట అనిపిస్తుంది. అలాంటప్పుడు ఒక గ్లాసుడు మజ్జిగ త్రాగితే బాగుంటుంది. రోజుకి రెండు మూడు సార్లయినా వాంతి చేసుకొని ప్రేగుల్లోని పసర్లను పూర్తిగా బయటకు తీయగలిగితే చాలా హాయిగా ఉంటుంది. మాములుగా వాంతులయితే నీరసంగా ఉంటుంది. అలాంటిది ఉపవాసంలో అయ్యే వాంతులు వల్ల నీరసం ఉండదు. వాంతి చేసుకున్నాక నీరసం తగ్గి, శక్తితో ఉంటాము. రోజుకి ఐదు లేదా ఆరుసార్లు వాంతులయినా కంగారు పడనక్కర్లేదు. మరీ వాంతులు ఆగక కడుపులో మంటగా ఉంటే కొద్దిగా దానిమ్మకాయ గింజలను మెల్లగా నమిలి రసం మింగి పిప్పి ఊసి వేస్తే వాంతులు ఆగుతాయి. తరువాత రోజు నుండి మరలా తేనె నీళ్ళతో ఉపవాసం మాములే. వికారంగా ఉన్నప్పుడు నీళ్ళు ఒక్కసారే ఎక్కువ తాగకుండా కొద్దిగా త్రాగితే బాగుంటుంది.
లివరులో రిపేరు జరుగుచున్నప్పుడు అక్కడ చెడు కదలక పోతే దానిని కదపడం కొరకు ఉపవాసంలో ఎక్కిళ్ళు వస్తాయి. మాములు రోజులలో ఎక్కిళ్ళు నీళ్ళు త్రాగితే తగ్గుతాయి. కానీ ఉపవాసంలో ఎక్కిళ్ళు తేనె నీళ్లు త్రాగినా, మంచినీరు త్రాగినా తగ్గవు. ఎక్కిళ్ళు వచ్చిన ప్రతిసారి ఎక్కి పడినప్పుడల్లా లివరులో సంకోచాలు వచ్చి (కన్ ట్రాక్షన్స్) అక్కడ చెడు బాగా కదులుతుంది. ఎక్కిళ్ళు వచ్చేటప్పుడు వాంతి చేసుకొంటే, వాంతి అయిన తరువాత గంట రెండు గంటలకు ఎక్కిళ్ళు ఆగుతాయి. కొంతమందికి మళ్ళీ ప్రారంభమవుతాయి. లివరు మీద చికిత్సలు చేసినప్పటికీ ప్రయోజనముండదు. దానంతటవి ఆగవలసిందే. ఎవరికోగానీ ఉపవాసంలో ఎక్కిళ్ళు రావు. ఒక్కొక్కరికి రోజంతా అనిపిస్తాయి. రెండు మూడు సార్లు వాంతి చేయడమే మార్గము.
ఉపవాసంలో ఇలా అనిపించవచ్చు:
1. ఉపవాసం ప్రారంభించిన మొదట రెండు నుండి నాలుగైదు రోజులలో ఉపవాసం అలవాటు లేని కారణంగా తలనొప్పి, నీరసం, ఆకలి, తినాలనిపించడం, తేనెనీళ్ళు, మంచినీరు బాగో పోవడం మొదలగునవి అనిపించి ఉపవాసాన్ని మానివేద్దామని ఎక్కువ మందికి అనిపిస్తుంది. మొదట్లో వచ్చిన ఈ ఇబ్బందులకుగానీ, ఆలోచనలకు గానీ ఉపవాసాన్ని ఎవరన్నా విరమించినట్లైతే, మరలా ఉపవాసాన్ని ఎప్పుడు ప్రారంభించాలన్నా ఇలాంటివి అన్నీ వస్తాయేమోనని భయపడతారు. మొదట్లో నాలుగు రోజులు ఓపిక పడితే చిన్న చిన్నవి అన్నీ సర్దుకుపోతాయి. అక్కడ నుండి చెడు కదలడం ప్రారంభమవుతుంది. పైన వచ్చిన ఇబ్బందులన్నీ ఆ రోజు నుండి ఆగిపోతాయి. పిల్లవాడు మొదట్లో స్కూలుకు వెళ్ళేటప్పుడు అలవాటు లేక నాలుగైదు రోజులు పేచీలు పెడతాడు. ఐదు ఆరు రోజులు స్కూలుకు వెళ్ళడం అలవాటు అయితే ఏడవ రోజు నుండి గొడవ లేకుండా వెళతాడు. ఐదు లేదా ఆరు రోజులు ఉపవాసం అలవాటు అయితే మీరు కూడా పిల్లవాడిలా ఏడవ రోజు నుండి ఉపవాసం మానకూడదనిపిస్తుంది.
2. ఐదు, ఆరు రోజులు ఉపవాసాలు గడిచాక రోజు రోజుకీ గాలిలో తేలిపోతున్నట్లు మనలో చెడు అంతా (రోగాలు) వదిలిపోతున్నట్లు, ఇప్పటికి మన శరీరానికి విముక్తి వస్తున్నట్లు అనిపిస్తుంది. అప్పటి నుండి ఈ ఉపవాసాలలో బ్రతికినన్నాళ్ళు తేనె నీళ్లతోనే ఉండిపోతే చాలా బాగుంటుంది. ఉండిపోదాం అనిపిస్తుంది. ఇన్నాళ్ళు ఉపవాసాల గురించి మనం ఎందుకు తెలుసుకోలేక పోయామని, మనమెందుకు చేయలేదని, గవర్నమెంటు ఈ ఉపవాసాల గురించి ఎందుకు ప్రచారం చేయడంలేదని, పశ్చాత్తాపపడతారు. కనపడ్డ వారందరి చేత, తెలిసిన వారందరిచేత ఉపవాసాలు చేయించాలని ఊపు వస్తుంది. ఇలా సంతోషంగా ఉన్న సమయంలో ఏ విరేచనాలో, వాంతులో, కడుపునొప్పో వస్తే పైవన్నీ మరచి ఉపవాసాన్ని విరమించి తింటే తగ్గిపోతాయో మోనని కూడా ఆ మనిషికి అనిపిస్తుంది. ఉపవాసంలో ఆనందంగా, సంతోషంగా ఉన్నా పొంగిపోకూడదు. అలాగే ఏదన్నా చిన్న ఇబ్బంది వచ్చినా క్రుంగి పోకూడదన్నమాట. ఉపవాసంలో మనస్సు ఆ విధంగా ఉంటేనే మీరు ఉపవాసాన్ని సంపూర్ణంగా పూర్తి చేయగలరు. మనస్సు పొంగి పోయినా, క్రుంగి పోయినా మరు నిముషం శరీరంలో రక్తాన్ని పాడు చేసే హార్మోనులు ఉత్పత్తి అయ్యి, తరువాత ఒకటి రెండు రోజులు మనస్సును పాడుచేస్తాయి. ఇలాంటి ఆపద మీకు రాకుండా చూసుకోండి.
3. మాములు రోజులలో మనకు విరేచనాలు అయినా, తలనొప్పి వచ్చినా, కడుపులో మంట వచ్చినా, వెంటనే ఏదన్నా ఆహరం పొట్ట నిండా తింటే తగ్గిపోతుందని అందరూ అలా తినివేస్తుంటారు. ఆహారం తిన్న వెంటనే వచ్చిన ఆ ఇబ్బంది సర్దుకోవడం అన్నది నిజమే. కానీ ఉపవాసంలో ఇబ్బందులు వచినప్పుడు తింటే మనలో చెడు (రోగాలు) పోవడం ఆగడమేగాక, ఆహారం తిన్నందుకు కొత్త ఇబ్బందులు వస్తాయి. ఉపవాసంలో వచ్చే ఇబ్బందులను ఉపవాసం ద్వారానే (అలా కొనసాగించడం) తగ్గించుకొనే ప్రయత్నం చేస్తే శరీరం పూర్తిగా శుభ్రం అవుతుంది. వచ్చిన నెప్పులకు, వాంతులకు బయపడి ఉపవాసాన్ని మానివేస్తే, మరలా ఎప్పుడూ ఉపవాసం యొక్క ఉపయోగాన్ని మీరు జీవితంలో పొందలేరు. ఆ బెదురు మీకు అలానే ఉండిపోతుంది. వాటిని అధిగమించి ఉపవాసాన్ని ఎక్కువ రోజులు చేయగలిగితే, ఆహారం లేకపోయినా ఎన్నిరోజులైనా ఉండగలం అన్న గట్టి నమ్మకం కలుగుతుంది. మరలా ఎప్పుడైనా మీ ఇంట్లో మీరు ఉపవాసాలు చేసుకోవడానికి వెనుకాడరు.
4. పది పదిహేను రోజులు రోజూ తేనె నీళ్ళు త్రాగి త్రాగి బోరు కొట్టి, లేదా విరక్తి వచ్చి లేదా మొఖం మొత్తి (వెగటు పుట్టి) తేన్నీళ్ళంటే భయం వేస్తుంది. ఇలా కొంతమందికి అనిపించవచ్చు. తేనె నీళ్ళు మాని పళ్ళ రసాలలో ఎక్కువ రోజులు ఉపవాసాలు చేద్దామని వారికి అనిపిస్తుంది. తేనె నీళ్ళతో ఉపవాసాలలో శరీరం శుభ్రం అయినట్లు పళ్ళ రసాలలో అవ్వదు. పళ్ళ రసాలలో ఎక్కువ ఆకలి పుట్టడం కారణంగా ఎక్కువ రోజులుండలేరు. తేనె నీళ్ళతో ఉపవాసాలు చేయగలిగినన్ని రోజులు చేయడమే మీకు ఉపయోగం. ఉపవాసంలో తేనె నీళ్ళను మీరు రుచికి త్రాగడం లేదు. తేనె నీళ్ళు త్రాగేటప్పుడు ఆ రుచి మీద మీరు మనస్సు పెట్టకుండా ముందుగా త్రాగడం మొదటి రోజు నుండి అలవాటు చేసుకుంటే మంచిది. ముందు రోజుల్లో రుచిగా ఉన్నాయి అనుకుంటే అవి అలవాటు అయ్యాక ఆ రుచి పోయి త్రాగడానికి ఇబ్బందిగా ఉంటుంది. తేనె త్రాగలేక ఉపవాసాన్ని విరమించే ప్రయత్నం చేయకూడదు. ఆలా అని బలవంతంగా కూడా త్రాగకూడదు. అలా త్రాగితే అవి శరీరానికి ఉపయోగ పడవు. మనస్ఫూర్తిగా ప్రయత్నం చేసి త్రాగాలి.
5. ఉపవాసాలలో కొంతమందికి ఎక్కువ రోజులు చేసినప్పటికీ ఇంకా ఆకలి వేయదు. ఎన్ని రోజులు చేసినా అలానే ఉండేసరికి, అసలు ఆకలి పూర్తిగా చచ్చిపోయిందేమోనని వారు కంగారు పడుతూ ఉంటారు. ఉపవాసంలో ఆకలి ఎన్నడూ చావదు. ఇంకా శుభ్రం అవ్వాల్సింది చాలా ఉండి ఆకలి అవ్వడం లేదు. ఆకలయ్యేవరకూ వేచియుండటమేగానీ కంగారు పడి, భయపడి ప్రయోజనముండదు. కొందరికి ఆకలి పుట్టడానికి వారం రోజులు పడితే మరికొందరికి 50 నుండి 60 రోజులు కూడా పట్టవచ్చు.
6. కొంత మందికి ఒక్కో రోజు ఉపవాసంలో మాట గట్టిగా రానట్లు, కళ్ళు మసకలుగా ఉన్నట్లు, చెవులు గళ్ళు పడినట్లు, కాళ్ళు తేలిపోతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు రెండు మూడు సార్లుగా తేనెను త్రాగితే సర్దుకొనిపోతాయి. అంతేకాని మనకు లోపల ఏదో అయిపోతున్నదేమోనని ఆదుర్దాపడనక్కరలేదు.
7. మనకు ఉపవాసంలో వచ్చే చిన్న చిన్న ఇబ్బందులకు ప్రకృతి చికిత్సలు ముందుగా అన్ని విధాల ప్రయత్నం చేస్తాము.రోగం యొక్క తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఒక్కోసారి మనం చేసే సహజమైన చికిత్సలు ఉపవాసంలో ఉపశమనాన్ని ఇవ్వలేకపోవచ్చు. అలాంటప్పుడు వాటి నుండి బయటపడి ఉపవాసాన్ని కొనసాగించడానికి మనం వేరే వైద్య విధానాల యొక్క సహాయాన్ని ఉపయోగించుకోవచ్చు. అంతేకాని మనం ప్రకృతి వైద్యాన్ని చేస్తున్నాము, మందుల జోలికి మరలా వెళితే ఇంకా ప్రయోజనం ఏముంది అనుకుంటే అది పొరపాటే. మందులు ఉపవాసంలో వాడవచ్చా లేదా అని చాలా మంది భయపడతారు. మీరు ఏ వైద్య విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ మరీ ఇబ్బంది ఓర్చుకోలేకుండా ఉన్నప్పుడు లేదా పరిస్థితి ప్రాణం మీదకు వచ్చినప్పుడు అల్లోపతి (ఇంగ్లీషు) మందులను తప్పనిసరిగా అందరం వాడవలసిందే. అలా ఇబ్బంది వచ్చినప్పుడు మనం మందును వాడకపోతే మనం తప్పుచేసిన వారమౌతాము. అన్ని వైద్య విధానాలు మనల్ని రకరకాల ఇబ్బందుల నుండి బయటపడవేసి, ఆరోగ్యాన్ని ఇవ్వడం కొరకే ఉన్నాయి. చుట్టం చూపులా మందులను వాడాలేగానీ స్నేహితులలాగా మందులతో జీవితం అంతా స్నేహం చేయకూడదు. అప్పుడు వాటివల్ల ప్రమాదముండదు. మందును మందుగానే చూడండి. ఉపవాసంలో అవసరమైతే ఎలాంటి మందునైనా వాడవచ్చు. దానివల్ల, వచ్చిన ఇబ్బందులతో ఉపవాసాలు ఆగిపోకుండా ముందుకు వెళ్ళటానికి మందులు సహకరించగలవు.
8. ఉపవాసాలు చేస్తుండగా మధ్యలో ఎవరికన్నా జ్వరం వస్తుంది. జ్వరం తగ్గడానికి మందులు వాడకూడదు. తేనె నీళ్ళు కొద్దిగా త్రాగడం తగ్గించి, మంచినీరు ఎక్కువగా తీసుకొంటే ఒకటి రెండు రోజులలో జ్వరం దానంతటదే తగ్గిపోతుంది. ఉపవాసంలో జ్వరం రావడం వలన శరీరంలోని చెడు ఇంకా త్వరగా కదులుతుంది.
9. మా దగ్గర వంద మంది ఉపవాసాలు చేస్తే వారికి ఉపవాసం చేస్తున్న సమయంలో వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు ఎంత శాతం మందికి ఏఏ ఇబ్బందులు (సుమారుగా) వస్తుంటాయో తెలుసుకుందాం.
వచ్చే ఇబ్బంది శాతం
1. తల కొద్దిగా భారం - 25 %
2. తలనొప్పి - 60 %
3. విరేచనాలు - 30 %
4. వాంతులు - 40 %
5. వికారం - 40 %
6. కడుపులో మంట - 10 %
7. కడుపు నొప్పి - 25 %
8. కడుపులో గుడగుడలు - 25 %
9. నోరు చేదు - 80 %
10. కళ్ళు తిరగడం - 5 %
11 ఎక్కిళ్ళు - 2 %
12. జ్వరం - 8 %
13. పడిపోవడం - 1 %
14. తేపులు - 10 %
15. నీరసం - 5 %
16. తినాలనిపించేవారు - 8 - 10 %
17. ఆకలయ్యేవారు - 5 %
18. కళ్ళు మసకలు - 2 %
19. మాట తగ్గడం - 10 %
20. చెవులు గళ్ళు (దిబ్బళ్ళు పడడం) - 5 %
21. వాసనలు - 70 % (మలం, మూత్రం, చెమట)
పైన చెప్పిన ఇబ్బందులు ఏమీ ఉపవాసంలో అసలు రాని వారు - 30 %
ఎండలో నుండి వచ్చిన వారికే నీడలో ఎక్కువ సుఖముంటుంది. ఉపవాసంలో అసలు ఇబ్బందులు ఏమీ రాని వారి కంటే ఏమైనా ఇబ్బందులు ఒకటి అర వచ్చి తగ్గిన వారికే సుఖం ఎక్కువగా ఉంటుంది. పైన చెప్పిన ఇబ్బందులన్నీ ఒక్కరికే వస్తాయని హడలిపోకండి. మన శరీరతత్వాన్ని బట్టి, లోపల ఉన్న చెడును బట్టి ఎవరికి ఏమి వస్తాయో తెలియదు. నూటికి 70 శాతం మందికి పైన చెప్పిన వాటిలో ఏవో రెండు మూడు రకాల ఇబ్బందులు ఉపవాస కాలంలో వచ్చిపోతుంటాయి. పైన చెప్పిన ఇబ్బందులు మినహా ఉపవాసంలో వచ్చేవి ఇంకేమీ లేవని చెప్పాలి. మనిషికి ఎన్నిరకాల జబ్బులున్నప్ప్పటికీ, ఉపవాసంలో ఇవికాక ఇంకా వేరేవి ఏమైనా వస్తాయేమోనని సందేహించనక్కర్లేదు. మనం ఉపవాసాలు చేస్తున్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు వస్తే అవి చూసి, మనప్రక్కవారో, ఇంట్లోవారో, బంధువులో ఎందుకొచ్చిన తిప్పలు అని మనలను విరమింపజేయటానికి ప్రయత్నం చేస్తారు. వారికి మనం అన్ని విధాలా మంచి, చెడు తెలియజేసి ఉపవాసాల మీద చెడు అభిప్రాయం వారికి కలగకుండా చూసే బాధ్యత మన అందరికీ వుంది.

17. ఉపవాసంలో నిద్ర ఎలా పడుతుంది?

ఉపవాసం ప్రారంభించే ముందు ప్రతి ఒక్కరికీ ఈ సందేహము కలుగుతుంది. ఉపవాసంలో ఆహారం ఉండనందు వల్ల నిద్ర సరిగా పట్టదని ముందు నుండి బెంగ మనిషికి ఎక్కువగా ఉంటుంది. నాగరికత పెరిగిన దగ్గర నుండి మనిషి ప్రతి రోజూ రాత్రి పూట ఆహారాన్ని తిని పడుకోవడానికి అలవాటు పడ్డాడు. రాత్రి పూట భోజనం చేసినప్పటికీ పడుకోవడం ఆలస్యమయ్యి మరలా ఆకలయితే, మళ్ళీ కొద్దిగా ఆ పొట్టను నింపి పడు కొనేవారు కొందరైతే, ఎక్కడ ఆకలయితే, రాత్రికి నిద్ర సరిగా పట్టదని పడుకొనే వరకు భోజనం చేయకుండా ఆగి పడుకొనే ముందు మాత్రమే భోజనం చేసి పడుకొనే వారు కొందరు. ఈ విధంగా శరీరాన్ని అలా అలవాటు చేయడం వలన అలా అనిపిస్తుంది గానీ నిజానికి నిద్రకు, పొట్టకు ఏమీ సంబంధం లేదనే చెప్పవచ్చు. మన పూర్వీకులు వెలుతురుండగానే భోజన కార్యక్రమాలు పూర్తిచేసి, ఆ ఆహారం అరిగాక గానీ పడుకొనే వారు కాదు. మరి వారికి నిద్ర అసలు పట్టకుండా పోయేదంటారా? వారందరూ పడుకొన్న వెంటనే నిద్రలోనికి వెళ్ళిపోయేవారు. సుఖ నిద్ర అంటే కష్టపడి పనిచేసిన వారికి తెలుస్తుంది. మత్తు నిద్ర అంటే పొట్ట నిండా తిని పడుకున్న వారికి తెలుస్తుంది.
మనిషికి పొట్ట ఖాళీగా ఉండే సరికి ఏదో ఒకటి తినడం అలవాటు. అదే ఉపవాసంలో ఉండగా మొదట రెండు మూడు రోజులు ఆకలయ్యి, తినాలనిపించడంతో ఆలోచనంతా దాని మీద ఉండిపోతుంది. మనస్సు, ఆలోచనలన్నీ పొట్టమీద ఉండి కోరికలు తీరకపోయేసరికి ఆ మొదటి రెండు మూడు రోజులు కొంత మందికి నిద్ర సరిగా పట్టదు. నాలుగవ రోజు నుండి ఆకలి తగ్గడం, తినాలనిపించక పోవడం మొదలగునవి ఉండటంతో కోరికలు పోయి, ఆలోచనలు పొట్టమీద లేక నిద్ర సుఖంగా పడుతుంది. అసలు ఆకలవ్వని వారికో, శరీరం బాగా నీరు పట్టిన వారికో విరేచన బద్ధకం బాగా ఉన్నవారికో అయితే ఉపవాసం ప్రారంభించిన మొదటి రోజున ఎనిమా చేయడం ద్వారా ప్రేగులోని బరువు ఎక్కువగా తగ్గి, మొదటి రోజు నుండి ఎప్పుడూ ఎరుగని సుఖ నిద్ర వారికి పడుతుంది. వీరికి ఆకలి లేక కోరికలు ఉండనందువల్ల పడుకొన్న వెంటనే నిద్రపడుతుంది. రకరకాల దీర్ఘ రోగాలున్న వారు, రోజూ నిద్రసరిగా పట్టని వారు మరియు శరీరంలో బాధల కారణంగా మత్తు బిళ్ళలు వేసుకునే వారికి మొదటి రెండు రోజులు నిద్రసరిగా పట్టక పోవచ్చును. మొదటి రెండు రోజులు విసర్జన క్రియ ప్రారంభమవ్వనందువల్ల ఈ మార్పు వస్తుంది. మూడవ రోజు నుండి మాలీషు, ఆవిరి స్నానం మొదలైనవి చేయడం ద్వారా చాలా చక్కటి నిద్రపట్టడం ప్రారంభమవుతుంది. శరీరం నుండి వ్యర్ధపదార్థాలన్నీ పూర్తిగా కదిలి బయటకు రావడం ప్రారంభమవ్వడం వలన శరీరం రోజు రోజుకి ఉపవాసంలో తేలిక అవుతూ ఉంటుంది. దీని కారణంగా మంచి నిద్ర ప్రతిరోజూ ఉపవాసంలో పడుతుంది. రాత్రిపూట పెందలకడనే నిద్రరావడం ఉపవాసంలో జరుగుతుంది. అలాగే కొద్దిగా తెల్లవారుజామునే మెలకువ రావడం కూడా జరుగుతుంది.
ఉపవాసం ప్రారంభమయిన 4, 5 రోజులలో గురక వచ్చే వారికి గురక రావడం పూర్తిగా ఆగుతుంది. పొట్ట ఖాళీగా ఉండడం వలన, ఉపవాసంలో ఎక్కువ ప్రాణశక్తి ఊపిరితిత్తుల నిండా అందడం వలన కలతలు లేని నిద్ర పడుతుంది. రోజు రోజుకీ శరీరంలోని అవయవాలన్నీ వాటి భారాన్ని వదిలించుకొంటూ తేలికపడుతూ ఉంటాయి. ఉపవాసానికి ముందు ఆ చెడును కదపడానికి రాత్రిపూట శరీరం ఎక్కువగా కష్టపడి పనిచేస్తూ ఉంటుందేగానీ పూర్తిగా విశ్రాంతి తీసుకోలేదు, కానీ ఇప్పుడు ఆ చెడు అంతా కదిలి వెళ్లిపోవడంతో, శరీరం అంతా తేలికగా అయ్యి, చక్కటి విశ్రాంతిని తీసుకొంటూ, చక్కటి నిద్రను మనకు అందిస్తూ ఉంటుంది. ఆహారం తింటున్న రోజులలో కంటే గాఢనిద్ర ఉపవాసంలో పడుతుంది అని ఎక్కువ మంది వారి అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు. పొట్టనిండా ఆహారం తిన్నప్పుడు పొట్టవద్దకు ఆహారాన్ని అరిగించడానికి ఎక్కువ రక్తం, ఎక్కువ శక్తి అక్కడకు చేరుకుంటుంది. అందువలన భోజనం చేసిన వెంటనే మనకు మత్తుగా ఉంటుంది. అప్పుడు వచ్చే నిద్ర మత్తు నిద్ర అవుతుంది. శరీరం పూర్తిగా విశ్రాంతి తీసుకునేటప్పుడు వచ్చేనిద్ర సుఖ నిద్ర లేదా గాఢ నిద్ర అవుతుంది. మత్తు నిద్రలో కలతలు ఎక్కువగా వస్తుంటాయి. సుఖనిద్రలో అలాంటివి ఏమీ ఉండవు. మనకు ఉపవాసంలో పట్టే నిద్ర సుఖ నిద్ర లేదా గాఢ నిద్ర అనవచ్చు. ఉపవాసంలో నిద్రపట్టదేమోనని బెంగపెట్టుకుని ఉపవాసాలను చేయడం మానకండి. నిద్రపట్టకపోతే నిద్ర పట్టే విధంగా చిట్కాలు చెబుతాములెండి. ఉపవాసాన్ని అందరూ ప్రారంభించండి. నిద్రపట్టక పోతే రాత్రి పూట పడుకొనే ముందు వేడినీటి పాదస్నానం చేస్తే నిద్ర బాగా పడుతుంది. ఒక బేసిన్ లో గోరువెచ్చని కంటే వేడినీరు (మీరు భరించగలిగినంత వేడి) పోసి, మీరు కుర్చీలో కూర్చొని పాదాలను రెండిటినీ అందులో ముంచి యుంచాలి. అలా 15 నిముషాలు చేస్తే సరిపోతుంది. పాద స్నానం చేసేటప్పుడు తలమీద కొద్దిగా చల్లటి బట్ట వేసుకొంటే మంచిది. ఆ తరువాత పాదాలను నాలుగు చెంబుల చల్లటి నీటితో కడుక్కొని తేనె నీళ్లు త్రాగి పడుకొంటే మంచి నిద్రపడుతుంది.
నిద్ర ఇంకా పట్టక పోతే రెండు కళ్ళల్లో రెండు తేనె చుక్కలు వేసుకొంటే నిద్ర వెంటనే వచ్చేస్తుంది. కంటిలో తేనె వేస్తే నిద్ర ఎలా వస్తుందని ఆశ్చర్యపోతున్నారా? లేదా ప్రతిదానికీ తేనె అంటున్నానని ఆలోచిస్తున్నారా? తేనె చిక్కటి ద్రావణం, అది కంటిలోపడ్డ వెంటనే కళ్ళు మండుతున్నప్పుడు ఆ తేనెను పలుచబరచడానికి ఎక్కువ నీరంతా కంటిలోనికి వచ్చేస్తుంది. అదీగాక కంటిలో పడ్డ వెంటనే తేనె చుర్రుమని కొద్దిసేపు మండుతుంది. ఆలా కళ్ళు మండుతున్నప్పుడు మన ఆలోచనలు, మనస్సు (నిద్ర పట్టక పోవడానికి కారణమైన ఆలోచనలు) ఉన్నట్లుండి అటునుండి ఇటు మంటపై కేంద్రీకృతమై నిలుస్తాయి. ఆ మంట కొద్దిగా తగ్గే వరకు మన ఆలోచనలు వేరే విధంగా మళ్ళవు. అంతలో తెలియకుండానే నిద్రలోనికి జారుకోవడం జరుగుతుంది. కళ్ళు మండుతాయన్నానని బెదురు తున్నారా? తేనె వేయడం వలన కంటికి ఏమీ అపకారం జరుగదు. భరించరాని ఇబ్బంది ఏమీ ఉండదు లెండి! ప్రయతించవచ్చు. ఉపవాసాలలో పట్టే నిద్ర గాఢంగా ఉండడం వలన ఎక్కువ గంటలు పడుకోవలసిన అవసరం రాదు. తిండి తినేటప్పుడు పట్టే మత్తు నిద్ర ఎక్కువ గంటలు నిద్రపోతేగానీ శరీరానికి శక్తిరాదు. అందువలన ఉపవాసంలో పట్టే నిద్రను స్వచ్ఛమైనదిగా, అసలైనదిగా గుర్తించవచ్చు. అంత చక్కటి నిద్రను అనుభవించే అవకాశం ఉపవాసం చేసేవారికి మాత్రమే దక్కుతుందట. కావాలంటే మీరు ఉపవాసం చేసి చూడండి. మీకే తెలుస్తుంది.

18. ఉపవాసంలో ఆకలి ఎందుకు వేయదు?

ఏ రకమైన ఆహారం తినకుండా ఉండటమే ఉపవాసం. ఆహారాన్ని పూర్తిగా తినకుండా ఉంటే ఆకలి అవ్వక ఏమవుతుంది అని మీకు అనిపించవచ్చు. మీ చేత ఉపవాసం చేయించడానికి మేము మిమ్మల్ని నమ్మించడం కొరకు కూడా అలా చెప్పడం లేదు. తిన్న ఆహారం అరిగిన వెంటనే మరలా ఆకలి వేయడమనేది మాములు రోజులలో సామాన్యంగా జరిగే విషయం. అప్పటి మీ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని, అదే ఊహించుకుంటూ ఉపవాసంలో కూడా అలానే ఉంటుంది, అలా ఆకలి అయితే అప్పుడు ఏమి చేయాలి, ఏమి తినాలి? అని భయం మనిషికి ముందు నుండి ఉంటుంది. మీకు వచ్చే ఆ భయం ఎలాంటిదంటే అలవాటు లేని వారు చలిగా ఉన్నప్పుడు చల్లని నీరు స్నానం చేయడానికి వెనుకాడినట్లు ఉంటుంది. చలి, చలి అని చేతులో చెంబు పెట్టుకొని భయపడినంత సేపు చలిగానే ఉంటుంది. అలాగే ఆకలవుతుందేమో, ఆకలయితే తట్టుకోలేమేమో అని భయపడుతూ ఉపవాసం ప్రారంభించనంత కాలం ఆ భయం ఉంటుంది. దైర్యం చేసి స్నానం చేయడం ప్రారంభిస్తే ముందు రెండు చెంబులు పోసుకునేటప్పుడు చలిగా ఉంటుందిగానీ మూడవ చెంబు పోసుకునేటప్పుడే చలిలేనట్లగా అనిపిస్తుంది. అలాగే దైర్యం చేసి ఉపవాసం చేయడం ప్రారంభిస్తే, ముందు రెండు రోజులు కొద్దిగా ఆకలిగా ఉంటుందేగానీ, మూడవ రోజు నుండి ఉపవాసంలో ఆకలి లేనట్లుగా అనిపిస్తుంది. మూడు చెంబుల స్నానం పూర్తి అయ్యాక చలి తగ్గి, అప్పుడు చల్లనీళ్ళ మీద భయం పోతుంది. అలాగే మూడు రోజులు ఉపవాసం పూర్తి అయ్యాక ఆకలి తగ్గి, అప్పుడు ఉపవాసంలో ఆకలి భయం పోతుంది. నాలుగో చెంబు పోసుకునే సరికి పూర్తిగా చలితగ్గి, ఒంట్లో వేడి వచ్చి స్నానం ముందు కంటే కూడా స్నానం చేసేటప్పుడే వెచ్చగా హాయిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అలాగే ఉపవాసం నాలుగు రోజులు గడిచేసరికి పూర్తిగా ఆకలి తగ్గి, ఒంట్లో వేడి, శక్తి వచ్చి ఉపవాసం ముందు కంటే కూడా ఉపవాసం చేసేటప్పుడే ఏమీ తినక పోయినప్పటికీ ఆకలి లేకుండా శక్తిగా, హాయిగా ఉన్నట్లు అనిపిస్తుంది. చలిగా ఉన్నప్పుడు చల్లని నీరు పోసుకుంటే చలి తగ్గడానికి కారణమేమిటో తెలుసా! చల్లని నీరుకి చర్మం చల్లగా అవ్వకుండా మన శరీరంలోని రక్తాన్ని అంతా చర్మానికి పంపిస్తుంది మనలోని ప్రాణశక్తి. వేడిగా ఉన్న రక్తం చర్మానికి చేరే సరికి చర్మం వెచ్చగా అవుతుంది.
అలాగే తినేటప్పుడే రోజూ ఆకలయ్యి, అసలు తిననప్పుడు (ఉపవాసం) ఆకలి వేయక పోవడానికి కారణమేమిటో తెలుసా! మనం తిన్న ఆహారాన్ని అరిగించడానికి మన ప్రేగులో, పొట్టలో జీర్ణాది రసాలు తయారవుతాయి. మనం ఆహారాన్ని తినే టైం అయినప్పుడు, మనం ఆహారాన్ని తినబోతున్నామని మనస్సులో ఆలోచనలు ప్రారంభమయినప్పుడు, ఆహార పదార్థాల యొక్క వాసనలు వచ్చినప్పుడు నోటిలో, పొట్టలో జీర్ణాది రసాలు ఊరడం ప్రారంభిస్తాయి. ఆ రసాలు ఊరడం ప్రారంభమయిన దగ్గర నుండి ఆకలి ఆరాటం పెరుగుతుంది. ఆ ఆరాటం వచ్చిన దగ్గర నుండి మనస్సు మిగతా పనుల మీద శ్రద్ధ తగిస్తూ పొట్ట మీద శ్రద్ధ పెంచుకుంటుంది. ఆ సమయంలో నిముషాలు గంటలుగా గడుస్తుంటాయి. కొంత మందికి ఈ సమయంలోనే ఆకలి తిక్కరావడం కూడా చూస్తుంటాము. పొట్టలో తయారయ్యే జీర్ణాది రసాల యొక్క ప్రభావం మనస్సులో చెలరేగిన కోరికకు తోడైనప్పుడు వచ్చే ఆకలి బాధగా ఉంటుంది. ఆకలైనప్పటికీ మనస్సు పొట్ట మీదకు రాకపోతే ఆకలి తెలియదు. మనస్సు పనిలోగానీ, వేరే చోట గానీ లగ్నం అయ్యి ఉంటే ఆకలి అవ్వదు. దీనంతటికీ కారణం మనస్సు అన్నమాట. ఒక్క మనస్సు తోడనున్నది సకలము - తిక్కబట్టి నరులు తెలియలేరు, యిక్క మెరిగి నడువ నొక్కటే చాలురా, విశ్వదాభి రామ వినురవేమ. అన్న వేమన మాటలు నిజమే. సహజంగా ఆడవారు ఉదయం పూట ఆకలి అయినప్పటికీ ఆకలి మీద శ్రద్ధ కంటే భర్త, పిల్లవాడికి టిఫిన్లు, క్యారేజీలు సర్దుకోవడంలో ఉన్న శ్రద్ధ ఎక్కువ కాబట్టి ఆ సమయంలో ఆకలి గానీ నీరసం గానీ లేకపోవడానికి ఆ శ్రద్ధ, ఆ మనస్సే కారణం. అయితే మీకు కూడా ఉపవాసం చేయాలని గట్టి శ్రద్ధ, గట్టి మనస్సు ఉంటే ఉపవాసంలో ఆకలి ఇబ్బంది ఉండదన్నమాట. ఈ విధంగా మనస్సును గట్టి చేసుకున్న వారికి మొదటి రోజు నుండే ఉపవాసంలో ఆకలి అసలుండదన్నమాట. చల్లని నీరంటే భయంలేని వారికి మొదటి చెంబు పోసుకున్నప్పటికీ చలి అని అనిపించకపోవడం కూడా అలాంటిదే.
ఈ రోజు నుండి ఉపవాసం ప్రారంభిస్తున్నాము, ఏమీ తినకూడదని మనస్సులో అనుకొని ప్రారంభించినప్పటికీ, ఎక్కువ మందికి మొదటి మూడు రోజులు కొద్దిగా ఆకలనిపించడానికి గల కారణాలు ఏమిటో తెలుసుకుందాము. ఉపవాసం ఎనిమాతో ప్రారంభించి, ఉదయం నుండి తేనె + నిమ్మకాయ నీళ్ళు త్రాగడం ప్రారంభిస్తారు. మొదటి రోజు ఎనిమాలో ఎక్కువ విరేచనం బయటకు పోవడం జరుగుతుంది. దాని కారణంగా ఉదయం టిఫిన్ టైముకు రోజూ కంటే ఎక్కువ పొట్ట ఖాళీగా అనిపిస్తుంది. అలవాటు ప్రకారం టిఫిన్ టైము అయినప్పుడు మీకు రోజూ చేసే టిఫిన్లు గుర్తుకు వస్తే ఆ టైముకు జీర్ణాది రసాలు పొట్టలో, నోటిలో ఊరి కొద్దిగా ఆకలి అనిపిస్తుంది. టిఫిన్ టైమని గుర్తుకు రాని వారికి ఆకలి అనిపించదు. అప్పుడు తేనె నీళ్ళు త్రాగితే ఆకలి తగ్గిపోతుంది. మరలా భోజనం టైము అయినప్పుడు ఆ టైముకు మీకు ఆలోచన వస్తే కొద్ది రసాలు తయారయ్యి మరలా ఆకలనిపిస్తుంది. ఆలోచన లేని వారికి ఏమీ ఉండదు. అలాగే మరలా మధ్యాహ్నం టీ టైములో, సాయంత్రం భోజనం టైములో అలంటి ఇబ్బంది అనిపిస్తుంది. మనస్సు నిగ్రహం ఉన్న వారికి ఏమీ ఉండదు. ఉపవాసంలో మొదటి రోజు కాబట్టి నిన్న తిన్న ఆహారాలు గుర్తుకు రావడం, ఆ టైము అయ్యేసరికి రోజూ తినే పదార్థాలు, కాఫీ, టీ, టిఫిన్లు వస్తాయని మీ మనస్సులో లేకపోయినప్పటికీ మీ పొట్ట కణాలు అన్నీ ఎదురుచూస్తూ ఉంటాయి. అందువలన కొద్ది జీర్ణాదిరసాలు తయారవడం ఉంటుంది. కాబట్టి మొదటిరోజున ఆకలి అవ్వడం అనేది ఉంటుంది. తేనె నీళ్ళు రెండు గంటలకు ఒకసారి త్రాగుతారు కాబట్టి ఆకలయినా ఇబ్బంది పెద్దగా ఉండదు. కానీ నాలుక, నోరు ఏదొకటి రోజు నమిలే అలవాటు మీద ఇంకా ఏమైనా అందితే నములుదామని ఆరాటపడుతూ ఉంటాయి. కొన్ని రోజులు నమలడం, సప్పరించడం అన్నీ తేనెతోనే ఎడ్ జెష్ట్ అవ్వాలని మీ నాలిక, నోరుకు మీరు చెప్పుకోవాలి.
రెండవ రోజు ఉపవాసంలో ఎనిమా ద్వారా పెద్దగా విరేచనం అవ్వదు కాబట్టి ఉదయం అంత ఆకలి ఉండదు. భోజనం టైము అయ్యేసరికి నిన్న కూడా మాకేమీ పెట్టలేదు. కనీసం ఈ రోజైనా ఏమైనా తింటాడేమోనని బాగా ఎదురు చూస్తాయి. అందువల్ల ఆకలి ఎక్కువగా ఉంటుంది. అలా అనిపించినప్పుడు వెంటనే తేనె నీళ్ళు త్రాగితే వాటితో పొట్ట సర్దుకొని పోతుంది. పొట్టకు ఏదో ఒక ఆహారం కావాలి అనే గానీ, మనస్సు లాగా భోజనం, పచ్చళ్ళను మనస్సు కోరుకోదు. పొట్టకు తేనె నీళ్ళు పోసి, మనస్సు నేరుగా మళ్ళించితే ఉపవాసం నడుస్తుంది. ఆ ఆకలి మీద మనస్సు కోరే రుచులను నెమరువేసుకొంటూ తేనె నీళ్ళను అశ్రద్ధ చేస్తే, మీరు ఆ రుచులను తినేదాకా మీ మనస్సు ఊరుకోదు. ఆలా తిన్నారో అదే ఉపవాసానికి ఆఖరు రోజు. అలా గనక రెండవ రోజు జరిగితే మళ్ళీ ఉపవాసాలు మీ జన్మలో చేయలేరు. చేయాలంటే ఆ ఆకలి భయం గుర్తుకు వస్తుంది. ఇక మనం ఉపవాసాలు చేయడానికి పనికి రాము, చేయలేము అని మీ మనస్సులో పిరికితనం వచ్చేస్తుంది. అది మీ జీవితానికి నష్టం. సాయంకాలం భోజనం టైముకు కూడా అలానే ఆకలయ్యి గొడవ పెట్టేస్తుంది మనస్సు. రెండవ రోజు కూడా రకరకాల రుచులన్నీ గుర్తుకు వస్తాయి. వాటన్నింటినీ నిగ్రహించగలిగితేనే ఉపవాసంలో సుఖం మీకు మిగులుతుంది. మొదట రెండు చెంబుల చన్నీటి స్నానం ఎంత కష్టమో, ఆ కష్టాన్ని మీరు ఉపవాసంలో పూర్తి చేసి, మూడవ చెంబు అయిన మూడవ రోజుకి చేరుకుంటారు.
మూడవ రోజు ఉపవాసం కొద్దిగా తేలికగా ఉంటుంది. రెండు రోజులు టిఫిన్లు, కాఫీ టీ లు, భోజనం చేయకపోయే సరికి, ఆ టిఫిన్ టైము, భోజనం టైము అయినప్పటికీ క్రిందటి రెండు రోజులు ఆ ఆహారాలు అందలేదు కాబట్టి ఈ రోజు నుండి ఎదురు చూడడం పొట్ట కణాలు మానేస్తాయి. పిల్లవాడు రెండుసార్లు అబద్ధం చెప్పేసరికి మూడవ సారి నిజం చెప్పినప్పటికీ ఆ మాటకు మనం విలువ ఇవ్వనట్లే, పొట్ట, కణాలు కూడా ఆహారం మీద ఆధారపడడం (రుచుల మీద) మానివేస్తాయి. మన మనస్సుకు కూడా రెండు రోజులు తినక పోయే సరికి, మూడవ రోజు కోరిక పోతుంది. దీని కారణంగా పొట్టలో, నోటిలో జీర్ణాది రసాలు తయారవ్వడం తగ్గిపోతుంది. అటు శారీరకంగా, ఇటు మానసికంగా రెండు విధాలా ఆహారం మీద భ్రాంతి పోతుంది. అందువలన మూడవరోజు నుండి ఆకలి వేయదు. మొదటి రెండు రోజులు అలవాటు ప్రకారం ఎక్కువ శాతం రక్తం పొట్టకు, ప్రేగులకు రావడం జరుగుతుంది. మూడవ రోజు నుండే పొట్టకు, ప్రేగుల దగ్గరకు రావలసిన రక్తం అంతా ఆహారం లేని కారణంగా ఇక్కడకు రాకుండా వేరే చోట కేంద్రీకృతమై శరీరాన్ని రిపేరు చేయడం ప్రారంభిస్తుంది. ఉపవాసం వలన ఉపయోగం మనకు మూడవ రోజు నుండి ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే శరీరానికి ఉపవాసం ప్రారంభమయ్యిందో ఆ రోజు నుండి ఆహారం మీద కోరికలు, ఆలోచనలు మారతాయి. ఈ రోజు నుండి జీర్ణాది రసాలు తయారవడం పూర్తిగా ఆగిపోతాయి. ఎక్కువ మందికి ఇలా జరుగుతుంది. మూడవ రోజు కూడా ఆకలయ్యేవారు కొద్దిమంది వుంటారు.
నాల్గవ రోజు ఉపవాసం ప్రారంభమయిన దగ్గర నుండి మీ శరీరం 24 గంటలూ విసర్జన క్రియ మీద కేంద్రీకృతమై ఉంటుంది. అందువలన ఈ రోజు నుండి ఆకలి పూర్తిగా ఆగిపోతుంది. మీరు రకరకాల పదార్థాలను చూసినప్పటికీ మీకు కోరికలు కలుగవు. ఈ రోజు నుండి పొట్ట, ప్రేగులు, నోరు ఇవన్నీ కూడా పూర్తి విశ్రాంతిలో ఉండి వాటిలో ఉన్న చెడును బహిష్కరించుకుంటూ ఉంటాయి. తినేటప్పుడో, తినాలనుకున్నప్పుడో ఆకలవుతుందిగానీ, నాలుగవ రోజు నుండి ఆకలి బాధ ఉండదు. బావిలో నీరు తోడిన దగ్గర నుండి ఊట ఊరడం పెరుగుతుంది. అలాంటిదే తింటున్నకొలదీ జీర్ణాదిరసాలు తయారవడం కూడా. బావిలో నీరు తోడటం ఆపివేస్తే కొత్తగా ఊట (నీరు) ఊరడం కూడా ఆగిపోతుంది. అలాగే ఆహారం తినడం పూర్తిగా మానివేస్తే ఆకలి అవ్వడం (జీర్ణాది రసాలు తయారవడం) కూడా పూర్తిగా ఆగిపోతుందన్న మాట.
మీకు ఇంకొక విషయం తెలుసా! హోమంలో (అగ్నిగుండం) నెయ్యి ఎంత పోస్తుంటే అంత మంట పెరుగుతూ వుంటుందీ గానీ తరగదు గదా! మనం కూడా రోజూ అదే పనిగా తింటూ జఠరాగ్నిని రగుల్చుచున్నాము. ఉపవాసంలో మంటను రగిల్చే నెయ్యి లాంటి ఆహారాన్ని మనం తినడం లేదు కాబట్టి ఉపవాసంలో ఆకలి అయ్యే అవకాశం అసలు లేదు. ఇప్పటికైనా ఉపవాసంలో ఆకలి ఎందుకవ్వదని మీ అందరికి బోధపడి ఉంటుందని అనుకుంటున్నాను. లేకపోతే చెప్పండి ఇంకో నాలుగు ఉదాహరణలు చెప్పి ఉపవాసంలోనే కాకుండా ఉపవాసం అయిన తరువాత కూడా ఏకంగా ఆకలి కాకుండా, ఆహారం తినకుండా చేయగలను. మీరందరు మంచి వారే కాకుండా, నేను చెప్పినట్లు ఆకలి అని భయపడకుండా ఉపవాసాలు చేస్తానంటున్నారు. కాబట్టి మిమ్మల్ని ఇక్కడితో వదిలిపెడతాను లెండి.

19. ఉపవాసంలో ఎందుకు తినాలనిపించదు?

పనిచేసే వారికి పనిలో ఆనందం, చప్పగా తినే వారికి చప్పిడిలో ఆనందం, వ్రాసే వారికి వ్రాయడంలో ఆనందం, బద్ధకించే వారికి ఖాళీగా కూర్చోవడంలో ఆనందం, ఇలా రకరకాలుగా ఎవరికి ఇష్టమున్న పనిని వారు తృప్తిగా చేసుకొంటూ అందులో ఆనందాన్ని పొందడం అనేది ప్రకృతి ధర్మం. ప్రతి మనిషి కోరుకునేది కూడా ఆ ఆనందాన్నే. కొంత మంది అన్నింటి కంటే తినడంలోనే ఎక్కువ ఆనందం ఉన్నదని అదేపనిగా తింటుంటారు. ఒక పనిని పదే పదే చేయడంలో ఆ పని మన మనస్సుకు అలవాటుగా అయ్యి, అది లేనిదే మనముండలేనట్లు అవుతుంది. ఆ పని, ఆ ఆనందం లేనిదే నేనుండలేను అన్నది మానసికమైన సంబంధం. తినే వాడికి అదే పనిగా ఆకలయినప్పుడల్లా తినాలని పించడం కూడా మానసికమైన సంబంధమే. ఆకలిని పుట్టించేది మనస్సు. ఆకలిని తెలిపేది మనస్సు. తాత్కాలికంగా ఆకలిని చంపేదీ మనస్సే, రుచిని తెలిపేది కూడా మనస్సే. మనస్సుని ఖాళీగా ఉంచితే ఆకలి ఎక్కువ అవుతుందన్న మాట పనీపాట లేని అమ్మకు కూటి మీదనే ధ్యాస అన్నట్లు ఖాళీగా పనీపాటా లేకుండా ఉంటే అదే పనిగా తినాలనిపిస్తుందట. దీన్ని బట్టి చూస్తే ఉపవాసంలో పనీ పాటా లేకుండా విశ్రాంతిగా కూర్చోవడంలో మీకు ఎక్కువ ఆకలి అవుతుందన్న మాట. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లేనండీ. నిజానికి ఉపవాసంలో మీకు ఏమనిపిస్తుందో కొద్దిగా తెలుసుకుందాం.
ఒంటరితనాన్ని వదిలించి జంటగా ఇంకొకరితోడు నందించేది వివాహం. అలాగే అనారోగ్యాన్ని వదిలించి శరీరానికి ఆరోగ్యం అనే తోడును అందించేది ఉపవాసం అని అనుకొందాము. వివాహం, ఉపవాసం అనేవి జీవితంలో క్రొత్త మార్పు తీసుకొచ్చేవి, ఆనందాన్ని అందించేవి అయినప్పటికీ, అనుభవం లేని కారణంగా వాటిని తలచుకొంటే కొద్దిగా భయం ఉంటుంది. ఇది అందరికి సహజమైన విషయమే. అయినా వివాహం చేసుకోవడం ఎవరన్నా మానుతున్నారా? వివాహానికి భయపడి, వివాహం చేసుకోకుండా ఎవరు ఉండరేమో గానీ, ఉపవాసమంటే భయపడి, ఉపవాసం చేయకుండా తప్పించుకుందామనుకొనేవారు ఎందరో. వివాహం అవసరం, అది మన బాధ్యత అనుకుంటున్నాము. కానీ ఉపవాసం చేయడం అవసరం. అది మన బాధ్యతగా గుర్తించక అది అంటే భయం వేస్తుంది.
అవసరం అనుకున్నాం, వివాహం పూర్తి అయ్యింది. బాధలు పడలేక, తప్పక మొత్తానికి ఉపవాసం కూడా ప్రారంభించడం జరిగింది. పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్ళే అమ్మాయికి పుట్టినిల్లు వదలడం ఓ బాధ అయితే, మెట్టినిల్లుకు చేరుతున్నామన్న బాధ మరొకటి. అలాగే ఉపవాసం ప్రారంభించే వారికి అలవాటైన టీ, కాఫీలు, టిఫిన్లు, భోజనం వదలడం ఒక బాధ అయితే, అలవాటు లేని ఉపవాసం ప్రారంభించి తేనె నీళ్ళు, మంచి నీళ్ళు త్రాగడం మరొక బాధ.
అత్తారింట్లో కొత్తగా అడుగుపెట్టింది మొదటిరోజు. అలాగే మీరు ఉపవాసం ప్రారంభించి కూడా మొదటి రోజు. అత్తగారిల్లు, భర్త, బంధువులు, వాతావరణం అంతా కొత్తగా అనిపిస్తుంది. అలాగే ఉపవాసంలో ముందు ఎనిమా, తేనెనీళ్ళు, చల్లని నీరు తల స్నానం ఇవన్నీ కూడా కొత్తగా అనిపిస్తాయి. అలవాటు ప్రకారం ఆ టైము అయ్యే సరికి పాత స్నేహితులు, పుట్టింటి దగ్గర వారు జ్ఞాపకం ఎక్కువగా వస్తుంటారు. అలాగే ఉపవాసంలో అలవాటు ప్రకారం టీ టైము అయ్యే సరికి కాఫీ, టీలు త్రాగాలనిపించడం, టిఫిను టైముకు టిఫిన్స్ గుర్తుకు వచ్చి తినాలనిపించడం ఎక్కువగా ఉంటుంది. అలాగే భోజన సమయాల్లో కూడా రకరకాల పదార్థాలు గుర్తుకొచ్చి తినాలనిపించడం మొదటి రోజు సహజం. అమ్మాయిని ప్రక్కవారో, బంధువులో పలుకరించి మాట్లాడిస్తున్నప్పుడు ఇంటి మీద ధ్యాస, మనస్సు అటు మళ్ళడం ద్వారా తగ్గడం సహజం. అలాగే టైముకు తేనె నీళ్ళు త్రాగేస్తుంటే కూడా మనస్సుకు అప్పుడు తినాలనే కోరిక కొద్దిగా తగ్గిపోతుంది. 20 సంవత్సరాల స్నేహాన్ని, పెంపకాన్ని ఒక్కరోజులో వాటన్నిటిని వదిలి, ఆ ఆలోచనలు రాకుండా చేయడం సాధ్యపడేది కాదు. అలాగే ఎన్నో ఏళ్ళుగా ఉన్న తిండి అలవాట్లను వదిలి ఒక్కరోజులో తినకుండా మనస్సును నిగ్రహిద్దామంటే అది కూడా సాధ్యమయ్యేదికాదు. అందువలన మొదటి రోజు అమ్మాయి శరీరం అత్త వారింట్లో ఉంటుందే గానీ, మనస్సంతా పుట్టినింట్లో తనవారితో ఉంటుంది. అలాగే ఉపవాసం మొదటి రోజు మీ శరీరం ఉపవాసంలోనే ఉంటుంది గానీ, మనస్సంతా తింటున్నట్లు, అన్నీ తినాలనిపించడం ఉంటుంది. ఇంటి మీద బెంగతోనే మొదటి రోజు నిద్ర పూర్తి అవుతుంది. అలాగే తిండి మీద బెంగతోనే మీకు మొదటి రోజు ఉపవాసం పూర్తి అవుతుంది.
మొదటి రోజు అయినా పరిచయానికి అందరితో కొద్దిగా ఫ్రీగానే మాట్లాడగలుగుతుంది గానీ, రాత్రి కలలో ఇంటి దగ్గర వారు గుర్తుకు వచ్చేసరికి మరీ బెంగగా ఉంటుంది. అలాగే ఉపవాసంలో తిండి మీద బెంగతో నిద్ర సరిగా పట్టక రెండవ రోజు టిఫిన్ టైముకు బాగా తినాలనిపిస్తుంది. పుట్టింటి వారిని చూసి రెండు రోజులయ్యే సరికి రెండో రోజు అమ్మాయికి మరీ బెంగ ఎక్కువగా ఉంటుంది. ఒక రోజంతా పూర్తిగా రుచులు తినకుండా దూరం అయ్యినందుకు రెండవ రోజు భోజన సమయాల్లో మరీ ఎక్కువ తినాలనిపిస్తుంది. మనం వద్దన్నదే పిల్లవాడు కావాలంటాడు. అది పిల్లవాడి స్వభావం అని మనం అంటాం. కానీ మన స్వభావం కూడా అంతే. మనం తినకూడదనుకుంటున్నాము కాబట్టి అవే ఎక్కువ గుర్తుకు వచ్చి మరీ తినాలనిపిస్తుంది. రెండవ రోజు ఆలా తినాలనిపించినప్పుడల్లా తేనె నీళ్ళు, మంచి నీళ్ళు త్రాగేసి మనస్సును వేరే విధంగా మళ్ళిస్తుంటే మొత్తానికి కష్టంగా రెండవ రోజు తినాలనిపించినా తినకుండా దాటించవచ్చు.
రెండు రోజులు ఇబ్బందిగా ఉన్న అత్తగారిల్లే మూడవ రోజుకి అలవాటవుతుంది. అలవాటైన పుట్టినిల్లు మూడవ రోజు వచ్చేసరికి గుర్తుకు రావడం తగ్గుతుంది. అలాగే రెండు రోజులు త్రాగేసరికి మూడవ రోజు తేనె నీళ్ళే కమ్మగా ఉంటాయి. రెండు రోజులు రుచులను తినక పోయేసరికి మూడవ రోజు నుండి తినాలన్న భ్రాంతి తగ్గిపోతుంది. రెండు రోజులు స్నేహం చేస్తే వాడు వీడౌతాడు, వీడు వాడౌతాడు అన్న సామెత ఇక్కడ నిజం అనిపిస్తున్నది గదా! ఈ మార్పు జరగాలి అంటే రెండు రోజులు ఓపిక పట్టాలన్న మాట. ఎప్పుడైతే పుట్టింటి మీద భ్రాంతి తగ్గిందో, అత్తగారింట్లోనే హుషారుగా, సంతోషంగా ఉండగలుగుతుంది. అలాగే ఎప్పుడైతే పాత రుచులను తినాలని కోరిక తగ్గిందో అప్పుడే ఉపవాసం యొక్క ఉపయోగం ప్రారంభమవుతుంది. మనస్సుకి రుచులను తినాలని కోరిక తగ్గి, ఉపవాసంలో చెడును బహిష్కరించే కార్యక్రమం చేబడుతుంది.
మూడు నిద్రలయ్యేసరికి అమ్మాయికి అత్తగారిల్లే స్వర్గంలా, వాళ్ళ ఆయనే దేవుడిలా అనిపిస్తుంది. అలాగే మూడు రోజులు పూర్తి అయ్యేసరికి, నాలుగవరోజు ఉపవాసంలో మీకు ఆహారం తినాలనే కోరిక పూర్తిగా పోయి, మనస్సుకు నిగ్రహం పెరిగి, బ్రతికినన్నాళ్ళు ఇలా తేనె నీళ్ళతోనే ఉండిపోతే బాగుంటుందనిపిస్తుంది. మూడవ రోజు నుండే కొంతమందికి నోరు చేదు, వాసన, నాలిక మీద పాచి పట్టడం, నోరు జిగురు మొదలగునవి అనిపించడంతో ఆ రోజు నుండే ఆహారం తినాలనే కోరిక పూర్తిగా పోతుంది. కొంత మందికి నాల్గవరోజు నాలుక మీద ఈ లక్షణాలు వచ్చినప్పుడు ఆ రోజు నుండి? పూర్తిగా తినాలనే కోరికలు ఆగిపోతాయి. నిప్పు మీద నీరు పడ్డప్పుడు ఆ నిప్పు ఏ విధంగా ఆరిపోతుందో అలాగే నాలుక మీద పాచి, చేదు వచ్చినప్పుడు తినాలనే కోరికలు ఆగిపోతాయి. నీరు పోయగా ఆరిపోయిన తడి బొగ్గు మీద మీరు కిరోసిన్, పెట్రోలు పోసినప్పటికీ అది ఎలా వెలగదో అలాగే ఉపవాసంలో నోరు ఈ విధంగా మారినప్పుడు మీకు ఏది చూసినా, వాసనా వచ్చినా మరలా తినాలనిపించదు. ఆ తడి పొతే ఆ బొగ్గు తిరిగి ఎలా మంటకు పనికి వస్తుందో, అలాగే నాలిక మీద తేడాలు పోతే మరలా తిరిగి తినాలనిపిస్తుంది.
జ్వరం వచ్చినప్పుడు పొట్ట ఖాళీగా ఉన్నప్పటికీ మనస్సుకి ఆహారం తినాలన్న కోరిక ఉండదు. ఆహారం తినాలని కోరిక పుట్టించే మనస్సు జ్వరం వచ్చినప్పుడు శరీరంలో చెడును విసర్జించుకొనే కార్యక్రమంలో లగ్నమై ఉండిపోతుంది. ఆ చెడు పోయే వరకు మనకు తినాలనిపించదు. జ్వరం తగ్గాక బాగా ఆకలి వేసి, బాగా తినాలనిపిస్తుంది. ఉపవాసంలో కూడా మనకు అదే విధంగా జరుగుచున్నది. జ్వరం వచ్చినప్పుడు మీకు తినాలనే కోరిక పుట్టడం ఎంత అసహజమో, ఉపవాసం చేస్తున్నప్పుడు కూడా మీకు తినాలనే కోరిక పుట్టడం కూడా అంత అసహజమే. ఇక్కడ నుండి కాశీ ఎంత దూరమో, కాశీ నుండి ఇక్కడకు కూడా అంతే దూరం కదా! నిజమేనని మీరందరు ఒప్పుకుంటారు. కానీ ఉపవాసంలో తినాలనిపించిందంటే ఇంకా నమ్మబుద్ధి కావడం లేదా?
మీకు ఇంకో విషయం తెలుసా! కుక్క పరిగెడుతున్న కొద్దీ వెంబడే పడుతుంది. మనం పరిగెట్టలేక ఆగితే అదీ ఆగిపోతుంది. అలాగే మీరు తింటున్న కొలదీ రుచులు వెంబడిస్తాయి. అంటే మీరు తింటున్న కొలదీ తినాలనిపిస్తుందన్నమాట. మనం తినకుండా ఆపితే తినాలనే కోరిక కూడా ఆగిపోతుంది. అంటే మనం ఉపవాసాలలో ఆహారాన్ని తినకుండా ఆపుతున్నాము కాబట్టి ఉపవాసంలో ఆహారాన్ని తినాలనే కోరిక కూడా ఆగుతుందన్నమాట. రుచుల వెంట పరుగులు తీయడం ఎండమావుల వెంట పరుగులు తీయడం లాంటిది. జాగ్రత్త! దెబ్బ తింటారు. ఇప్పటి వరకు మీ పరుగులు అలానే సాగుచున్నాయి. కనీసం ఇక నుండి అయినా మేలుకొని, ఉపవాసాలతో అలాంటి పరుగులకు బ్రేకులు వేయండి. జ్ఞానం లేని మూగ జీవులు కూడా ఉపవాసాలలో ఏమీ తినకుండా, తినాలని తలంపు లేకుండా ఉపవాసాలు చేయగలుగుచున్నాయే! ఓ బుద్ధి జీవి! నీవెందుకోయ్ ఇంకా! వెనుకాడుతున్నావ్! తప్పు, తప్పు.

20. ఉపవాసంలో ఎందుకు నీరసం రాదు?

ఉపవాసం అంటే విశ్రాంతి అని అనుకొంటున్నాము. మరి విశ్రాంతి అనేది శరీరానికి విశ్రాంతి నిచ్చేదా? లేదా శరీరాన్ని నీరసింపజేసేదా? మీరే నిర్ణయించండి. మీరనుకుంటున్నట్లు ఉపవాసం నీరసాన్ని మిగిల్చేది అయితే రాత్రి 7-8 గంటలు విశ్రాంతి (నిద్రపోయి) తీసుకొని, ఉదయం లేచిన తరువాత ఆ మనిషి నీరసంగా శక్తిహీనంగా ఉండాలిగదా! మరి ఆలా జరగడం లేదే. పగలంతా పని చేసి కోల్పోయిన శక్తిని రాత్రికి విశ్రాంతిలో మరలా పొందగలుగుచున్నాడు. అందువల్లనే ఉదయం నిద్ర లేచిన తరువాత అందరూ చకా చకా పనులు చేసుకోగలుగుతారు. శరీరం ఉదయం పూట తేలికగా ఉంటుంది. కారణం రాత్రి నిద్రలో ఉపవాసం చేస్తున్నాము కాబట్టి. రాత్రికి 7 - 8 గంటలు శరీరానికి విశ్రాంతి (ఉపవాసం) నిస్తేనే ఉదయానికి అంత శక్తిగా, హుషారుగా ఉంటుంది. ఇక 24 గంటలూ శరీరానికి విశ్రాంతి (ఉపవాసం) నిస్తే ఇంకా ఎంత శక్తి పెరుగుతుందో ఆలోచించండి. అందువల్లనే మనిషి తినేటప్పుడు కంటే ఉపవాసంలో ఎన్నో రెట్లు బలంగా ఉంటాడు.
మీరనుకున్నట్లు తినప్పుడే బలంగా ఉంటుంది అంటే పొట్ట నిండా భోజనం చేసాక మనిషి శక్తిగా ఉండాలి గదా! పొట్ట నిండా భోజనం చేశాక భుక్తాయాసం వచ్చి తన శరీరాన్ని తనే మోసుకోలేని వాడు ఇంకా ఏమి శక్తిగా ఉండగలడు. భోజనం చేశాక మన ఒంట్లో శక్తి అంతా పొట్టకు ఆహారాన్ని అరిగించడానికి వెళ్ళిపోతుంది. అందువలన మనలో ఉన్న శక్తి కాస్తా మనం తిన్నదాన్ని జీర్ణం చేయడానికే ఎక్కువ ఖర్చు అయిపోతుంది. ఎప్పుడైతే శక్తి జీర్ణక్రియకు చేరుతుందో, ఆ శక్తి మనకు చెందదన్నమాట. శక్తి ఖర్చు అవ్వకుండా ఉండాలంటే భోజనం (జీర్ణం పని) చేయడం మానివేయడమే. అంటే ఉపవాసం చేయాలన్నమాట. శక్తి రావాలంటే మనకు ఉపవాసమే మార్గమన్నమాట. ఉదాహరణకు పరుగు పందాలకు వెళ్ళేవారు ఎవరైనా పొట్టనిండా తిని పరిగెడుతున్నారా? లేదా ఉపవాసం (పొట్టను తేలికగా ఉంచి) చేస్తూ పరిగెట్టి విజయం సాధిస్తున్నారా? ఆహారం తిన్న తరువాత మనలో శక్తి రెండు రకాలుగా విడిపోయి పనిచేస్తుందన్నమాట. పనిచేయడానికి (ఒక రకంగా) కొంత శక్తి ఉండి, మిగతా శక్తి ఆహారాన్ని అరిగించడానికి (రెండవ రకంగా) గానూ విడిపోతుంది. ఆహారం లేకుండా వున్నప్పుడు (ఉపవాసం) మనలో శక్తి రెండు రకాలుగా విడిపోవడం బదులు రెండు శక్తులు కలిసి ఏకంగా పనిచేస్తుంది. ఉపవాసం అంటే మనలో ఉన్న శక్తులను ఏకం చేసి శక్తినిచ్చేది అని అర్థం. రెండు చేతులూ కలిపి ఒకే పనిచేస్తే (రెండు చేతులూ ఒకటై) అప్పుడు వచ్చే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇదే ఉపవాసంలో జరిగేది. రెండు చేతులు విడి విడిగా వేరే వేరే పనులను చేస్తే అప్పుడు వచ్చే శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఇదే ఆహారం తిన్నప్పుడు జరుగుచున్నది.
మనం పొట్టనిండా ఆహారం తిన్న తరువాత ఎక్కువ శాతం రక్తం, ఎక్కువ శక్తి జీర్ణాశయానికి చేరిపోవడంతో మన మనస్సు కూడా కొంత మందం అవుతుంది. అందువల్లనే భోజనం చేసిన తరువాత వెంటనే మత్తుగా ఉంటుంది. ఆజ్ఞలను అందించే మనస్సు, శక్తిని ప్రేరేపించే మనస్సే మందంగా, మత్తుగా ఉంటే మనకు ఇంక శక్తి ఎక్కడ నుండి వస్తుంది? అందువల్లనే పొట్టలో ఆహారం ఉన్నంత సేపు మనిషి నీరసంగా, బధ్ధకంగానే ఉంటాడు. పైగా మనం పీల్చుకున్న ప్రాణశక్తి కూడా ఎక్కువ శాతం జీర్ణాశయానికి కేటాయించబడుతుంది. అందువల్ల ముఖ్యంగా మనకు ఎక్కువ శక్తికి మూలమైన ప్రాణశక్తి లోపం (జీర్ణాశయానికి ప్రాణశక్తి ఎక్కువగా వెళ్లడం) మనస్సుకు, మిగతా భాగాలకు కలగడానికి కూడా ఆహారం ఒక కారణం. ఉపవాసంలో శక్తిగా ఉండడానికి మరికొన్ని కారణాలు వున్నాయి.
1. విసర్జన క్రియ ద్వారా: నేల నున్న బరువును నెత్తికెత్తుకోవడం లాంటిది ఆహారం తినడం అనేది. నెత్తి మీద నున్న బరువును కొద్ది కొద్దిగా దించి వేయడం లాంటిది ఉపవాసం. బరువు నెత్తి మీద ఉన్నప్పుడు మనలో నిలువ ఉన్న శక్తి ఎక్కువ ఖర్చు అవుతుంది. పైన బరువు ఉన్నప్పుడు మన ఆలోచన కూడా దాని మీదే ఉండి పోతుంది. బరువును దించి వేస్తూ ఉంటే శక్తి మిగులుతూ ఉంటుంది. శరీరం తేలికవుతుంది. అలాగే ఎన్నో ఏళ్ళ తరబడి శరీరంలో నిలువ ఉండి, శరీర భాగాలకు రక్త ప్రసరణలకు ఆటంకం అయిన వ్యర్థపదార్థాలను మనం 24 గంటలూ మోసుకుంటూనే ఉన్నాం. ఆహారం తింటున్నంత కాలం ఒకటికి రెండు తోడై భారం పెరుగుతూనే ఉంటుంది గానీ తరగదు. ఉపవాసంలో రోజు రోజుకీ ఆ భారం అంతా బయటకు పోవడంతో లోపల అవయవాలు మరల తిరిగి శక్తిని పుంజుకుని, మనకు శక్తిని చేకూర్చుతాయి. 24 గంటలూ శరీరం ఉపవాసంలో విసర్జన క్రియను చేపడుతుంది. కాబట్టి ఉపవాసంలో 24 గంటలూ శక్తిగా ఉంటుంది అన్న దానికి ఇవన్నీ నిదర్శనాలు.
2. తేనె ద్వారా: తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని ప్రేగులకు శ్రమ లేకుండా అందివ్వగల ఆహారం తేనె ఒక్కటే. పొగ తక్కువ వచ్చి, ఎక్కువ పికప్ (బండి త్వరగా అందుకోవడం) ని అందించే ఆయిలును మన కారుకు మనం ఎలా వాడుకుంటున్నామో అలాగే మన శరీరానికి కూడా తేనె ఆహారంగా పనిచేయగలదు. ఉపవాసంలో తేనె ఇవ్వడం వలన జీర్ణాశయం పని లేకుండానే శరీరానికి, మనస్సుకు ఎక్కువ శక్తి 24 గంటలూ అందుతుంది. మనస్సు శక్తివంతంగా ఉపవాసంలో ఉండటం వలన, ఎవరికీ నీరసం అనేది రాకుండా శక్తిగా ఉపవాసంలో మనకుంటుంది.
3. నీరు తగ్గడం ద్వారా: ఉప్పు తింటున్నంత కాలం మన శరీరంలో అవసరానికి మించి 10-20 శాతం నీరు ఎక్కువగానే నిలువ ఉంటుంది. ఆ అవసరానికి మించి ఉన్న నీరు మన కణాలకు సంబంధించిన రక్త ప్రసరణకు, ఆక్సిజన్ కు, ఆహారం రాకపోకలకు అడ్డుపడుతూ కణాలలో ఉత్పన్నమయ్యే శక్తికి ఆటంకం కలిగిస్తూ ఉంటుంది. మన కణాలలో పుట్టే శక్తే మనలోని శక్తి. నీటి మీద పడవ ఉంటే నష్టం లేదు గానీ, పడవలో నీరుండటమే ప్రమాదం. శరీరంలో నీరు ఎక్కువగా ఉన్నవారికి వచ్చే ప్రమాదం కూడా పడవలో నీరుండటం లాంటిదే. ఆ నీరు మనలో శక్తి ఉత్పన్నమవ్వాల్సినంత అవ్వకుండా చేస్తుంది. ఉపవాసంలో ఎక్కువ మంచి నీరు త్రాగడం, ఉప్పు లేకపోవడం, తేనె వాడటం, వలన శరీరంలోని అవసరానికి మించి ఉన్న నీరంతా మూత్రం ద్వారా, చమట ద్వారా (ఆవిరి స్నానం) బయటకు పోతుంది. రోజు రోజుకు ఎంత నీరు బయటకు పోతుందో అంత శక్తి మనకు ఉపవాసంలో పెరుగుతూ ఉంటుంది.
4. ప్రాణశక్తి (ఆక్సిజన్) ద్వారా: పొట్ట నిండా మనం ఆహారం తిన్నప్పుడు పొట్ట బరువు వెళ్ళి ఊపిరితిత్తుల మీద పడి, ఊపిరితిత్తులు ఎక్కువ గాలిని పీల్చుకోకుండా చేస్తుంది. మరొక కారణం ఏమిటంటే తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికే మనం పీల్చుకున్న ప్రాణశక్తి ఎక్కువగా రోజులో వినియోగపడుతూ ఉంటుంది. ఈ రెండు కారణాల వల్ల మనలో ప్రాణశక్తి లోపం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఆహారం తింటున్న రోజుల్లో కొన్ని గంటలు శక్తిగా ఉంటే, మరి కొన్ని గంటలు శక్తిలేనట్లుగా అనిపిస్తుంది. ఉపవాసం చేస్తూ ఉంటే పూర్తిగా శక్తి తగ్గిపోతుందని అందరూ భయపడటంలో ఏమన్నా అర్థం ఉందటారా? ఆహారం లేని కారణంగా ఉపవాసంలో పొట్ట ఖాళీగా ఉండి, ఊపిరితిత్తులు ఎక్కువ గాలిని పీల్చుకోగలుగుతాయి. అంటే పూర్తిగా, నిండుగా గాలి చేరడం జరుగుతుంది. పైగా ఆహారం లేని కారణంగా, ఆహార జీర్ణానికి ప్రాణశక్తి ఖర్చు అయ్యే అవసరం లేనందువల్ల దేహంలో ప్రాణశక్తి సంచారం బాగా ఎక్కువగా ఉంటుంది. ప్రాణులన్నింటికీ ఎక్కువ శక్తి నిచ్చేది ఆహారం కాదు. ముందు ప్రధానమైనది గాలి (ప్రాణశక్తి), తరువాత నీరు, శరీరానికి శక్తినిచ్చే ప్రధానమైన రెండూ కావలసినంత ఉపవాసంలో అందిస్తుంటే మనిషికి నీరసం వస్తుందంటారా? ఎక్కువ శక్తి వస్తుందంటారా?
365 రోజులూ, ఎప్పుడూ ఏదొకటి తినే వారికి తినడంలో ఉన్న ఆనందం, తినడం ద్వారా వచ్చిన శక్తి ఎంతో వారికి తెలుసు. బావిలో కప్పలాగా ఆ శక్తే వారికి ఎక్కువగా అనిపిస్తుంది. అసలైన శక్తీ ఎంత ఉంటుందో, ఎలాగుంటుందో, అన్నది ఉపవాసం చేసినప్పుడు కానీ తెలియదు. ఉపవాసంలో ఏదో నీరసం వస్తుందని, ఏదేదో ఊహించుకొంటూ, ఎవరో సరిగా చేయలేని వారి మాటలు వేదంగా పెట్టుకొని జీవితం అంతా నీరసంగా బ్రతికే బదులు ఉపవాసం చేసి చూస్తే మీకే అసలు విషయం తెలిసిపోతుంది గదా. ఒడ్డునున్నంత సేపూ నీటి లోతు ఎలా తెలియదో, ఇప్పుడు మీకున్న పాత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని మాట్లాడినంత సేపూ కూడా అలానే ఉపవాసం అంటే ఏదో అవుతుందన్న భయం ఉంటుంది.

21. ఉపవాసంలో ఎందుకు వ్యాయామం చేయకూడదు?

మనిషి రోజూ రెండు పూటలా ఆహారం తింటున్నప్పుడు శరీరానికి రాత్రి సమయాల్లో 5 నుండి 8 గంటలు విశ్రాంతి లభించడం జరుగుతూ ఉంటుంది. ఈ విశ్రాంతి సమయంలో (అంటే ఏ రకమైన వ్యాయామం లేదు కాబట్టి చివరకు జీర్ణక్రియ కూడా) శరీరం రిపేరు కార్యక్రమాన్ని చేపట్టడం చేస్తూ ఉంటుంది. వెలుతురుండగా భోజనం చేసి పడుకున్న వారికి ఎక్కువ గంటలు రిపేరు జరిగితే, రాత్రి పది, పదకొండు గంటలకు తిని పడుకున్న వారికి తక్కువ సమయం రిపేరు చేసుకొంటుంది. అదే ఉపవాసంలో అయితే 24 గంటలూ రిపేరు కార్యక్రమంలో ఉన్నట్లే. ఇక్కడ 24 గంటలూ ఆహారం తినటం లేదు కాబట్టి విశ్రాంతి ఎక్కువగా తీసుకొంటూ ఉంటే (వ్యాయామం, పని చేయకుండా) శరీరానికి అన్ని గంటలూ ఉపవాసంలో ఉపయోగమున్నట్లే. ఉపవాసం ప్రారంభమయిన మూడవ రోజు నుండి మనలోని శక్తి లేదా ప్రాణం శరీరంలో ఏ భాగానికి అవసరమైతే ఆ భాగంలో చేరి రిపేరు కార్యక్రమంలో ఉంటుంది అంటే శక్తి అంతా ఒకే చోట కేంద్రీకృతమై పనిచేస్తూ ఉంటుంది.
పై పటముల గురించి వివరణ: మన శరీరంలో సుమారు ఐదు లీటర్ల రక్తం ఉంటుంది. అందులో 10 శాతం ఎప్పుడూ మెదడుకు మరియు మరో 15 శాతం ఎప్పుడూ కిడ్నీలకు నిరంతరం వెళ్ళుతూనే ఉంటుంది. మనం పనిలో ఉన్నప్పటికీ, విశ్రాంతిలో ఉన్నప్పటికీ ఆ రెండు అవయవాల రక్తప్రసరణలలో ఏ మాత్రం మార్పు చేర్పులుండవు. (1) మిగతా శరీర భాగాలలో 20 శాతం, లివరులో 5 శాతం ఉండి, మిగతా 50 శాతం రక్తం అంతా మనం వ్యాయామం చేసేటప్పుడు కండరాలకు సర్దుకుంటుంది. అందువల్లనే వ్యాయామం చేసేటప్పుడు శరీరం అంతా వేడిగా కాలిపోతున్నట్లు ఉంటుంది. వ్యాయామంలో కండరాలు కదులుతాయి కాబట్టి కండరాలకు రక్తం చేరుకుంటుంది. (2) ఆహారం తింటున్న రోజులలో మనం భోజనం చేసి అరిగిన తరువాత పగలు పడుకొంటే (విశ్రాంతిలో) మిగతా శరీర భాగాలకు 40 శాతం, కండరాలలో 15 శాతం, లివరులో 20 శాతం రక్తప్రసరణ జరుగుతూ వుంటుంది. (3) ఉపవాసం చేస్తున్నప్పుడు 50 శాతం రక్తం ఎక్కడ రోగముంటే అక్కడకు వెళ్ళి, ఆ భాగానికి ఎక్కువ రక్త ప్రసరణ అందించి త్వరగా ఆ భాగాన్ని రిపేరు చేస్తుంది. రక్తంలో గాలి, నీరు, ఆహారపదార్థాలు కలిసి ప్రయాణిస్తూ ఉంటాయి. రక్తం వెళ్ళేటప్పుడు వీటిని మోసుకొని వెళ్ళి, తిరుగు ప్రయాణంలో చెడు పదార్థాలను (విసర్జక పదార్థాలు), కార్బన్ డైఆక్సైడ్ ను మోసుకొని విసర్జకావయవాలకు చేరుస్తుంది. ఇది రక్తం చేసే పని. ఎక్కువ పని చేసే దగ్గర ఎక్కువ ఆహారం (రక్తం) కావాలి కాబట్టి వ్యాయామం చేసేటప్పుడు కండరాలకు, ఆహారం తిన్న తరువాత పొట్టకు, విశ్రాంతిగా ఉన్నప్పుడు మిగతా భాగాలకు రక్తం చేరుతుంది. ఉపవాసాలు చేసేటప్పుడు రిపేరు జరిగే దగ్గర ఖర్చు ఎక్కువ (ఆహార పదార్థాలు అయిన గాలి, నీరు) ఉంటుంది కాబట్టి ఎక్కువ రక్తం ఆ భాగాలకు అందేటట్లు మనలోని శక్తి చేస్తుంది. అక్కడ కదిలిన ఎక్కువ చెడును తిరిగి మోసుకొని రావడానికి కూడా ఆ 50 శాతం రక్తం పనికి వస్తుంది.
మనం ఉపవాసంలో ఉండగా (ఆహారం, వ్యాయామం లేని కారణంగా) ఖాళీగా ఉన్న 50 శాతం రక్తం మనం ఏ జబ్బు కొరకైతే ఉపవాసాన్ని ప్రారంభించామో, ఆ జబ్బును తగ్గించడానికి ఆ భాగానికి చేరి అక్కడ రిపేరుకు సహకరిస్తుంది. రిపేరు కావలసిన చోట ఎక్కువ నీరు, ఎక్కువ గాలి, ఆహారం కావాలి కాబట్టి వాటిని ఆ రక్తం మోసుకొని వచ్చి, అక్కడ అందించి, మరలా తిరుగు ప్రయాణంలో రిపేరు దగ్గర తయారైన వ్యర్థపదార్థాలను, కదిలిన రోగ పదార్థాలను రక్తం మోసుకొని వస్తుంది. వాటిని విసర్జకావయవాలకు చేర్చి శరీరం నుండి బయటకు పోయేటట్లు సహకరిస్తుంది. ఉపవాసంలో జరిగే రక్తప్రసరణలు ఈ విధంగా శరీరం విశ్రాంతిలో ఉన్నప్పుడే ఉంటాయి.
వ్యాయామం చేస్తే ఏమవుతుంది?: వ్యాయామం చేసేటప్పుడు కండరాలు పనిచేస్తుంటాయి. మాములు కంటే ఎక్కువ పనిచేస్తున్న కండరాలకు ఎక్కువ గాలి, నీరు, ఆహారం త్వరగా కావలసి వస్తుంటుంది. పని చేస్తున్న కండరాలకు ముందు వీటిని (గాలి, నీరు, ఆహారం) అందించడం ముఖ్యం కాబట్టి రిపేరు కార్యక్రమంలో ఉన్న 50 శాతం రక్తం నుండి కొంత రక్తం ఇటు మళ్ళుతుంది. ఎక్కువ అలుపు వచ్చే వ్యాయామం చేస్తే పూర్తిగా 50 శాతం రక్తం అంతా కండరాలకు వచ్చేస్తుంది. అదే నడవడం, ఆసనాలు వేయడం మొదలైనవి చేస్తుంటే సుమారు 20-40 శాతం రక్తం రిపేరు జరుగుతున్న దగ్గర నుండి రావలసి వస్తుంది. ఆ రక్తమే ఇటు కండరాలకు రావడంతో రిపేరు కార్యక్రమం పూర్తిగా ఆగుతుంది. శరీరం తన్ను తాను బాగుచేసుకొనే అవకాశాన్నివ్వడం కొరకే ఉపవాసాన్ని ప్రారంభించాము. ఉపవాసంలో గంటో అరగంటో వ్యాయామం చేస్తే శరీరానికి ఆ కొద్ది సేపు మాత్రమే ఆటంకం కాకుండా తరువాత ఉపవాసం తిరిగి ప్రారంభం కావడానికి రెండు మూడు గంటల సమయం పట్టవచ్చు. వ్యాయామం ద్వారా అలిసిన కండరాలు విశ్రాంతి తీసుకొనేటప్పుడు రక్తం కొద్దిసేపు కండరాలలోనే ఉండిపోతే, తరువాత మరి కొద్ది సేపు మిగతా శరీర భాగాలకు చేరి ఉంటుంది. సినిమా చూసి వచ్చిన తరువాత మనకు అవే ఆలోచనలు సుమారు అరగంటో, గంటో మెదలుతూనే ఉంటాయి. అదే జరుగుతుంది ఇక్కడ కూడా. అందువలన వ్యాయామం ద్వారా సుమారు రెండు, మూడు గంటలు ఉపవాసానికి ఆటంకం కలుగుతుంది. వ్యాయామం చేస్తే కూడా చెడు చెమట రూపంలో కదిలి పోవచ్చు అని మీకు అనిపించవచ్చు. వ్యాయామం ద్వారానే చెమట పట్టనక్కర లేదు. ఉపవాసంలో నీటి ఆవిరి పడితే శరీరానికి శ్రమలేకుండా, చర్మానికి వచ్చిన చెడు పదార్థం అంతా చెమట రూపంలో కారిపోతుంది. వ్యాయామం ద్వారా మనలోని శక్తి, రక్తం అంతా ఉపవాసానికి కాకుండా వేరే విధంగా మార్చబడుతుంది. అందువలన ఉపవాసాలు ఎక్కువ రోజులు పట్టవచ్చు.
జంతువులు అసలు తిరగకుండా, కదలకుండా ఉపవాసంలో పూర్తి విశ్రాంతి తీసుకుంటాయి కాబట్టి వాటికి తక్కువ రోజుల ఉపవాసాలు సరిపోతున్నాయి. ఉపవాసంలో వ్యాయామం చేస్తే కణాలలోని ఆహార పదార్థాలు పూర్తిగా ఖర్చు అయిపోతాయి. అలాగే లివరులో నిలువ ఉండే గ్లైకోజెన్ నిలువలు కూడా పూర్తిగా ఖర్చు అయిపోతాయి. క్రొవ్వు నుండి శక్తి విడుదలవ్వాలంటే కొవ్వు గ్లూకోజుగా మారడం ఆలస్యం అవుతుంది. కణాలు ఆహారం కొరకు బాగా ఎదురు చూస్తుంటాయి. రక్తంలోని గ్లూకోజు కూడా ఎక్కువ ఖర్చు అయిపోయి ఉంటుంది. మెదడుకు వెళ్ళే గ్లూకోజు శాతం కూడా సరిపోనట్లుగా మెదడు డిమ్ గా ఉంటుంది. శరీరానికి ఆహారం వెంటనే అవసరం అన్నట్లు అన్నీ ఎదురు చూస్తుంటాయి. అప్పుడు మనకు మెదడులో ఉన్న ఆకలిని తెలిపే భాగం పనిచేయడం మొదలు పెడుతుంది. దాని ద్వారా మనకు పొట్టలో ఆకలి అవుతున్నట్లు, తినాలని కోరికలు పుట్టించడం గానీ చేస్తుంది. ఆ సమయంలో మనకు తినాలనిపిస్తుంది. ఇలా ఉపవాసంలో చెడు పూర్తిగా విసర్జింపబడకుండానే ఆకలి అయ్యి ఆహారాన్ని తిని వేస్తే నిలువ ఉన్న చెడు ఎప్పుడు కదిలి వెళ్ళను? ఇలా ఆకలి అయ్యి, మన ఆలోచనలు ఆహారం మీదకు మారిన నిముషం నుండి విసర్జన క్రియ ఆగిపోతుంది. మనం తేనెను ఎక్కువగా అందించినప్పటికీ వ్యాయామం ద్వారా వచ్చిన ఆకలికి సరిపోదు. అకలయ్యి ఆహారం అందించినప్పుడు లేదా చాలనప్పుడు నీరసం రావడం ప్రారంభమవుతుంది. ఉపవాసాలలో వ్యాయామాలు చేస్తే ఆకలవ్వడం, నీరసం రావడం ఎక్కువగా ఉంటుందేగానీ ఉపవాసం వలన అసలు ప్రయోజనం ఎక్కువ ఉండదు.
పనిచేస్తే ఏమవుతుంది?: మనం రోజూ ఇంట్లో నడిచే నడక, చేసే పని చాలడం లేదనే కదా ఉదయం పూట రోజూ బయటకు వెళ్ళి నడక, పరుగు లేదా రకరకాల వ్యాయామాలు చేసేది. బయటకు వెళ్ళి చేసే వ్యాయామాల ద్వారా 50 శాతం రక్తం కండరాలకు వెళ్ళి పోతే, ఇంట్లో చేసే తేలిక పనులకు 15-20 శాతం రక్తం కండరాలలోనికి వెళ్ళుతుంది. ఇంట్లో బరువు పనులయిన బట్టలుతకడం, నీళ్ళు తోడడం, పిండి రుబ్బడం మొదలగు వాటికి అయితే సుమారు 20-35 శాతం రక్తం వెళ్ళవచ్చు. అందుకనే ఉపవాసాలు చేసేవారు ఈ బరువు పనులు అసలు చేయకూడదనేది. తేలిక పనులయిన కూరలు కోయడం, వంట చేయడం, ఆఫీసు పని కూర్చొని చేయడం మొదలగు వాటి వలన సుమారు 15-20 శాతం రక్తం కండరాలలోనికి వచ్చి ఉపవాసం యొక్క ఉపయోగాన్ని తగ్గించవచ్చు. ఈ 15 నుంచి 20 శాతం ఉపయోగాలన్నీ కూడా ఉపవాసాల ద్వారా మనం తిరిగి పొందాలంటే పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం అంత మంచిది ఇంకొకటి లేదు. ఉపవాసంలో హుషారుగా ఉన్నదని పనిచేసే వారు కొందరైతే, ఇంట్లో గడవక పనిచేసుకొనే వారు మరి కొందరు ఉంటున్నారు. ఇక ఆఫీసులకు వెళ్ళేవారి మాట చెప్పనక్కరలేదు. ఉపవాసాలు చేస్తున్నన్ని రోజులు సెలవు పెట్టుకొని ఇంట్లో ఉండి చేయమంటే ఏ ఒక్కరికీ అది అయ్యేది కాదు, జరిగేది కాదు అంటారు. అలాగే ఆడవారిని ఇల్లు వదిలి పెట్టి వచ్చి ప్రకృతి ఆశ్రమాలలో కదలకుండా ఉండి చేయమంటే అవకాశం లేదని, జరుగుబాటు కాదని వారు కూడా ప్రకృతి వైద్యానికి దూరం అవుతున్నారు. అలాంటి ఇబ్బందుల వల్లే ఈ విధానం అందరికీ అందుబాటులోనికి రాలేక పోతుంది.
ఇలాంటి వారికి ఉపవాస జీవన విధానం అందుబాటులోనికి తీసుకొని వెళ్ళడం కొరకే మేము ఇంటి దగ్గర ఉపవాస విధానాన్ని చేయించడం అలవాటు చేస్తున్నాము. ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకొంటూ ఆడవారు, ఆఫీసు పనులు చేసుకుంటూ మగవారు మా దగ్గర ఉపవాస ధర్మాన్ని తెలుసుకోవడం జరుగుచున్నది. వీరు కొద్దిపాటి పనులను చేయడం కారణంగా 15-20 శాతం రక్తం రిపేరు చేసుకోవడం నుండి పనికి మళ్ళుతుంది. రాత్రి పూట, మధ్యాహ్నం పడుకొంటే మళ్ళీ అలాంటి సమయాల్లో పూర్తిగా ఉపవాసం వల్ల ఉపయోగం వస్తుంది. ఉపవాసంలో ఆ కొద్ది పాటి పని చేయడం వలన కూడా ఉపవాసం రోజులు (శుద్ధికావడానికి) పూర్తి విశ్రాంతి తీసుకొన్న వారికంటే 15-20 శాతం ఎక్కువ రోజులు పట్టవచ్చు. అంటే పది రోజులలో పూర్తి అయ్యే ఉపవాసాలు పనిచేసుకొంటూ చేస్తే 14, 15 రోజులు పడతాయి అని అర్థం. తేనె ఎక్కువగా ఇస్తున్నందువల్ల మీరు చేసుకొనే కొద్దిపాటి పని వలన నీరసం రాకుండా కాపాడగలుగుచున్నది. తేనె కారణంగా ఇటు పనీ గడుస్తున్నదీ, అటు ఉపవాసమూ దెబ్బతినకుండా పూర్తిగా చేయగలుగుచున్నాము. అవకాశమున్నవారు పూర్తిగా విశ్రాంతిలో ఉండి ఉపవాసము చేయడానికే ప్రయత్నించడం మంచిదని నా అభిప్రాయము కూడా. అలా చేసిన వారు ఉపవాసానికి పూర్తి న్యాయం చేసినట్లు అవుతుంది.
విశ్రాంతి విలువ: విశ్రాంతినిస్తేనే ఉపవాసానికి విలువ పెరుగుతుంది. ఎంత విశ్రాంతినిస్తే అంత బలం ఉపవాసానికి వస్తుంది. విశ్రాంతి ద్వారానే శరీరానికి శక్తి కూడా పెరుగుతుంది. ఉపవాసంలో ఖాళీ చూసుకొని ప్రశాంతంగా పగలు, రాత్రులు ఎక్కువ సమయం పడుకొంటూ ఉంటే చాలా మంచిది. నిద్రపట్టక పోయినా అలా పడుకోవడంలో రిపేరుకు శరీరం అనుకూలంగా ఉంటుంది. కదిలే చెక్క మీద మేకు కొట్టినప్పటికీ సరిగా దిగదు. అదే చెక్క స్థిరంగా, కదలకుండా ఉంటే తేలికగా తక్కువ శక్తితో దిగుతుంది. అలాగే ఉపవాసంలో శరీరం స్థిరంగా ఉంటే శక్తి నిలకడగా పనిచేయడానికి అవకాశం కల్గుతుంది. పగలు ఎంత సేపు పడుకొన్నప్పటికీ ఉపవాసంలో నష్టం లేదు. ఆహారంలోనికి వచ్చిన తరువాత ఎంత పనిచేసుకొంటే అంత మంచిది. అదే ఉపవాసంలో ఎంత విశ్రాంతి తీసుకొంటే అంత మంచిది. సరైన విశ్రాంతి తీసుకొంటే ఉపవాసంలో ఆకలయ్యే వరకూ నీరసం రాకుండా ఉంటుంది. ఆకలి అవ్వకుండానే నీరసం వస్తే ఉపవాసం పూర్తి కాకుండానే విరమించవలసి వస్తుంది. ఉపవాసంలో విశ్రాంతి తీసుకోవడం ప్రథమ కర్తవ్యం.
ప్రారంభించిన ఉపవాసాలను ఏ ఇబ్బందులు రాకుండా సక్రమంగా ముగించాలంటే ఉపవాసంలో వ్యాయామాలు, పనులు చేయడం మాని విశ్రాంతి తీసుకోవడం ఉత్తమము. మీరు కోరుకున్న ఫలితం, ఆశించిన ఫలితం తప్పనిసరిగా తక్కువ కాలంలో పొందగలరు. ఎక్కడ పాటించవలసిన ధర్మాలను అక్కడ పాటించక తప్పదు కదా! మానవ మాత్రులం కాబట్టి మన ప్రయత్నం మనం చేయక తప్పదు. ప్రయత్నించండి.

22. ఉపవాసంలో చెడ్డ వాసనలు ఎందుకు వస్తాయి?

బాకీలు తీసుకునేటప్పుడు సంతోషముగానే ఉంటుంది. కానీ ఆ బాకీలు తీర్చేటప్పుడు బాధగా ఉంటుంది. అలాగే ఆహారం తినేటప్పుడు కమ్మగా రుచిగా ఉండి మంచి వాసనలు వస్తూ ఉంటేనే గానీ మనకు ఎక్కువ ఆనందము రాదు. ఆ రుచిగల ఆహారం ద్వారా తయారైన వ్యర్థ పదార్థాలు ఏ రోజుకారోజు విసర్జింపబడక శరీరంలో అలాగే నిలువ యుండిపోయి అదే చివరకు వాసనగా తయారవుతుంది. అలా శరీరంలో నిలువ ఉండి, విసర్జింపబడని వ్యర్థ పదార్థాలు రెండు మూడు రోజులలో గట్టిపడి శరీరంలోనే పేరుకొని పోయి ఎండి పోతుంది. ఆ చెడు పదార్థం ఎండిన తరువాత కొంత వాసనను కోల్పోతుంది. ఈ రోజులలో, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు నూటికి 60 శాతం (ఆహారం ద్వారా వచ్చిన చెడు) చెడు లోపలే నిలువ ఉండి పేరుకొని పోతే, 40 శాతం మాత్రమే రోజూ విసర్జింపబడుతుంది. ఈ విధంగా రోజూ శరీరంలో చెడు ఎన్నో ఏళ్ళుగా పేరుకొని పోవడం జరుగుతూ ఉంటుంది. మనిషి ఎక్కువ రుచి, మంచి వాసనలుగల ఆహారం ఎంత ఎక్కువగా తింటే అవి విసర్జింప బడేటప్పుడు కూడా అంత ఎక్కువ చెడు వాసనను కలిగి ఉంటాయి. ఉదాహరణకు జంతువుల మల మూత్రాలలో ఎక్కువ వాసన లేకపోవడానికి గల కారణం కూడా అవి తినే పదార్థం సహజమైన రుచి, వాసన కలిగి యుండటమే దాని రహస్యం.
రోజూ మనకు మలం, మూత్రం, చెమట మరియు గాలి ద్వారా తక్కువ శాతం చెడు బయటకు పోబట్టి కొద్ది వాసనతోనే అవి వెలువరింపబడటం జరిగి ఎక్కువగా చెడు పదార్థం, వాసనలు లోపలే ఉండి పోవడం జరుగుచున్నది. శరీరాన్ని లోపల శుద్ధి చేయడం కొరకు ఉపవాసాన్ని ప్రారంభిస్తున్నాము. ఉపవాసంలో ఆహారం లేని కారణంగా ఆ చెడు శరీరంలో పేరుకొని పోవడం బదులు నిలువయున్న చెడు కదలడం ప్రారంభిస్తుంది. ఉపవాసంలో అంతకు ముందెన్నడూ త్రాగనంత మంచి నీరు (సుమారు 6 నుండి 7 లీటర్లు) త్రాగడం వలన లోపల నిలువ యున్న వ్యర్థ పదార్థాలన్నీ నాని కదలడం ప్రారంభిస్తాయి. ఉపవాసం ప్రారంభమయిన మూడు లేదా నాలుగవ రోజునుండి లోపల నిలువయున్న చెడు పదార్థం పునాదులతో సహా కదులుతుంది. ఆ ఎండిన చెడు పదార్థం నీళ్ళ ద్వారా ఉపవాసంలో నానినప్పటి నుండి దాని చెడ్డ వాసన ఎక్కువ అవుతుంది. ఆ కదిలిన చెడు పదార్థం విసర్జకావయాల ద్వారా బయటకు పోవలసిందే. కదిలినది బయటకు వెళ్లేటప్పుడు గానీ దాని యొక్క అసలైన చెడ్డ వాసన, స్వభావం బయట పడదు. వీధులలోని మురుగు కాలువల వల్ల వచ్చే చెడ్డ వాసన రోజూ కంటే మునిసిపాలిటీ వారు శుభ్రం చేసే రోజున భరించలేనట్లుగా ఉండటం కూడా అలాంటిదే. మనిషి యొక్క అసలు స్వభావం అతను చేసే పనిని బట్టి చూస్తే తేలిపోతుంది. అలాగే మనం ఇన్ని రోజుల నుండి ఎంత చెడ్డ పదార్థాన్ని శరీరంలో నిలువచేసుకున్నదీ, ఉపవాసంలో కదిలి, వాసనలతో బయటకు వస్తుంటే గానీ అర్థం కాదు. ఈ చెడు వాసనలన్నీ ఉపవాసాన్ని విరమించే ముందు పూర్తిగా తగ్గిపోతాయి.
ఉపవాసం చేస్తూ ఉండగా వచ్చే నోరు వాసన, వదిలే గాలి వాసన (ముక్కు ద్వారా), వచ్చే చెమట వాసన, పొసే మూత్రం వాసన, వెళ్లే మలం వాసన, మొదలగు వాసనలన్నీ ఒక్కసారే రావడంతో ఉపవాసంలో ఉన్న వారు కంగారు పడుతుంటారు. ఇది వరకెన్నడూ నాకు ఇలా వాసనలు రాలేదు ఇప్పుడే అన్ని వస్తున్నాయి. లోపల ఏదన్నా చెడు జరుగుతున్నదేమో అని కొందరు భయపడుతుంటారు. మరి కొందరు ఆ వాసనలను భరించలేక ఉపవాసాన్ని విరమించేద్దామన్న ఆలోచనలో ఉంటారు. ఆ వాసనల వలన ప్రక్క వారితో మాట్లాడాలన్నా దగ్గరకు పోవాలన్నా సిగ్గు పడుతుంటారు. ఆ చెడు పదార్థాలన్నీ బయటకు పోకపోతే లోపలే ఉండి ఎన్నో దీర్ఘ రోగాలకు దారి తీస్తాయి. దీర్ఘ రోగాలు తెచ్చుకొని వాటితో జీవితం అంతా బాధ పడేషకంటే నాలుగు రోజులు ముక్కులకు ఇబ్బంది అయినా ఉపవాసాలలో ఓర్చుకొని శరీరాన్ని పూర్తిగా శుభ్రం చేసుకుంటే పైకి పౌడర్లు, అత్తర్లు, సబ్బులు, పేస్టులు వాడవలసిన అవసరం లేనంత శుభ్రంగా మీరు తయారువుతారండీ. ఇది నిజమండీ!

23. ఉపవాసంలో మనస్సు ప్రశాంతంగా ఎందుకు ఉంటుంది?

శరీరం ఒక కుటుంబమయితే అన్ని అవయవాలు కుటుంబ సభ్యులు. కుటుంబానికి అధిపతి భర్త లేదా తండ్రి. అలాగే శరీరానికి అధిపతి మనస్సు. భర్తకు అనుకూలంగా భార్య, పిల్లలు నడుస్తుంటారు. అలాగే మనస్సుకు అనుకూలంగా అవయవాలు, మిగతా భాగాలు నడుస్తుంటాయి. అటు ఆనందాన్ని, ఇటు దుఃఖాన్ని కుటుంబంలో అందరూ కలిసే పంచుకుంటారు. అలాగే ఆరోగ్యాన్ని, అనారోగ్యాన్ని కూడా శరీరం మనస్సు రెండూ కలిసే పంచుకొంటూ ఉంటాయి. ఇంట్లో ఏ ఒక్కరికి బాగో పోయినా యజమానికి ప్రశాంతత లోపిస్తుంది. అలాగే ఒంట్లో ఏ భాగానికీ, అవయవానికీ బాగోపోయినా మనస్సుకు ప్రశాంతత లోపిస్తుంది. ఇంట్లో యజమాని చెప్పిన పనిని భార్య, పిల్లలు గానీ చేయక పోతే యజమానికి వారి మీద కోపం రావడం సహజం. ఆ నిముషం నుండి చిరాకుగా ఉండి అశాంతిగా ఉంటాడు. అలాగే మనస్సు చెప్పిన పనిని భాగాలు, అవయవాలు సరిగా చేయక పోతే మనలాగే మనస్సుకు కూడా బాధ, చిరాకు కలిగి అశాంతిగా ఉంటుంది. మనం అనుకున్న పనులన్నీ అనుకున్నట్లుగా అయిపోతుంటే మనకు సంతోషంగా ఉండటమే కాకుండా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే శరీరంలో కూడా అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతుంటే మనస్సుకు ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఉదాహరణకు ప్రేగులలోని విరేచనం ఏ రోజుది ఆ రోజు బయటకు పూర్తిగా నెట్టి వేయాలని మనస్సు ప్రయత్నిస్తూనే ఉంటుంది. మనకు విరేచనం సాఫీగా అయిన రోజున మనస్సు ప్రశాంతంగా, హాయిగా ఉండి సరిగా అవ్వని రోజున చిరాకుగా, బాధగా ఉండటం మనందరం గమనిస్తూనే ఉంటాం. ప్రేగులలో విరేచనం గట్టి పడి సరిగా కదలనందుకు ప్రేగులు కష్టపడటమే కాకుండా, ఆ ప్రయత్నం మనస్సు చేయిస్తూ మనస్సు కూడా ఆ బాధను పంచుకుంటూ ఉంటుంది. సుఖాన్ని పంచుకోవడం చేతనయినప్పుడు కష్టాన్ని, బాధను కూడా పంచుకోవడం చేత కావాలన్నమాట. అదే మన మనస్సు కూడా ఇక్కడ చేస్తున్నది.
మన మనస్సు రకరకాల రుచులను తినమని రోజూ కోరికలు పుట్టిస్తూ ఉంటుంది. ఆ రుచులు కమ్మగా ఉంటేనే మన నాలిక తింటుంది. తిన్న పదార్థాన్నంతా స్వీకరిస్తుంది మన శరీరం. క్షణికంలో మనస్సు, నాలిక పనులు పూర్తి అవుతాయి. ఆ తిన్న పదార్థాల నుండి వచ్చిన మంచిని గానీ చెడును గానీ ముందు శరీరం అనుభవించాలి. కేవలం రుచి గురించి తిన్న పదార్థాలయితే వాటివల్ల శరీరం ఆ రోజు నుండే ఇబ్బంది పడుతూ ఉంటుంది. శరీరంలో భాగాలు ఇబ్బంది పడుతూ ఉంటే వాటి యజమాని అయిన మనస్సుకు కూడా ఆ ఇబ్బందిని పంచుకోక తప్పదు. పైగా ఆ రుచులను తినమని ప్రేరేపించింది మనస్సే కాబట్టి ఆ నష్టాన్ని, కష్టాన్ని పంచుకోవలసిన బాధ్యత మనస్సుకు కూడా ఎక్కువ ఉన్నదన్నమాట. ఈ విధంగా రోజూ మనస్సు, శరీరం కష్టసుఖాలను పంచుకొంటూ కాలక్షేపం చేస్తూ ఉంటాయి. బంధాలు ఎక్కువగా పెంచుకొంటే బాధలు ఎక్కువగా ఉంటాయని, మనకు ఇబ్బందులు వస్తాయని పెద్దల మాటలు. అలాగే మనస్సు కోరుకున్న కోరికలు, రుచులే మనస్సుకు ఇబ్బందులను, బాధలను తెచ్చి పెడుతున్నాయి. ఆ విధంగా ఉన్న ప్రశాంతతను దూరం చేసుకొంటున్నది. మనస్సు కోరే కోరికలను చెల్లించకుండా ఉంటేనే (ఉపవాసం) మనస్సుకు ఎందుకు ప్రశాంతత వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పొట్ట ఖాళీగా ఉంచడం ద్వారా: పొట్టను ఖాళీగా ఉంచితే మనస్సుకు ప్రశాంతత వస్తుందంటే ఆశ్చర్యంగా ఉందా? మామూలుగా అయితే పొట్ట ఖాళీ అయినప్పుడు మనస్సులో కోరికలు పరుగెడుతూ ఉండటం వలన ఉన్న ప్రశాంతత కాస్తా లోపిస్తుంది. అంటే ఆకలి అంత పని మన మనస్సు చేత చేయిస్తుందన్నమాట. ఆ లోపించిన ప్రశాంతత ఆహారం తినేటప్పుడు వచ్చే ఆనందం వలన తిరిగి మనస్సు ప్రశాంతతను పొందుతుంది. బాగా రుచిగల ఆహారం తింటుంటే ఆ తిన్న కాసేపు మాత్రమే ఆనందంగా అనిపించి, ఆ ఆహారం అరిగేటప్పుడు మరలా శాంతి లేనట్లుగా అయిపోతుంది. ఉదాహరణకు పలావు తినేటప్పుడు లేదా బాగా నూనెను పీల్చిన పిండివంటలను తినేటప్పుడు పొట్టలో జరిగే మార్పులకు ప్రేగులు, పొట్ట ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అప్పుడు మనకు పొట్టలో బరువుగా, చిరాకుగా ఉండి ఏమీ తోచనట్లు అనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో మన మనస్సు తన అనుచరులు అయిన పొట్ట, ప్రేగులు పడే ఇబ్బందులను కొద్దిగా పంచుకొంటూ, తను కూడా చిరాకుగా, అశాంతిగా ఉంటుంది. అందువలనే మనం భోజనం చేసిన తరువాత ఏ పనినైనా చురుగ్గా చేయలేక పోవడం, సరిగా చేయలేక పోవడం, మనస్సు మందంగా ఉండి నిద్రరావడం మొదలైనవి జరుగుతూ ఉంటాయి. అలాగే ఉదయం పూట పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు మనం ఎక్కువ హుషారుగా ఉండటంతో పాటు, ప్రశాంతంగా ఉన్నట్లు అందరికీ అనిపిస్తుంది. పొట్టలో ఆకలి ప్రారంభమవ్వనంత వరకూ ఉదయం పూట ఆ విధంగానే ఉంటుంది. ఆకలి మొదలు పెట్టిన దగ్గర నుండి మనకు ఈ ప్రశాంతత లోపించడం ఆరంభం అవుతూ ఉంటుంది. ఉపవాసంలో కూడా ఏమీ తిననందుకు ఆకలి అయి, ప్రశాంతత లోపిస్తుందేమోనని మీకు అనిపించవచ్చు. అది నిజం కాదు. ఎందుకు కాదో తెలుసుకుందాము.
ఉపవాసంలో మొదటి రెండు రోజులు అప్పుడప్పుడూ కొంత మందికి ఆకలి అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించినప్పుడల్లా మనస్సులో బాధగా, ప్రశాంతత లేనట్లుగా అనిపించడం వాస్తవమే. కానీ ఉపవాసం ప్రారంభించిన మొదటి రోజు ఉదయం నుండి చాలా ప్రశాంతంగానే ఉంటుంది. సాయంత్రం నుండి ప్రశాంతత లోపించడం ప్రారంభం అవుతుంది. అంటే మొదటి రోజు సాయంకాలం నుండి గానీ ఉపవాసంలో ఆకలి ప్రారంభం అవడం జరగదు. మూడవ రోజు ఉపవాసం నుండి ఆకలి ఆరాటం పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. ఉపవాసంలో ఎంత ఆకలి లేకుండా ఉంటే అంత ప్రశాంతంగా మనస్సు ఉంటుంది. పొట్ట, ప్రేగులు ఎప్పుడు పని లేకుండా విశ్రాంతిలో ఉంటే అప్పుడు మనకు శాంతి లభిస్తుంది. మామూలుగా ఆహారం తింటున్న రోజులలో ఉదయం పూట గంట, రెండు గంటలు పొట్ట ఖాళీగా ఉండి ఆకలి లేనందుకే మనకు అంత ఆనందం, ప్రశాంతత ఉంటే, మరి 24 గంటలూ ఆకలి లేకుండా, పొట్ట ఖాళీగా ఉంటే అలాంటి ఉపవాసాలలో మన మనస్సుకు దొరికే ప్రశాంతతగానీ, ఆనందాన్నీ గానీ ఎంత అని వర్ణించగలము? అది వర్ణనాతీతం. తేనె అమృతం. అలాంటి అమృతాన్ని సేవిస్తూ ఉపవాసాలు చేస్తూ ఉంటే మనకు ఎలా అనిపిస్తుందంటే, ఈ తేనె నీళ్ళ ఉపవాసాలతోనే జీవితం అంతా గడిపివేద్దాం అన్నంత ఆవేశం వస్తుంది. మనిషికి ఉపవాసంలో ఎంతో పట్టరాని ఆనందం, కొనలేని ఆనందం, మానసికమైన ప్రశాంతత ఎంతో రానిదే ఆ మాట ఎలా అనగలుగుతారు. రోజూ రకరకాల వంటలను, రుచులను కోరే మనస్సు ఉపవాసంలో ఆ మాట మన చేత అనిపించగలుగుతున్నది అంటే ఆ రుచుల కంటే, క్షణికమైన సుఖం కంటే మించిన ఆనందం ఏదో దొరకబట్టే కదా! సౌకర్యాలు లేని రోజులలో బస్సు ప్రయాణం చాలా ఆనందంగా ఉండేది. సౌకర్యాలు పెరిగి రైలు ప్రయాణాలు వచ్చాక చాలా తేలికగా, హాయిగా ప్రయాణం ఉంటుందని బస్సును ఎక్కడం తగ్గిస్తున్నాం లేదా మానివేస్తున్నాం. అలాగే రుచి కలిగించే క్షణికమైన సుఖం ద్వారా వచ్చే ఆనందం కంటే ఎన్నో వందల రెట్లు ఉపవాసంలో మనస్సుకు దొరుకుతుంది కాబట్టి ఆ రుచుల సుఖం మనకు అక్కరలేదని ఉపవాసంలో అనిపిస్తుంది. అందువల్లనే బ్రహ్మానందాన్ని పొందగోరే ఋషులు, మునులు ఆహార నియమాలు, ఉపవాసాలు ముఖ్యంగా చేస్తూ ఉంటారు. ఉపవాసాన్ని విరమించాక ఉపవాసంలో దొరికిన ఆనందాన్ని గుర్తు పెట్టుకొని మరలా రుచుల జోలికి పోని వారికి జన్మ ధన్యం అవుతుంది. వారికి ఆహారంలో నియమాల వలన, 24 గంటలూ మనస్సు ఉపవాసంలో ఉన్నట్లు ప్రశాంతతను, ఆనందాన్ని పొందడానికి ఎక్కువ మంది ధ్యానం చేస్తూ ఉంటారు. ధ్యానం చేసే వారెవరూ పొట్ట నిండా ఆహారాన్ని తిన్న తరువాత ధ్యానం చేయడం చేయరు. ఆహారం తిన్న తరువాత మనస్సుకి ప్రశాంతత లోపించి నిలకడ కుదరదు. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడే ఎవరైనా ఏకాగ్రతని, శ్రద్ధని, మానసికమైన సుఖాన్ని పొందగలరని ఇక్కడ స్పష్టం అగుచున్నది.
అందువలనేమో మన పూర్వీకులు, ఋషులు పూజలప్పుడు, పెళ్ళిళ్లు చేసేటప్పుడు, కర్మలు చేసేటప్పుడు, యజ్ఞాలు చేసేటప్పుడు ఉపవాస ధర్మాన్ని అవలంభించాలని ఆ నియమాన్ని ఆచారంగా ప్రవేశపెట్టియున్నారు. అవి చేసేటప్పుడు మనస్సు ఏకాగ్రతగా, ప్రశాంతంగా, శ్రద్ధగా ఉండాలి కాబట్టి, ఆహారం తీసుకుంటే అవి లోపిస్తాయి కాబట్టి ఆ సమయంలో ఉపవాసం ద్వారా వాటిని నిర్విఘ్నంగా కొనసాగించడానికి ప్రవేశపెట్టారు. రాత్రికి వివాహం అయితే ఆ రోజు ఉదయం నుండి కన్యాదానం చేసే తల్లి తండ్రులను, కన్యను కూడా ఉపవాసంలో ఉంచుతారు. పొట్టను అన్ని గంటలు ఖాళీగా ఉంచితే గానీ అంతటి మహా కార్యాన్ని నిర్విఘ్నంగా సాగించలేరని మన పెద్దల అభిప్రాయం. వివాహం రోజున విందు భోజనాలు, పిండివంటలు, పలావులు అన్నీ చేస్తే వచ్చిన బంధువులకు పెడతారుగానీ, పెళ్ళి దగ్గర కూర్చునే వారికి మాత్రం ముందు పెట్టకుండా, ఆ శుభకార్యం పూర్తి అయ్యాక గానీ పెట్టరు. పెళ్ళి దగ్గర కూర్చొనే నలుగురూ పొట్టనిండా భోజనం చేసి అన్ని గంటలు కదలకుండా కూర్చోవాలంటే అది ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆ ఉపవాస ధర్మాన్ని వారికి పెట్టారు. అలాగే పితృకార్యాలలో అంటే పెద్దలు చనిపోయినప్పుడు చేసే కర్మలలో ఆ పదమూడు రోజులు ఒక పూటే భోజనం పెడతారు. ఉదయం నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఉపవాసంలోనే ఉంచుతారు. పెద్దలు చనిపోయినందుకు వచ్చే బాధలకు సగం ఆరోగ్యం దెబ్బ తింటూ ఉంటుంది. దానికి తోడు రెండు పూటలా భోజనం చేస్తే ఆరోగ్యం దెబ్బ తింటే కర్మకాండలు సరిగా చేయలేరని ఉపవాస విధానాన్ని ఆచరింపజేస్తారు. అలాగే నిరాహార దీక్షలు చేసేటప్పుడు, ఒక మంచి కార్యాన్ని సాధించడానికి మనస్సును శక్తివంతంగా చేసుకోవడానికి ఆహారాన్ని పూర్తిగా మానడం చేస్తున్నారు. ఆహారం లేనప్పుడు వచ్చే ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఆలోచనల గడిబిడి ఉపవాసంలో ఉండదు. పూజలు చేసేటప్పుడు, దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థించడానికి, ఆయనపై మనస్సును లగ్నం చేయడానికి ఆహారాన్ని తీసుకోకూడదన్నది శాస్త్రం. మనస్సులో ప్రశాంతత, భక్తి భావం కలగడానికే మనం ఆహారాన్ని పూర్తిగా వీడాలన్నది. ఇలాంటి ప్రశాంతతను అందించే ఉపవాస విధానాన్ని మరుగున పెట్టే రోజులు వస్తున్నందుకు, సమాజంలో ప్రేమ, ఆనందం, ప్రశాంతత పూర్తిగా కరువైపోవడం కళ్ళారా చూస్తున్నాము. చివరగా మనం గుర్తించుకోవలసిందేమిటంటే ఎప్పుడు ప్రశాంతతను, ఆనందాన్ని పొందాలన్నా ఆహారాన్ని మాని పొట్టను ఖాళీగా ఉంచితే తప్పనిసరిగా మానసికమైన ఆనందాన్ని పొందవచ్చని.
2. విసర్జన క్రియ ద్వారా: మనం రోజూ ఆహారం తినేప్పుడు శరీరంలో వ్యర్థ పదార్థాలు తయారవుతూ ఉంటాయి. తయారైన వ్యర్థ పదార్థాలను శరీరం నుండి పూర్తిగా బయటకు నెట్టి వేయడానికి మనస్సు 24 గంటలూ కృషి చేస్తూ ఉంటుంది. ఏ రోజు చెడు ఆ రోజు కదిలి వెళ్ళి పోతూ ఉంటే మనస్సు ఎక్కువ కష్టపడకుండానే పని పూర్తి అవుతూ ఉంటుంది. ఆహారం తింటూ ఉన్న రోజులలో ఆ తిన్న ఆహారం మనస్సు ప్రశాంతతను కొంత అపహరిస్తే, వాటి ద్వారా (ఆహారం) శరీరంలో తయారయ్యే వ్యర్థ పదార్థాలు పూర్తిగా బయటకు పోక మరికొంత ప్రశాంతతను అపహరించి వేస్తాయి. ఇది పోగా (ఆ ప్రశాంతత పోగా) మిగతాదే రోజూ మనం పొందే ప్రశాంతత. రాను రానూ శరీరంలో చెడు పదార్థాలు ఎక్కువ పేరుకొని పోతూ వుండడంతో ప్రశాంతత రోజురోజుకీ తగ్గిపోతూ ఉంటుంది. అందువల్లనే దీర్ఘ రోగాలున్న వారు, ఎక్కువ రోగాలతో బాధల్లో ఉన్న వారు చాలా దిగులుగా, దీనంగా ఉండడానికి కారణం. మనం వారిని చూసి ఎందుకండీ, బాధపడకండి, అన్నీ అవే సర్దుకుపోతాయి, సంతోషంగా ఉండండి అని చెబుతుంటాము. శరీరంలోని అవయవాలు అన్నీ చెడుతో పూడుకొని పోయి అవి బాధపడుతూ, మనస్సును కూడా బాధిస్తుంటాయి. అందువల్లనే ఆనందంగా, ప్రశాంతంగా ఉండాలనుకున్నా రోగాలు, జబ్బులు వచ్చిన వారు ఉండలేరు. శరీరం పూర్తిగా శుభ్రం అయిన రోజునే వారికి తిరిగి ప్రశాంతత లభిస్తుంది. మనకు వచ్చిన రోగాలకు మందులు వాడితే రోగం యొక్క లక్షణాలు మాత్రమే మందు ద్వారా తగ్గుతాయి. రోగం మాత్రం శరీరంలోనే ఉండిపోతుంది. అందువలన ఎన్ని సంవత్సరాలు అయినా అలా డాక్టర్ల చుట్టూ తిరుగుతూనే ఉంటాము. మందులు వాడినప్పటికీ రోగం అలానే ఉంటుంది కాబట్టే రోగం లేనట్లు పైకి అనిపించినా మనస్సులో ప్రశాంతత మాత్రం రాదు. మందులు వాడిన శరీరం, మనస్సు రెండూ లోపల బాధలు పడడం తప్పడం లేదు కాబట్టి ఆనందంగా ఉండలేము. అదే రోగి ఉపవాసాలు చేస్తూ ఉంటే రోజు రోజుకీ రోగం లోపల నుండి తగ్గుతూ వస్తుంది కనుక రోజురోజుకీ ఉపవాసంలో ప్రశాంతంగా, ఆనందంగా ఉండగలుగుతాడు. వారు ఉపవాసంలో పొందే ఆనందం ఇంత అంత అని చెప్పలేము. అప్పుడు తెలుస్తుంది మందులు శరీరానికి ఏమి చేస్తున్నదీ, ఉపవాసం ఏమి చేస్తున్నదీ. ఆ రోజు వరకూ ఉపవాసం విలువ తెలియదు. ఇప్పుడు ఉపవాసంలో విసర్జన క్రియ ద్వారా మనస్సు ఎలా తేలిక అవుతుందో చూద్దాం.
ఉపవాసం ప్రారంభించిన మొదటి రెండు రోజులు శరీరంలో చెడు నానదు. శరీరం నుండి కదలడం ప్రారంభం కాదు. ఈ రెండు రోజులు ఉపవాసంలో మనస్సు కొద్దిగానే ప్రశాంతంగా ఉంటుంది. మూడవ రోజు ఉపవాసం నుండి శరీరంలో చెడు కదిలి వెళ్ళడం ప్రారంభమవుతుంది. మనస్సు రోజూ కోరుకున్నట్లు శరీరంలోని అన్ని అవయవాలు, భాగాలు ఉపవాసంలో వాటిలోని చెడును రోజూ వదిలి వేస్తూ ఉంటాయి. ఏ చెడు అయితే శరీరంలో పేరుకొని పోయి రోజూ మనస్సును ఇబ్బంది పెట్టేదో, ఆ చెడు ఇప్పుడు ఉపవాసంలో కదిలి వెళుతూ ఉంటుంది. జాడించి విరేచనం అయిన తరువాత ఎంత సుఖంగా ఉంటుందో, అలాగే నిలువయున్న చెడు కదిలి వెళ్ళి పోతుంటే కూడా మనస్సుకు అంత సుఖంగా ఉంటుంది. ఒక్క విసర్జకావయం అయిన మలం ప్రేగుద్వారా (జాడించి విరేచనం) చెడు పోయినందుకే అంత సుఖం మామూలు రోజులలో మనస్సుకు ఉంటే, ఉపవాసంలో నాలుగు విసర్జకావయవాల ద్వారా చెడు కదిలి వెళుతుంటే ఇంకా ఎంత సుఖం, ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆలోచించండి. కంటిలో నలుసు పడ్డప్పుడు ఆ నలుసు పోయే వరకు మన మనస్సుకు కుదురు ఉండదు, సుఖంగా ఉండదు. ఇంత నలక కంటిలో పడ్డందుకే అంత ఆలోచన మనస్సుకు వచ్చి మనస్సుకు ప్రశాంతత లేనట్లుగా ఆ కాసేపు అనిపిస్తుంది. ఆ విధంగా లెఖ్ఖ వేసుకుంటే మన శరీరంలో రోజూ పేరుకొని పోయే సుమారు 50-60 శాతం చెడు వల్ల ఎంత మనశ్శాంతిని, ఆనందాన్ని మనం దూరం చేసుకుంటున్నామో ఆలోచించండి. మనము రోజూ ఎంత నష్టపోతున్నామన్నది మామూలు రోజులలో తెలియదు. శరీరం, మనస్సు ఆ సుఖానికి, ఆ ఆనందానికి, ఆ ప్రశాంతతకు అలవాటు పడ్డప్పుడు లభించే సుమారు 40 శాతం ప్రశాంతతే (60 శాతం చెడు శరీరంలో ఉంటుంది కాబట్టి) పరిపూర్ణంగా అనిపిస్తుంది. ఈ స్థితిలో శరీరాన్ని ఉంచుకొని రోజూ ధ్యానం చేసే వారికి కూడా లభించేది సుమారు ఆ 40 శాతం ప్రశాంతతే. ఎప్పుడూ ఉపవాసం చేయని వారికి కూడా లభించేది మాత్రం ఇంతే. ఉపవాసంలో నాలుగవ రోజు నుండి మనస్సుకు ఆటంకం కలిగించే చెడు కొద్ది కొద్దిగా కదిలి పోతున్న కొద్దీ, మనస్సు యొక్క ప్రశాంతత కొద్ది కొద్దిగా రోజురోజుకి పెరుగుతూ బయటపడుతూ ఉంటుంది.
మనలో ఎంత చెడు దాగి యున్నదనేది మనకు మామూలు రోజులలో తెలియదు. కానీ ఉపవాసంలో అది కదిలి బయటకు (మలం, మూత్రం, చెమట) వాసన రూపంలో వెళుతూ ఉంటే ఇదంతా ఎక్కడుంది? ఎన్నాళ్ళ నుండి ఉంది? ఇంత ఎందుకు ఉంది? అన్న ప్రశ్నలు అప్పుడు వస్తుంటాయి. అలాగే ఉపవాసం ద్వారా పూర్తిగా శరీరం శుభ్రం అయినప్పుడు ఆహారం తింటున్న రోజులలో ఎంత ప్రశాంతతని, ఆనందాన్ని నష్ట పోతున్నామనేది పూర్తిగా శరీరంలో జరిగే మార్పులను మనస్సు పెట్టి ఆలకించిన వారికే ఉపవాసంలో తేడాలు, సుఖం స్పష్టంగా తెలుస్తాయి. రోజూ సబ్బు పెట్టి స్నానం చేసి శరీరం అంతా చాలా శుభ్రం అయ్యింది, చాలా ప్రశాంతంగా ఉంది అనుకుంటాము. స్నానం పూర్తి అయ్యేటప్పుడు మురికి అంతా పూర్తిగా పోయింది, ఇంక ఏమీ లేదనిపిస్తుంది. తరువాత ఎప్పుడన్నా ఒక్క రోజు నలుగు పెడుతుంటే వచ్చే మురికిని చూసాక గానీ సబ్బు రోజూ ఏమి చేస్తున్నది, ఎంత శుభ్రం చేస్తున్నది అప్పుడుగానీ అసలు బండారం బయటపడదు. నలుగు పెట్టిన వారికే అసలు విషయం స్పష్టంగా తెలిసినట్లు, ఇక్కడ ఉపవాసంలో ఉన్న వారికే మనస్సు యొక్క ప్రశాంతతను, ఆనందాన్ని ఆహారం ఎంత పాడుచేస్తున్నదీ స్పష్టంగా అవగాహన అవుతుంది. అందువల్లనే పెద్దలు ఏదన్నా అనుభవిస్తే గానీ పూర్తిగా తెలియదు అని అంటారు. ఆహారనియమాలు, ఉపవాస విధానాలు తెలియని వారికి మానసికమైన ఆనందం, సుఖం, ప్రశాంతత లభించేది 40-50 శాతం మాత్రమే ఉంటుంది. ధ్యానం చేసే వారు ఆహార నియమాన్ని, ఉపవాస ధర్మాన్ని పాటించకపోతే వారికి దొరికేది కూడా అంత మాత్రమే అవుతుంది. ఉపవాసంలో ఉన్నన్ని రోజులూ మానసికమైన ప్రశాంతత పూర్తిగా లభిస్తుంది. ఉపవాసాన్ని విరమించే ముందు, ఆకలయిన రోజు నుండి మీకు కొద్దిగా మనస్సు కుదురు తప్పుతుంది. ఆకలి కారణంగా ఈ మార్పు వస్తుంది. తరువాత రోజు నుండి అందించే ఆహారం మంచిదైతే ఆ ప్రశాంతత కొనసాగుతూనే ఉంటూ రోజురోజుకీ పెరుగుతూ 24 గంటలూ ఆనందంగా ఉంటుంది. అలాకాక ఎంత రుచులను మరలా జోడిస్తూ ఉంటే అంత సుఖం వెనక్కి పోతూ ఉంటుంది. దేనికైనా అదృష్టం ఉండాలంటారు. మనకు ఎంత సుఖం, ఎంత ప్రశాంతతను భగవంతుడు యిస్తే దాన్ని అందించే ఆహారనియమాలే మనం పాటిస్తూ ఉంటాము.
3. ప్రాణశక్తి ద్వారా: మనస్సును చైతన్యవంతం చేసేది ప్రాణశక్తే. ఎక్కువ ప్రాణశక్తి ద్వారా మనస్సు పరుగులు తీయకుండా అరికట్టవచ్చును. నిమిషానికి 18 సార్లు మనం గాలిని పీలుస్తూ వదులుతూ ఉంటాము. అదే భోజనం చేసిన తరువాత అయితే నిమిషానికి సుమారు 20-25 సార్లు వరకూ పీల్చుకోవలసిన ఆససరం వస్తూ ఉంటుంది. ఆ విధంగా శ్వాసలు పెరగడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది మనం భోజనం చేసే సరికి పొట్ట బరువు ఎక్కుతుంది. ఆ బరువు పొట్ట వెళ్ళి ఊపిరితిత్తుల చివరభాగాల మీద పడుతుంది. అందువలన రెండు ఊపిరితిత్తులు నిండుగా గాలిని పీల్చుకోలేక పోతాయి. సుమారు 25 శాతం గాలిని ఈ విధంగా మనం పీల్చుకోలేక పోతున్నాము. ఇక రెండవ కారణం, ఆహారాన్ని అరిగించడానికి ఎక్కువ ప్రాణశక్తి ఖర్చు అవుతూ ఉంటుంది. మనం తిన్న ఆహారం వండినది అవ్వడం వలన ఆహారంలో ఉన్న ప్రాణశక్తి అంతా పూర్తిగా నశిస్తుంది. ప్రాణశక్తి లేని వండిన ఆహారాన్ని జీర్ణం చేయడానికి మనలో నిలువయున్న ప్రాణశక్తితోపాటు పీల్చుకుంటున్న ప్రాణశక్తి కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. తద్వారా మనస్సును చైతన్యవంతం చేసే ప్రాణ శక్తికి శరీరంలో కొంత లోపం (ఆహారాన్ని జీర్ణం చేయడానికి కొంత వెళ్ళింది కాబట్టి) రావడంతో మనస్సు మందంగా అవుతుంది. మామూలుగా పీల్చుకొనే గాలి చాలక ఈ అవసరాలకు ఎక్కువగా పీల్చుకొంటుంటాము. అయినా సరే మనస్సు శక్తి హీనం అవుతున్నది. అదే మీరు సహజమైన పచ్చి కూరలు, పండ్లు పొట్టనిండా తీసుకున్నప్పుడు మీకు ఈ రకమైన ఇబ్బంది రాదు. వాటిలో ప్రాణ శక్తి ఎక్కువగా ఉండటం వలన వాటి జీర్ణానికి మనం పీల్చుకునే ప్రాణశక్తి ఎక్కువగా ఖర్చుకాదు. అదీ గాక వాటిని ఎంత తిన్నా పొట్ట నిండనందువల్ల కూడా ఆయాసం రాదు. ఈ విధంగా మనం రెండు పూటలా ఉడికిన భోజనం చేయడం ద్వారా భోజనం అయిన దగ్గర నుండి సుమారు 4-5 గంటలు ఉదయం మరియు 4-5 గంటలు సాయంకాలం మనస్సు మందం కావడం గానీ, ప్రశాంతత లోపించడం గానీ, శక్తి తగ్గిపోయినట్లుగానీ మనకు ఉంటూ ఉంటుంది. అలాగే ఉదయం సాయంకాలం టిఫిన్లు, చిరుతిండ్లు, డ్రింకులు మొదలగు వాటివల్ల ఇంకా కొంత నష్ట పోతుంటాము. భోజనం చేసిన తరువాత మనస్సు పెట్టి పరీక్షిస్తే భోజనం ముందు ఉన్న మన మానసికమైన శక్తి, తరువాత ఉన్న మానసిక శక్తికి ఉన్న భేదం చాలా స్పష్టంగా తెలుస్తుంది. మెదడు పనిచేయడానికి కావలసిన ప్రాణశక్తి ఎక్కువగా మనం తిన్న ఆహారం వలన ఖర్చు అవడం ఒక కారణమయితే, మనలో నిలువ యున్న శక్తి కూడా ఎక్కువగా ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఖర్చు అయిపోతుంది. అందువల్ల మనం అటు మానసికంగా, ఇటు శారీరకంగా భోజనం తర్వాత సుఖంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉండలేము. మనం తినే భోజనం మన మనశ్శాంతిని, ప్రశాంతతను ఎంత పాడుచేస్తున్నదని తెలియజేయడం కొరకు ఇదంతా చెప్పవలసి వచ్చింది.
మనం ఆహారం తింటున్న రోజులలో ఉదయం పూట నిద్ర లేచిన తరువాత మన రెండు ఊపిరి తిత్తులూ నిమిషానికి 14, 15 సార్లు ఆడుతుంటాయి. ఆ టైములో పొట్ట ఖాళీగా ఉండి మనం పీల్చుకునే ప్రాణశక్తి ఎక్కువగా ఖర్చు గాదు. శరీరానికి అవసరం కూడా తక్కువ ఉండి మనం తక్కువ సార్లే (14, 15 సార్లే) పీల్చుకోగలుగుతాము. అందువల్లనే ఆ సమయంలో మనకు చాలా నిర్మలంగా, ప్రశాంతంగా, చాలా శక్తి వంతంగా ఉంటుంది. కల్మషం లేని మనిషిలా మనలో ఎక్కువ లక్షణాలు ఆ సమయంలో కనబడతాయి. ఎంత ప్రాణశక్తిని తక్కువగా ఖర్చు చేయడం నేర్చుకుంటే అంత జీవితంలో సుఖపడతాము. ఎంత ఎక్కువగా ప్రాణశక్తిని ఖర్చు పెడితే జీవితంలో అంత బాధలు పడవలసి వస్తుంది. ప్రాణశక్తి (గాలి) ఎక్కువగా ఖర్చు అయితే శరీరంలో ఎక్కువ వ్యర్థ పదార్థాలు తయారవుతున్నట్లు, మనలో నిలువ యున్న శక్తి కూడా ఎక్కువ చెడు పదార్థాలకు వ్యయం అవుతున్నట్లు గుర్తు. గాలి ఊరకే వస్తుందిలే అని ఎక్కువ సార్లు పీల్చుకొంటే వచ్చే నష్టమేమిటో మనకు తెలియక పోయినా ఆయు క్షీణం మాత్రం జరుగుతుంది. నిమిషానికి 18 సార్లు గాలి పీల్చు కోవడం సహజమయితే, 18 సార్లు కంటే ఎప్పుడు ఎక్కువ పీల్చుకుంటున్నప్పటికీ అది మన అనారోగ్యానికి, అశాంతికి గుర్తు. బాగా సిగరెట్లు త్రాగి, ఎక్కువ పొట్ట పెంచుకొని, బాగా లావుగా ఉన్న వారికి అలుపు, ఆయాసంతోపాటు మానసికంగా ప్రశాంతత లోపించడానికి నిమిషానికి ఈ 18 సార్ల శ్వాసలు మించడమే కారణం. నిమిషానికి 25 సార్ల కంటే ఎక్కువగా పీల్చుకొనే వారికి 24 గంటలూ ఆయాసం, ఆందోళన, భయం, నీరసం నిద్ర పట్టక పోవడం, ఎప్పుడు చచ్చి పోదామా అన్నట్లు ఉంటుంది. ఆస్తమాలు, ఊపిరితిత్తుల జబ్బు ఉన్న వారు అయితే ఇంకా ఎక్కువ సార్లు పీల్చుకొంటూ 24 గంటలూ భూలోక నరకాన్ని అనుభవిస్తూ ఉంటూరు. నిద్రలో సుఖం అనేది ఎన్ని సార్లు శ్వాసలు పెరుగుతూ ఉంటే అంత సుఖ నిద్ర తగ్గిపోతు ఉంటుంది. శ్వాసలు పెరగడం వలన కోపం, చిరాకు, ఈర్ష్యా, ద్వేషం, ప్రేమ నశించడం, శాంతం లోపించడం మొదలగు మనిషిలో ఉండకూడని అసహజ గుణాలు ప్రవేశిస్తూ ఉంటాయి. శ్వాసలు పెరుగుతున్న కొలదీ వీటి యొక్క తీవ్రత కూడా పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు మనిషిలో మానవత్వం నశిస్తూ ఉంటుంది.
నిమిషానికి 18 సార్లు శ్వాసలు ఉంటే లక్షణాలు అన్నీ మధ్యస్థంగా ఉంటాయి. శ్వాసలు 18 సార్ల కంటే ఎన్ని తక్కువ సార్లు పీల్చుకోగలిగితే అంత మనస్సు నిగ్రహం పెరుగుతుంది. ఆహారం తింటున్న రోజులలో ఉదయం పూట నిమిషానికి 14, 15 సార్ల శ్వాసలు ఉంటాయని అనుకున్నాము. అందువలన ఆ సమయంలో శక్తిగా, హుషారుగా, ప్రశాంతంగా ఉంటుంది అని అనుకున్నాము. ఇలా రోజంతా ఉంటే (14, 15 సార్ల శ్వాసలు) రోజంతా ప్రశాంతంగా, హుషారుగా ఉంటుంది. మరి మనకు అన్నీ ఉడికినవి తినడం అలవాటు వలన ఆ సుఖం ఉదయంతో (తినే ముందు వరకే) పోతున్నది. అది పోకుండా ఉండాలంటే 60 శాతం అపక్వాహారం (పచ్చివి) తినవలసిందే. ప్రాణాయామం చేయడం (దీర్ఘ శ్వాసలు) ద్వారా ఊపిరి తిత్తులలో గాలిని ప్రవేశించే శాతాన్ని పెంచవచ్చు. ప్రాణాయామం ద్వారా శ్వాసలను తగ్గించుకోవచ్చు. అందువలననే ఋషులు, యోగులు ప్రాణాయమాలను తప్పనిసరిగా చేసేవారు. మన శ్వాసలు నిముషానికి 14 సార్ల కంటే ఇంకా తగ్గి పోతుంటే ఇంకా మనస్సు గట్టి పడుతూ, ఆరోగ్యం చాలా బాగుంటుంది. మేము చేప్పే ఆహారాన్ని ఉపవాసాలు చేసి అదే నిత్యం తీసుకొంటూ ఉంటే సుమారు 5, 6 నెలల్లో శ్వాసలు 10-14 సార్లకు వచ్చే అవకాశం ఉంటుంది. శరీరం బరువు ఉండవలసిన దాని కంటే కేజీలు పెరుగుతుంటే శ్వాసలు పెరుగుతుంటాయి. మన శ్వాసలు నిముషానికి 6 నుండి 10 సార్లకు తగ్గిపోతే మనం యోగుల క్రింద లెఖ్ఖ వేసుకోవచ్చు. ఇక వీరు వేరే ధ్యానం చేయనక్కరలేదు. 24 గంటలూ మనస్సు నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటుంది. కోపం, చిరాకులు నశిస్తాయి. ద్వేషాలు దరిచేరవు. ప్రేమ పెరుగుతుంది. ధైర్యం దండిగా ఉంటుంది. చావుకి చలించరు. ఇంద్రియ నిగ్రహం పెరుగుతుంది. భగవంతుడు మనకు ఇచ్చిన సుఖాన్ని పూర్తిగా అనుభవిస్తూ, ఆనందిస్తూ ఉంటాము. పచ్చి ఆహారం ఎక్కువగా తింటూ (60 శాతం) 3 సార్లు విరేచనానికి వెళుతూ, వెలితిగా భోజనం చేస్తూ, అవసరానికి ఉపవాసాలు చేస్తూ, రోజుకి 5 లీటర్ల నీరు త్రాగుతూ, ఆసన ప్రాణాయామాలు చేస్తూ ఉంటే శ్వాసలు 6-10 సార్లకు కొన్ని నెలల్లో వచ్చేస్తాయి. ఈ నియమాలు అన్నీ జితేంద్రియత్వానికి దారితీస్తాయి. ఆ మనిషి కాషాయం కట్టని సన్యాసి అయినట్లే. మనం చేసే ఉపవాసాలలో మన శ్వాసలు ఏ విధంగా ఉంటాయో అన్న అసలు విషయానికి వద్దాము.
ఉపవాసం ప్రారంభించిన మొదటి రెండు రోజులూ నిముషానికి సాధారణంగా 18 సార్లు శ్వాసలు ఉండే వారికి 14 నుండి 18 సార్లకు వస్తే, 18 సార్లు కంటే ఎక్కువ శ్వాసలు ఉన్న వారికి 18 కి వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్లనే ఆ రెండు రోజులూ కొద్దిగా ప్రశాంతంగానే ఉంటుంది. మూడవ రోజు ఉపవాసం నుండి ప్రేగులలో జీర్ణాదిరసాల తయారీ ఆగిపోవడంతో ప్రేగులలో జీర్ణానికి ఖర్చు అయ్యే శక్తి పొదుపు అవుతుంది. అదే విధంగా ఉపవాసం ప్రారంభించిన రోజు నుండి జీర్ణక్రియ లేని కారణంగా ప్రాణశక్తి అంతా (జీర్ణ క్రియకు వెళ్ళేది) ఎక్కువ పొదుపు అవుతూ ఉంటుంది. పైగా మనం వాడే తేనె అమృతం కాబట్టి అందులో ప్రాణశక్తి కూడా బాగా ఎక్కువ ఉంటుంది. శరీరానికి శక్తి ఈ విధంగా వస్తూ, పొట్ట ఖాళీగా ఉండడం వలన ఊపిరితిత్తులనిండా గాలి వెళ్ళే అవకాశం ఉంటుంది. మన శరీరంలో రోజూ కొత్తకణాలు పుట్టడానికి, కణాలు చావడానికి ఎక్కువ ప్రాణశక్తి ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఉపవాసం ప్రారంభించిన మూడవ రోజు నుండి మనలో క్రొత్త కణాలు పుట్టడం గానీ, చావడం గానీ దరిదాపుగా ఆ క్రియ ఆగి పోతుంది. అదే జంతువులు ఉపవాసం ప్రారంభించిన మొదటి రోజు నుండే ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మనస్సుంది కాబట్టి మనకు రెండు రోజులు ఆలస్యం అవుతుంది. ఆ ప్రక్రియ లేనందువల్ల దాని ద్వారా పొదుపు అయిన ప్రాణశక్తి మనకు ఆరోగ్యానికి, ప్రశాంతతకు సహకరిస్తుంది. శరీరం బరువు సరిపడా ఉన్న వారికి రక్తం సరిగా ఉంటే ఉపవాసంలో రోజు రోజుకీ శ్వాసలు తగ్గే అవకాశముంటుంది. అదే శరీరం లావుగా ఉన్న వారికి, పొట్ట ఉన్న వారికి, బాగా శరీరం నీరుపట్టిన వారికి, ఊపిరితిత్తుల జబ్బులున్న వారికి శ్వాసలు నిదానంగా గానీ తగ్గవు. అవన్నీ తగ్గుతున్న కొలదీ శ్వాసలు కూడా మెల్లగా తగ్గుతూ, కొద్దికొద్దిగా ప్రశాంతత ప్రారంభమవుతుంది. ఉపవాసంలో నిముషానికి 14 శ్వాసల కంటే తక్కువ అవుతున్న కొలదీ శరీరం గాలిలో తేలిపోయినట్లు ఉంటుంది. వారం రోజుల ఉపవాసంలోనే శ్వాసలు 10 సార్లకు ఎక్కువ మందికి వస్తాయి. మరి కొంతమందికి 10 నుండి 15 రోజులలో 8 నుండి 10 సార్లకు కూడా వచ్చే వారుంటారు. నిమిషానికి 6-8 సార్లు శ్వాసలు వచ్చే వారు చాలా అరుదుగా ఉంటారు. శ్వాసలు ఉపవాసంలో తగ్గడం అనేది మన ఆరోగ్యాన్ని బట్టి ఉంటుంది. అందరికీ ఉపవాసం ప్రారంభించిన పది పదిహేను రోజులలోనే రోగాలన్నీ పోవు. కాబట్టి శ్వాసలు వెంటనే తగ్గవు. క్రమేపీ ఉపవాసంలో రోజులు గడిచిన కొద్దీ శ్వాసలు తగ్గే అవకాశం ఉంటుంది. మానసికమైన ప్రశాంతతను, నిగ్రహాన్ని పొందడానికి మనిషికి ఉపవాసం ఒక మంచి మార్గం అని చెప్పవచ్చు. ఉపవాసం చేయకుండా కొంత మంది మేము ప్రశాంతంగానే ఉన్నాము, నిగ్రహంగానే ఉన్నాము అని అనుకోవచ్చు. కానీ వారికి ఇప్పుడున్న దాని కంటే ఇంకా ఎన్నో రెట్లు నిగ్రహము, ప్రశాంతత ఉపవాసం ద్వారా పెరుగుతుంది అనడంలో సందేహం లేదు.
మన శ్వాసలకు ఇంత బలం ఉందని తెలిస్తే చిన్నప్పటి నుండి జాగ్రత్త పడేవాళ్ళము అని అనుకుంటున్నారా? అయిపోయిన దాని గురించి ఎందుకు లెండి? ఇక నుండి అయినా శ్వాసలు (ప్రాణశక్తిని) పొదుపు చేయడానికి ప్రయత్నించండి. ఉన్న ఆయుష్షు అంతా సుఖంగా జీవించవచ్చు. మనకు ఎన్ని శ్వాసలు నిమిషానికి ఆడుతున్నాయన్నది తెలుసుకోవడం ఎలా అంటారా? చాలా తేలికండి. మిషన్లు ఏమీ అక్కరలేదు. పైసా ఖర్చు లేదు. డాక్టర్ చీటీ అంతకంటే అక్కరలేదు. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు వెల్లకిలా పడుకొని ఐదు నిమిషాలు గడిచిన తరువాత (అలుపు ఏమైనా ఉంటే తగ్గడం కొరకే) చేతిని పొట్టమీద పెట్టి, సెకన్ల ముల్లు 60 సార్లు తిరిగే లోపులో పొట్ట ఎన్ని సార్లు పైకి ఎగిరితే అన్ని సార్లు మీ ఊపిరితిత్తులు శ్వాసలు తీసుకుంటున్నట్లు అర్థం. ఎక్కువ సార్లు ఆడితే కంగారు పడకండి. కంగారు పడితే ఇంకా శ్వాసలు ఎక్కువ అవుతాయి జాగ్రత్త. అందువల్లనే శాంతం కంటే సముద్రం చిన్నదన్నారు. శాంతం ఆరోగ్యానికి అంత గొప్పదన్న మాట. కోపం వచ్చినా, భయపడినా, చిరాకుగా ఉన్నా, పోట్లాడినా, ఏడుస్తూ ఉన్నా, కాఫీలు, టీలు, సిగరెట్లు, బ్రాందీలు త్రాగినా రక్తంలో ఒకరకమైన హార్మోన్లు క్షణంలో తయారయ్యి వాటి ద్వారా శ్వాస నాళాలు మూసుకొని పోవడం జరుగుతుంది. అప్పుడు మనకు శ్వాసలు పెరిగి ఆరోగ్యం, ప్రశాంతత లోపిస్తాయి. ఆ ప్రశాంతతను పొందాలంటే ఎదుటి వారిని చూస్తే రాదు. అప్పు తీసుకోవడానికి అంత ఆరోగ్యం, ప్రశాంతత నిలువలు బాగా ఉన్న వారు ఎవ్వరూ లేరు. డబ్బు పెట్టి కొందాము అంటే వాటిని కొనగలిగేంత డబ్బు ఎవరి దగ్గరా లేదు. దొంగిలించడానికి దొరకదు. ఎదుటి వారిని పొడిచి అన్నా తీసుకుందామంటే మనకున్న కొద్ది ఆరోగ్యం, ప్రశాంతత కాస్తా పోతుందేగానీ వేరే ప్రయోజనం ఉండదు. పుస్తకాల ద్వారా జ్ఞానం సంపాదించి సాధిద్దాం అంటే అలా సాధ్యపడేదీ కాదు. మరి ఆ ఆరోగ్యం, ప్రశాంతత ఎలా వస్తుందంటే, రావడం చాలా తేలికే. కొండలు ఎక్కనక్కరలేదు, ముక్కు మూసుకోనక్కరలేదు, సంసారాన్ని వదలనక్కరలేదు, కాషాయం కట్టనక్కరలేదు. శరీరాన్ని ఉపవాసాల ద్వారా పూర్తిగా శుభ్రం చేసి, అప్పటి నుండి ఆహార, వ్యవహారాలలో నియమాలు గురువు చెప్పినట్లు పాటిస్తూ, గురువు ఆజ్ఞనే దైవానుగ్రహంగా స్వీకరిస్తూ సత్ సాంగత్యంతో కాలం గడుపుతూ ఉంటే కాలక్రమేణా అన్నీ చిగురించి మొక్కై అదే మ్రానై మన మనస్సులో చలించకుండా పాతుకొని పోగలవు. ప్రయత్నించిన వారు తప్పక ఫలితాన్ని సాధిస్తారు.
శరీరాన్ని ఆహార వ్యవహారాల ద్వారా పాడు చేసుకొంటూ, మనస్సుకు శరీరానికీ ఉన్న బంధాన్ని తెంచుకొంటూ ఉంటే మనకు జీవితంలో అన్నీ బాధలే మిగులుతాయి. శరీరాన్ని శుద్ధి చేసుకోకుండా మనలో ఉన్న దైవాన్ని దూరం చేసుకొంటూ, బయట గుళ్ళు గోపురాలకు, గురువుల చుట్టూ తిరగడం వలన ప్రయోజనం ఏమీ ఉండదు. కుమార స్వామిలాగా దైవాన్ని దర్శించడానికి లోకాలన్నీ పరుగెత్తడం మాని, వినాయక స్వామి లాగా దగ్గరలో, అందుబాటులో ఉన్న దైవాన్ని (మనలో ఉన్న దైవం) నమ్ముకోవడం, గౌరవించడం, ఆరాధించడం చేయగలిగితే మన జన్మ సార్థకత చెందినట్లే. మానసికమైన ఆనందాన్ని, ప్రశాంతతను అందుకోవడానికి ఆహార నియమాలు, ఉపవాస ధర్మాలు తప్పక పాటించడానికి ప్రయత్నిద్దాం. మనిషి తిండిని అరికట్టలేక నోటితో ఇన్ని బాధలను ఆహ్వానిస్తున్నాడు. ఉపవాసాల ద్వారా అలాంటి వాటిని అరికట్టి, శరీరాన్ని ఆరగట్టి, మనస్సులో కోరికలను చెదరగొట్టి, మంచి ఆహారాన్ని గట్టిగా పట్టి, ఆరోగ్యంలో ఉన్న అసలైన ఆనందాన్ని, ప్రశాంతతను పొంది జైలులో శాశ్వత ఖైదీలా శరీరంలో వీటిని శాశ్వత బందీలుగా చేయడానికి అందరం ప్రయత్నిద్దాం. పువ్వులు పరిమళాన్ని వెదజల్లడం ఎంత సహజమో, ఉపవాసం ద్వారా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ప్రశాంతతను పొందడం కూడా అంత సహజమని మాత్రం మరువకండి. మనిషిలా ప్రయత్నించడం మానకండి.

24. ఉపవాసంలో తింటే ఏమవుతుంది?

ఉపవాసంలో ఆహారం తినడం పూర్తిగా ఆపడం వలన శరీరం విసర్జన క్రియ చేసుకొనే అవకాశం కలుగుచున్నది. ఉపవాసంలో విసర్జన క్రియ ప్రారంభమయిన రోజు నుండి ప్రేగులు, పొట్టలో జీర్ణాది రసాలు తయారవడం పూర్తిగా ఆగుతాయి. ఆహారం తింటేనే ఆ రసాలు తయారయ్యి, ఆహారం తినక పోతే ఆగిపోయే సహజ గుణం ఆ రసాలకు ఉంది. ఉపవాసంలో శరీరం 24 గంటలూ చెడును బయటకు నెట్టే కార్యక్రమంలో ఉంటుంది. అందువల్లనే మనం ఉపవాసం చేస్తే అన్ని రకాల జబ్బులు ఒక్క ఉపవాసం ద్వారానే తగ్గుతుంటాయి. శరీరం, మనస్సు పూర్తిగా ఈ కార్యక్రమంలో నిమగ్నమై పని చేస్తూ ఉంటాయి. ఇలాంటి సమయాల్లో మనం ఉపవాసంలో ఉండి కూడా ఏదన్నా ఆహారంగానీ, పండుగానీ, టిఫిన్లు గానీ తినాలనిపించి తింటే ఏం జరుగుతుందో ఆలోచిద్దాము.
మామూలు రోజులలో అయితే తినే ముందు, తింటున్నప్పుడు, తిన్న తరువాత కూడా జీర్ణాది రసాలు తయారవడం వెంటనే జరుగుతుంది. అది అలవాటుగా అలా జరిగి పోతుంటుంది. ఉపవాసం వలన ప్రేగులకు ఈ అలవాటు తప్పిపోతుంది. అదీగాక ప్రేగులు ఉపవాసంలో చెడును బయటకు నెట్టి వేస్తూ, కణాలను రిపేరు చేసుకొంటూ ఉంటాయి. ఉపవాసంలో ఉండగా ఆహారం గురించి ఎక్కువ ఆలోచిస్తూ, తినాలని కోరిక ఎక్కువగా పెంచుకొంటూ ఉంటే ఆ రోజు నుండి విసర్జన క్రియ తగ్గిపోతూ ఉంటుంది. మన ఆలోచనలను బట్టే లోపల మార్పులు జరుగుతూ ఉంటాయి. ఉపవాసంలో మన మనస్సంతా కోరికల మీద ఉంది కాబట్టి కోరికలకు అనుకూలంగా ప్రేగులలో రసాలు తయారవడం కొద్ది కొద్దిగా మొదలవుతూ ఉంటే ఇంకో ప్రక్క విసర్జన క్రియ తగ్గిపోతూ ఉంటుంది. అలా ఒకటి రెండు రోజులు బాగా ఆలోచించి తరువాత తింటే వారికి తిన్న ఆహారం పెద్ద ఇబ్బందులు లేకుండానే జీర్ణం అయ్యే అవకాశం ఉంటుంది. వారం పది రోజుల లోపు ఉపవాసంలో ఉన్న వారైతే ఈ విధంగా జరుగుతుంది. అదే ఎక్కువ రోజులు ఉపవాసాలు చేస్తున్నప్పుడు ఇలా చేస్తే, ఆహారాన్ని అరిగించే రసాలు అంత త్వరగా తయారవక కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఉపవాసాన్ని ప్రారంభించడం అంటే మెల్లగా చెట్టు ఎక్కడం అని, ఉపవాసాన్ని విరమించడం (ఆహారంలోనికి రావడం) అంటే మెల్లగా చెట్టునుండి క్రిందకు దిగడం అని ఇంకో అధ్యాయంలో కూడా చెప్పుకున్నాం. ఉపవాసంలో తినడం అనేది చెట్టునుండి దూకడం వంటిది. చిన్న చెట్టు (తక్కువ రోజులు ఉపవాసాలు) మీద నుండి దూకితే కాళ్ళు విరగకుండా మనం క్షేమంగానే ఉండవచ్చు. అలాగే మనం పెద్ద చెట్టు మీద నుండి (దీర్ఘోపవాసాలు) దూకితే ప్రాణం పోదుగానీ ఏదో ఒకటి విరగడం గానీ దెబ్బలు తగలడం గానీ, నెప్పులు రావడం గానీ జరగవచ్చు. మనకు ఇక్కడ ఉపవాసంలో తింటే కూడా అదే జరుగుచున్న ది. ఉపవాసాలు పది పదిహేను రోజులు దాటిన తరువాత ఇలాంటి పని చేస్తే నష్టం ఎక్కువగా ఉంటుంది. వారికి ఎన్ని రోజుల ఉపవాసంలో ఏ రోజూ ఆహారం మీద కోరిక పోకుండా, ఆలోచన లేకుండా ఉండి ఒక్కసారే వచ్చిన వాసనలకో లేదా కోరికలకో చలించి ఆ నిముషమే ఆహారాన్ని తిని వేస్తే ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ముందు నుండి ఆలోచనలు, కోరికలు లేని కారణంగా ప్రేగులలో రసాలు తయారవడం జరుగదు. మనకు ఆలోచన వచ్చిన నిముషమే తింటే జీర్ణాది రసాలు అసలు లేక, తిన్న తరువాత కూడా తయారుగాక ఆ ఆహారం ప్రేగులకు మరీ భారం అవుతుంది. ఆ ఆహారం ప్రేగులలో మార్పులు చెందక క్రిందకు జరుగదు. అజీర్ణే భోజనం విషం అని శాస్త్రం చెప్పినట్లు అరగని ఆహారం శరీరానికి విషం అవుతుంది. దీని కారణంగా విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి మొదలగునవి వచ్చి కొందరకు తగ్గితే, మరి కొందరకు ఆ బాధలకు మందులు వాడలసిన అవసరం కూడా కలగవచ్చు. ఉపవాసంలో ఆహారం తినడం వలన శరీరానికి వచ్చే నష్టం 40 శాతం అయితే, విసర్జన క్రియ ఆగిపోవడం ద్వారా 60 శాతం నష్టముంటుంది.
మన ఇంట్లో వారు ఎవరన్నా ఉన్నట్లుండి చనిపోతే మనం ఎన్ని ముఖ్యమైన పనులలో ఉన్నప్పటికీ వాటన్నింటినీ వెంటనే వదలి పెట్టి ఆ కార్యానికి హాజరవ్వడం మన బాధ్యత. అలాగే మనలోని శక్తి రకరకాల విసర్జన క్రియలలో నిమగ్నమై ఉన్నప్పటికీ వాటన్నంటిని వెంటనే వదిలిపెట్టి ముందు జీర్ణ క్రియ ముఖ్యం కాబట్టి పొట్ట ప్రేగులకు వచ్చేస్తుంది. దేనికోసం శరీరానికి ఉపవాసాన్ని ప్రారంభించామో, ఆహారం తిన్న రోజు నుండి ఆ ఉపయోగం మనకు రావడం పూర్తిగా ఆగిపోతుంది. అంటే విసర్జన క్రియ పూర్తిగా ఆగిపోతుంది. ఉపవాసంలో మనం ఒక రోజు తిని, తరువాత మరలా తేనె నీరు త్రాగడం ప్రారంభించినప్పటికీ విసర్జన క్రియ తిరిగి అందుకోవడానికి మరలా ఒకటి, రెండు రోజులు పడుతుంది. ఒక్క రోజు తిన్న భాగ్యానికి రెండు, మూడు రోజుల ఉపవాసం నిరుపయోగం అవుతుంది.
ఉపవాసంలో ఒక్క రోజు తిన్న తరువాత రెండవ రోజు కూడా మరలా తినాలని ఎక్కువ మందికి అనిపిస్తుంది. ఉపవాసాన్ని కొనసాగించకుండా రెండవ రోజు నుండి తినడం ప్రారంభిస్తే ఏమి జరుగుతుందో ఆలోచిద్దాం. ఉపవాసంలో సహజమైన ఆకలి పుట్టలేదు కాబట్టి తరువాత రోజు నుండి తిన్న ఆహారం సరిగా అరగక పొట్ట ఉబ్బరం, గ్యాసు ఇవన్నీ వస్తాయి. శరీరంలోని చెడు కొంత నాని, కదిలి ఉంది కాబట్టి దాన్ని విసర్జిస్తే బాగుండు అన్న ఆలోచన కొంత అయితే, వచ్చిన ఆహారాన్ని అరిగించే ఆలోచన మరి కొంత ఉంటుంది. అటు సరిగా విసర్జన క్రియ చేయలేక, ఇటు సరిగా ఆహారాన్ని అరిగించలేక రెండు విధాలా చెడి మనలను ఇబ్బందుల్లో పడవేస్తుంది. మన ఇంట్లో వారు చనిపోయారన్న మనస్తాపం, ఆలోచనల వలన తరువాత కొన్ని రోజులు ఏ పనులూ సరిగా చేయలేక పోరపాట్లు చేస్తూ ఉంటాము. అదే అవస్థ శరీరానికి వచ్చింది కాబట్టి శరీరం కూడా పొరపాట్లు ఎక్కువగా చేస్తూ ఉంటుంది. ఆహారం సరిగా జీర్ణం కాకపోతే లివరులో ఎక్కువ క్రిములు, చెడ్డ పదార్థాలు పేరుకొని పోతుంటాయి. తరువాత లివరు జబ్బులు గానీ, జ్వరాలు గానీ, కామెర్లు గానీ వచ్చే అవకాశముంటుంది. తరువాత వచ్చే చిన్న చిన్న ఇబ్బందులకు ఇటు సరిగా తినలేరు, అటు ఉపవాసమూ చేయలేరు. ఎటూ కాకుండా చెడిపోతారు.
చూశారా ఉపవాసంలో వచ్చిన కోరికలను పట్టించుకొంటే ఎన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందో. నాలికదేముందండీ పది నిముషాలలో దాని ఆరాటం తీరిపోతుంది. తరువాత శరీరానికి బాధలూ తప్పడం లేదు, చివరకు వ్రత భంగం అవుచున్నది. ఉపవాసంలో తినాలని కోరిక పుట్టినప్పుడు లేదా అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని అలా కొనసాగిస్తే చివరకు మనం తినే వరకూ ఇంద్రియాలు లాగేస్తూనే ఉంటాయి. వాటి నుండి బయట పడటానికి నాలుగు స్పూన్ల తేనెను వెంటనే తినడమో లేకపోతే తేనె, నిమ్మనీరు వెంటనే త్రాగివేయడమో లేదా చిన్న నిమ్మకాయ ముక్కను (పచ్చడిలో ముక్క కాదు) కొద్దిగా చప్పరించడమో చేస్తే ఆ ఆపద నుండి బయట పడవచ్చు. ఇన్నాళ్ళూ అలా మనస్సు కోరిందల్లా తినే మన ఆరోగ్యాన్ని పాడు చేసుకొన్నాము. పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని తిరిగి పొందే ప్రయత్నంలో కూడా అలాంటి తప్పు మళ్లీ మనం చేస్తే బాగుపడేది ఎప్పుడు? జైలులో ఉండి కూడా తప్పులు చేయడం లాంటిది ఉపవాసంలో ఉండి కూడా తప్పులు చేయడం. అలాంటి వారిని క్షమించే వారెవ్వరూ ఉండరు చివరకు పైవాడు తప్ప. ఉపవాస ధర్మం ఎంతో పవిత్రమైనది. అంతటి ధర్మాన్ని అపవిత్రం చేయడం మనకు ధర్మం కాదు. ఆ ధర్మాన్ని మనం సక్రమంగా ఉపయోగించుకొని, పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని తిరిగి పొంది, బ్రతికినన్నాళ్ళు అదుపుగా రుచులను తింటూ ముందు తరాల వారికి ఆదర్శప్రాయులమవుదాము.

25. ఉపవాసం 5, 6 రోజులు మాత్రమే ఉపవాసాలు చేస్తే ఏమవుతుంది?

ప్రస్తుత నాగరిక ప్రపంచంలో మనకున్న ఆహారపు అలవాట్లతోపాటు శారీరక శ్రమ లోపం కారణంగా శరీరంలో ఎన్నో ఏళ్ళ తరబడి వ్యర్థపదార్థాలు నిలువ ఉండి పోతున్నాయి. అవే తిరిగి రోగాలుగా మార్పు చెందడం కూడా జరుగుచున్నది. నూటికి 60 శాతం చెడు శరీరంలోనే రోజూ మిగిలిపోతుంటే, 40 శాతం మాత్రమే బయటకు విసర్జింపబడుతూ వుంటుంది. నేడు మనకున్న అలవాట్ల కారణంగా ఎక్కువ మందికి ఇదే విధంగా విసర్జన క్రియ ఉంటుంది. పైగా మనం శరీరాన్ని శుద్ధి చేసే క్రియలయిన విరేచనాలు, వాంతులు, జలుబు, దగ్గు, జ్వరం మొదలగు వాటిని రాకుండా చేసుకొంటూ, శరీరంలోనే ఎక్కువ చెడును నిలువ చేసుకొంటున్నాము. మనం చేసే వైద్య విధానాలు కూడా వీటిని అణిచి వేసే విధంగానే ఉంటున్నాయి. శరీరం ఒక చెత్తకుండీ కంటే హీనంగా తయారవుచున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మొదటిసారి ఉపవాసాలు చేసేటప్పుడు సంపూర్ణంగా శుద్ధిచేసి, ఆ చెడు నుండి శరీరాన్ని రక్షించే విధంగా మన ఆలోచనలు ఉండాలి. ఉపవాసాన్ని ప్రారంభించిన తరువాత కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ లేదా అనుకోకుండా పనుల (ఉద్యోగ, వ్యాపార రీత్యా) హడావిడి అయినప్పటికీ ఉపవాసాన్ని మాత్రం వాటి గురించి ఎన్నడూ ఆపకూడదు.
ఉపవాసం ప్రారంభంలో మొదట మూడు, నాలుగు రోజులు కొద్దిగా కష్టంగా అనిపించవచ్చు. అది ఎలాంటిదంటే, ఆ నాలుగు రోజులు కొండ ఎక్కడం లాంటిది. మామూలు రోడ్డు మీద నడకకు, కొండ ఎక్కేటప్పుడు నడకకు చాలా తేడా ఉంటుంది. అలాగే ఉపవాసం ప్రారంభించిన రోజు నుండి వచ్చే తలనెప్పులు, నీరసం, ఆకలి, తినాలనిపించడం, మానివేద్దామనిపించడం ఇవన్నీ ఉండటం వలన కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కొండ ఎక్కడం పూర్తి అయ్యాక నడక సులువుగా ఉంటుంది. అలాగే ఉపవాసంలో నాలుగు రోజులు పూర్తి జేస్తే అక్కడ నుండి తేలికగా అనిపిస్తుంది. ఆ నాలుగు రోజులు ఉపవాసంలో శరీరంలో వ్యర్థపదార్థాలన్నీ నానడం, విషపదార్థాలు కొన్ని కదలడం ప్రారంభమవుతుంది. ఐదవ రోజు ఉపవాసం నుండి శరీరానికి ప్రయోజనం రావడం మొదలవుతుంది. ఈ ప్రయోజనం గురించే గదా మనం ఉపవాసాన్ని ప్రారంభించింది. ఇక్కడ నుండి రోజు రోజుకీ రోగాలు బాగా చురుగ్గా తగ్గుతూ ఉంటాయి. రోజు రోజుకీ శరీరం తేలిపోతున్నట్లు హాయిగా ఉంటుంది. 5, 6 రోజులు ఉపవాసానికి వచ్చిన వారు సమయం కుదరనప్పటికీ లేదా మరి ఏ యితర ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటి గురించి ఉపవాసాలను విరమించకూడదు. అలా ఉపవాసాలను విరమించితే 5, 6 రోజులకు కదిలిన చెడు, నానిన పదార్థాలన్నీ మళ్ళీ తిరిగి శరీరంలోనే ఉండిపోతాయి. మరలా ఆ చెడును ఎప్పుడు కదపాలన్నా మళ్ళీ ముందు 5, 6 రోజులు వృథా అవ్వక తప్పదు. ఆ ఇబ్బందులు పడక తప్పదు. వంట పాత్రలను తోమడానికి ముందు నీరు చల్లి నానబెడతారు. నానిన తరువాత తోమితే తేలిగ్గా వదులుతాయి. అలాగాక తోమకపోతే నానినదంతా మరలా ఎండుకొని పోతుంది. మరలా నానబెడితే అంత సమయం మళ్ళీ తీసుకుంటుంది. ఇక్కడ మనలో కూడా అదే జరుగుతుంది. ఎక్కువ మంది ఇప్పుడు ఉపవాసాలను సరిపోతుందిలే అని 5, 6 రోజులు చేసి ఆపివేయడం చేస్తున్నారు. ఆశించిన ఫలితాలేవీ వారికి కలుగవు. ఉపవాసంలో చెడు బయటకు వచ్చినట్లు రసాలలోగానీ, ఆహారంలో గానీ ఎన్నడూ రావు. మేము చేయించే ఉపవాసాలలో శరీరానికి నష్టం ఉండదు కాబట్టి శరీరం కోరినన్ని రోజులు ఉపవాసాలు చేయాలే గానీ 5, 6 రోజులకు మన ఇష్టం వచ్చినట్లు ఆపకూడదు. కేవలం నీరు మాత్రం లేదా నిమ్మరసం త్రాగి చేసే ఉపవాసాలు అయితే అలా కొనసాగించే కంటే అక్కడతో విరమించడం వలన ఎక్కువ నష్టం ఉండకపోవచ్చు. అంతకంటే ఎక్కువ రోజులు ఆ విధానంలో అందరూ చేయలేరు కాబట్టి ఆ పద్ధతికి అది చెల్లుతుంది.
ఉపవాసాలను సక్రమంగా చేసి శరీరాన్ని పూర్తిగా శుభ్రం చేసుకొని, అక్కడ నుండి మేము చెప్పే ఆహారం తింటున్న వారు ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు లేదా బరువు తగ్గడం గురించో ఉపవాసాలు ప్రారంభిస్తే అప్పుడు ఐదారు రోజులు సరిపోతాయి. 5, 6 రోజులలోనే చెడు అంతా పూర్తిగా పోయే అవకాశం అప్పుడు ఉంటుంది. బరువు గురించి చేసేవారు ఇలా రెండు నెలలకు ఒకసారి 5, 6 రోజులు చేయవచ్చు. మొదటిసారి ఉపవాసాలు ప్రారంభించిన వారికి 5, 6 రోజులలో పావలా వంతు కూడా శరీరం శుభ్రం కాదంటే మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కాని జరిగేది అంతే. ఎక్కువ మంది అన్ని రోజులే చేసి సరిపెట్టుకొని, ఉపవాసాల ద్వారా వచ్చే పూర్తి సుఖాన్ని అందుకోలేక పోతున్నారని ఇలాంటి విషయాలను పదే పదే తెలియజేయవలసి వస్తుంది. 5, 6 రోజుల ఉపవాసాలు మనకు కష్టాలే మిగుల్చుతాయి గానీ సుఖాన్ని అందివ్వలేవు. సుఖాన్ని అందు కోవాలంటే ముందుకు వెళ్ళవలసిందే, ప్రయత్నించవలసిందే. తప్పదు.

26. ఉపవాసం ఎన్ని రోజులు చేయాలి?

ప్రస్తుత కాలంలో మనుషులు వృత్తి రీత్యా, వ్యాపారరీత్యా ఖాళీ సమయం ఎక్కువ లేక ప్రకృతి ఆశ్రమానికి వెళ్ళే రోజునే తిరిగి ఎప్పుడు ఇంటి ప్రయాణమో డేటు నిర్ణయించుకొని ప్రకృతి వైద్యానికి వెళ్ళేవారు ఎక్కువ మంది కనబడుచున్నారు. ఒక నెలో, రెండు నెలలో ఆశ్రమంలో ఉంటేగానీ వైద్యం పూర్తి గాదు అని గట్టిగా చెబితే అంత సమయం ఆరోగ్యం గురించి కేటాయించలేక ప్రకృతి వైద్యానికి అసలు రావడం మానివేస్తున్నారు. రోగులు రాకపోతే ఆశ్రమాలు (హాస్పిటల్స్) నడవవు కాబట్టి రోగికి అనుకూలంగా రోగాన్ని నయం చేసే విధానాలను మార్పుచేసి, ఉపవాస ధర్మాన్ని పూర్తిగా సడలించివేశారు. వారం రోజుల సర్వీసింగ్ కోర్సు, పది హేనురోజుల క్లీనింగ్ కోర్సులాగా ప్రకృతి విధానాన్ని మార్చి, ఉపవాసాలు నాలుగు రోజులో, వారం రోజులో, పది రోజులో అని ముందే నిర్ణయించి అన్ని రోజులు పూర్తికాగానే ఉపవాసాలను విరమించడం చేస్తున్నారు. ఉపవాసం ఎన్నిరోజులు చేయాలన్నది ముందే నిర్ణయించడం అనేది సరి అయిన పద్ధతి కాదు. డాక్టరు వద్దకు వెళ్ళి ఇన్ని రోజులైతేనే నేను ఉపవాసం చేస్తాను అని గానీ, నాకు అన్ని రోజులు చేసే ఖాళీ లేదని గాని, వారం రోజులు చేస్తే సరిపోతుంది అని గానీ మీరు అంటే అది మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం అవుతుంది.
ఒకే వయసున్నవారు, ఒకే బరువున్నప్పటికీ, ఒకే రకం రోగ లక్షణాలతో ఉండి, ఒకే రోజు ఉపవాసం ప్రారంభించినప్పటికీ అందరికీ ఒక్కసారే ఉపవాసాలు పూర్తికావు. శరీర లక్షణాలు అన్నీ ఒకటయినప్పటికీ, దానిని నడిపే మనస్సు వేరు కాబట్టి ఉపవాసంలో చెడు అంతా అందరికీ ఒక రకంగా కదలదు. అందువలన ఉపవాసాలు అనేవి మనిషికి మనిషికీ ఎన్ని రోజులు పట్టేది ముందే తెలియదు. ఏ రోజు బట్టలను ఆ రోజు విడిస్తే బట్టలు త్వరగా మాయవు. అలాగే ఏ రోజు శరీరంలో తయారైన చెడును ఆ రోజే పూర్తిగా విసర్జించివేస్తే శరీరంలో చెడు పదార్థం ఎక్కువగా నిలవ ఉండదు. ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతికితే సబ్బు ఎక్కువ పట్టదు. పైగా తక్కువ సమయంలో ఉతకడం పూర్తి అవుతుంది. అలాగే ఏ రోజు చెడును ఆ రోజు పూర్తిగా (మలం, మూత్రం, చెమట, గాలి) విసర్జించేవారికి కూడా ఉపవాసాలు ఎక్కువ రోజులు పట్టవు, పైగా తేలిగ్గా ఉపవాసాలు పూర్తి అవుతాయి. ఒక జత బట్టలనే నాలుగు రోజులు వాడితే బట్టలు మాసిపోయి, ఉతకడానికి ఎక్కువ సబ్బు, ఎక్కువ సమయం పడుతుంది. అలాగే చెడు బయటకు రోజూ పోకపోయినప్పటికీ మామూలుగా అన్నం రోజూ తింటూ ఉంటే వారికి శరీరంలో చెడు ఎక్కువ పేరుకొని పోయి ఉంటుంది. అటువంటి వారికి ఉపవాసాలు ఎక్కువ రోజులు పట్టడమే కాకుండా, ఆ చెడును కదపడానికి శరీరం ఎక్కువ కష్టపడవలసివస్తుంది. దీన్ని బట్టి ఆలోచిస్తే ఉపవాసాలు అనేవి మనలో ఎంత వ్యర్థపదార్థం నిలువ వుంటే అన్ని రోజులు పడతాయన్నమాట. మనలో ఉన్న వ్యర్థ పదార్థం ఎంతో మనం కొలవ లేము, మనకు తెలియదు కాబట్టి ఉపవాసాలు ఎన్ని రోజులు చేయాలన్నది కూడా మనకు తెలియదన్నమాట. ఎవరన్నా మీకు ఇన్ని రోజులు ఉపవాసాలు చేస్తే సరిపోతుందని సంఖ్య ముందే చెబితే అది నూటికి నూరు శాతం తప్పన్నమాట.
మా దగ్గరకు వచ్చే రోగులలో ఎక్కువ మంది మేము ఎన్ని రోజులు ఉపవాసాలు చేస్తే సరిపోతుందని ముందు తెలుసుకోవడానికి అడుగుతారు. మీలో ఉన్న చెడు ఎంతో మీరు చెప్పగలిగితే మీరు ఎన్ని రోజులు ఉపవాసాలు చేయాలో మేము చెప్పగలము. కష్టపడి పనిచేయడమే మనవంతుగానీ ఫలితం దైవాధీనం. అలాగే ఉపవాసాలు ప్రారంభించడమే మనవంతు గానీ ఎన్ని రోజులు చేయాలన్నది మీ యిష్టం గాదు, డాక్టరు గారిష్టమూ గాదు. శరీరం ఇష్టప్రకారము ఎన్ని రోజులు అన్నది రోజూ వచ్చే మార్పులను బట్టి ఏ రోజుకారోజు చూసుకొంటూ, రోజులను పొడిగించుకుంటూ లేదా తగ్గించుకొంటూ శరీరం పూర్తిగా శుభ్రం అయ్యేవరకూ ఉపవాసాలను చేస్తూ ఉండాలి. అంతే గానీ ఎన్ని రోజులు ఉపవాసాలన్నది సమస్య కాదు. ముందే ఇన్ని రోజులని నియమించుకొంటే, శరీరం శుభ్రం కాకుండా అన్ని రోజులకే ఉపవాసాలను విరమించితే శరీరం అపరిశుభ్రంగా మిగిలిపోతుంది. అలాంటప్పుడు ఉపవాసాలు చేసి ప్రయోజనం ఏముంటుంది? ఆ ఉపవాసం ద్వారా మనం సాధించేది ఏమిటి?
మేము చేయించే ఉపవాసాల విషయం ఆలోచిస్తే, మా దగ్గర చేసే వారు అధమం ఎనిమిది రోజుల నుండి నూట నాలుగు (104) రోజుల వరకూ ఉపవాసాలు చేయగలిగారు. మా దగ్గర ఉపవాసాలు చేసే వారిని వంద మందిని పరిశీలిస్తే ఈ క్రింది విధంగా వారు చేసే ఉపవాసపు రోజులుంటాయి. 8 నుండి 10 రోజులు చేసేవారు 10 శాతం మంది అయితే, 10 నుంచి 15 రోజులు చేసేవారు 25శాతం మంది ఉంటారు. అలాగే 15 రోజుల నుండి 30 రోజుల వరకూ ఉపవాసం చేయగలిగే వారు 50 శాతం మంది ఉంటే, 30 రోజుల నుండి 60 రోజుల వరకూ ఉపవాసం చేసేవారు 15 శాతం మంది ఉంటున్నారు. సామాన్యంగా ఎవరికీ ఎనిమిది రోజుల కంటే ముందు ఉపవాసం పూర్తి కాదు. మలబద్ధకం ఉన్నవారికి, మాంసాహారం ఎక్కువ తినేవారికి, మందులు ఎక్కువగా వాడిన వారికి, మంచినీరు బాగా తక్కువగా త్రాగేవారికి ఉపవాసాలు ఎక్కువ రోజులు పడతాయి.
మనకు కుదిరినన్ని రోజులు ఉపవాసాలు చేయడం మాని, శరీరం కోరినన్ని రోజులు ఉపవాసాలు చేయడం ఆరోగ్య లక్షణం. శరీర ఇష్ట ప్రకారం మనం నడవాలిగానీ, మన ఇష్టప్రకారం శరీరంలో చెడు పోదు. మొదటిసారి శరీరాన్ని ఉపవాసాల ద్వారా కడగనారంభించినప్పుడు రోజులు లెక్కవేయడం మానండి.

27. ఉపవాసం ఎప్పుడు విరమించాలి?

ఉపవాసం ప్రారంభించిన మూడవరోజు లేదా నాలుగవ రోజు నుండి శరీరం పూర్తిగా విసర్జన క్రియపై కేంద్రీకృతం అవుతుంది. ఆ రోజు నుండి శరీరంలోని అన్ని రకాల వ్యర్థపదార్థాలు, బాక్టీరియా, టాక్సిన్స్ మరియు ఇతర విషపదార్థాలు పూర్తిగా, బహిష్కరింపబడే వరకు శరీరం ఉపవాసంలోనే కొనసాగుతూ ఉంటుంది. ఉపవాసంలో మనం అన్ని విధాలా శరీరానికి సహకరిస్తే ఆ పదార్థాలన్నీ అన్ని విసర్జకావయవాల ద్వారా బయటకు నెట్టివేయబడతాయి. విసర్జన క్రియ పూర్తి అయిన దగ్గర నుండి శరీరం ఉపవాసంలో కొనసాగలేదు. అప్పటి నుండి ఉపవాసాన్ని విరమించమని శరీరం కోరుతుంది. ఉపవాసాన్ని విరమించడానికి శరీరం అందించే కొన్ని రకాల సంకేతాలను ఆధారంగా చేసుకొని మనం ఉపవాసాన్ని విరమించడం తెలుసుకోవాలి. శరీరం ఉపవాసాన్ని విరమించమని తెలియజేసినప్పటికీ మనం ఇంకా ఉపవాసం నాలుగురోజులు చేస్తే బాగుంటుందని ప్రయత్నిస్తే, అప్పటి నుండి శరీరం దెబ్బతినడం ప్రారంభిస్తుంది. శరీరానికి సహకరించడం మన బాధ్యత కాబట్టి ఏ లక్షణాలు వస్తే ఉపవాసాన్ని విరమించాలో పూర్తిగా తెలుసుకుందాము.
1. చెడు వాసనలు పూర్తిగా పోవాలి: ఉపవాసం ప్రారంభమయిన దగ్గర నుండి మలమూత్రాలు, చెమట, గాలి, నోరు ఇవన్నీ బాగా దుర్వాసన వస్తాయి. రోజు రోజుకీ శరీరం ఉపవాసంలో శుభ్రం అయ్యి, ఉపవాసం విరమించే రోజు దగ్గరకు వచ్చే సమయానికి మలమూత్రాలు, చెమట, గాలి, నోరు ఇవన్నీ దుర్వాసన పోయి సహజమైన వాసన రావడం జరుగుతుంది. వాసనలు పోవడం అనేది అన్నింటి కంటే ముందువచ్చే లక్షణం.
2. నోరు జిగురు, నాలుక మీద పాచి పోయి ఎర్రగా రావాలి: ఉపవాసంలో విసర్జన క్రియ ప్రారంభమయిన రోజు నుండే నాలుక మీద పాచి పట్టడం, నోరు జిగురు రావడం ప్రారంభమవుతుంది. అందువల్లనే ఉపవాసంలో తినాలనిపించదు. ప్రేగులు, లివరు పూర్తిగా శుభ్రం అయ్యాక నోట్లో జిగురు, నాలుక మీద పాచి పోతాయి. శరీరంలోని చెడు అంతా పోతే గానీ నాలుక ఎర్రగా రావడం జరగదు. ఒక్కొక్కసారి ఆకలి పుట్టకుండానే నాలుక ఎర్రగా రావడం జరుగుతుంది. ఇంకా శరీరంలో ఎక్కడో విసర్జక పదార్థాలు ఉన్నట్లు దాని అర్థం. నాలుక రంగునే ప్రధానంగా తీసుకుంటే ఇలాంటి సందర్భాలలో ఉపవాసం పూర్తికాకుండానే విరమించవలసివస్తుంది. జిత్తులమారి నాలుక మనలను రోజూ మోసం చేస్తున్నట్లే ఇక్కడ ఉపవాసంలో కూడా మనలను మోసగించే ప్రయత్నం జేస్తుంది. నాలుక రంగును చూసి ఉపవాసం విరమిస్తే, మనం ఉపవాసంలో మోసపోయినట్లే. నాలుకతో జాగ్రత్త.
3. మలం పూర్తిగా పోవాలి: ఉపవాసంలో రోజూ ఎనిమా నీళ్ళ ద్వారా ఎంతో కొంత మలంగానీ, రంగునీళ్ళు వాసనతో గానీ లేదా ఒట్టి రంగునీళ్ళు గానీ విరేచనంలో రావడం జరుగుతుంది. ఉపవాసం విరమించే ఒకటి, రెండు రోజులు ముందు నుండి ఎనిమా ద్వారా ఎక్కించిన నీళ్ళు అదే రంగులో విరేచనం లేకుండా ఒట్టివి బయటకు రావడం జరుగుతుంది. ఎక్కువ మందికి విరేచనం పూర్తిగా బయటకు పోయి, ప్రేగు శుభ్రం అవ్వడంతోటే ఉపవాసం విరమించే లక్షణాలు వస్తాయి. అసలు మలబద్ధకం లేనివారికి కొద్దిరోజులలోనే మలం ప్రేగు శుభ్రం అయినప్పటికీ, ఆకలి పుట్టక ఉపవాసాలు ఎక్కువ రోజులు చేయవలసి వస్తుంది. ఒక విసర్జకావయవం అయిన మలం ప్రేగు పూర్తిగా శుభ్రం అయినప్పటికీ మిగతా విసర్జకవయవాలు, కణాలు పూర్తిగా పరిశుభ్రం కానప్పుడు ఆకలి లేక ఉపవాసాలు కొనసాగించవలసి వస్తుంది. అందువలన మలం పూర్తిగా పోవడాన్ని కూడా ఒక్కోసారి ఉపవాసాన్ని విరమించడానికి గుర్తుగా స్వీకరించగూడదు. మల బద్ధకం ఉన్నవారికి ఉపవాసం విరమించే ముందు రోజు వరకూ ఎంతో కొంత మలం వస్తూనే ఉంటుంది.
4. నీరసం రావడం: శరీరం ఉపవాసంలో చెడును విసర్జించుకొంటున్నన్ని రోజులు మనిషికి నీరసం రాకపోవడమే గాక శక్తిగా ఉంటుంది. ఉపవాసంలో ఉండగా నీరసం వచ్చింది అంటే మనం ఏదో తప్పు చేస్తున్నామని అర్థం. అంటే ఉపవాసంలో ఆకలి పుట్టకుండా నీరసం రావడం తప్పు అని భావం. సరిగా తేనె నీళ్ళు టైముకు త్రాగనందువల్ల, సరియైన విశ్రాంతి శరీరానికి ఇవ్వనందువల్ల లేదా ఉపవాసానికి అనుకూలంగా ఆలోచనలు లేనందువల్లో నీరసం రావడం జరుగుతుందే గానీ ఉపవాసం విరమించే ముందు వచ్చే నీరసం కాదని గ్రహించి ఉపవాసాన్ని కొనసాగించాలి. ఆ నీరసాన్ని ఆధారంగా చేసుకొని ఉపవాసాన్ని విరమిస్తే శరీరం ఇబ్బందులలో పడుతుంది. పైన చెప్పుకున్న కారణాలను తిరిగి సవరిస్తే మరలా చాలా రోజులు ఉపవాసాలు చేయగలుగుతారు. ఆకలి లేకుండా వచ్చే నీరసం ఉపవాసాన్ని విరమించడానికి గుర్తుకాదు.
5. ఆకలి అవడం: శరీరం చెడును బహిష్కరించుకొంటున్నన్ని రోజులూ మనిషికి ఆకలి తెలియదు, ఆకలి అవ్వకూడదు, ఇది ధర్మం. ఆకలి అవుతున్నదీ అంటే మన ఆలోచనలు, మనస్సు ఉపవాసంలో ప్రక్కదోవ పడుతున్నాయని అర్థం. విసర్జన క్రియ పూర్తి అయ్యాక ఆకలి వేయడం ఆరోగ్య లక్షణం. ఉపవాసంలో ఆకలి వేయడం అనేది ఎలాగుండాలంటే, తేనె త్రాగిన తరువాత రెండు గంటలకు, ముందు రోజులలో ఆకలి అవుతుంది. కొన్ని రోజుల తరువాత గంటన్నరకు, తరువాత గంటకు అలా క్రమేపీ టైము తగ్గుతూ ఆకలి పెరుగుతూ రావాలి. ఈ విధంగా రాకుండా ఉన్నట్టుండి ఒక్కరోజునే సడన్ గా ఆకలి అవ్వడం అనేది మనస్సులో కోరికలు పుట్టడం వలనేగానీ ఉపవాసం పూర్తి అయ్యి మాత్రం కాదు. ఈ విధంగా అయ్యే ఆకలిని దొంగ ఆకలి అని అనవచ్చు. ఈ దొంగ ఆకలి వేయడానికి ఇంకొక కారణం కూడా లేకపోలేదు. అది విరేచనం బాగా జాడించి, సాఫీగా వెళ్ళిన రోజున కూడా ఆకలి అయినట్లు అనిపిస్తుంది. ఆ దొంగ ఆకలిని నమ్మితే ఉపవాసం విరమిద్దామనిపిస్తుంది, అలా విరమించితే ఉపవాసంలో వచ్చే ప్రయోజనాన్ని దూరం చేసుకొన్నట్లే.
6. తేనె త్రాగిన తర్వాత పావుగంట నుంచి అరగంటలోపు ఆకలి అవ్వాలి: ఉపవాసం ప్రారంభించినప్పుడు మనం త్రాగిన తేనెనీళ్ళు రెండు గంటల వరకు శక్తి నివ్వగలుగుతాయి. శరీరం విసర్జన క్రియలో ఉన్నంత సేపూ మనలోని శక్తి ఎక్కువ ఖర్చు కాదు. అదీకాక శరీరానికి ఉపవాసం ప్రారంభమయిన రోజు నుండి ప్రేగులలో కణాలు చావడం, తిరిగి పుట్టడం ఆగిపోవడం కారణంగా ఎక్కువ శక్తి శరీరానికి మిగులుతుంది. విసర్జన క్రియ పూర్తి అవుతున్న కొలదీ కొద్ది కొద్దిగా ఆకలి ప్రారంభమవడం మొదలవుతుంది. ఉపవాసం విరమించే రోజు దగ్గరబడుతున్న కొలదీ తేనె వలన వచ్చే శక్తి చాలదనట్లుగా అనిపిస్తుంది. దీనికి కారణం శరీరం, కణాలు పూర్తి ఆరోగ్యవంతం అవ్వడం. మనం అందించే తేనె ఉపవాసం విరమించే ముందు ఆహారంగా చాలక పావుగంటకే లేదా అరగంట లోపులో మరలా త్రాగాలనిపించడం జరుగుతుంది. ఉపవాసాన్ని ఒకటి లేదా రెండు రోజులలో విరమించవచ్చని ఈ లక్షణం తెలియజేస్తుంది.
7. తినాలని పించడం: ఆహారం మీద ధ్యాస లేకపోతే శరీరం విసర్జన క్రియలో నిమగ్నం అయ్యి ఉన్నన్ని రోజులు అసలు తినాలన్న ఆలోచన గానీ, భావం గానీ మనకు రాదు. మనం ఉపవాసంలో త్రాగే తేనె నీళ్ళ ద్వారా శరీరానికి శక్తి చాలనప్పుడు, విసర్జన క్రియ పూర్తిగా పూర్తి అయినప్పుడు ఆకలి పెరిగి ప్రేగులలో, పొట్టలో మరలా జీర్ణాది రసాలు తయారవడం కొద్ది కొద్దిగా ప్రారంభమయ్యి మనకు ఆహారం తినాలనిపించడం జరుగుతుంది. ఈ సమయంలోనే పాత రుచులు, రకరకాల వంటలు గుర్తుకు రావడం జరిగి ఇంకా ఆకలి ఎక్కువ అవడం, తినాలనిపించడం ఉపవాసం విరమించే రోజున జరుగుతుంది.
8. లాలాజలం తయారవడం: క్రొత్త బావిలో ఊట ఊరినట్లు నోటిలో అదేపనిగా లాలాజలం ఊరుతూనే ఉంటుంది. ఇప్పుడు తయారయ్యే లాలాజలం తీపిగా ఉంటుంది. ఉపవాసాన్ని విరమించనున్న శరీరానికి ఆహారం అవసరం కాబట్టి ఆహారాన్ని జీర్ణం జేయడానికి అనువుగా ఈ రకమైన లాలాజలం నోట్లో తయారవడం జరుగుచున్నది. కాబట్టి ఉపవాసాన్ని విరమించి, శరీరానికి ఆహారాన్ని అందించమని నోరు ఈ రకంగా విలపిస్తున్నదన్నమాట. మనస్సులో తినాలని కోరిక రావడం వలన, ఆకలి అవ్వడం వలన నోట్లో జీర్ణక్రియకు లాలాజలం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అవుతుంది. ఉపవాసాన్ని విరమించడానికి నోట్లో లాలాజలం తయారవ్వడమనేది అతి ముఖ్యమైన గుర్తు.
9. ఆకలి మంట, నీరసం రెండూ కలిసి వస్తే అది కరెక్టు: దొంగ ఆకలి, సరిగా తేనె నీళ్ళు త్రాగనందుకు వచ్చిన నీరసం ఇవి రెండూ వచ్చిన రెండవ రోజుకి మరలా సర్దుకు పోతాయి. ఉపవాసాన్ని శరీరం కరెక్టుగా పూర్తిచేసి ఉన్నట్లయితే ఉపవాసాన్ని విరమించే రోజున పావుగంటకు అయ్యే ఆకలే చివరకు మంటగా ప్రారంభమవుతుంది. దానికి తోడు నీరసం ఉన్నట్లుండి ఒక్కసారే ఎక్కువ అనిపిస్తుంది. దీని కారణంగా శరీరం పట్టు వదిలేసినట్లు అనిపిస్తుంది. ఈ విధంగా ఆకలి మంట, నీరసం రెండూ కలిసి ఒక్క రోజులోనే అనిపిస్తే ఆ రోజున గాని లేదా మరుసటి రోజు ఉదయం నుండి ఉపవాసాన్ని సందేహించకుండా విరమించవచ్చు.
10. నిద్రపట్టదు: పైన చెప్పుకున్న లక్షణాలు వచ్చినప్పటికీ ఉపవాసాన్ని విరమించకుండా ఆ రోజు గడిపితే రాత్రికి అసలు నిద్రపట్టనట్లుగా, కలత నిద్రగా అనిపిస్తుంది. శరీరానికి ఆహారం చాలనందుకు మనస్సు, శరీరం సరిగా రాత్రికి విశ్రాంతి తీసుకోవు. ఆహారం మీద రకరకాల కోరికలు ఉండటం వలన కూడా నిద్ర సరిగా పట్టదు. క్రిందటి రోజు రాత్రి ఇలా నిద్రలేక ఆలోచనలు ఆహారం మీదకు మళ్ళితే తరువాత రోజు నుండి ఉపవాసం తప్పనిసరిగా విరమించాలి.
11. తల డిమ్ గా, మనస్సు మందంగా ఉంటుంది: తేనె ద్వారా వచ్చిన శక్తి శరీరానికి, ముఖ్యంగా మనస్సుకు చాలనందువల్ల ఈ విధంగా ఉంటుంది. ఈ రకంగా తలలో అనిపించినప్పుడు ఉపవాసాలు చేస్తే మెదడులో కణాలు చనిపోయే ప్రమాదముంటుంది. తల డిమ్ గా అనిపించిన రోజునే ఉపవాసాలను పూర్తిగా విరమించి వేయాలి. ఈ లక్షణం వచ్చిన తరువాత ఉపవాసం విరమించడానికి ఇంకా వేరే ఆధారాలు అక్కరలేదు. ఉపవాసాన్ని పూర్తిగా ఆపి, ఆహారాన్ని అందించడానికి ఇదే ఫైనల్ గుర్తు. నిస్సందేహంగా ఉపవాసాన్ని విరమించ వలసిందే.
ఇన్ని రకాల లక్షణాలన్నీ ఒక దాని తరువాత ఒకటి రెండు మూడు రోజులలో వరుసగా వస్తే వీటిని ఆధారంగా చేసుకొని ఉపవాసాలను విరమించవచ్చు. మూర్ఖుడు కూడా ఉపవాసం చేయగలడు. కానీ నిగ్రహం గలవాడు, తెలివిగలవాడు మాత్రమే ఉపవాసాన్ని సరిగ్గా విరమించగలడు. పైన చెప్పుకున్న లక్షణాలన్నీ సరిగా రాకుండా ఉపవాసాన్ని ఎవరయినా విరమించి ఉంటే వారికి రెండు మూడు రోజులలో కొన్ని మార్పులు, తేడాలు వస్తాయి. అవి ఏమిటంటే ఆకలి తగ్గిపోవడం, తినాలని కోరిక రెండు రోజుల క్రితం కంటే సన్నగిల్లడం, అరగనట్లు అనిపించడం, నాలుక కొద్దిగా చేదుగా ఉండి నోటిలో లాలాజలం తగ్గడం మొదలగు లక్షణాలు రావడం జరుగుతుంది. ఉపవాసంలో విసర్జన క్రియ సరిగా పూర్తి కానందువల్ల శరీరం, మనస్సు విసర్జన క్రియలోనే లగ్నం అయ్యి ఉండి, మనం ఇచ్చే తేలికపాటి ఆహారాన్ని కూడా వద్దని తెలియజేయడమే వాటి (పై లక్షణాల) అర్థం. ఇలాంటి సమయాల్లో తొందరపడకుండా, ఓర్పుగా నిగ్రహంతో పళ్ళరసాలను వదిలి మరలా వెనుకటిలా తేనెనీళ్ళు తీసుకొంటూ శరీరాన్ని ఉపవాసంలో కొన్ని రోజులు కొనసాగించాలి. అప్పటి నుండి రెండు మూడు రోజులు ఉపవాసం కొందరు చేయవలసి వస్తుంది. అలా చేస్తే గానీ శరీరం ఒప్పుకోదు. శరీరం తిరిగి ఉపవాసం చేయమని సంకేతాలు అందించినప్పుడు వాటిని మనం లెక్కచేయక ఉపవాసం విరమించి అలాగే పళ్ళరసాలు అందిస్తుంటే మరలా వికారాలు, వాంతులు తిరిగి ప్రారంభమవుతాయి. ఇది శరీర ధర్మం. శరీర ధర్మాన్ని అతిక్రమించితే శిక్ష ఉపవాసంలో వెంటనే ఉంటుందన్నమాట.
ఉపవాసాలు చేస్తున్నవారు ప్రతి రోజూ శరీరంలో ఏమి జరుగుచున్నదో, ఏ మార్పులు ఉపవాసంలో వస్తున్నాయో మనస్సు పెట్టి శ్రద్ధగా ఆలకించితేగానీ అర్థం కావు. ఉపవాసంలో వచ్చే మార్పులను మీరు కరెక్టుగా ఉన్నది ఉన్నట్లు డాక్టరు గారికి చెప్పగలిగితే ఏ రకమైన ఇబ్బందులు మీరు పడకుండా ఉపవాసాలను సంపూర్ణంగా పూర్తి చేయగలరు. క్లాసులో పాఠాలు చెప్పుచున్న మాష్టారి మాటల మీద పిల్లవాడు మనస్సు నిల్పక పోతే తరువాత అడిగే ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పలేడు. అలాగే ఉపవాసాలు చేస్తున్నప్పుడు మీ మనస్సును కొంత శరీరంపై లగ్నం చేయకపోతే ఉపవాసాన్ని విరమించే లక్షణాలను సరిగా మీరు తెలుసుకోలేరు. చేస్తున్న పనిమీద మనస్సు పెట్టకపోతే ఎన్ని యిబ్బందులు ఎదురౌతాయో తెలుస్తున్నది గదా! జీవితానికి ఉపయోగపడే ఉపవాసాలను మొదటిసారి చేసేటప్పుడు డాక్టరు గారిని అన్నీ అడిగి తెలుసుకొని మీరు ఆలకిస్తే అది మీ కుటుంబాన్నంతటిని మీరు బాగు చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ప్రకృతి వైద్య విధానం, ఉపవాస ధర్మం మీకు అలాంటి సదవకాశాన్ని కల్గిస్తున్నాయి. ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఉపయోగించుకొని మీ కుటుంబం అంతా ఆరోగ్యంగా జీవించండి.

28. ఉపవాసాన్ని ఎలా విరమించాలి

చెట్టును ఎక్కడం లాంటిది ఉపవాసాన్ని ప్రారంభించడం. చెట్టు నుండి దిగడం లాంటిది ఉపవాసాన్ని విరమించడం. మంచి పండును తినడానికి మనం చెట్టును ఎక్కడానికి ప్రయత్నిస్తాము. అలాగే మంచి ఆరోగ్యం అనే పండును అందుకోవడానికి ఉపవాసం అనే చెట్టును ఎక్కాము. పండును కోయడం పూర్తి అయినట్లే ఇక్కడ ఉపవాసం చేయడం పూర్తి అయ్యింది. చెట్టు మీద పని పూర్తి అయ్యాక మెల్లగా దిగడం ఎంత సహజమో అలాగే ఉపవాసం చేయడం పూర్తి అయ్యాక మెల్లగా విరమించడం కూడా అంత సహజమే. పండును పొందడానికి చెట్టును ఎక్కేటప్పుడు ఉన్న ధ్యేయం, శ్రద్ధ, జాగ్రత్త మొదలగునవన్నీ చెట్టు నుండి దిగేటప్పుడు కూడా ఉంటేనే మనం సురక్షితంగా నేలను చేరగలము. అలాగే ఆరోగ్యాన్ని పొందడానికి ఉపవాసాన్ని ప్రారంభించేటప్పుడు ఉన్న ధ్యేయం, శ్రద్ధ, జాగ్రత్త మొదలగునవి అన్నీ ఉపవాసం విరమించేటప్పుడు కూడా ఉంటేనే మనం సురక్షితంగా గమ్యాన్ని చేరగలము. పండు తినడం (లేదా కోయడం) పూర్తి అయ్యింది గదా అని చెట్టు నుండి ఒక్కసారే నేల మీద దూకితే కాళ్ళు విరగవచ్చు లేదా నడుము దెబ్బ తినవచ్చు. అలాగే ఉపవాసంలో ఆరోగ్యం వచ్చింది. శరీరం అంతా శుభ్రం అయ్యింది. తిని చాలా రోజులయ్యింది అని ఒక్కసారే ఆహారం తింటే ప్రేగులు పాడయి పోవడమో లేదా ప్రాణం పోవడమో జరుగుతుంది. చెట్టును ఎక్కేటప్పుడు స్పీడుగా ఎక్కగలిగినప్పటికీ, దిగేటప్పుడు మాత్రం అలా కాకుండా నిదానంగా దిగడం వలన కాళ్ళు జారకుండా క్షేమంగా నేలకు దిగగలము. అలాగే సడన్ గా ఒక్కరోజే ఆహారం మానివేసి ఉపవాసం మొదట్లో ప్రారంభించినప్పటికీ ఉపవాసాన్ని విరమించేటప్పడు సడన్ గా ఒక్కసారే ఆహారంలోనికి వెళ్ళకుండా నిదానంగా తేలిక ఆహారం కొద్ది కొద్దిగా అందించడం వలన విరేచనాలు, వాంతులు లేకుండా క్షేమంగా గమ్యాన్ని జేరగలము.
ఉపవాసం ప్రారంభించేటప్పుడు ఉండే ఆరంభ శూరత్వం వలన గానీ, రోగాలు బాధలు పడలేక గానీ, సుఖాన్నీ కోరుకోవడం వలన గానీ, అందరూ ఉపవాసాన్ని ఊపుగానే ప్రారంభిస్తారు. ఉపవాసాన్ని విరమించేటప్పుడు ముందు ఉన్న ఆ ఊపు లేక, త్రాగి త్రాగి తేనె నీళ్ళు బోరు కొట్టి, ఆకలికి, కోరికలకు తట్టుకోలేక, శరీరంలో శక్తి చాలక ఎక్కువ శాతం మందికి ఉపవాసం విరమించేటప్పుడు కష్టంగా ఉంటుంది. ఉపవాసాన్ని విరమించేటప్పుడు ఆ మనిషికి రుచుల మీద కోరికల పరుగులు ఎలా ఉంటాయి అంటే, వెర్రి బట్టి పిచ్చి కుక్క అర్థం లేకుండా ఊరంతా పరుగులెత్తినట్లు ఉంటాయి. మనస్సును నిగ్రహించి, ఆ పరుగులకు కళ్ళాలు వేయగలిగి, మంచి రసాలతో ఉపవాసాన్ని విరమించగలిగిన వారికి నష్టం లేకుండా సత్ ఫలితాలు వస్తాయి.
ఉగాది పండుగ వస్తుంది అంటే ఇంట్లో ఆడవారు ఇంటిని శుభ్రం చేసే కార్యక్రమం ప్రారంభిస్తారు. ఇల్లంతా పూర్తిగా బూజులు దులిపి, పూర్తిగా కడిగి, అన్నీ శుభ్రంగా సర్దుకోవడంలో ఒకటి రెండు రోజులు బాగా కష్టపడవలసి వస్తుంది. ఆ పనిమీద ఉన్న శ్రద్ధ, బాధ్యత వలన పనిలో ఉన్నంత సేపూ నీరసం గానీ, నొప్పులు గానీ, ఆకలిగానీ ఏమీ ఆడవారికి తెలియవు. దులుపులు అయ్యాక ఆడవారికి తరువాత రోజు నీరసం, అలసట, ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉండటం వలన శరీరం అంతా భారంగా ఉండి ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటారు. అలాగే మన శరీరం కూడా ఉపవాసంలో తనలో ఉన్న బూజు, దుమ్ములను దులుపు కోవడానికి 20 లేదా 30 రోజులు రేయింబవళ్ళు కష్టపడి పనిచేయడం జరుగుచున్నది. శరీరం దులుపుకునే రోజులలో నీరసం, ఆకలి, నొప్పులు అని చెప్పకుండా ఏకధాటిగా శత్రువులను ఎదుర్కొంటుంది. అన్ని రోజులు అంత కష్టపడ్డ శరీరం దులుపులు పూర్తయ్యాక (ఉపవాసం పూర్తి అయ్యాక) విశ్రాంతిని కోరుకోవడం సహజం. ఉపవాసం పూర్తి అయ్యాక అంటే విరమించేటప్పుడు నొప్పులు, నీరసం, ఆకలి ఇవన్నీ ఉండటం సహజమన్నమాట. పని పూర్తి అయ్యాక ఆడవారు శరీరానికి తరువాత రోజు విశ్రాంతి నిచ్చి శరీరానికి మరలా తిరిగి శక్తిని పెంచుకొన్నట్లే అన్ని రోజులు ఉపవాసాన్ని విరమించిన శరీరానికి కూడా నాలుగైదు రోజులు పూర్తిగా విశ్రాంతి నిచ్చి పూర్వం కంటే ఎక్కువ శక్తిని పొందవచ్చు.
రోజూ అన్ని పనులూ చేసుకుంటూ ఉపవాసం చేయగలిగిన మనిషి, ఉపవాసాన్ని విరమించాక ఏమీ చేయలేక నీరసించి పోవడానిక గల కారణాన్ని తెలియజేయడానికి చెప్పినదే పై ఉదాహరణ. అంటే శరీరానికి ఉపవాసంలో కంటే ఉపవాసం విరమించిన తరువాతే ఎక్కువ విశ్రాంతి నివ్వాలన్నమాట. తేనె నీళ్ళు బదులు పళ్ళరసాలు ఇచ్చినప్పటికీ, శరీరానికి పూర్తి విశ్రాంతి నిస్తేనే గానీ కొన్ని రోజులలో శక్తి పెరగదు. ఉపవాసాలలో ఆఫీసులకు వెళ్ళేవారు ఇంట్లో పనులు చేసుకొనే వారు ఉపవాసానంతరం శెలవు పెట్టి పూర్తి విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది.
ఉపవాసాన్ని విరమించే ఆహారం: అన్ని రోజులు అదే పనిగా కష్టపడ్డ శరీరానికి ఒక్కసారే ఆహారం ఎక్కువగా ఇస్తే ఆ ఆహారం వలన ఎక్కువ శ్రమ అవుతుంది. శరీరానికి, ప్రేగులకు శ్రమ కల్గించని ఆహారాన్ని ఇవ్వగలిగితే, శరీరానికి మనం సహకరించి నట్లవుతుంది.
కొబ్బరి నీళ్ళు, మజ్జిగ తేట, చెరకు రసం: ఉపవాసాన్ని విరమించే ఒకటి రెండు రోజుల ముందు నుండి తేనెనీళ్ళ వలన శక్తి చాలనప్పుడు, వాటికి తోడుగా రెండు మూడు సార్లు కొబ్బరి నీళ్ళు త్రాగవచ్చు. తేనె నీళ్ళు, కొబ్బరి నీళ్ళు త్రాగినప్పటికీ మరుసటి రోజు ఇంకా ఆకలయితే అప్పుడు అవకాశమున్న వారు చెరకు రసాన్ని త్రాగవచ్చు. తేనె నీళ్ళు, కొబ్బరి నీళ్ళూ, చెరకు రసం త్రాగుతూ ఉపవాసంలో రోజూ త్రాగినట్లే మంచినీరును త్రాగుతూ ఒకటి రెండు రోజులు ఈ విధంగా ఉండగలిగితే మంచిదే. మరీ అవసరమైతే వాటితో పాటు కొద్దిగా పలుచటి మజ్జిగ గానీ, మజ్జిగ తేట గానీ త్రాగవచ్చు. ఉపవాసంలో చెడు పూర్తిగా విసర్జింపక, ఇంకా శరీరంలో మిగిలి ఉంటే కొబ్బరి నీళ్ళు, చెరుకురసం, మజ్జిగ వాడే సరికి ఆకలి పూర్తిగా తగ్గిపోతుంది. ఇలా ఆకలి తగ్గడం గమనించిన వారు మరలా తేనెనీళ్ళు మంచి నీరుతోనే ఉపవాసాన్ని పూర్తిగా ఆకలియ్యేవరకూ కొనసాగించాలి. ఉపవాసం కరెక్టుగా పూర్తి అయితే తేనె నీళ్ళు ఎనిమిది సార్లతో పాటు కొబ్బరి నీళ్ళు, చెరకు రసం, మజ్జిగ ఇచ్చినప్పటికీ ఇంకా ఆకలి పెరుగుతూనే ఉంటుంది గానీ కొద్దిగా కూడా తరగదు. ఇన్ని రకాలుగా త్రాగినప్పటికీ శరీరానికి నీరసం పెరుగుతూ, శక్తి చాలనట్లుగా ఉంటుంది. పళ్ళరసాల జోలికి పోకుండా వీటితో ఉండగలిగిన రోజు వరకూ, మనం ఉపవాసంలోనే ఉన్నట్లుగా లెక్క వేసుకో వచ్చు. ఇక్కడితో ఉపవాసాల చరిత్ర ముగుస్తుంది.
రసోపవాసం: ముందు లీటరు నీరు త్రాగి రోజుటి లాగానే రసోపవాసాలలో కూడా ఉదయం ఎనిమా చేసుకోవలసిందే. మొదటిసారి తేనె, నిమ్మకాయ నీళ్ళు ఒక్కసారి త్రాగితే కొద్దిగా నీరసం తగ్గుతుంది. ఉపవాసంలో త్రాగినట్లే పళ్ళ రసాలలోనికి వచ్చిన తరువాత కూడా మంచినీరు త్రాగవలసిందే. కాకపోతే రసం త్రాగిన తరువాత గంటకు త్రాగడం బదులు మరలా పళ్ళరసం త్రాగే అరగంట ముందు నీరు త్రాగితే (రెండు గ్లాసులు) మంచిది. పళ్ళ రసం గంటపైన జీర్ణానికి తీసుకుంటుంది. కాబట్టి మంచినీళ్ళు ఆలస్యంగా త్రాగాలి. రోజుకి నాలుగు లేదా ఐదుసార్లుగా పళ్ళరసాలను తీసుకోవచ్చు. కొబ్బరినీళ్ళను, చెరుకురసాన్ని, మజ్జిగ తేటను కూడా పళ్ళరసాలు తీసుకొనే రోజులలో తీసుకోవచ్చు. రసం వచ్చే ప్రతి పండును రసం తీసి కొద్దిగా నీరు (సగానికి సగం) కలిపి దానిలో నాలుగు స్పూనుల తేనెను కలిపి, ఆ రసాన్ని మెల్లగా పుక్కిలిస్తూ త్రాగాలి. నోట్లో లాలాజలం రసంతో పూర్తిగా కలియాలి. రసాన్ని మెల్లగా త్రాగడం వలన విరేచనాలు అయ్యే అవకాశం ఉండదు. ఉపవాసాలను విరమించాక టైముతో సంబంధం లేకుండా ఆకలయినప్పుడల్లా నీరును త్రాగి అరగంట తరువాత ఏదొక రసం తీసుకుంటే సరిపోతుంది. ఇన్నిసార్లు పళ్ళరసం త్రాగాలని కొలత ఏమీ లేదు.
రసాలకు వాడే పళ్ళు: బత్తాయి, నారింజ, కమలా, దానిమ్మ, ద్రాక్ష, పుచ్చకాయ, అనాస (పైన్ యాపిల్), యాపిల్, సపోటా మొదలగునవి రసాలుగా తీసుకొని త్రాగవచ్చు. అరటి, మామిడి, జామ మొదలగు పండ్లను రసాలుగా తీసి త్రాగడం మంచిది కాదు. ఫ్రిజ్ లో పెట్టిన పళ్ళను వాడటం పూర్తిగా నిషేధించాలి.
కొంతమందికి పళ్ళరసాలు ప్రారంభించిన దగ్గర నుండి విరేచనాలు అవ్వడం జరుగుతుంది. వారు విరేచనాలు తగ్గేవరకూ రసాలను (పుల్లటి) మాని కొద్దిగా దానిమ్మగింజలను చప్పరించి, రసం మింగి పిప్పిని ఊసి వేయడం, కొద్దిగా పుచ్చకాయ ముక్కను బాగా నమిలి తినడం చేస్తే సరిపోతుంది. ఎక్కువగా మజ్జిగ వాడడం అలాంటప్పుడు మంచిది. లేత కొబ్బరికాయ నీళ్ళను కూడా త్రాగడం మంచిది. ఆస్తమాలు, సైనస్ ట్రబుల్స్ (ముక్కురొంప) ఉన్నవారు పళ్ళరసాలను డాక్టరు గారి సలహా మీదటే పుచ్చుకోవడం చేయాలి. అవసరమైనప్పుడల్లా తేనె నీళ్ళు కూడా త్రాగవచ్చు. లేదా నీరసంగా ఉన్నప్పుడు కొద్దిగా తేనెను మెల్లగా చప్పరించవచ్చు. అన్ని రకాల పళ్ళరసాలు, కొబ్బరి నీళ్ళు, తేనె మొదలగునవి పదే పదే తీసుకొంటున్నప్పటికీ ఇంకా ఆకలి ఎక్కువ అవుతూ ఉంటే మనలో జీర్ణక్రియ పెరుగుతున్నదని అర్థం. ఇవన్నీ ఎన్నిసార్లు త్రాగినప్పటికీ మనకు ఇంకా ఆకలి ఎక్కువ అవుతూ ఉంటే మనం ఉపవాసాలను కరెక్టుగా విరమించినట్లని దాని అర్థం. రసోపవాసాలలో ఆకలితో పాటు నీరసం కూడా పెరుగుతూ ఉంటుంది. తేనే, నిమ్మకాయ నీళ్ళతో చేసే ఉపవాసాలలో ఎంత శక్తిగా, హుషారుగా, ఆకలి లేకుండా, నీరసం లేకుండా ఉన్నదో రసోపవాసాలు చేస్తుంటే బాగా తెలుస్తుంది. రసోపవాసాలను మనం చేయగలిగినన్ని రోజులు చేయడం మంచిది. ఎక్కువ విశ్రాంతి తీసుకొంటూ, రసాలను బాగా త్రాగుతూ ఉంటే రసోపవాసాలను ఎక్కువ రోజులు చేసే అవకాశం కలుగుతుంది. రసాలు త్రాగుచున్నప్పుడు నీరసం ఎక్కువగా ఉంటే అలాంటి వారు ఉదయం అరడజను ఖర్జూరం పండ్లు, అలాగే సాయంత్రం అరడజను పండ్లను మెత్తగా నమిలి (రసంలాగా) తినడం మంచిది. ఖర్జూరం పళ్ళరసాల కంటే కూడా త్వరగా జీర్ణం అయ్యే ఎక్కువ శక్తి నిచ్చే ఆహారం. ఖర్జూరం ద్వారా గ్లూకోజ్ జీర్ణక్రియ ఎక్కువ అవసరం లేకుండానే (ప్రీ డైజెస్టెడ్ ఫామ్) అందుతుంది. రసోపవాసాలను మూడు నాలుగు రోజుల కంటే ఎక్కువ ఎవరూ మా దగ్గర చేయలేక పోతారు. రసాల ద్వారా వచ్చే శక్తి చాలనప్పుడు, రసాహారంలో ఆకలికి తట్టుకోలేనప్పుడు ఈ ఉపవాసాలను విరమించి ఫలోపవాసంలోనికి వెళ్ళవలసిందే. రసోపవాసాలు ప్రారంభించిన దగ్గర నుండి బరువు తగ్గడం పూర్తిగా ఆగి పోతుంది.
ఫలోపవాసం: రసోపవాసంలో కంటే ఫలోపవాసంలో కొద్దిగా బాగుంటుంది. ఫలోపవాసం ప్రారంభించే రోజున ఉదయం ఎనిమా చేసుకొని, ఆ రోజు నుండి ఎనిమాని చేసుకోవడం పూర్తిగా ఆపివేయాలి. ఉదయం ఒక్కసారి పళ్ళరసంలో తేనె వేసుకొని త్రాగడం మంచిది. అక్కడ నుండి ఆకలయినప్పుడల్లా అన్ని రకాల పండ్లను పిప్పిని ఊసివేయకుండా మెత్తగా నమిలి తినడం మంచిది. పుల్లగా ఉన్న పండ్లను మాత్రం రసం తీసుకొని త్రాగడం మంచిది. మీ ఆకలికి తగ్గట్లు ఆయా కాలంలో దొరికే అన్ని రకాల పండ్లు తినవచ్చు. మంచి నీళ్ళను పండు తినే అరగంట ముందు రెండు గ్లాసులు ప్రతిసారీ త్రాగవలసిందే. పండ్లు తిన్న తరువాత మళ్ళీ ఆకలి అయ్యేవరకు నీరును త్రాగకూడదు. ఫలోపవాసంలో ఖర్జూరం రెండు పూటలా తినడం మంచిది. దీని వలన నీరసం వచ్చే అవకాశం ఉండదు. ఫలోపవాసం మొదటి రోజున పళ్ళు తినడం వలన ఆకలి కొద్దిగా తగ్గినట్లనిపిస్తుంది. కొంత మంది పళ్ళు తినడం వలన పొట్టలో కొంతసేపు బరువుగా ఉన్నట్లు ఫీలవుతారు. మరి కొంతమందికి పూర్తిగా ఆకలి లేనట్లు అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది. ఇన్ని రోజులు ద్రవాహారం మీద ఉండినందువల్ల ప్రేగులకు అవి అలవాటు అయ్యి, పళ్ళు తినడం వలన ఒక్కసారే లోడు పడినట్లు అనిపిస్తుంది. అలాగే నీరసం కూడా కొద్దిగా తగ్గినట్లుగా ఉంటుంది. మామూలుగా రోజూ చేసుకొనే పనులు చేసుకుందామనిపిస్తుంది. ఫలోపవాసం ప్రారంభమయిన రోజు నుండి సాయంత్రం ఐదు లేదా ఆరుగంటలకు పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కసారే లీటరు నీరు త్రాగి విరేచనానికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. అలాగే మరుసటి రోజు ఉదయం కూడా లీటరు నీరు త్రాగిన వెంటనే ఆలోచిస్తే సాఫీగా విరేచనం అవుతుంది. ఉదయం పూట మరలా రెండవ లీటరు నీరు అరగంట తరువాత త్రాగడం ప్రారంభించాలి. ఎప్పుడు విరేచనం అవ్వాలన్నా ఇలా ఒక్కసారే లీటరు నీరు త్రాగి ఆలోచన పెడితే వెంటనే మలం కదిలే అవకాశముంటుంది. ఫలోపవాసంలోనే రోజుకు మూడు లేదా నాలుగు సార్లు విరేచనం అయ్యేటట్లు చూసుకోవాలి. ఈ దశలో విరేచనం సాఫీగా కాకపోతే తరువాత ఆహారంలో అయ్యే అవకాశం తక్కువ.
ఫలోపవాసంలో కూడా జీర్ణక్రియ కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. రెండవ రోజు ఫలోపవాసంలో మొదటి రోజు కంటే ఆకలి పెరగడం, కొద్దిగా నీరసం అనిపించడం ఉంటుంది. రెండు రోజులు పళ్ళు తినడం అనేది అందరూ చేయగలుగుతారు. మూడవ రోజు నుండి ఫలోపవాసంలో కూడా ఆకలి పెరగడం, నీరసం పెరగడం పళ్ళమీద విరక్తి రావడం ఇవన్నీ కొంత మందికి జరుగుతాయి. మా దగ్గర నూటికి 70 శాతం మంది మూడు రోజుల తరువాత నుంచి ఫలోపవాసం చేయలేక నాలుగవ రోజు నుండి ఆహారంలోనికి వెళ్లిపోతారు. 25 శాతం మంది ఐదు రోజుల వరకు చేయగలిగితే, మిగతా 5 శాతం మంది ఐదు రోజుల నుండి 10 రోజుల వరకు ఫలోపవాసంలో కొనసాగగలుగుతారు. ఫలోపవాసంలో రెండు మూడు రోజులు గడిచాక ఉదయం పరగడుపున పళ్ళరసానికి బదులు పచ్చి కూరగాయల రసాన్ని పెద్దగ్లాసుడు త్రాగడం చాలా మంచిది. అలాగే మధ్యాహ్నం పూట కూడా ఇంకొక సారి కూరగాయల రసం త్రాగవచ్చు. క్యారెట్, బీట్ రూట్, కీరా, దోసకాయలు, టమోటా, బంగాళాదుంప, క్యాబేజీ మొదలగు కూరగాయలను రెండు మూడు రకాలుగా కలిపి త్రాగవచ్చు. ఉదాహరణకు క్యారెట్ + బీట్ రూట్ + కీరాలను కలిపి ఒకరకం, క్యాబేజీ + టమోటా + కీరా కలిపి వేరే రకం, అలాగే బంగాళాదుంప + కీరాను కలిపి (కీళ్ళ నెప్పులున్నవారు) రసం తీసుకొని త్రాగవచ్చు.
ఈ విధంగా పళ్ళు తింటూ కూరగాయల రసాన్ని త్రాగుతూ ఎన్ని రోజులు ఫలోపవాసాలు చేయగలిగితే అంత రక్త శుద్ధి జరుగుతుంది. దీర్ఘరోగాలున్న వారు ఫలోపవాసాలు ఎక్కువ రోజులు చేస్తే చాలా త్వరగా శరీరం ఆరోగ్యవంతం అయ్యే అవకాశం ఉంటుంది. భగవంతుడు అందించే చక్కని ఆహారాన్ని పాడుచేసుకోకుండా తినే అవకాశం ఫలోపవాసాలలో లభిస్తున్నది. కాబట్టి ఫలోపవాసాలు శరీరానికి పూర్తిగా రోగనిరోధక శక్తి వచ్చేటట్లు సహకరించగలవు. ఆకలికి, నీరసానికి తట్టుకోగలిగినన్ని రోజులు ఫలోపవాసాన్ని సాగనిచ్చి, ఇబ్బంది అనిపించినప్పుడు ఆహారంలోనికి మారడం మంచిది.
ఆహారం: పళ్ళు, ఖర్జూరం తింటూ కూరగాయ రసాలు త్రాగుతూ అలవాటున్నవారు పచ్చికూరగాయలను ఉదయం కొద్దిగా, సాయంత్రం కొద్దిగా తింటూ ఉండగలిగినన్ని రోజులు ఉండగలిగితే చాలామంచిది. ఈ విధంగా తింటే సుగరు, చర్మవ్యాధులు, కీళ్ళనొప్పులు, ఆస్త్మా మరియు మిగతా దీర్ఘ రోగాలు త్వరితంగా నివారింపబడతాయి. ఈ ఆహారాన్ని తినడం వలన శరీరంలో విటమిన్లు, మినరల్స్, సహజమైన ఎన్ జైమ్ లు, పీచు పదార్థాల లోపం పూర్తిగా నివారింపడుతుంది. ఇది సంపూర్ణారోగ్యానికి ఉపయోగ పడుతుంది. ఇంకా ఆకలి పెరిగితే కొన్ని రోజుల తరువాత ఉదయం, సాయంకాలం పచ్చికూరలతో ఒకటి లేదా రెండు పుల్కాలను జోడించి తినగలిగిన వారు తినవచ్చు. ఈ విధంగా చాలా రోజులు తినవచ్చు.
అలాగే పళ్ళు, ఖర్జూరం తింటూ పచ్చి కూరగాయరసాలు త్రాగుతూ పచ్చికూరలు తినలేని వారు ఉడికించిన కూరను వట్టిది ఉదయం, సాయంత్రం తీసుకొంటూ రెండూ పూటలా మజ్జిగ త్రాగుతూ రెండు రోజులు ఇలా చేయాలి. ఇందులో ఇంకా ఆకలి పెరిగితే అప్పుడు ఉడికించిన కూరకు తోడు మూడవ రోజు నుండి ఒక పుల్కా ఉదయం, సాయంత్రం వేరొక పుల్కాతో కూరను తినడం మంచిది. ఇలా రెండు మూడు రోజులు గడిచాక ఇంకా ఆకలి పెరిగితే పుల్కాలను పెంచుకోవచ్చు. పుల్కాలను నమలలేని వారు గోధుమ అన్నంలో కూరను రెండు పూటలా కలుపుకొని తినవచ్చును. బరువు తగ్గ వలసిన వారు పుల్కాలతోనే కూర తినడం తప్పదు. తెల్లటి అన్నాన్ని అసలు వాడరాదు. ముడి బియ్యాన్ని వాడవచ్చు. తెల్లటి అన్నానికి విరేచనం బద్ధకం వస్తుంది. తెల్లటి అన్నంలో కూరలు మరీ చప్పగా ఉంటాయి. ఆ విధంగా ఆహారంలో నాలుగైదు రోజులు గడిచాక, ఇంకా ఆకలి పెరిగితే మొలకెత్తిన గింజలను ప్రారంభించవచ్చు. విరేచనం రోజుకు రెండు మూడు సార్లు అయినప్పటి నుండి మొలకలు తినడం ప్రారంభించడం మంచిది. విరేచనం సాఫీగా అవ్వకపోతే పొట్ట బరువుగా ఉండి, గ్యాసు తయారవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు పెసలు తింటుంటే మరీ ఇబ్బందిగా ఉంటుంది. విరేచనం సాఫీగా వెళ్ళే ప్రయత్నం చేయాలేగానీ, గ్యాసు వస్తున్నదని మొలకెత్తిన గింజలు తినడం మానివేస్తే శరీరానికి నీరసం పెరుగుతుంది. ఈ ఆహారాన్నంతటినీ మార్పు చేయకుండా తింటూ ఇంకా ఆకలి పెరిగితే మజ్జిగ అన్నంగానీ, పెరుగు అన్నంగానీ వాడుతూ అందులో అరటి పండు ప్రారంభించవచ్చు. అన్నింటిలో పచ్చి కొబ్బరిని వాడటం ఇక ప్రారంభించవచ్చు. పూర్తి ఆరోగ్యాన్నీ పొందే ప్రయత్నంలో ఉపవాస కార్యక్రమాన్ని పూర్తిచేసి, శరీరాన్ని శుభ్రం చేసుకున్నందుకు తరువాత మేము చెప్పే ఆహారాన్ని సంపూర్ణంగా తినగలిగితేనే మీరు సంపూర్ణారోగ్యవంతులు కాగలరు.
చూసారా! ఉపవాసం చేయడం కంటే విరమించడానికి ఎంత తతంగం ఉందో. రాత్రికి నిద్రలో ఐదు లేదా ఆరుగంటలు పొట్టకు విశ్రాంతి నిచ్చినందుకే మరుసటి రోజు ఉదయం తీసుకొనే టిఫిన్ తేలిగ్గా తింటారు. కొద్దిగా తింటే తేలిగ్గా ఉంటుందని దాన్ని అల్పాహారం అని అంటారు. 20 నుండి 30 రోజుల వరకు పొట్టకు, ప్రేగులకు పూర్తి విశ్రాంతి నిచ్చిన దాని మీద ఎంత తేలికైన ఆహారం అందించాలో ఆలోచించండి. పొయ్యి రాజేయడానికి (ముట్టించడానికి) ముందు తుక్కు, గడ్డి లేదా ఏదన్నా తేలిగ్గా మండే చెత్తను ఉపయోగిస్తాము. అలాగే ఉపవాసాన్ని విరమించేటప్పుడు జీర్ణాది రసాలు తయారవడానికి (జీర్ణక్రియను ప్రారంభించడానికి) కొబ్బరి నీళ్ళు, చెరకు రసం మనం ఉపయోగించాలి. వాటితో పొయ్యి ముట్టించాక మంట కొద్దిగా పెరిగి ఆరిపోకుండా ఉండడానికి సన్నటి ఎండు పుల్లలు, తాటాకులు లాంటివి వాడతాము. అలాగే జీర్ణక్రియ ఇంకొద్దిగా పెరిగి, ఆకలి పుట్టడానికి పళ్ళరసాలను ఇవ్వడం జరుగుతుంది. మంట అందుకున్నాక అందులో ఒక మాదిరి పుల్లలు క్రమేపి వేస్తూ వంటసాగిస్తూ ఉంటాము. అలాగే ఇంకా జీర్ణాదిరసాలు పెరిగి, ఆకలి కొద్దిగా పెరిగాక పళ్ళుతినడం, ఖర్జూరం, పచ్చికూరలు లేదా ఉడికిన కూరలు పుల్కాతో తినడం చేస్తూ రోజులు గడుపుతూ ఉండాలి. మంట బాగా రగిలాక పెద్దపుల్లలు, దుంగలు కొద్దిగా పచ్చి ఉన్నప్పటికీ మంటలో పడి భస్మం అయిపోగలవు. అలాగే జీర్ణాదిరసాలు పెరిగి, ఆకలి బాగా ఉన్నప్పుడు మీరు ఆహారాన్ని ఎంత పెంచినప్పటికీ ప్రేగులు అరాయించి వేయగలవు. అంతేగానీ పొయ్యిరాజేయడానికి పెద్దపుల్లలు, కొద్దిగా పచ్చిగా ఉన్నవి వేసి ముట్టిస్తే పొగవస్తుందే గాని అంటుకోదు. ఉపవాసాలు చేసి ఒక్కసారే ఆహారాన్ని తింటే జీర్ణక్రియ అందుకొనక అక్కడ పొగవచ్చినట్లు మనకు విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి వచ్చి ప్రేగులు దెబ్బతింటాయి. ఇంత ఓపిగ్గా ఆహారాన్ని నిగ్రహంతో తినగలిగితేనే ఉపవాసాలు ప్రారంభించాలని ఇప్పటికైనా తెలిసిందా? ఉపవాసాలు చేసి సరిగా వాటిని విరమించకుండా ఏదిపడితే అది తినేసి, లేని పోని తేడాలు తెచ్చుకొని వాటిని ఉపవాసాల మీదకు నెట్టకండి. చివరగా ఒక్కమాట చెప్పి విరమిస్తాను. వివేకంతో ఉపవాసాలను విరమించాలి గానీ ఉపవాసాలు చేసి అవివేకంగా అన్నీ తినివేయడం మనిషి చేయవలసిన పని కాదు.

29. ఉపవాసం అంటే నిరాహార దీక్షలు కాదు (పస్తులు లేక స్టార్ వేషన్)

ఉపవాసం అంటే ఏమీ ఆహారం తినరని మాత్రం అందరకూ తెలిసిన విషయమే. అలాగే పస్తులు లేదా నిరహార దీక్షలలో కూడా ఏమీ తినరని కూడా అందరికీ తెలుసు. అటు ఉపవాసాలలోనూ ఇటు పస్తులలోనూ ఆహారం తినడం లేదు కాబట్టి పస్తులలో వచ్చే నష్టమే ఉపవాసాలలో కూడా ఉంటుంది అని అందరూ ఊహించవచ్చు. పస్తుల గురించి దేశంలో ఎక్కువ మందికి తెలుసుకానీ ఉపవాసాల గురించి కొంత మందికే తెలుసు. తెలియని వారు ఈ విధంగా అపోహ పడటంలో తప్పు లేదు. మందులను విరివిగా వాడటం ప్రారంభమయిన దగ్గర నుండి పొట్ట ఖాళీగా ఉంచినా అసలు ఏమీ తినక పోయినా రోగాలు ఎక్కువగా వస్తాయన్నది సమాజంలో ఎక్కువ మందిలో పాతుకొని పోయింది. మందులొచ్చిన దగ్గర నుండి రోగాలొచ్చినప్పుడు కూడా పొట్టకు తిని వేయడం సాంప్రదాయం అయ్యింది. ఈ సంప్రాదాయం గల వ్యక్తులకు ఉపవాసం యొక్క విలువ పూర్తిగా తెలియదనే చెప్పాలి. అందువలననే వారు ఉపవాసాలంటే లేనిపోని ఇబ్బందులు వస్తాయని లేదా ప్రాణాలు పోవచ్చని భయపడుతూ ఉంటారు. ప